interior design of home: మీరే ఇంటీరియర్‌ డిజైనర్స్‌.. ఖర్చు లేకుండా..

interior design
Photo by Lisa Fotios from Pexels

interior design of home: ఇంటీరియర్‌ డిజైనర్స్‌కు ఇప్పుడు మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉందో తెలుసు కదా. ఏదో ఇల్లు కట్టి, రంగులేసి ఊరుకోవడం లేదెవరూ. ఒంటినే కాదు ఇంటిని కూడా అందంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ టేస్ట్‌కు తగినట్లు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు. లివింగ్‌ రూమ్‌, హాల్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌.. ఇలా ఒక్కో రూమ్‌లో ఒక్కో డిజైన్‌తో తమ అభిరుచిని చాటుకుంటున్నారు. దీనికోసం లక్షలు ఖర్చు చేయడానికి కూడా చాలా మంది వెనుకాడటం లేదు. కానీ అందరూ ఇంత ఖర్చు భరించలేరు. అలాగని చూస్తూ వదిలేయలేరు. అలాంటి వాళ్ల కోసమే ఈ ఇంటీరియర్‌ టిప్స్‌. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించడం వల్ల మీ ఇంటికి మీరే డిజైనర్‌గా మారిపోవచ్చు. పైగా మీ బడ్జెట్‌లోనే ఇంటిని అందంగా మార్చుకోవచ్చు. 

interior design: లైట్‌ కలర్స్‌తో మాయ చేసేయండి

అర్బన్‌ ఏరియాల్లోని మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు చాలా వరకు చిన్న చిన్న ఇళ్లలో, ఇరుకైన గదుల్లో నివసిస్తుంటారు. ఇంత చిన్న గదికి ఇంకా ఏం ముస్తాబు చేస్తాంలే అని బాధపడుతుంటారు. కానీ చిన్న రూమ్‌ను కూడా పెద్దగా కనిపించేలా అందంగా మాయ చేసేయొచ్చు. పెద్ద పెద్ద కిటికీలు, గోడలకు లైట్‌ 
కలర్స్‌ వేయడం ద్వారా చిన్న గది కూడా పెద్దగా కనిపిస్తుంది. అక్కడక్కడా పెద్ద పెద్ద అద్దాలు పెట్టడం వల్ల రూమ్‌ మరింత విశాలంగా కనిపించేలా చేయొచ్చు. చిన్న గదులకు ముదురు రంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకండి. అది మీ గది మరింత చిన్నగా కనిపించేలా చేస్తుంది. 

interior design: పాత, కొత్త.. అన్నీ కలిపేయండి

మనకు కొత్తొక వింత.. పాతొక రోత. కొత్త వస్తువు ఏదైనా వస్తే.. పాతదాన్ని పక్కన పడేస్తాం. కానీ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణులను అడగండి.. ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని చెబుతారు. మీ ఇంటి డిజైన్‌.. మీరు, మీ వ్యక్తిత్వం, మీ స్టైల్‌ని ప్రతిబింబించేలా ఉండాలని అంటారు. అందుకే మీ తాతల 
కాలం నాటి వస్తువేదైనా ఇంట్లో ఉంటే.. దానిని ఎక్కడో ఎవరికీ కనిపించకుండా మూలన పడేయకండి. మీరు తెచ్చుకున్న అత్యాధునిక ఫర్నీచర్‌తోపాటే దాన్ని కూడా ఉంచండి. కొత్త, పాతల కలయిన ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఆర్ట్‌ లవర్స్‌ అయినా కూడా ఇదే సూత్రం 
పాటించండి.

interior design: రంగు పడితే చాలు

ఒక్కోసారి అన్నీ ఉన్నా ఏదో వెలితి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమయంలో సింపుల్‌గా కొత్త పెయింట్‌ వేసేయండి. ఆకర్షణీయమైన రంగుల్లోని పెయింట్స్‌ నిర్జీవంగా ఉన్న మీ ఇంటి గది, ఫర్నీచర్‌కు ఓ కొత్త లుక్‌ను తీసుకొస్తుంది. 

Indoor Plants: మీ ఇల్లే ఓ గార్డెన్‌

మొక్కలను బయట పెరట్లోనే పెంచాలన్న రూలేమీ లేదు. మనకు ఆసక్తి ఉండాలే కానీ.. అవి ఇంట్లోకీ వచ్చేస్తాయి. లివింగ్‌ రూమ్‌లో మనతోపాటే కూర్చుంటాయి. హాల్‌లో మనకు తోడుగా ఉంటాయి. కిచెన్‌లో సాయం చేస్తాయి. చిన్న, పెద్దా అన్న తేడా లేకుండా మీ ఇంట్లోని అన్ని రూమ్స్‌లో మొక్కలను పెట్టుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా మీ ఇంటికి కొత్త అందాన్ని తీసుకొచ్చేవి ఈ మొక్కలే. అంతేకాదు ఈ మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లోని గాలి స్వచ్ఛంగా మారుతుంది. తేమ తగ్గి ఉక్కపోత కూడా ఉండదు. హానికరమైన వాయువులను ఈ మొక్కలు పీల్చుకుంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అసలు మొక్కలు లేని ఇల్లు ఓ ఇల్లే కాదని గుర్తుంచుకోండి. 

Photos: మీ ఫొటోల దుమ్ము దులపండి

ఇంటిని ముస్తాబు చేయడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన వస్తువులే అవసరం లేదు. మీరు, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్నా చాలు. ఏదో ఫంక్షన్‌లోనో, పండుగలప్పుడో, ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడో కొత్త బట్టలు వేసుకొని అందరూ కలిసి ఫొటోలకు పోజులివ్వడం చాలా కామన్‌. కానీ ఆ ఫొటోలు అల్మారాలు దాటి బయటకు రావు. ఒకసారి వాటి దుమ్ము దులపండి. కొన్ని మంచి ఫొటోలను సెలక్ట్‌ చేసుకొని వాటిని ఒకే రకమైన ఫ్రేమ్స్‌లో పెట్టి గోడకు తగిలించండి. ఓ గ్రిడ్‌ ఆకారంలోనో, వరుసగానో.. మీకు నచ్చినట్లుగా డిజైన్‌ చేయండి. ఆ గోడకే కాదు.. మీ ఇంటికే కొత్త అందం వస్తుంది. ఫొటోలే కాదు.. చీప్‌గా దొరికే వెదురు వస్తువులను కూడా ఇంటిని ముస్తాబు చేసుకోవడానికి విరివిగా వాడుకోవచ్చు. వెదురు కుర్చీలు, వెదురు బుట్టలు ఇంటికి మంచి లుక్‌ని తీసుకొస్తాయి. అంతెందుకు మీ ఇంట్లో రంగు రంగుల ప్లేట్స్‌ ఉన్నా చాలు.. ఫొటో ఫ్రేమ్స్‌లాగా వాటినీ గోడలకు వేలాడదీస్తే ఆ లుక్కే వేరు. మీరే ఇంటీరియర్ డిజైనర్లుగా మారిపోతారు.

Previous articleఎనీడెస్క్ యాప్ మీ ఫోన్‌లో ఉందా.. జాగ్రత్త!
Next articleగూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాతో పిల్లల బ్రౌజింగ్ సేఫ్