Home లైఫ్‌స్టైల్ ఉగాది 2024: తెలుగు సంవ‌త్స‌రాదిగా ఉగాదిని ఎందుకు జ‌రుపుకుంటారు? పండగ విశిష్టత ఏంటి?

ఉగాది 2024: తెలుగు సంవ‌త్స‌రాదిగా ఉగాదిని ఎందుకు జ‌రుపుకుంటారు? పండగ విశిష్టత ఏంటి?

green shades in nature, neem tree, neem
ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఒక భాగం Photo by Guddanti on Pixabay

తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ‌ ఉగాది. ఈ రోజు నుండే తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభం అవుతుంది. తెలుగు వారు అత్యంత ముఖ్యమైన ఈ ఉగాదిని ప్ర‌తీ సంవ‌త్స‌రం చైత్ర శుద్ధ పాడ్య‌మి నాడు జ‌రుపుకుంటారు. అలాగే ఈసారి ఉగాది ఏప్రిల్ 9, 2024 మంగ‌ళ‌వారం నాడు వస్తోంది. ఈ తెలుగు సంవత్సరం పేరు శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రం. ఉగాది పండుగ అంటే ఏమిటి? తెలుగు ప్ర‌జ‌లు  ఈ పండుగ‌ను ఎందుకు జ‌రుపుకుంటారు? ఉగాది ప‌చ్చ‌డి ప్ర‌త్యేక‌త ఏమిటి? ఇలాంటి విష‌యాల‌న్నీ ఇక్కడ తెలుసుకోండి.

ఉగాది విశిష్టత

ఉగాది హిందూ నూత‌న సంవ‌త్సరానికి ప్రారంభం. ఈ పండుగ‌ను భార‌త‌దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క, గోవా రాష్టాల‌లో జ‌రుపుకుంటారు. సాధార‌ణంగా మార్చి – ఏప్రిల్ నెల‌లో వ‌చ్చే ఈ పండుగ తెలుగు ప్ర‌జ‌ల‌కు అత్యంత ప్రీతికరమైన పండుగ. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో ఉగాది అని, మ‌హారాష్ట‌లో గుడి ప‌డ్వా అని, క‌ర్ణాట‌క‌లో యుగాది అని ర‌క‌ర‌కాల పేర్ల‌తో ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో కొత్త వెలుగులు రావాల‌ని, సుఖ సంతోషాల‌ను అందివ్వాల‌ని కోరుకుంటూ కొత్త సంవ‌త్స‌రంగా ఆహ్వానిస్తారు.

ఉగాది అనే పేరు ఎలా వచ్చింది?

ఉగాదిలో ఉగా అంటే న‌క్ష‌త్ర గ‌మ‌నం. ఆది అంటే ఆరంభం అని మొత్తంగా సృష్టి ఆరంభం అని అర్థం. కొత్త  ప‌నులు ప్రారంభించుకునేందుకు శుభదినంగా భావిస్తారు.తెలుగు వారు ప్ర‌త్యేకంగా జ‌రుపుకునే ఈ ఉగాది నాడు త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌లో ఉగాది ప‌చ్చ‌డి సేవించడం, పంచాంగ శ్ర‌వ‌ణం ముఖ్యంగా క‌నిపిస్తుంటాయి. ఉగాది నాడు వేప పువ్వు, చింతపండు, చ‌క్కెర, తదితర ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తింటే కష్టసుఖాలను సమంగా స్వీకరించగలుగుతామని విశ్వాసం.

