Home స్కిల్స్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ లో జాగ్రత్తలు

ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ లో జాగ్రత్తలు

mobile rules
మొబైల్ వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి

నం వాడే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యంగ్ అవడం, గతంలో మాదిరిగా వేగంగా స్పందించకపోవడం వంటి సమస్యలకు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ కొట్టడం అనేది ఉత్తమ మార్గం. కానీ అందరూ ఆ ఆప్షన్ ని ఉపయోగించుకోరు. దాని ప్రధానంగా వారు భయపడేది మన డేటా పరిస్థితి ఏంటి అని.. చిన్నపాటి శ్రద్ధ తీసుకుంటే అదేమంత కష్టం కాదు..

అసలు మొబైల్ రీసెట్ కొట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..? ఏ డాటాని భద్రపరుచుకోవాలి..? బ్యాకప్ తీసుకునేందుకు ఉత్తమ మార్గం ఏంటి వంటి విషయాలు పరిశీలిద్దాం..

బ్యాకప్ తీసుకునే సమయంలో మన డాటాలో ముఖ్యమైన అంశాలు ఫోన్ నెంబర్లు, టెక్ట్స్ సందేశాలు, వాట్సప్ చాట్, ఫొటోలు, వీడియోలు, యాప్స్, కాల్ లాగ్ వంటివి చాలా కీలకం.. వీటిని బ్యాకప్ తీయడం ఎలా అనేది ఒక్కోటిగా పరిశీలిద్దాం.

మొబైల్ నెంబర్లు స్టోర్ చేసుకోవడానికి

ఫోన్ నంబర్లు.. ఆండ్రాయిన్ స్మార్ట్ ఫోన్ లో మొబైల్ నంబర్లు స్టోర్ చేసుకోవడానికి గూగుల్ కాంటాక్ట్స్ బాగుంటుంది. సిమ్ స్టోరేజ్, ఫోన్ స్టోరేజ్ కాకుండా గూగుల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాదాపు ఎక్కువ మంది ఈ స్టోరేజ్ నే వాడుతున్నారు. అందువల్ల ఫోన్ నంబర్లు ఎప్పటికప్పుడు గూగుల్ సర్వర్ లో సింక్ అయి సేవ్ అవుతాయి.

ఏ మొబైల్ లోనైనా గూగుల్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వగానే ఫోన్ నంబర్లు వచ్చేస్తాయి. గూగుల్ లో కాకుండా ఇతర స్టోరేజ్ లో ఫోన్ నంబర్లు ఉన్నా వాటిని గూగుల్ ఐడీ లోకి ఇంపోర్టు కొడితే సరిపోతుంది. దాని కోసం ఫోన్ బుక్ > కాంటాక్ట్ మేనేజర్ లేదా సెట్టింగ్స్ > కాంటాక్ట్స్ ఇంపోర్టు > అవుట్ పుట్ లో గూగుల్ ఐడీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాకప్ తీసే సమయంలో ఒక సారి గూగుల్ సర్వర్ కు కూడా కాంటాక్ట్స్ అప్డేట్స్ అయ్యాయో లేదో పరిశీలించుకుంటే సరిపోతుంది. చివరి సారి మన కాంటాక్ట్స్ అప్డేట్ ఎప్పుడు సింక్ అయ్యిందో తెలుసుకునేందుకు ఫోన్ సెట్టింగ్స్ > అకౌంట్స్ > గూగుల్ > మీ జీమెయిల్ ఐడీని ఎంచుకోవాలి. అక్కడ ఫోన్ బుక్ చివరిసారిగా ఎప్పుడు సింక్ అయ్యిందో నమోదు అయి ఉంటుంది. మళ్లీ సింక్ చేయాలనుకుంటే దానిపై ట్యాప్ చేస్తే సరిపోతుంది.

ఎస్.ఎం.ఎస్. ఆర్గనైజర్ యాప్ వల్ల ఉపయోగం ఇదీ..

మొబైల్ రీసెట్ కొట్టిన తరువాత గూగుల్ ఐడీ ఇచ్చి లాగిన్ అయితే సరిపోతుంది. ఫోన్ నంబర్లు ఆటోమేటిగ్గా మొబైల్ లోకి వచ్చేస్తాయి. ఎస్.ఎం.ఎస్.ల బ్యాకప్ కోసం మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఎస్.ఎం.ఎస్. ఆర్గనైజర్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఈ యాప్ ని డిఫాల్ట్ గా మెసేజింగ్ యాప్ గా ఫెట్టుకోవాల్సి ఉంటుంది.

