Black Circles under Eye: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖంపై మచ్చలు, ముడతలు. ఇవి చర్మ సౌందర్యాన్ని పోగొట్టి ముఖారవిందాన్ని పాడుచేస్తున్నాయి. ముఖం ఎంత అందంగా కనిసించినా, చర్మం ఎంత కాంతివంతంగా మెరిసిపోయినా కంటి చుట్టూ నల్లగా ఉంటే అంత ఆకర్షణగా ఉండదు.
ముఖంలో కళ్లు అనేవి అందానికి ప్రతిబింబంలాంటివి. అలాంటి కళ్లు అందంగా లేకపోతే నిర్జీవంగా మారితే ఎలాంటి చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా వేసవి వేడికి కళ్లు చాలా నిర్జీవంగా తయారవుతాయి. సాధారణంగా కళ్లకింద నల్లటి వలయాలు చాలా కారణాల వల్ల వస్తూంటాయి. ఒత్తిడి, జీవనశైలితో వచ్చే మార్పుల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి. అసలు ఈ నల్లటి వలయాలు రావడానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు? దీనికి సహజంగా ఎలాంటి చిట్కాల ద్వారా వీటిని దూరం చేయచ్చు? ఇప్పుడు చూద్దాం.
కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు
- సరైన నిద్ర లేకపోవడం.
- ఒత్తిడికి గురికావడం.
- టీవీ, మొబైల్ ఎక్కువగా చూడడం.
- నిరంతరం కంప్యూటర్‌ను ఎక్కువగా చూడడం.
- మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం కూడా ఒక కారణం.
- అలర్జీలు
- డీ హైడ్రేషన్
- జన్యుపరమైన కారణాలు
సరైన నిద్ర లేకపోతే ఎంత అందమైన ముఖం అయినా వాడిపోతుంది. దాని వల్ల కళ్ల చుట్టూ వలయాలు ఏర్పడి చర్మం ఛాయ దెబ్బతింటుంది. ఆరోగ్యానికి, అందానికి కూడా నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. కనుక ముఖం కాంతివంతంగా ఉండాలన్నా, కళ్లు కళకళలాడాలన్నా, నల్లటి మచ్చలు, ముడతలు పోవాలన్నా అన్నింటికి ప్రధానంగా ఉండాల్సింది నిద్ర. మరి ఎలాంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చో చూద్దాం.
నల్లటి వలయాలకు ఈ టిప్స్‌తో చెక్
- రాత్రి పడుకునే ముందు కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని కళ్ల కింద రాని మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి.
- విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్‌గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ను కళ్ల కింద మర్దన చేయాలి.
- పై రెండూ అందుబాటులో లేనివారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్ల కింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి.
- తురిమిన బంగాళాదుంపలు లేదా కీరదోస కాయలను చక్రాలుగా కోసుకుని వాటిని కళ్లమీద పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. ఇవి కంటిచుట్టూ తయారయ్యే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వీటిలో ఉండే విటమిన్‌లు, యాంటీ ఆక్సీడెంట్‌లు నిరోధక శక్తిని కలిగి ఉంటాయి కనుక మంచి ఫలితం ఉంటుంది.
- చల్లటి పాలు సహజంగా పనిచేస్తాయి. కళ్లకి మంచి క్లెన్సర్‌లాగా పనిచేస్తాయి. కళ్ల చుట్టూ సున్నితమైన చర్మాన్ని కాపాడడం ద్వారా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి. చల్లటి పాలలో దూదిని ముంచి కాసేపు మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేయాలి. పాలలో లాక్టిక్ ఆమ్లం వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- బాదం నూనె, నిమ్మరసంలో ఆస్కార్బిక్ ఆమ్లం కళ్ల కింద వలయాలను నిరోధిస్తుంది. ఒక టీస్పూన్ బాదం నూనె, కొన్ని చుక్కల నిమ్మ రసం తీసుకుని కంటిచుట్టూ సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత కడిగేయాలి.
- రోజ్‌వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కాటన్ ప్యాడ్‌ను తీసుకుని దానిని రోజ్‌వాటర్‌లో ముంచి కళ్ల మీద ఉంచాలి. 2 నుంచి 3 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత వాటిని తీసేయాలి. ఒక నెలరోజుల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాన్ని చూడవచ్చు.
పై వాటిలో ఏ చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోయి ముఖం అందంగా కనిపిస్తుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్