Latest

Tooth Ache Home Remedies: పంటినొప్పి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందకపోతే తలనొప్పి కూడా వస్తుంది. సరిగ్గా పడుకోలేము. ఏది తినలేము. అందుకే దీనికి పరిష్కారం తప్పనిసరి. ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ట్రై చేసి మీరు కావిటీస్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
మనం ఆహారాన్ని శరీరానికి అందించే ఏకైక మార్గం నోరు. దీనిని ద్వారానే మనం శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఆహారాన్ని అందిస్తాము. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన నోరు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. నోటి సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కావిటీస్. ఇవి స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనివల్ల పంటి నొప్పి విపరీతంగా వస్తుంది. మీరు ఇప్పటివరకు దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుంటే ఇప్పుడైనా వాటిపట్ల కాస్త శ్రద్ధ వహించండి. రెగ్యూలర్ గా వైద్యుని సూచనలు తీసుకోవడంతో పాటు.. ఇంట్లోనే కొన్ని సహజ నివారణ పద్ధతులు కూడా పాటించవచ్చు. అవేంటంటే.. 

ఆయిల్ పుల్లింగ్

దంత సంరక్షణలో ఆయిల్ పుల్లింగ్ చాలా పురాతనమైనది. దీనిలో భాగంగా నూనెను నోటిలో వేసుకుని 15 నుంచి 20 నిమిషాలు పుల్లింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ చిగుళ్లు, దంతాలు, నాలుకపై ఉన్న బ్యాక్టిరీయా తొలగుతుంది. ఆయిల్ పుల్లింగ్ మిమ్మల్ని దంత క్షయం, చిగురువాపు వంటి పరిస్థితులనుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది క్లోరెక్సిడైన్ మౌత్ వాష్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 

లవంగాలు

లవంగాలు యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కావిటీస్ వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి. సమస్య పెరుగుదలను కంట్రోల్ చేస్తాయి. లవంగాలలోని క్రిమినాశక లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియాతో పోరాడుతాయి. అందుకే వీటిని టూత్ పేస్ట్, మౌత్ వాష్ లలో ఉపయోగిస్తారు. అయితే మీరు పంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే లవంగాలు తినవచ్చు. లేదా ఆలివ్ నూనెలో లవంగాల పొడిని మిక్స్ చేసి.. ఆ పేస్ట్ ను పంటిపై అప్లై చేయవచ్చు. 

కలబంద

కలబంద కేవలం చర్మ సంరక్షణకే కాదండోయ్.. దంత సంరక్షణకు మంచి పరిష్కారం చూపిస్తుంది. జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయోలీడ్ సైన్సెస్ ప్రకారం.. కలబంద నోటి సమస్యలను దిగ్విజయంగా ఎదుర్కొంటుంది. అయితే దీనికోసం మీ టూత్ బ్రష్‌పై 1/2 టీస్పూన్ కలబంద జెల్ తీసుకోండి. దీనితో మీరు ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయండి. అనంతరం మీ నోటిని నీటితో బాగా శుభ్రం చేసుకోండి. దీనిని ఫాలో అయ్యే ముందు కలబంద మీకు పడుతుందో లేదో చెక్ చేసుకోండి. 

వంట సోడా

వంట సోడా దంత సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనినే బేకింగ్ సోడా అని కూడా అంటాము. ఇది కావిటీస్ లక్షణాలను తగ్గిస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు దంత సమస్యలను దూరం చేస్తాయి. ఇది మీ నోటిలో ఉండే ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. దంతాలపై రంధ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది. పంటినొప్పిని తగ్గించుకోవడానికి, దంత సంరక్షణకై బేకింగ్ సోడాతో రోజూ రెండు సార్లు బ్రష్ చేయండి.

Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending