Home ఫుడ్ చపాతీలు గట్టిగా వ‌స్తున్నాయా? ఈ ప‌ద్ద‌తిలో అయితే మెత్తగా దూదిలా వ‌స్తాయ్

చపాతీలు గట్టిగా వ‌స్తున్నాయా? ఈ ప‌ద్ద‌తిలో అయితే మెత్తగా దూదిలా వ‌స్తాయ్

roti, bread, flatbread
చపాతీ మెత్తగా రావాలంటే ఏం చేయాలి Photo by saniusman89 on Pixabay

చ‌పాతీ అస్స‌లు పొంగ‌డం లేదా? చాలా గ‌ట్టిగా వ‌స్తున్నాయా? మెత్తగా దూదిలా రావాలంటే ఏ కిటుకు వాడాలి? ఆ చిట్కాలేంటో మీరూ చూడండి. చ‌పాతీ తయారు చేయడం వ‌చ్చిన వాళ్ల‌కు ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. కానీ రాని వాళ్ల‌కు మాత్రం అదొక పెద్ద స‌వాలుగా ఉంటుంది. చ‌పాతీని తినాల‌నిపించినా వాటి త‌యారీ స‌రిగా కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల వాటిని దూరంగా పెట్టేస్తుంటారు. అయితే చ‌పాతీ, రోటీ ఏదైనా స‌రే మెత్త‌గా, మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం అవ‌స‌రం. చ‌పాతీ పిండిని ఎలా ప‌డితే అలా  క‌లప‌కూడ‌దు. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం క‌లుపుకుంటే అవి త‌యారు చేసేట‌ప్పుడు చాలా మృదువుగా వ‌స్తాయి. బాగా పొంగుతాయి కూడా. ఎక్కువ స‌మ‌య‌మైనా గట్టిప‌డ‌కుండా ఉంటాయి. 

చ‌పాతీ త‌యారీకి చిట్కాలు

పిండిని ఇలా క‌లుపుకోవాలి:

  1. చ‌పాతీని చేయ‌డానికి చాలామంది పిండిలో చ‌ల్ల‌టి నీరు వేస్తూ క‌లిపేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు. చ‌పాతీ మ‌రియు రోటికి చ‌ల్ల‌టి నీరు కంటే గోరు వెచ్చ‌ని నీరు వేసి క‌ల‌ప‌డం ఉత్త‌మం. దీని వ‌ల్ల చపాతి బాగా మెత్త‌గా వ‌స్తుంది. అలాగే కొద్దిగా ఉప్పు వేసిన నీటితో కూడా పిండిని త‌డ‌ప‌వ‌చ్చు. ఇది కూడా గోరువెచ్చ‌గానే ఉంటే మంచిది.
  2. పిండిని క‌లుపుతున్న‌ప్పుడు కొద్దిగా కొద్దిగా నీరును ఉప‌యోగించాలి. ఒకేసారి ఎక్కువ నీరు పోసి క‌లిపితే పిండి స‌రిగా క‌ల‌వ‌దు. పైగా మెత్త‌గా రాకుండా గ‌ట్టిప‌డిపోతుంది.
  3. అలాగే పిండిని ఎంత ఎక్కువసేపు క‌లిపితే అంత మంచిది. చ‌పాతీలు త‌యారు చేసేట‌ప్పుడు మొత్త‌గా రావ‌డానికి ఇదొక మంచి చిట్కా. అలాగే క‌లుపుతున్న క్ర‌మంలో కొద్దిగా నూనెను వేసుకోవాలి.
  4. పిండిని కొద్దిగా మెత్త‌గా క‌లుపుకోవాలి. గ‌ట్టిగా క‌లుపుకుంటే వాటిని త‌యారు చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. చ‌పాతీలు ఎక్కువ స‌మ‌యం మెత్త‌గా ఉండవు.
  5. చ‌పాతీలు చేయ‌డానికి  20 నుంచి 30 నిమిషాలు ముందు పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన పిండిని 30 నిమిషాల పాటు గాలి త‌గ‌ల‌కుండా పిండిని క‌వ‌ర్ చేయాలి. ఇలా చేస్తే చ‌పాతీలు చాలా మృదువుగా దూదుల్లా వ‌స్తాయి.
  6. చపాతీ త‌యారు చేయ‌డానికి ముందు చేతుల‌తో కొద్దిగా పిండిని క‌ల‌పాలి. అలాగే చ‌పాతీల‌ను కాల్చేట‌ప్పుడు త‌క్కువ మంట ఉండేలా చూసుకోవాలి. ఎక్క‌వ మంటపై కాల్చితే అవి  పొంగ‌కుండా గట్టిగా వ‌చ్చేస్తాయి.

చపాతి మంచి పౌష్ఠికాహారం

గోధుమ పిండితో చేయడం వ‌ల్ల చపాతీలు శ‌రీరానికి మంచి పోష‌కాహారమే అవుతాయి. గోధుమ‌పిండి ఎన్నో ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి చూపుతుంది. శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్ ఉత్ప‌త్తి పెంచుతుంది. మ‌హిళ‌ల్లో రొమ్ము క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే కీళ్ల‌వాతం, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాల‌నుకునే వారికి గోధుమ‌లు మంచి ధాన్యాలు. అంతేకాకుండా చ‌ర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ముఖంపై ఉండే జిడ్డును తొల‌గిస్తుంది. గోధుమ‌పిండి ప్యాక్ ముఖానికి వేసుకుంటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, దుమ్ము తొల‌గి కాంతివంతంగా మారుతుంది. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version