Home లైఫ్‌స్టైల్ పది జీవిత పాఠాలు : కరోనా లాక్ డౌన్ కు థ్యాంక్స్

పది జీవిత పాఠాలు : కరోనా లాక్ డౌన్ కు థ్యాంక్స్

life lessons
Photo by mentatdgt from Pexels

లైఫ్ లెసన్స్ సంక్షోభం నుంచే బాగా నేర్చుకోవచ్చు. కరోనా లాక్ డౌన్ కూడా జీవిత పాఠాలు నేర్పింది. ఎలా జీవించాలో చెప్పింది. ఎలాంటి అలవాట్లు ఉండాలో తెలియజెప్పింది. అకస్మాత్తుగా లైఫ్‌ లాక్‌ డౌన్‌ అయితే ఎలా నడుచుకోవాలో నేర్పించింది. ఎలాంటి అంతరాయం ఏర్పడినా సంతోషంగా ఉండడం ఎలాగో నేర్పించింది. ఆ పాఠాలు ఒకసారి మీరూ చూడండి

1. కనీసం మూడు నెలల అత్యవసర నిధి ఉండాలిః

ఇప్పుడు కరోనా వల్ల లాక్‌ డౌన్‌ వచ్చింది. కానీ జీవితంలో కొన్నిసార్లు అనేక ఊహించని మార్పులు ఎదురవుతాయి. ప్రమాదం రూపంలో, ప్రకృతి విపత్తు రూపంలో.. ఇంకా అనూహ్య పరిస్థితి ఏది ఎదురైనా, ఉపాధి కోల్పోయినా.. కుటుంబం ముందుకు సాగాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలకు తగ్గకుండా కుటుంబ ఖర్చులను అత్యవసర నిధి రూపంలో దాచుకోవాలి. సేవింగ్‌ అకౌంట్‌లో గానీ, లిక్విడ్‌ ఫండ్‌ రూపంలోగానీ దాచుకుంటే అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చు. రెగ్యులర్‌ ఆదాయానికి అంతరాయం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి. నిత్యావసరాలకు, మందులకు, షెల్డర్‌ కోసం, కనీస అవసరాల కోసం వాడుకోవచ్చు. అంతేగానీ షేర్స్‌ కొనుగోలు చేసేందుకో, పెట్టుబడులు పెట్టేందుకో వీటిని వినియోగించరాదు.

2. సాయం ఒక జీవిత పాఠం

కరోనా వంటి ప్రకృతి విపత్తులు ఎన్నో రావొచ్చు. బాగున్న రోజుల్లో సమాజం నుంచి మీరు ఎంతో సాయం పొందిఉండొచ్చు. ఇలాంటి కష్ట సమయాల్లో ఇతరులకు మీ చేతనైనంత సాయం చేయండి. వారు ఈ కష్టకాలంలో నిలదొక్కుకునేందుకు మీరు మానవత్వం ప్రదర్శించండి. మీ డ్రైవర్‌కో, మీ పని మనిషికో లేక మీ వద్ద పనిచేస్తే ఉద్యోగులకో వారి జీవనం సాఫీగా సాగేందుకు సహకరించండి. మీ వద్ద ఉంటే ఒక నెల వేతనం ముందే సర్దుబాటు చేయండి. ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు నిల్వ ఉంటే వారికి పంచండి. ఇవ్వడంలో ఉన్న తృప్తి దేనిలోనూ లేదని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోండి.

3. లైఫ్ లెసన్స్ ఈ ప్రాథమిక సూత్రాలు

జీవనం సాఫీగా సాగాలంటే నాలుగు ప్రాథమిక అవసరాలు ఎన్నడూ మరవకండి. ఒకటి అత్యవసర నిధిని సమకూర్చుకోవడం, రెండోది జీవిత బీమా, మూడోది ఆరోగ్య బీమా, నాలుగోది పొదుపు. అత్యవసర నిధి ఎందుకో ముందే చెప్పుకున్నాం కదా.. కుటుంబంలో ఆదాయం సముపార్జించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదు. అందువల్ల వచ్చే ఆదాయానికి వంద రెట్లు జీవిత బీమా చేయించుకోవాలి. కరోనా వంటి అంటువ్యాధి సంక్రమించినప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి పరీక్ష చేయిస్తోంది. చికిత్స అందిస్తోంది. కానీ అన్నివేళలా ఇది సాధ్యం కాదు కదా.. అందువల్ల అనారోగ్యం పాలైతే ఆదుకునేలా ఆరోగ్య బీమా ఉండాలి. ఇక ఆదాయంలో కనీసం 30 శాతం పొదుపు చేస్తే మీ బంగారు భవిష్యత్తుకు ఢోకా ఉండదు.

4. మీ అలవాట్లు మార్చుకోండి

అనూహ్యంగా దేశాన్ని కరోనా తరుముతుండడంతో లాక్‌డౌన్‌ ఎదురైంది. దీంతో దేశంలో మద్యం దుకాణాలు, సిగరెట్ల షాపులు మూతపడ్డాయి. మీరు మద్యానికి, దూమపానానికి దూరమయ్యారు. అయినా నిబ్బరంగా నిలబడగలిగారు. నిలబడగలరని తేలిపోయింది. అవును. మీరు మీ అలవాట్లను మార్చుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పొదుపు పెరుగుతుంది. అందువల్ల మీరు దీనిని కొనసాగించండి. దురలవాట్లను వీడితో ఎలాంటి నష్టం లేదన్న మీ అనుభవాన్ని ఆస్వాదించండి. జీవితం చాలా సింపుల్‌గా ఉంటే, కోరికలు అదుపులో ఉంటే ఎంతటి కష్టాన్నైనా అవలీలగా భరించవచ్చని గ్రహించండి.