ఓటీపీ నోటిఫికేషన్, మెసేజ్ ల విభజన ( రెగ్యులర్ సందేశాలు, బ్యాంకుల నుంచి వచ్చే ట్రాన్సెక్షన్ సందేశాలు, ప్రమోషన్ల కోసం వచ్చే మెసేజులు వేరువేరు ట్యాబ్ లో చూపుతుంది.), రిమైండర్స్ వంటి ప్రత్యేకతలు ఈ యాప్ సొంతం. వాటితోపాటు బ్యాకప్, రీస్టోర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఎస్.ఎం.ఎస్. ఆర్గనైజర్ > కుడివైపు మూడు చుక్కల ఆప్షన్స్ లో సెట్టింగ్స్ > బ్యాకప్ అండ్ రీస్టోర్ ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ గూగుల్ ఖాతా వివరాలు ఇవ్వాలి.

అక్కడ రెండు రకాలుగా బ్యాకప్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ విధానంలో లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. ఆ డాటాని యాప్ గూగుల్ డ్రైవ్ లో భద్రపరుస్తుంది.

మొబైల్ రీసెట్ కొట్టిన తరువాత గూగుల్ ప్లే స్టోర్ లో ఎస్.ఎం.ఎస్. ఆర్గనైజర్ ని ఇన్ స్టాల్ చేసుకుని బ్యాకప్ అండ్ రీస్టోర్ లోకి వళ్లి మన ఖాతా వివరాలు ఇచ్చి రీస్టోర్ కొడితే చాలు సందేశాలన్ని తిరిగి వచ్చేస్తాయి. గమనించాల్సిందేంటంటే ఈ యాప్ వాడేసమయంలో ముందుగా ఏ మొబైల్ నంబర్ ఇస్తామో అదే నంబర్ మళ్లీ ఇవ్వాలి. అప్పుడే మీ వివరాలు చూపుతుంది.

అలా కాకుండా వేరే నంబర్ ఇస్తే దాన్ని కొత్త ఖాతాగా పరిగణించి పాత వివరాలు రీస్టోర్ విభాగంలో చూపదు. అందుకే మొదిటి సారి ఇచ్చిన నంబరే మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది.

వాట్సాప్ డేటా బ్యాకప్ ఇలా..

అసలు కథ వాట్సప్ తోనే…ప్రస్తుత కాలంలో వాట్సప్ డాటానే అందరికీ చాలా కీలకం.. మొబైల్ రీసెట్ కొట్టినా ఈ డాటా యథాతథంగా ఉండాలంటే వాట్సప్ సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవాలి.

వాట్సప్ యాప్ కుడివైపు పైన మూడు చుక్కల మెనూలో సెట్టింగ్స్ > చాట్ > చాట్ బ్యాకప్ > అక్కడ గూగుల్ ఖాతా వివరాలు ఇచ్చి బ్యాకప్ తీసుకోవచ్చు. అప్పటికే గూగుల్ ఖాతా వివరాలు ఇచ్చి ఉంటే బ్యాకప్ కొడితే సరిపోతుంది. ఆ డాటాని గూగుల్ డ్రైవ్ లోకి సేవ్ చేస్తుంది.

మొబైల్ రీసెట్ కొట్టిన తరువాత వాట్సప్ ఇన్ స్టాల్ చేసుకుని అదే మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ అయితే చాలు.. ఈ నంబర్ పై పలాన గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ ఉంది రీస్టోర్ చేయాలా అని అడుగుతుంది. రీస్టోర్ ఆప్షన్ ని ఎంపిక చేసుకుంటే చాలు మీరు బ్యాకప్ తీసే సమయానికి ఉండే సందేశాలతో సహా మొత్తం చాట్ థ్రెడ్స్ వచ్చేస్తాయి.

సైజ్ పెరగకుండా ఉండాలంటే..

బ్యాకప్ సైజ్ పెరగకుండా ఉండాలంటే అనవసరమైన చాట్ లను ముందుగా తొలిగించుకుంటే సరిపోతుంది. దానితోపాటు బ్యాకప్ పేజీలో ఇంక్లూడింగ్ వీడియోస్ అని ఉన్న చోట ఆప్ చేయాలి. అప్పుడు బ్యాకప్ సైజ్ తక్కువగా ఉంటుంది. ఫొటోలు, వీడియోస్ కి గూగుల్ ఫొటోస్…మన కెమెరాలో బంధించే ఫొటోలు, వీడియోలు బ్యాకప్ తీసుకోవడానికి గూగుల్ ఫొటోస్ ఉత్తమ యాప్.

