మొటిమలు పోవాలంటే ఏం చేయాలి అని తలమునకలవుతున్నారా? మొటిమల మచ్చలు పోవడానికి చిట్కాల కోసం చూస్తున్నారా? ఈ సమస్యలను అందరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొని ఉంటారు. మొటిమలు పోవడానికి మార్కెట్లో అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు లభిస్తున్నాయి. అయితే ఇవన్నీ పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మొటిమలను నివారించవచ్చు. అలా మీ ఇంట్లోనే ఉండే పదార్థాలతో మొటిమలను వదిలించుకునేందుకు చిట్కాలు ఇక్కడ చూడండి.
1. కలబంద
మీకు మొటిమలు పెరిగి ఎర్రగా, నొప్పిగా మారుతున్నట్లయితే కలబంద మంచి ఉపశమనం ఇస్తుంది. కలబందలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఎరుపును తగ్గించడంలో, మొటిమలను తగ్గించడంలో తోడ్పడతాయి. మొటిమల నుండి జిడ్డు తొలగించడంలో కలబంద సహాయపడుతుంది. మొక్క నుండి నేరుగా తీసుకున్న కలబందను ఉపయోగించి ప్రతిరోజూ అప్లై చేస్తే మొటిమల వల్ల ఏర్పడే ఏవైనా మచ్చలను కూడా మాయం చేస్తుంది. మొటిమలు, మచ్చలు పోవడానికి కలబంద చక్కటి పరిష్కారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2. పెరుగు
ఇంట్లో తోడు పెట్టిన పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత కణాలను తొలగిస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. పావు కప్పు పెరుగును మీ ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోండి.
3. పసుపు, తేనె
పసుపు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది చర్మం నుండి జిడ్డు, అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. తేనె మొటిమలలో బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ తేనెకు 1⁄2 టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తడి చర్మంపై అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలను వదిలించుకోవడంలో సహాయ పడుతుంది. పగుళ్లను నివారిస్తుంది. ఇది చర్మానికి లోతైన ప్రక్షాళనగా, మన చర్మ రంధ్రాలను మూసుకుపోయే మలినాలను, మురికి కణాలను తొలగించడంలో సాయపడుతుంది.1 1⁄2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని నీరు లేదా రోజ్ వాటర్‌తో కలపండి. మీ ముఖం మీద అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత శుభ్రంగా కడుక్కోండి.
5. నిమ్మరసం
నిమ్మరసం యాంటీ బాక్టీరియల్. బ్యాక్టీరియాను చంపడం ద్వారా మొటిమలను వదిలించుకోవడంలో సహాయపడుతుంది. ఇది విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్‌లో కూడా సమృద్ధిగా ఉంటుంది. తరచుగా ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించి నేరుగా మొటిమపై అప్లై చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
6. పుదీనా
పుదీనా ఆకులలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి రెండూ చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మం పొడిబారకుండా ఉండేందుకు, మొటిమలు పోయేందుకు తాజా పుదీనా రసాన్ని ప్రతి రాత్రి ముఖమంతా అప్లై చేసుకోవాలి.
7. నారింజ
నారింజ పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది సెబమ్ గ్రహించడంలో సహాయపడుతుంది. నారింజ గుజ్జును ముఖానికి అప్లై చేయండి.10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత శుభ్రం చేసుకోండి. నారింజ గుజ్జుకు స్ట్రాబెర్రీ గుజ్జును కూడా కలపొచ్చు.
8. బొప్పాయి
మొటిమలను వదిలించుకోవడంలో బొప్పాయి చాలా బాగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జును అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. దీనిలోని యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి మొటిమలు రాకుండానూ, అలాగే వదిలించుకోవడంలోనూ సహాయపడుతాయి.
9. రోజ్ వాటర్
రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మంట, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం ఇరిటేషన్ కలిగించకుండా చేస్తుంది. రోజూ ఉదయం, రాత్రి టోనర్‌కు బదులుగా దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి.
10. శనగ పిండి
మొటిమలు పోవాలంటే శనగ పిండి కూడా హోమ్ రెమెడీగా ఉపయోగపడుతుంది.. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వారికి మేలు చేస్తుంది. ఇది అదనపు సెబమ్ స్రావాన్ని గ్రహించడం ద్వారా జిడ్డును తగ్గించడంలో సహాయపడుతుంది. 1 టేబుల్ స్పూన్ శనగ పిండిని నీటితో కలపండి. శుభ్రమైన చర్మానికి పూయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రంగా కడుక్కోండి.
ఇవి కూడా చదవండి:
Vitamin B12 deficiency and Food: విటమిన్ బీ12 లోపం లక్షణాలు.. అది లభించే ఆహారం ఇవే