తెలుగు దేశభక్తి సినిమా రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) 2024 జనవరి 26 రిపబ్లిక్ డే పురస్కరించుకుని విడుదలైంది. ఈ చిత్రం థియేటర్లో వచ్చి ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా మంచి ఆదరణే పొందుతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ ఓఎస్ఎం విజన్ బ్యానర్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ సినిమాకు మిహిరామ్ వైనతేయ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా దేశభక్తి నెపంతో సాగే చిత్రం అయినందు వల్ల అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. ఇందులో నటీనటులుగా సూర్య అయ్యలసోమయాజుల, ధన్య బాలకృష్ణ, భాను చందర్, సాయి కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 10న ట్రైలర్ విడుదలైంది. 26న థియేటర్లో విడుదల చేశారు. రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సినిమాకి సంగీతం ఆశ్రిత్ అయ్యంగార్ అందించగా సినిమాటోగ్రఫీ ఆర్ఆర్ అందించారు. కెమెరావర్క్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు మిహిరాం వైనతేయకి ఇది మొదటి సినిమానే అయినా సినిమాపై మంచి టాక్ వచ్చిందనే చెప్పాలి.
కథ ఏంటి?
ఈ సినిమా ఇప్పడు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అసలు కథ విషయానికి వస్తే హైదరాబాద్‌లోని హిందూస్తాన్ ఇంట్రా డిఫెన్స్ హెడ్‌గా రియాజ్ అహ్మద్(సాయికుమార్) వ్యవహరిస్తుంటారు. అదే డిపార్ట్‌మెంట్‌లో జేబీ (భానుచందర్) ఎంతో మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటారు. గతంలో జేబీ పనిచేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీ పై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ ప్రాణాలు కోల్పోతాడు. అలా ప్రాణాలను అర్పించిన అధికారి కొడుకు రామ్(సూర్య అయ్యలసోమయాజుల)ను తండ్రిలా ఉన్నతాధికారిని చేయాలని కలలు కంటాడు. కానీ రామ్‌కి మాత్రం అది నచ్చదు. అల్లరిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.
ఈ సందర్భంలోనే జాహ్నవి (ధన్యా బాలకృష్ణ) తో రామ్ తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ ఆమ్మాయి జేబీ కూతురే. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే తను డిపార్ట్‌మెంట్‌లో చేరాలని జేబీ కండీషన్ పెడతాడు. అయితే రామ్ అమ్మాయి ప్రేమ కోసం అందులో చేరతాడా? జేబీ ప్రయత్నాలు సఫలం అవుతాయా? ఉగ్ర సంస్థల కుట్రలను రామ్ అడ్డుకోగలడా? దేశం కోసం రామ్ ఎలాంటి పోరాటం చేస్తాడు? అన్నదే కథ.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్