Home ఎంటర్‌టైన్‌మెంట్‌ పెద్ద హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందేనా..!

పెద్ద హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందేనా..!

shooting
Image Source: pexels

ఫిల్మ్ ఇండస్ట్రీకి లాక్ డౌన్ కాలం ఇంతకుముందు ఎన్నడూ ఎదురుకాని పరిస్థితిని తెచ్చిపెట్టింది. నెలల తరబడి షూటింగ్ బంద్ చేసుకొని, థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే రెండున్నర నెలలకు పైగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని కార్యకలాపాలు మొత్తంగా ఆగిపోయిన దుస్థితి.

ఇప్పుడిప్పుడే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు, పరిమిత సంఖ్యలో షూటింగ్ లకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అయినా థియేటర్లలో బొమ్మ ఎప్పుడు పడుతుందో తెలియదు. లాక్ డౌన్ కు ముందు పూర్తైన సినిమాలు విడుదల చేయలేక నిర్మాతలు దిక్కులు చూస్తున్న పరిస్థితులు.

ఆర్థిక భారాలు భరించలేక కొంత మంది నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల వేదికగా విడుదల చేస్తున్నారు. లాభాల మాట ఎలా ఉన్నా, భారం మాత్రం కాకుండా ఓటీటీలలో తమ చిత్రాలను విడుదల చేసేందుకు వెనకడుగు వేయడం లేదు.

ఈ లాక్ డౌన్ కాలంలో ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీలలో విడుదలయ్యాయి. మరిన్ని విడుదలకు తేదీలు ఖారారయ్యాయి. ఈ పరిణామాలన్నీ నిర్మాతల ఆర్థిక భారం నుంచి పుట్టుకొచ్చినవే. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలను కాపాడేందుకు పెద్ద హీరోలు త్యాగాలు చేయక తప్పదేమో!

లాక్ డౌన్ వేళ ప్రేక్షకులు ఒకింత ఓటీటీలకు అలవాటు పడిన విషయాన్ని అంగీకరించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు దర్శక, నిర్మాతలు మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుంది.

అలాంటప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూనే, ఉన్నత విలువలతో సినిమా ఉండాలి. అలా ఉండాలంటే నిర్మాతలకు భారం కాకుండా దర్శకులు, హీరోలు కృషి చేయాలి. దీనికి ఉన్న ఎకైన మార్గం పారితోషికాలు తగ్గించుకోవాలని అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.

ఒక పెద్ద హీరోకు ఇచ్చే పారితోషికంతో ఒక చిన్న సినిమా తీసేయవచ్చు అనేది పరిశ్రమ టాక్. ఇందులో నిజమెంత ఉన్నా.. ఇక నుంచి నిర్మాతలను రక్షించుకోవడానికి, ప్రేక్షకులను మెప్పించడానికి పెద్ద టెక్నీషియన్లు త్యాగాలు చేయకతప్పుదు. వారి పారితోషికాల విషయంలో ఇక నుంచి లాక్ డౌన్ కు.. ముందు లాక్ డౌన్ కు తరువాత అని కాస్త తగ్గాల్సిందే!

సినిమాకు సినిమా కష్టాలు..

ఇన్నాళ్లు నిర్మాతలకు భారం తగ్గించే విషయంలో కొంత మంది పెద్ద హీరోలు, దర్శకులు అనుసరిస్తున్న విధానం కొంత ఆదర్శనీయమనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన వెంటనే అడ్వాన్సుల పేరిట నిర్మాత మీద భారం మొపకుండా సినిమా మొత్తం పూర్తైన తరువాతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కొంత మంది పెద్ద హీరోలు, దర్శకులు.

ఈ విధానం ఆహ్వానించదగ్గదే అయినా.. ఈ లాక్ డౌన్ కాలంలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన చిత్రాలు, పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి కాని చిత్రాల విషయంలో నిర్మాతకు లాభం చేకూర్చే విధానం మాత్రం కాదనే చెప్పాలి. ఆగిపోయిన చిత్రాలకు చేసిన ఖర్చులు, వేసిన సెట్టింగులు, వాటిని ఇన్నాళ్లపాటు మెయింటెన్ చేయాల్సిన అనవసర భారాలు నిర్మాతలకు తలనొప్పి అంశాలే.

లాక్ డౌన్ కు ముందు అజయ్ దేవగణ్ హీరోగా నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రం మైదాన్. ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించి లాక్ డౌన్ కు ముందు ముంబై శివారులో 16 ఎకరాల్లో సెట్టింగ్ వేశారు.

తీరా దేశంలో లాక్ డౌన్ విధించడంతో సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. తీరా షూటింగ్ లకు అనుమతులు వచ్చే లోగా రుతుపవనాల రాకతో మొత్తం సెట్టింగ్ నే తీసేయాల్సిన పరిస్థితి.

16 ఎకరాల్లో వేసిన సెట్టింగ్ ను ఈ కారణంగా తొలగించేస్తున్నట్టు బోనీకపూర్ ప్రకటించారు. ఇలా చిత్రీకరణలో ఉన్న ఎన్నో సినిమాలు సినిమా కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితితుల్లో నిర్మాతలను గట్టెక్కించాలంటే పెద్ద టెక్నీషియన్లు తమ పారితోషికాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి!

పెద్ద టెక్నీషియన్లు ఆలోచించాలి: మణిరత్నం

చిత్ర పరిశ్రమలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు పెద్ద హీరోలు, టెక్నీషియన్లు తమ పారితోషికాలను తగ్గించే విషయంలో ఆలోచనలు చేయలంటున్నారు దిగ్గజ దర్శకులు మణిరత్నం.

మున్ముందు సినిమా బిజినెస్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతయాన్న విషయంలో స్పష్టత లేని కారణంగా, పెద్ద టెక్నీషియన్లు పారితోషికాలు తగ్గించుకోవడంపై ఆలోచించాలని ఆయన సూచిస్తున్నారు. అప్పుడే చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని సలహా ఇస్తున్నారు.

Exit mobile version