Yama kupam book review: తాను పండై తనువు పుండై.. ఒకరికి వశమై.. తాను శవమై.. వేశ్య గురించి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఈ కవిత ఎంతలోతైనది. మూతి మీద మీసం మొలవని పసి వాడైనా, కాటికి కాలు చాపిన ముసలాడైనా మగాడు మగాడే. ఆడదాని శరీరానికి దాసుడే. కానివాడు ఎక్కడా కనిపించడు. ఎక్కడో ఒక్కడు ఎక్కడో ఓ చోట ఉండొచ్చు.
ప్రకృతి నియమమో.. బలహీనతను జయించలేని బలహీనతో.. చేతి గాజుల గలగల వినపడకపోతే విలవిలలాడే మగాళ్లే ఎక్కువ. అందుకే ఆనాది కాలం నుంచి అంతులేని యుద్ధాలకు, చరిత్ర పరిణామ క్రమానికి, హత్యలకు, వ్యాపారాలకు ఆడదే కేంద్ర బిందువుగా ఉంటోంది లేదా ఉంచబడుతోంది.
ఆడదాని శరీరమే కేంద్రంగా ఆది కాలం నుంచి నేటి వరకు జరిగిన వ్యాపారాన్ని కొలవాలంటే సముద్రపు లోతును అంగుళాలతో కొలువడమే అవుతుంది. అయితే అంతటి లోతును ఒక ఊరు కేంద్రంగా సాగిన వ్యాపారంతో కొలిచి చూపిన చూపిన పుస్తకం యమకూపం.
రష్యాలోని యామ్‌స్కాయాలోని సాగిన వేశ్యా వ్యాపారంతో మొత్తం ఈ వ్యవస్థను కళ్లకు కట్టేలా రాసిన పుస్తకం యమకూపం ..
యామా ది పిట్ పేరుతో అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన నవలను తెలుగులోకి యమకూపం పేరుతో రెంటాల గోపాలకృష్ణ అనువదించారు.
విలాసిని.. వేశ్య, గణికాంగన, లంజ, ముండ, కాల్‌గర్ల్.. కాలాలు, పేర్లు వేర్వేరు కావచ్చు. వ్యభిచారం చేసే ఆడదానికి సమాజం ఇచ్చిన బిరుదులు అవి. రంగు రంగుల చీరలు, వగలు పలికించే ఒంపులు, ఇక ఇకలు, పకపకలు.. లెక్కలేని తనం.. సిగ్గుమాలిన తీరు ఆ మహిళలకు అదనపు అభరణాలు.. అయితే ఇవన్నీ పైకి కనిపించే దృశ్యాలు.
మరి ఒక్కసారి తెర తొలగించి వారి మనస్సును తాకాలంటే యమకూపం (yama kupam) నవల చదవాల్సిందే.
ఆ రంగుల వెనుక కనిపించని చీకట్లు ఎన్నో, ఒంపుల వగల వెనుక వంచనకు గురైన సెగలెన్నో, ఇకఇకలు, పకపకల వెనుక పెళ్లుమని పగిలిపోయిన ప్రేమలెన్నో, లెక్కలేనితనం వెనుక కుక్కలు చింపిన విస్తరిలా చిరిగిపోయిన మనస్సులెన్నో, సిగ్గుమాలిన తనం వెనుక నుగ్గునుగ్గయిన జీవితాలెన్నో…
ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంది. కన్నీటి ప్రవాహం ఉంది.. కడుపు నింపుకొనేందుకు పడుపు వృత్తి నెంచుకునే క్రమంలో ఆ శరీరాలు, మనస్సును ఎంత చిత్రవధననుభవిస్తాయో తెలుసుకుంటే గుండె చెరువవుతుంది. మనస్సు ముక్కలుముక్కలై శిథిలాలుగా మారిపోతుంది.
ప్రజలు స్థిర జీవనం ఏర్పర్చుకొని వివాహ వ్యవస్థ ప్రారంభమైనప్పుడే వ్యభిచారం ప్రారంభమైంది. మగాడు చేతికి అధికారం దక్కడంతో విచ్చలవిడి తనం పురుడుపోసుకుంది. ఇళ్లలో భార్యతో పొసగని వాడు, కొత్త రుచుల కోసం అర్రులు చాచేవాడు, వ్యాపారం, వృత్తి రీత్యా ఇళ్లకు దూరంగా ఉన్న వాళ్లతో ప్రారంభమైన ఈ వ్యవస్థ సమాజ అభివృద్దితో పాటు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది.