5. మీ పిల్లలతో గడపండి..

మీ ఒత్తిడి జీవితానికి ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. కుటుంబంతో గడపడం లేదన్న మీ బెంగను తీర్చింది. మీ పిల్లల వ్యక్తిత్వం, మీ పిల్లల అలవాట్లు, వారి దృక్పథాన్ని సరైన దారిలో పెట్టేందుకు ఉపయోగపడింది. జీవితంలో దీనిని కొనసాగించండి. మీ పిల్లలకు ఇంతకంటే మీరేం ఇవ్వగలరు? డబ్బు అవసరాలను తెలియపరచండి. పొదుపు ఎంత ముఖ్యమో వివరించండి. అత్యవసర పరిస్థితి అంటే ఏంటో చెప్పండి. వారితో కలిసి చదవండి. వారితో కలిసి రాయండి. వారితో కలిసి టీవీ చూడండి. కలిసి తినండి. వ్యాయామం, యోగ, ధ్యానం, ఇంటి పనులు.. ఇలా ఒకటేమిటి.. అన్నింట్లో వారిని ఇన్‌వాల్వ్‌ చే యండి.

6. మీ తల్లిదండ్రులకు సమయం కేటాయించండి

కుటుంబం అంటే మీరు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు మాత్రమే కాదు. మీ తల్లిదండ్రులు కూడా. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన వారికి ఇప్పుడు ఆత్మీయ పలుకరింపు అవసరమని గ్రహించండి. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయండి. వారికి సంతోషం ఇవ్వడం కంటే మీకు దక్కే సంతోషం ఏముంటుందని?

7. మీ డాక్యుమెంట్స్‌ భద్రపరచండి

ఖాళీ సమయంలో మీ పాత సర్టిఫికెట్లు, మీ పొదుపు రశీదులు, ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు.. ఇలాంటివన్నీ భద్రపరచడమో, నీట్‌గా పొందుపరచడమో చేయండి. దీనిని ఇప్పుడు అలవరచుకుంటే మీరు భవిష్యత్తులో మీకు ఖాళీ దొరికినప్పుడు మళ్లీ మళ్లీ చేస్తూంటే, వీటికి సంబంధించి మీ కుటుంబంతో చర్చిస్తుంటే మీ తదనంతరం వారికి వాటిపై ఒక స్పష్టత ఏర్పడుతుంది.

8. సమయం సద్వినియోగం చేసుకోవడం

ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో, జీవితాన్ని ఆనందంగా గడపడం ఎలాగో ఈ కరోనా సెలవులు నేర్పి ఉంటాయి. ఎంతోకాలంగా నేర్చుకోవాలనుకున్న కోర్సులు ఆన్‌లైన్‌లో నేర్చుకోవడమో, ఎంతో కాలంగా చూడాలనుకున్న సినిమాలు ఏ ఓటీటీలోనో చూడడమో వంటివి చేసి ఉంటారు. ఇష్టమైన పుస్తకాన్ని కిండ్లే ద్వారా చదవడమో, ఆడిబుల్‌ ద్వారా వినడమో చేసి ఉంటారు. దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగించండి. జీవితం అంటే పరుగెత్తడం మాత్రమే కాదని తెలుసుకోండి. కొత్త నైపుణ్యం అందిపుచ్చుకుంటే జీవితం మరింత ఉజ్వలంగా ఉంటుందని గ్రహించండి.

9. ఆరోగ్యకరమైన జీవితానికి అద్భుతమైన పాఠం

కరోనా మన ఆరోగ్యాలకు ఒక పాఠం నేర్పింది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సీ విటమిన్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని కరోనా దేశవాసులదరికీ అవగాహన కల్పించింది. అలాగే మనం ఏయే రకాల ఆరోగ్యాలకు ఏయే రకాల ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. జీవితంలో దీనిని ఒక అలవాటుగా చేసుకోండి. శుచి, శుభ్రత పాటించండి. అవి లేని ప్రాంతంలో కూరగాయలు కొనకండి. శుచి లేని చోట మాంసం కొనకండి. ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం విలువ తెలుసుకోండి. వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కోసం చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం అలవాటుగా చేసుకోండి.

10. జీవిత పాఠాలు స్నేహితులకు నేర్పండి

ఒత్తిడి జీవితంలో మీ స్నేహితులు, క్లాస్‌మేట్స్‌ ఎందరున్నారో మీరు మరిచిపోయి ఉంటారు. వారితో మీ మరవలేని జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకునేందుకు హాయ్‌ అంటూ ఒకసారి ఫోన్‌లో పలుకరించండి. మీరు దీని వల్ల ఎంత ఉల్లాసంగా ఉంటారో తెలుసుకోండి. ఈ జీవన ప్రయాణంలో మనకు తోడుండేది కుటుంబ సభ్యులే కాకుండా స్నేహితులు, సమాజం అని కూడా తెలుసుకోండి. మీ అనుభవాలు వారితో పంచుకోండి. మీ జీవిత పాఠాలు వారికి నేర్పండి..

మీ జీవితం సాఫీగా సాగాలని డియర్‌ అర్బన్‌ డాట్‌ కామ్‌ ఆకాంక్షిస్తోంది.. ఆల్‌ ది బెస్ట్‌..

ఇవి కూడా చదవండి

  1. న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ ఎలా ఉండాలి
  2. స్మోకింగ్ మానేయడం ఎలా
  3. ఆల్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ అంటే ఏంటి
  4. ఆరోగ్యకర జీవితానికి మార్గాలు
  5. ఇంట్లో ఏ గాలి పీలుస్తున్నారు
  6. మీరు మంచి తల్లిదండ్రులేనా
  7. ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించాలంటే
  8. మీరు చేస్తున్న ఆర్థిక తప్పిదాలు
Exit mobile version