Home మనీ Pmjjby: పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, అటల్ పెన్షన్ యోజన‌తో లబ్ధి పొందండిలా..

Pmjjby: పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, అటల్ పెన్షన్ యోజన‌తో లబ్ధి పొందండిలా..

insurance
Image credit : Unsplash

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై-pmjjby), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై-pmsby), అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై-apy) తదితర పథకాల కింద పేద, మధ్య తరగతి జీవులకు కేంద్ర ప్రభుత్వం బీమా, పెన్షన్ అందిస్తోంది. ఈ పథకాల్లో చేరేందుకు అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత పరిహారం లేదా పెన్షన్ లభిస్తుంది వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకం (Pmjjby):

‘పీఎంజేజేబీవై’ ఏడాదిపాటు అమలులో ఉంటుంది. దీన్ని ఏటా రెన్యువల్ చేసుకోవాలి. ఏ కారణంతోనైనా వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం కింద రక్షణ లభిస్తుంది.

అర్హత: బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా గల 18-50 ఏళ్ల వయస్కులు ఈ పథకం కింద నమోదు చేసుకునేందుకు అర్హులు. ఇందులో 50 ఏళ్లు నిండకముందు చేరే వారికి ప్రీమియం చెల్లించిన తర్వాత 55 ఏళ్ల వయస్సు వచ్చేదాకా జీవిత బీమా కొనసాగుతుంది.

ప్రయోజనాలు: ఏడాదికి రూ.330 రుసుము చెల్లింపు ద్వారా రూ. 2 లక్షల మేరకు జీవిత బీమా రక్షణ లభిస్తుంది.

నమోదు: పొదుపు ఖాతా గల వ్యక్తులు బ్యాంకు శాఖలకు లేదా పోస్టాఫీసులకు నేరుగా వెళ్లి నమోదు చేసుకోవచ్చు. లేదా వెబ్‌సైట్‌ ద్వారా కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారు ఒకసారి సమ్మతిపత్రం ఇచ్చినట్లయితే ఈ బీమా పథకానికి చెల్లించాల్సిన రుసుము ప్రతి సంవత్సరం వారి ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. ఈ పథకం పూర్తి సమాచారం జనసురక్ష వెబ్‌సైట్‌ లో లభిస్తుంది.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై-PMSBY) ఇలా..

పథకం: ‘పీఎంఎస్‌బీఐ’ ఏడాదిపాటు అమలులో ఉంటుంది. దీన్ని ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణం లేదా వైకల్యం సంభవిస్తే వారికి బీమా రక్షణ లభిస్తుంది.

అర్హత: బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా గల 18-70 ఏళ్ల వయస్కులు ఈ పథకం కింద నమోదుకు అర్హులు.

ప్రయోజనాలు: ప్రమాద మరణం లేదా వైకల్యంపై ఈ పథకం కింద రూ. 2 లక్షలు (పాక్షిక వైకల్యమైతే రూ.1లక్ష) లభిస్తుంది.

నమోదు: పొదుపు ఖాతా గల వ్యక్తులు బ్యాంకు శాఖలకు, పోస్టాఫీసులకు నేరుగా వెళ్లి.. లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఈ పథకం కింద తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారు ఒకసారి సమ్మతి పత్రం ఇచ్చినట్లయితే ఈ బీమా పథకానికి చెల్లించాల్సిన రుసుము ప్రతి సంవత్సరం వారి ఖాతా నుంచి కట్ అవుతుంది. ఈ పథకం పూర్తి సమాచారం జనసురక్ష వెబ్‌సైట్‌ లో లభిస్తుంది.

అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై-APY)

‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) ప్ర‌ధానంగా అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత క‌ల్ప‌న‌తోపాటు భవిష్యత్ అవసరాలను తీర్చ‌డం ల‌క్ష్యంగా ప్రభుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌. జాతీయ పెన్ష‌న్ వ్య‌వ‌స్థ (ఎన్‌పీఎస్‌) ప‌రిధిలోని పాల‌న, వ్య‌వ‌స్థీకృత యంత్రాంగం కింద గ‌ల పెన్ష‌న్ నియంత్ర‌ణ‌-అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్‌డీఏ) ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు.

అర్హత: పొదుపు ఖాతాగల 18-40 ఏళ్ల వయస్కులందరూ ఈ పథకం కింద నమోదుకు అర్హులు. వారు ఎంచుకునే పెన్షన్‌ మొత్తం ఆధారంగా చందా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) ప్రయోజనాలు: ఈ పథకంలో చేరిన చందాదారులకు 60 ఏళ్లు పూర్తయ్యాక వారు చెల్లించిన చందా సొమ్ము ప్రాతిపదికన లభించే హామీ మేరకు రూ. 1000 లేదా రూ. 2000 లేదా రూ. 3000 లేదా రూ. 4000 లేదా రూ. 5000 వంతున కనీస నెలవారీ పెన్షన్‌ అందుతుంది.

చందాదారు జీవించి ఉన్నంతవరకూ, వారి తదనంతరం జీవిత భాగస్వామికి ఈ నెలవారీ పెన్షన్ లభిస్తుంది. వారి తదనంతరం చందాదారుని 60 ఏళ్ల వయస్సు దాకా సమీకృతమైన పెన్షన్ నిధి సొమ్ము వారు ప్రతిపాదించిన వారసులకు తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ చందాదారు అకాల మరణం (60 ఏళ్లు పూర్తికాక ముందే) సంభవిస్తే, చందాదారు 60 ఏళ్ల వయసుకు చేరే దాకా మిగిలిన కాలానికి వారి జీవిత భాగస్వామి ‘ఏపీవై’ ఖాతాను కొనసాగించవచ్చు. చందాదారులు ‘ఏపీవై’ చందాను నెల / మూడు నెలల / ఆరు నెలలవారీ పద్ధతిలో చెల్లించవచ్చు.

పథకం నుంచి ఉపసంహరణ: చందాదారులు ప్రభుత్వ వాటా చందా, రాబడి / వడ్డీల తగ్గింపు వంటి కొన్ని షరతులకు లోబడి స్వచ్ఛందంగా ‘ఏపీవై’ నుంచి నిష్క్రమించవచ్చు.

Exit mobile version