రష్యా దక్షణ ప్రాంతంలోని యామ్ స్కాయా ఓ వర్తక కేంద్రం అంతకు మించి ఓ వ్యభిచార కేంద్రం… పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత రైళ్లు పట్టాలెక్కిన తర్వాత వ్యభిచారం అంతే వేగంగా సమాజంలోకి దూసుకుపోయింది. ఇక్కడ ధనవంతులు, మధ్య తరగతి, బికారులకు అవసరమైన వేశ్యలు అందుబాటులో ఉండేవారు.
పెట్టే డబ్బు ఆధారంగా వేశ్యలను అందుబాటులో ఉంచే మూడు రకాల కంపెనీలు ఉండేవి. సమాజంలో పలుకుబడి కలిగిన పెద్దలు, న్యాయవాదులు, వైద్యులు, ప్రభు వర్గం, భూస్వాములు, ధనవంతులైన వ్యాపారులు వారు ట్రెప్పెల్సు కంపెనీకి వెళ్లేవారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు, కొద్దిపాటి ఆదాయం కలిగిన వారు అన్నా మార్క్‌వోనా, లెవోనా, కీస్ కంపెనీలకు వెళ్లేవారు. అలగాజనంగా పిలవబడే బండ్లవాళ్లు, బిచ్చగాళ్లు, ఇతర చిన్న వృత్తుల వారు మూడో రకం కంపెనీలకు వెళ్లేవారు.
కంపెనీ ఆధారంగా మూడు రుబుల్స్ (రూబుల్ రష్యా నాణెం, మన రూపాయి లాగా) నుంచి 50 కోపెక్కులు (సగం రూబుల్) వరకు ఇందులోని వేశ్యలు వసూలు చేసేవారు. అయితే ఈ వేశ్యలెవరు.. ఎలా ఈ వృత్తిలోకి వచ్చారు. ఎందుకు అందులోనే మగ్గిపోయారనేది నవల ఇతివృత్తం.
30 కంపెనీలున్న యామ్‌స్కాయాలో కథ ఎక్కువగా అన్నా మార్క్‌వోనా కంపెనీలోనే సాగుతుంది. ఒక్కసారికి 2 రూబుల్స్ తీసుకునే ఈ కంపెనీలో 30 మందికిపైగా వేశ్యలు ఉంటారు. నిరంతరం అభద్రతాభావం, సుఖవ్యాధుల భయం వెంటాడుతున్నా ఈ మహిళలంతా అందులోనే మగ్గిపోతుంటారు.
కారణం వాళ్లంతా సమాజం చేత వంచింపబడిన వాళ్లు. ఎక్కడికి వెళ్లినా ఆదరించే వాళ్లు లేకపోవడమే కారణం. ఎవడో ఒకడు ప్రేమిస్తున్నానని చెప్పి కడుపు చేసి కనపడకపోవడంతో కుటుంబాల నుంచి వెలివేయబడిన వారు, పెళ్లి చేసుకుంటానంటే వాడి నిజస్వరూపం గమనించక వాడి వెంటపడి వచ్చి కంపెనీలకు అమ్మేయబడిన అమాయక పిల్లలు, సవతి తల్లుల రాక్షసత్వం భరించలేక ఇంటి నుంచి పారిపోయిన వారు, పేదరికాన్ని, ఆకలి కేకలను భరించలేక తల్లిదండ్రులే అమ్మేసిన వారంతా ఈ కంపెనీలకు చేరతారు.
ఒక్క రోజు 20 నుంచి 30 మంది మగాళ్ల చేతిలో ఆట వస్తువుగా మారిపోతారు. 60 రూబుల్స్ వస్తే అందులో కంపెనీ యజమానికి, వారి తిండితిప్పలు, బట్టలు, అలంకారాలకు పోనూ వాళ్లకు గిట్టేది మూడోవంతు కూడా ఉండదు.