దాని కోసం గూగుల్ ఫొటోస్ > ఎడమవైపు పైన ఉండే మూడు గీతల ఆప్షన్లో ఉండే సెట్టింగ్స్ > బ్యాకప్ అండ్ సింక్ ని ఎంచుకోవాలి. అక్కడ ఆఫ్ అని ఉంటే ఆన్ చేసుకోవాలి. కెమెరా చిత్రాలతోపాటు ఇతర ఫోల్డర్లలో ఉండే ఫొటోలు, వీడియోలు కావాలనుకుంటే అదే పేజీలో చివరలో ఉండే బ్యాకప్ డివైజ్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ కావాల్సిన ఫోల్డర్ ని ఎంచుకుంటే చాలు అవి కూడా బ్యాకప్ అవుతాయి.

ఒక వేళ అప్పటికే ఉన్న జీమెయిల్ ఖాతా డాటా ఫుల్ అయితే కొత్తగా మరో జీమెయిల్ ఖాతా సృష్టించుకుని ఆ ఖాతాని ఎంచుకోవచ్చు. తద్వారా 15 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది. మొబైల్ రీస్టోర్ చేసిన వెంటనే బ్యాకప్ తీసిన గూగుల్ ఖాతా తిరిగి ఇస్తే చాలు ఆటోమేటిగ్గా మన ఫొటోలు, వీడియోలు రీస్టోర్ అయిపోతాయి.

కాల్ లాగ్, యాప్స్ కోసం సూపర్ బ్యాకప్…

ఇక మిగిలినవి కాల్ లాగ్ (మనం చేసిన కాల్స్, వచ్చినవి, మిస్ కాల్స్ వివరాలు), మొబైల్ లో ఇన్ స్టాల్ అయిన యాప్స్.. ఈ రెండు కొంతమందికి అంతగా అవసరం లేకున్నా సమయం ఆదా కోసం ఇవి కూడా బ్యాకప్ చేసుకుంటే మంచింది.

దీనికోసం ప్లేస్టోర్ లో లభించే సూపర్ బ్యాకప్ యాప్ ని ఇన్టాల్ చేసుకుని కాల్ లాగ్ ని బ్యాకప్ కొట్టాలి. దాని వెంటనే ఆ బ్యాకప్ ఫైల్ ని మెయిల్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా యాప్స్ కూడా బ్యాకప్ కొడితే ఉన్న యాప్స్ అన్ని మన మొబైల్ అంతర్గత మెమరీలో అవి సేవ్ చేస్తుంది. తద్వారా మొబైల్ రీసెట్ కొట్టొన తరువాత అన్న ప్లేస్టోర్ నుంచి అన్ని యాప్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలంటే చాలా డాటా, సమయం వృథా అవుతుంది.

అన్ నోన్ యాప్స్ ఇన్ స్టాల్ కు అనుమతి ఇవ్వాలి

మెమరీలో ఉన్న యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలంటే వేగంగా అవుతాయి. కాకపోతే మొదటి యాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో మొబైల్ సెట్టింగ్స్ లో అన్ నోన్ సోర్స్ యాప్స్ ఇన్ స్టాల్ కు అనుమతి ఇస్తే సరిపోతుంది.

రెండు రకాల ఫ్యాక్టరీ రీసెట్ చేయడం.. అంతర్గత మెమరీ కూడా డిలీట్ చేస్తూ చేసే ఫ్యాక్టరీ రీసెట్, అంతర్గత మెమరీని డిలీట్ చేయకుండా చేసే రీసెట్.. అయితే మొబైల్ వేగంగా స్పందించడానికి చేసే రీసెట్ కోసం మెమరీని డిలీట్ చేయాల్సిన అవసరం దాదాపుగా ఉండదు.

అందుకే ఫోన్ సెట్టింగ్స్ లో రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ని ఎంచుకునే ముందు అక్కడ ఎరేజ్ మెమరీ అనేది అన్ చెక్ చేసి రీసెట్ చేస్తే సరిపోతుంది. ఒక వేళ మొత్తం మెమరీ డిలీట్ చేయాలని భావిస్తే మాత్రం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సూపర్ బ్యాకప్ ద్వారా తీసిన యాప్స్ ని, కాల్ లాగ్ ఫైల్ ని కంప్యూటర్ లోకి బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్ బ్యాకప్ తీసే సమయంలో, గూగుల్ ఫొటోస్ లోకి బ్యాకప్ తీసేటప్పుడు వైఫై కనెక్ట్ చేసి తీసుకోవడం ఉత్తమం. వేగంగా పని జరుగుతుంది.

– డియర్ అర్బన్ టీమ్

ఇవి కూడా చదవండి

♦  వాట్సాప్‌ సీక్రెట్‌ ఫీచర్స్‌ మీకు తెలుసా?

♦  షటిల్ క్లౌడ్ తో జీమెయిల్ కు మెయిల్స్ మైగ్రేషన్

♦ పిల్లలకు గూగుల్ ఖాతా.. ఫ్యామిలీ లింక్ తో సేఫ్

Exit mobile version