Home పేరెంటింగ్ పిల్ల‌ల ఎముకలు బలంగా ఉండాలంటే డైట్‌లో ఈ ఆహారం తప్పనిసరి

పిల్ల‌ల ఎముకలు బలంగా ఉండాలంటే డైట్‌లో ఈ ఆహారం తప్పనిసరి

kids in spiderman and Captain America costumes
పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఇవ్వాల్సిన డైట్ Photo by Steven Libralon on Unsplash

పిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండాలంటే స‌రైన  ఆహర ప‌దార్థాలు అందించ‌డం అవ‌స‌రం. ముఖ్యంగా పిల్ల‌ల డైట్‌లో కాల్షియం విరివిగా ఉండే పాల‌ప‌దార్థాలు.. అంటే పెరుగు, చీజ్, నెయ్యి వంటి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు చేర్చాలి. కానీ కొందరు పిల్లలు వీటిని సరిగా తీసుకోకపోవడం వ‌ల‌న వారి ఎముకలు బలహీనంగా తయారవుతాయి. పిల్లల్లో సహజంగా ఎముకలను బలోపేతం చేసే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. 

ఎముక‌ల‌ను బ‌లోపేతం చేసే ఆహారాలు:

1. ఆకు కూరలలో విట‌మిన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. బచ్చలికూర, పాలకూర, తోటకూర, గంగవాయిలికూర, ఆవాకు మొదలైన వాటిలో కాల్షియం, విటమిన్ కె, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలన్నీ ఉంటాయి. ఇవన్నీ పిల్లలకు సంపూర్ణ ఆహార పోషణను అందిస్తాయి. త‌ద్వారా ఆరోగ్యం, జీవక్రియ రేటు వృద్ధి చెందుతుంది. ఎముక ఆరోగ్యం బలోపేతం అవుతుంది. పిల్లలు ఆకు కూరలు తినేలా చేయడానికి సులభమైన మార్గం శాండ్విచ్‌లలో వాటిని జోడించి పెట్టడమే.

2. విట‌మిన్ డి పిల్ల‌ల ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇది కాల్షియం శోషణకు ఉపయోగపడుతుంది. విటమిన్ డి తగ్గడం వ‌ల్ల పిల్ల‌లకు అనేక ర‌కాలైన వ్యాధులు చేర‌తాయి. అంతేకాదు ఎముక‌ల బ‌లం పూర్తిగా న‌శించిపోతుంది. క‌నుక పిల్ల‌ల‌ను రోజూ సూర్య‌ర‌శ్మి త‌గిలే విధంగా చేయ‌డం అవ‌స‌రం. విట‌మిన్ డి పెరిగేందుకు వారి ఆహారంలో జున్ను, కొవ్వుతో కూడిన చేప‌లు, పుట్టగొడుగులు ఉండేలా చూసుకోవాలి

3. సాల్మన్ చేప‌ల‌లో అనేక పోష‌కాలు, ఖ‌నిజ లవణాలు ఉంటాయి. ఇవి విటమిన్ కె, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలలతో నిండి ఉంటాయి. సాల్మన్, మాకరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు ఎముక ఆరోగ్యాన్ని, ఎముక ఖనిజ సాంద్రతను, శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

4. బాదం, చియా గింజలు, నువ్వులు వంటి వాటిని త‌ప్ప‌నిస‌రిగా పిల్లల ఆహారంలో చేర్చాలి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను  ఉపయోగించి స్మూతీస్, సోర్బెట్‌లు,షేక్‌లను తయారు చేసి పిల్లలకు తిన‌పించ‌వ‌చ్చు.

5. బీన్స్, శనగలు, తృణధాన్యాలు, కాయ‌గింజలు, చిక్కుళ్ళలో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్‌ మెండుగా ఉంటాయి. ఇవి పిల్లలలో ఎముకలను పటిష్టం చేయడంలో తోడ్పడుతాయి. ఈ ఆహారాల‌తో పాటు పిల్ల‌ల‌కు ముఖ్యంగా శారీర‌క శ్ర‌మ చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ పిల్ల‌ల ఎదుగుద‌ల‌ను ఎంత‌గానో మెరుగుప‌రుస్తుంది. ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా త‌యారవ్వాలంటే పిల్ల‌ల‌ను ఎక్కువ‌గా ర‌న్నింగ్, డ్యాన్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ లాంటి ఆట‌ల‌ను ఆడించ‌డం ద్వారా వారి ఎముకలు, కండ‌రాల్లో బలం పెరుగుతుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version