జీవితంలో జ‌రిగే ప్ర‌తీ అనుభ‌వాల‌ను ఈ ప‌చ్చ‌డి సూచిస్తుంది. ఈ ఉగాది ప‌చ్చ‌డిలో ఉండే ఒక్కో ప‌దార్థం ఒక్కో అర్థాన్ని ఇస్తుంది. వేప పువ్వు చేదుగా ఉంటుంది. అంటే జీవితంలో బాధ కలిగించే అనుభవాలు, అలాగే బెల్లం తీపికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం,

చింత‌ పండు పులుపు నేర్పుగా వ్వ‌వ‌హ‌రించ‌వ‌ల‌సిన ప‌రిస్థితులను గుర్తు చేస్తాయి. ఇక ప‌చ్చి మామిడి ముక్క‌లు కొత్త సవాళ్లకు సిద్ధం కమ్మని చెబుతాయి. కారం స‌హ‌నం కోల్పోయేలా చేసే  ప‌రిస్థితులను గుర్తుకు తెస్తుంది. 

ఉగాది పండగలో ఆయుర్వేద నియమాలు

పండ‌గ‌ల‌న్నీ కాలంతో వ‌చ్చేవే. కాలానుగుణంగా వ‌చ్చే పండుగ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని వాటికి ఆ కాలానికి స‌రిప‌డా ఆరోగ్య సూత్రాల‌ను అందించారు పూర్వీకులు. అదేవిధంగా ఉగాది రోజు చేసే ప్ర‌తీ ప‌ని ఆరోగ్య నియమాలను సూచిస్తుంది. ఉదయాన్నే చేసే అభ్యంగ‌న స్నానం నుంచి ఉగాది ప‌చ్చ‌డి వ‌ర‌కూ అనేక ఆరోగ్య ఆయుర్వేద నియ‌మాలు ఈ పండగలో ఉన్నాయి. శిశిర ఋతువు వెళ్లి వ‌సంత ఋతువు ప్రారంభం అయ్యే స‌మ‌యంలో ప్ర‌కృతిలో ఎన్నో మార్పులు వ‌స్తాయి. ఆ మార్పుల‌ను త‌ట్టుకుని శారీర‌కంగా, మాన‌సికంగా దృఢంగా ఉండాలంటే పెద్ద‌లు చెప్పిన సూత్రాలు ఆచ‌రించాల్సిందే.

పంచాంగ శ్ర‌వ‌ణం

తిథి వార‌ న‌క్ష‌త్రాల‌తో కూడుకున్న పంచాంగాన్ని ఆ రోజు విన‌డం వ‌ల‌న ఆ సంవ‌త్స‌రాన్ని చ‌క్క‌గా ప్ర‌ణాళిక చేసుకోవ‌చ్చ‌ని కాబ‌ట్టి పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలని పెద్దలు చెబుతారు. నూత‌న సంవ‌త్స‌రంలో జరగబోయే శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని ఆచ‌రించడానికి వీలవుతుంది. 

ఉగాది రోజు చేయ‌వ‌ల‌సిన ప‌నులు

అభ్యంగ‌న స్నానం అంటే నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని త‌ర్వాత శ‌న‌గ‌పిండితో రుద్దుకుని స్నానం చేయాలి. దీనివ‌ల్ల శ‌రీరంపై ఉన్న శ్వేద రంధ్రాల‌న్ని శుభ్ర‌ప‌డి వేస‌విలో చెమ‌ట వ‌ల్ల వ‌చ్చే చ‌ర్మ రోగాల‌ను కట్ట‌డి చేస్తుంది. చెమ‌ట కాయ‌లు, దుర‌ద‌లు ద‌గ్గ‌రికి రావు. నువ్వుల నూనెలో విట‌మిన్ ఇ, కె అధికంగా ఉంటాయి. క‌నుక చర్మాన్ని కాపాడ‌డంలో, కాంతివంతంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

కొత్త బట్టలు ధ‌రించి, త‌మ ఇష్ట దైవాన్ని ఆరాధించి సూర్య న‌మ‌స్కారం చేయాలి. పేద‌ల‌కు తోచిన సాయం చేయాలి. ఉగాది ప‌చ్చ‌డిని త‌ప్ప‌నిస‌రిగా తినాలి. పంచాంగం వినాలి. ఇవ‌న్నీ చేయడం వ‌ల‌న ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఆయురారోగ్యాలు క‌లుగుతాయ‌ని పెద్దల విశ్వాసం.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version