Mysore Pak Recipe in Telugu: మైసూర్ పాక్ రెసిపీ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? మీకు స్వీట్స్ ఇష్టమైతే, అయితే స్వీట్స్ కోసం బయటకు వెళ్లడమో.. ఆర్డర్ చేయడమో చేస్తున్నారా? దానిని ఇప్పుడే ఆపేయండి. ఇంట్లోనే కొంత సమయం వెచ్చిస్తే మీరు టేస్టీ టేస్టీ స్వీట్ మైసూర్ పాక్ తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం తక్కువ పదార్థాలతో అత్యంత ప్రీతికరమైన ఈ స్వీట్ తయారు చేయగలమంటే మీరు నమ్ముతారా? పైగా తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా నోరూరించే స్వీట్స్ తయారు చేసుకోగలిగితే ఎవరూ మాత్రం బయట షాప్‌కు వెళ్తారు. ఇంట్లిల్లీపాదికి స్వీట్స్ చేసి పెట్టాలనుకున్నా.. అతిథులు వస్తున్నారని వారి కోసం ఏమైనా స్వీట్ చేయాలనుకున్నా.. పండుగల సమయంలో బంధువులతో స్వీట్స్ పంచుకోవాలనుకున్నా మీరు దీనిని తయారుచేసుకోవచ్చు. అంతా తేలికగా తయారు చేసుకునే స్వీట్ మైసూర్ పాక్. దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- చక్కెర – 2 కప్పులు
- బేకింగ్ సోడా – చిటికెడు
- శనగపిండి – 1 కప్పు
- నెయ్యి – 2 కప్పులు
- నీరు – అర కప్పు
మైసూర్ పాక్ తయారీ విధానం
√ ముందుగా పాన్ తీసుకుని దానిలో కప్పు నెయ్యి వేసి మీడియం మంట మీద వేడి చేయండి. నెయ్యి తగినంత వేడెక్కిన తర్వాత శనగపిండి బాగా కలపండి. పిండి పచ్చి వాసనను కోల్పోయి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టండి.
√ ఇప్పుడు మరో పాన్ తీసుకుని దానిలో పంచదార, నీటిని వేసి తీగపాకం వచ్చేవరకు తిప్పండి. సిద్ధం చేసుకున్న శనగ పిండిని చక్కెర పాకంలో వేసి దానిని బాగా కలపండి. మిగిలిన నెయ్యిని వేడి చేసి ఈ మిశ్రమంలో వేసి ముద్దలు లేకుండా కలపండి. నెయ్యి పిండి నుంచి విడిపోయినప్పుడు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి.
√ ఓ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి.. శనగపిండి మిశ్రమాన్ని వేసి ఫ్లాట్గా చేయండి. అనంతరం దానిని చల్లార్చండి. అది పూర్తిగా సెట్ అయ్యాక అవసరమైన ఆకారాలలో కట్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ రెడీ. గాలి చొరబడని కంటైనర్లో దీనిని స్టోర్ చేసుకోవచ్చు.