Latest

ఇడ్లీలు మిగిలిపోతే వాటితో వేడివేడిగా, టేస్టీగా ఉప్మా కూడా చేసేయొచ్చు. ఈ రెసిపీ చేయడం చాలా సులువు. ప్రత్యేకంగా ఉప్మా రవ్వతోనే కాకుండా ఇడ్లీలతో కూడా ఉప్మా క్షణాల్లో చేసుకోవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా! అయితే ఈ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.

పొద్దున చేసే ఇడ్లీలు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి. మళ్లీ వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు. చల్లగా అయిపోయినందు వలన వాటిని బయట పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ఇడ్లీలను రవ్వలా చేసుకుని ఉప్మా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి టిఫిన్‌లాగా కూడా చేసుకుని తినవచ్చు. ఇడ్లీ చేయడం ఎంత సులభమో ఇడ్లీ ఉప్మా చేయడం కూడా అంతే సులభం. దీని తయారీ విధానం. కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం.. 

ఇడ్లీ ఉప్మా రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు:

  1. మిగిలిపోయిన ఇడ్లీలు
  1. నూనె – రెండు టేబుల్ స్పూన్లు
  1. ఆవాలు – అర టీ స్పూన్
  1. జీలకర్ర – అర టీ స్పూన్
  1. శనగపప్పు – ఒక టీ స్పూన్
  1. మినపప్పు – ఒక టీ స్పూన్
  1. వేరుశనగ గుళ్లు – ఒక టేబుల్ స్పూన్
  1. జీడిపప్పు – ఒక టీ స్పూన్
  1. ఉల్లిపాయ – ఒకటి
  1. అల్లం – ఒక టీ స్సూన్
  1. కరివేపాకు – రెండు రెమ్మలు
  1. పచ్చి మిరపకాయలు – రెండు
  1. పసుపు – ఒక టీ స్పూన్
  1. ఉప్పు – రుచికి సరిపడ
  1. కొత్తిమీర – కొద్దిగా
  1. నిమ్మరసం – కొద్దిగా

ఇడ్లీలతో ఉప్మా తయారీ విధానం:

  1. ముందుగా ఇడ్లీలను తీసుకుని చేతితో మెత్తగా పొడిలా చేసుకోవాలి.
  1. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ వేసుకుని కొద్ది సేపు వేగనివ్వాలి.
  1. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, పసుపు కూడా వేసుకుని కొద్ది సేపు వేయించాలి.
  1. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పొడిని వేసుకోవాలి. బాగా కలుపుకుని అందులో రుచికి పరిపడా ఉప్పును వేసి కలుపుకుని కొత్తిమీర కూడా యాడ్ చేయాలి.
  1. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మరింత రుచిని పొందవచ్చు.
  1. అంతే టేస్టీ టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్లు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు కూడా వదలకుండా తినేస్తారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version