అయినా వేరే పని రాదు. ప్రపంచం తీరు తెలియకపోవడం.. అందులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో శరీరమంతా పుండవుతున్నా.. మనస్సు మొద్దుబారిన ముఖాన చిరునవ్వు చెదరకుండా.. గుండె చెరువయ్యే దుఃఖం వస్తున్నా పగలబడి నవ్వుతూ వచ్చిన మగాడి అహాన్ని చల్లార్చుతుంటారు.
డబ్బులు ఇచ్చాం కదా అని ఒక్కోడు ఒక్కోలా వేధిస్తుంటాడు. వాతలు పెట్టే వాడొకడు.. వికృత పద్ధతుల్లో ప్రవర్తించే వాడు మరొకడు… అయినా అన్నింటిని భరించక తప్పని దైన్యం వాళ్లది. అంతా అలా ఉన్నా అందులోనూ కొందరు తెలివైన వాళ్లుంటారు.
వారిలో పలు రకాల భాషలొచ్చిన జెన్నీ ఒకటి . వారి అందరిలో విభిన్నమైన మహిళ.. మంచి అందం… అహంకారం.. ధిక్కారం.. తెలివి మేళవించిన మగువ… నవల పొడుగునా జెన్నీ తిరుగుబాటు ధోరణి మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంది. కానీ సుఖవ్యాధి సోకి ఆత్మహత్య చేసుకోవడం మనల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.
నాటి నుంచి నేటి వరకు వేశ్యా వృత్తి కొనసాగడానికి కారణం మగవాడికి డబ్బుపై ఉన్న ప్రేమ… వంచించే గుణమే ప్రధానం.. నవలలోని గోరింజాట్ అందుకు ప్రతీక. ప్రతి సారి పెళ్లి పేరుతో అమ్మాయిలను బుట్టలో పడేయడం.. వారిని కంపెనీలకు అమ్మేయడమే అతని వ్యాపారం. అతనికి ఆయా కంపెనీలకు యజమానులుగా ఉన్న మహిళలు సహకరించడం.. ఆడదానికి ఆడదే శత్రువనే నానుడికి బలం చేకూర్చుతుంది.
వేశ్యలపైనా సానుభూతి చూసే పత్రికా విలేకరి ప్లాటోనోవ్, గాయకురాలు ఎలెనా వంటి వాళ్లు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటే.. వేశ్యలను ఉద్దరిస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసంతో ఓ వేశ్యను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి ఆమెను ఓ వేశ్యలానే చూసి వదిలించుకున్న లిఖోనిన్, మహిళల వ్యాపారమే వృత్తిగా ఎంచుకున్న గోరింజాట్ వాళ్లు మానవలోని దానవ గుణాలకు ప్రతీకలు.
చివరకు సైనికులు వేశ్యలతో విచ్చలవిడిగా ప్రవర్తించి ఆ కంపెనీలపై దాడులు చేయడం, పరస్పర దాడుల్లో కొందరు చనిపోవడం, కొందరు పారిపోవడం.. ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ ప్రాంత గవర్నర్ యామాలో వ్యభిచారాన్ని రద్దు చేసే ఉత్తర్వు ఇవ్వడంతో కథ ముగుస్తుంది.
అయితే వేశ్యా కంపెనీల్లోని గదులు, పరుపులు, ఆ పరుపులపై సాగే రాక్షస రతి, ఆ క్షణంలోనే చూపే ప్రేమలు, ముద్దు ముచ్చట్లు, విచ్చలవిడి తాగుబోతుతనం, రకరకాల తిండి, జూదం, కలహాలు, హత్యలు, సుఖవ్యాధులు, పెట్టబుడి దారీ వ్యవస్థ వేశ్యావృత్తిని పెంచిపోషించే తీరు, పోలీసులు, ఉన్నతాధికారుల లంచగొండితనం, మోసాలు, భాషలు, రకరకాల వేషాలు, వేశ్యల్లోని మానవత్వం ఒక్కటేమిటి సకల కోణాలను కళ్లకు కట్టినట్లు చూపించే నవల యమకూపం.
రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడక ముందు జార్ పాలన కాలంలో సమాజ స్థితిగతులు ఈ యమకూపం నవల ద్వారా మనకు అవగతమవుతాయి.
– గ్రీష్మ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
ఇవీ చదవండి