Jack Fruit Health Benefits: వేసవి సీజన్‌లో పనస పండ్లు (Jack Fruit) విరివిగా లభిస్తాయి. దీనిలో ఆరోగ్యానికి అవసరమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పనసను తినడమే కాదు, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరవచ్చో కూడా తెలుసుకోవాలి. పనస పండు ఎక్కడ ఉన్నా మంచి సువాసనలతో మధురిమను అందిస్తుంది. అంతేకాదు పనసతో వివిధ రకాల వంటకాలు చేయొచ్చు. పనస పొట్టు పచ్చడి, పనస హల్వా, అలాగే పనస కుడుములు ఇలా ఎన్నో రకాలుగా పనసను వాడుతుంటారు. దీనిలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ గుణాలన్నీ ఉన్నాయి.
వేసవి కాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. అన్నీ కూడా సీజన్‌లో తినాల్సినవే. ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. అందులో పనస చెప్పుకోదగినది. ఇది చూడ్డానికి కొంచెం పెద్ద సైజు అనిపించినా దాని లోపల తొనలు మాత్రం ఎంతో రుచిగా ఉంటాయి. పనస తొనలు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని సైతం అందిస్తాయి. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే పనసతో అనేక లాభాలను పొందవచ్చు.
పనస పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
1.పనస పండ్లలో విభిన్న విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. పనస పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్ల సమస్య నయం అవుతుంది. పనస పండులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి.
2. పనసలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరడానికి సహాయపడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
3. పనస పండులో విరివిగా ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జ్వరం, అతిసారతో బాధపడేవారు పనస తొనలు తింటే ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది.
4. దీనిలో మానసిక ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు ఉన్నాయి. శారీరక అలసటను తగ్గిస్తుంది. పనసలో విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది.
5. పనసలో ఉండే కాపర్ థైరాయిడ్ గ్రంధి పనితీరుని మెరుగుపరుస్తుంది. నిత్యం ఈ పండు తినడం వలన థైరాయిడ్ సమస్యలను అధిగమించవచ్చు.
6. వయసు పై బడుతున్న వారు పనస పళ్లు తింటే కంట్లో శుక్లాలు వచ్చే అవకాశం తగ్గడమే కాకుండా కంటి సమస్యలు పోయి చూపు చక్కగా ఉంటుంది. పనసలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.
7. పనస తొనలు తినడం వలన పురుషుల్లో వీర్య కణాల వృద్ది జరుగుతుంది. మగవారికే కాదు ఆడవారికి కూడా ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. చాలామంది ఆడవాళ్ళు కాల్షియం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు పనస తొనలు తినడం ఎంతో మేలు చేస్తుంది.
8. పాలలో కంటే పనస తొనల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఎదిగే పిల్లలు వీటిని తినడం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి. కడుపులో మంట, అల్సర్లను తగ్గిస్తుంది.
9. పనసలో పోటాషియం రక్తనాళాలను సడలించి ఒత్తిడిని దూరం చేస్తుంది. పేగు కదలికకు, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
10. తొనలే కాదు పనస గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. పనస పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. ఈ పండు గింజలను కాల్చి తింటే మంచిది.
11. ఈ పండును మధుమేహ రోగులు కూడా తినొచ్చు. పనస తినడం వల్ల షుగర్ వ్యాధి ఎక్కువ అవుతుందనే అనుమానాలు అవసరం లేదు. మధుమేహుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్