Uttanasana Benefits : మీ రోజూవారీ జీవితంలో హెక్టిక్ షెడ్యూల్ ఉందా? వ్యాయామం, జిమ్‌కి వెళ్లే సమయం లేదా? పని వల్ల ఒత్తిడి పెరిగిపోతుందా? అయితే మీరు ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అదే ఉత్తనాసనం. పైగా దీనిని చేయడం చాలా సులువు.
ఉత్తనాసనంను స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు. సూర్య నమస్కారాల్లో ఇది రెండో ఆసనం. ఈ ఆసన సాధన సమయంలో శరీర పైభాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల మెదడుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఫలితంగా నిరాశ, ఆందోళన తగ్గుతుంది. ఇవే కాకుండా ఇది మీ వీపును సాగదీస్తుంది. నడుము నొప్పితో బాధపడుతుంటే ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
తలనొప్పి, మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందాలనుకుంటే దీనిని రోజూ ప్రాక్టీస్ చేయండి. మెరుగైన రిజల్ట్స్ మీ సొంతమవుతాయి. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియ, నిద్రను పొందుతారు. అలసట, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ మహిళలు, బీపీ ఎక్కువగా ఉండేవారు దీనిని చేయకపోవడమే మంచిది.
ఉత్తనాసనం ఎలా చేయలంటే..
నేలపై నుంచొని.. మీ శరీరాన్ని ముందుకు బెండ్ చేయండి. చేతులను పాదాల వద్ద ఉంచి.. మీ తలతో మోకాళ్లను తాకించేందుకు ప్రయత్నించండి. ఒకేసారి ఈ ఆసనం పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ మీ భంగిమను మెరుగుపరచుకోవచ్చు.
ఈ ఆసనంలో 15 నుంచి 20 సెకన్లు లేదా మీకు వీలైతే ఒక నిముషం వరకు ఉండొచ్చు. అనంతరం భంగిమ నుంచి విడుదలవ్వడానికి మీ చేతులను పైకి ఎత్తి శరీరాన్ని నెమ్మదిగా పైకి ఎత్తండి. మీ శరీరం ఎంత వీలైతే అంతే స్ట్రెచ్ చేయండి. ఆసనం మొదట్లోనే పర్ఫెక్ట్గా వచ్చేయాలని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి.
ఇది మీ వెన్నుముకకు దృఢత్వాన్ని అందించి.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు గడిపేవారికి ఇది చాలా ఉత్తమమైన ఆసనం. బ్యాక్ ప్రెజర్ నుంచి ఇది చాలా విముక్తినిస్తుంది. తుంటి, కటి ప్రాంతంలో బ్యాలెన్స్, బలాన్ని పునరుద్ధరిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు, భోజనం చేసిన వెంటనే ఈ ఆసనం చేయకపోవడమే మంచిది.