Latest

[yasr_overall_rating null size=”small”]

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ మాతృక మళయాల హిట్‌ సినిమా ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’. కేరాఫ్‌ కంచరపాలెం డైరెక్టర్‌ మహా దీనిని తెలుగులో రీమేక్‌ చేశారు. ఇది సినిమాయే కానీ సినిమాటిగ్గా ఉండదు. నిజజీవితంలోని ఓ కథే చూస్తున్నట్టు ఉంటుంది.

మూవీ రివ్యూ : ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
రేటింగ్ః 3/5
నటీనటులు : సత్యదేవ్, నరేశ్, హరిచందన, రూప, కుశాలిని, సుహాస్, టీఎన్‌ఆర్‌
నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయప్రవీణ
బ్యానర్ : ఆర్కా మీడియా, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌
దర్శకత్వం : వెంకటేశ్‌ మహా (కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌)
విడుదల : నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ తేదీ : 30.07.2020

థియేటర్లు లేవన్న బెంగ లేకుండా చేస్తున్న ఓటీటీలకు క్రమంగా మనం అలవాటుపడిపోతున్నాం. ఇల్లే థియేటర్‌గా మార్చేసిన ఓటీటీలో నేరుగా విడుదలైన మరో మూవీ ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. నటుడు సత్యదేవ్‌ ఇందులో హీరో. కేరాఫ్‌ కంచరపాలెం తరహాలోనే ఇదొక గ్రామీణ నేపథ్యం ఉన్న కథ. అరకు, పాడేరు ప్రాంతంలో తీసిన సినిమా. మన నిజ జీవితంలో జరిగే సంఘటనలకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఈ మూవీ సాగుతుంది.

కథ :

ఉమామహేశ్వరరావు (సత్యదేవ్‌) గిరిజన ప్రాంతమైన అరకు నివాసి. తండ్రి మనోహర్‌రావు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌. తాను కూడా అదే వృత్తిలో దిగుతాడు. తండ్రి ఫోటో స్టూడియోనే నడుపుకుంటాడు. మృధుస్వభావి. అమాయకుడు. చిన్నప్పుడు స్కూళ్లోనే స్వాతి అంటే ఇష్టపడతాడు. అది క్రమంగా ప్రేమగా మారుతుంది. ప్రేమను పెళ్లి దశకు తీసుకెళ్లేలోపు స్వాతికి అమెరికా సంబంధం వస్తుంది. దీంతో స్వాతి అటువైపు మొగ్గుచూపుతుంది. ఇద్దరూ విడిపోతారు. ఉమామహేశుడి గుండెబద్దలవుతుంది.

ఈ సంఘటనకు కొద్దికాలం క్రితమే ఊళ్లో ఓ గొడవను వారించడానికి వెళ్లి దారుణంగా దెబ్బలు తింటాడు. ఎంతో సున్నిత మనస్కుడైన ఉమామహేశ్వరరావు తనను కొట్టినవాడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ప్రతీకారం తీర్చుకునేంతవరకు చెప్పులు తొడగనని శపథం చేస్తాడు. మరోవైపు తనపై దాడి చేసిన వ్యక్తి చెల్లెలితో అనుకోకుండా ప్రేమలో పడతాడు. చివరకు తన ప్రతీకారం నెరవేరుతుందా? ప్రేమ నెగ్గుతుందా? అనేది సినిమాలో చూడాల్సిందే.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మెప్పిస్తుందా?

మళయాల సినిమా అయినా తెలుగు నేటివిటీకి దగ్గరగా తేవడంలో దర్శకుడు వెంకటేశ్‌ మహా విజయం సాధించాడు. నటీనటుల ఎంపిక చాలా బాగుంది. అందరూ సహజత్వం ఉట్టిపడేలా నటించారు. సత్యదేవ్‌ హావభావాలు, భావోద్వేగాలు చాలా సహజంగా ఉంటాయి. నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. మరో సహజ నటుడని అనిపించుకుంటాడు. నరేష్, సుహాస్, హరిచందన, రూప, కుశాలిని తమ తమ పాత్రల్లో మెప్పించారు.

అయితే సినిమాలో అనవసర సన్నివేశాలు చాలా ఉన్నాయి. వీటికి పూర్తిగా కత్తెర వేయవచ్చు. వీటి కారణంగా మూవీ వేగం చాలా నెమ్మదిస్తుంది. సినిమాలో కథే ఏమున్నట్టు అనిపించదు. ఎక్కడెక్కడికో తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. వీటికి కత్తెర వేస్తే ఒక అందమైన ప్రేమ కథగా నిలిచిపోయేది. కానీ మాతృకలో ఉన్న సన్నివేశాలను కొనసాగించేందుకు దర్శకుడు మొగ్గుచూపాడు.

మూవీ డైలాగులు కొన్ని హృదయాలను టచ్‌చేస్తాయి. ‘వెళ్లి పోవాలనుకున్న వారిని వెళ్లనివ్వకపోతే.. ఉన్నా వెలితిగానే ఉంటుంది..’, ‘తప్పు చేశానన్న గిల్టీతో జీవితాంతం బాధపడడం ప్రమాదకరం..’, ‘కళ అనేది పాఠాలు వింటే రాదు.. పరితపిస్తే వస్తుంది..’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి.

సహజంగా ఉండే సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version