How to remove tan from face: ఎండాకాలం వచ్చిందంటే చాలు ముఖంపై ట్యాన్ తప్పదు. ఈ నలుపు పోవాలంటే ఏం చేయాలి? వేసవిలో ఆరోగ్యంతో పాటు కాస్త చర్మ సౌందర్యాన్ని కూడా చూసుకోవలసిందే. వేసవిలో బయటికి వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా ఎండలోకి వెళ్లగానే ముఖం నల్లగా మారడం సహజం. ముఖ్యంగా టీనేజ్ అమ్యాయిలు ఎక్కువగా ఇబ్బంది పడే చర్మ సమస్యల్లో ట్యాన్ ఒకటి. చర్మం కమలిపోవడం, నల్లగా మారడం తద్వారా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది.
ఎక్కువగా మెడపై, చేతులపై, ముఖం మీద వస్తూ ఉంటుంది. కారణం మనం బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోకపోవడం అని అంటున్నారు నిపుణులు. కానీ చాలామంది సన్‌స్క్రీన్ లోషన్స్ రాసినా గానీ ఎండ ప్రభావం చర్మం తొందరగా పాడైపోవడానికి కారణమవుతుంది. చర్మం చాలా సున్నితంగా ఉండడం వల్ల ఎండ ప్రభావం తీవ్రంగా పడి ముఖం నల్లగా కమిలిపోయిన్నట్లు తయారవుతుంది. మనం ట్యాన్ పోగొట్టేటప్పుడు కేవలం ముఖం మీద మాత్రమే శ్రద్ద ఉంచకుండా మెడ, చేతులు వీటి భాగాల్లో కూడా ట్యాన్ తొలగించాలి. మరి ఈ ట్యాన్‌ను ఇంట్లో లభించే వాటితోనే ఎంచక్కా తొలగించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూసేయండి.
నేచురల్ పదార్థాలతో ట్యాన్ తొలగించే చిట్కాలు
1. కలబంద గుజ్జును తీసి ట్యాన్ ఉన్న ప్రదేశంలో పూతలా రాయాలి. కలబందలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు చర్యాన్ని రక్షిస్తాయి. అంతేకాక చర్మం తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. దీనితో పాటు ఎండల్లో కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో ఒక స్పూన్ టమాటో రసాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకుని ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. అరగంట ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
2. బొప్పాయి పండు గుజ్జులో తేనె కలిపి ఫేస్ మాస్క్‌లా వేసుకోవాలి. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ ఎండ వల్ల ఏర్పడ్డ నలుపు రంగును తొలగించడానికి సహాయపడుతుంది. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
3. కేవలం టమాటాతో ట్యాన్‌ను సులభంగా తొలగించవచ్చు. టమాటోలో ఉండే సి విటమిన్ చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం టమాటోను వెడల్పుగా ముక్కలు తరిగి ఎండవల్ల కమిలిన చర్మంపై రాస్తే అది చర్మాన్ని సహజంగా మారుస్తుంది. టమాటో గుజ్జును కూడా ముఖానికి అప్లయ్ చేయవచ్చు.
4. బంగాళాదుంప రసాన్ని చర్మానికి రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతం అవుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉండడం వల్ల ట్యాన్ పొగొట్టడంలో ఉపకరిస్తుంది. కనుక బంగాళాదుంపను తీసుకుని చిన్న ముక్కలుగా తురుముకుని దానితో రసం తీసి ఆ రసాన్ని ఏదైనా దూది సహయంతో ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
5. పెరుగుతో కూడా చర్మ సౌందర్మాన్ని పెంచుకోవచ్చు. ముఖానికి పెరుగు రాయడం వల్ల చర్మం సహజసిద్దమైన కాంతిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా చర్మం చాలా మృదువుగా ఉంచడంలో పెరుగు తోడ్పడుతుంది. ఇది చర్మానికి మంచి క్లెన్సింగ్‌గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడ భాగంలో రాసుకోవాలి. పదిహేను నిమిషాల పాటు ఉంచుకుని నీటితో కడిగేయాలి.
ట్యాన్ నుంచి చర్మాన్ని కాపాడేందుకు కొన్ని జాగ్రత్తలు
- బయటికి వెళ్లడానికి ముందు తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఎండ వేడి ప్రభావం చర్మానికి హాని చేయకుండా ఇది ఉపకరిస్తుంది.
2. కొందరు అదేపనిగా ముఖాన్ని నీటితో కడుగుతూ ఉంటారు. ఇలా మాటిమాటికి నీటితో చర్మాన్ని కడగడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ అనేది ఏర్పడుతుందట. ఇది చర్మ తేమను పోగొట్టేలా చేస్తుంది.
3. ఎండాకాలంలో వేడి నుంచి రక్షించుకునేందుకు సరైన దుస్తులు ధరించడం మంచిది. చల్లగా ఉండేవాటిని అంటే కాటన్ దుస్తులను ధరించాలి. ఎక్కువ బిగుతుగా లేకుండా చూసుకోవాలి. అలాగే ట్యాన్ బారి నుండి బయటపడాలంటే శరీరం మొత్తాన్ని కవర్ చేసుకోవాలి.
4. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం వేళలోనే ఎక్కువగా సూర్యుని నుంచి వచ్చే యువీ కిరణాలు నేరుగా భూమిమీద పడడం వల్ల ఎక్కవగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పైగా ఎండ వేడి తీవ్రంగా ఉండడం వల్ల చర్మం కమిలిపోవడం, నల్లగా తయారవడం లాంటి సమస్యల బారిన పడతాం.
5. బయటి పానీయాలు ఎక్కువగా తాగకపోవడం మంచిది. ఇంట్లోనే మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, సబ్బా గింజలు, కొబ్బరి నీళ్లు, ముంజలు ఎక్కువగా తీసుకోవాలి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్