Home ఫుడ్ ఉగాది నేతి బొబ్బ‌ట్లు రెసిపీ: ఇలా చేయండి.. ఇట్టే నోట్లో క‌రిగిపోవాల్సిందే

ఉగాది నేతి బొబ్బ‌ట్లు రెసిపీ: ఇలా చేయండి.. ఇట్టే నోట్లో క‌రిగిపోవాల్సిందే

bobbatlu
నేతితో చేసిన బొబ్బట్లు "Bobbatlu" by ►SitaraFoods is licensed under CC BY-NC-SA 2.0

నేతి బొబ్బ‌ట్లు చాలామందికి ఇష్ట‌మైన స్వీటు. ముఖ్యంగా తెలుగు వారి పండుగ‌ల‌లో ఈ నేతి బొబ్బ‌ట్టు లేకుండా పండుగే ఉండ‌దు. బొబ్బట్లు తెలుగు వారి పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పండ‌గ‌లు, ప‌బ్బాలు, పూజ‌లు, వ్ర‌తాలు మొద‌లైన వాటిలో సాంప్ర‌దాయ‌కంగా వండే పిండివంట‌. దేవుడికి నైవేద్యంగా కూడా బొబ్బ‌ట్ల‌ను సమర్పిస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈసారి నేతి బొబ్బట్లు ప్రయత్నించి చూడండి. వాటిని చేయడం పెద్ద కష్టమేం కాదు, ఇక్కడ చెప్పిన పద్ధతిలో సింపుల్ గా చేసుకుంటే సరిపోతుంది. 

బొబ్బట్లకు కావలసిన పదార్ధాలు

  • శనగపప్పు – క‌ప్పు
  • బెల్లం తురుము – క‌ప్పు
  • యాలకుల పొడి – అర టీస్ఫూన్ 
  • గోధుమ పిండి – క‌ప్పు
  • నెయ్యి – అర‌క‌ప్పు
  • ఉప్పు – పావు టీ స్ఫూన్‌
  • నీళ్లు – స‌రిప‌డిన‌న్ని

బొబ్బట్లు తయారుచేసే విధానం

బొబ్బ‌ట్లు త‌యారు చేసేందుకు మైదాపిండి, గోధుమ పిండి ఏదైనా వాడొచ్చు. చాలా మంది మైదా పిండిని వాడతారు. కానీ మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే మేం ఇక్కడ గోధుమ పిండిని వాడమని చెబుతున్నాం. దీనివల్ల టేస్టులో పెద్ద తేడా ఏమీ రాదు.

స్టెప్ 1: గోధుమ‌ పిండిని కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగ కలుపుకొని, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. 

స్టెప్ 2: ఒక గిన్నెలో శనగపప్పును నీళ్లుపోసి నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టాలి. 

స్టెప్ 3: శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయేంత నీరుపోసి, ఉప్పు వేసి కుక్కరులో ఉడికించాలి. 

స్టెప్ 4: నీళ్లు వ‌డ‌క‌ట్టి ఉడికించిన మిశ్ర‌మంలో బెల్లం తురుమువేసి గ్రైండ్ చేయాలి. దీనిలో ఏలకులపొడి, నెయ్యి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 5: ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ‌పిండి ఉండను తీసుకొని, చేతికి నూని రాసుకొని, ఆ ఉండను చ‌పాతీ క‌ర్ర‌తో పూరీలా వ‌త్తుకోవాలి. అందులో శనగపప్పు, బెల్లం ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి.

స్టెప్ 6: ఇప్పుడు అరటి ఆకు మీద కానీ, లేకపోతే పాల కవరు మీద కానీ, ఏదైనా దళసరి కవరు మీదైనా సరే, నూని రాసి, ఈ తయారు చేసుకున్న ఉండను పూరీలా వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్థం బయటకు రాకుండా వత్తుకోవాలి.

స్టెప్ 7: ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగా నెయ్యి రాసి, పెనం మీద వేయాలి. 

స్టెప్ 8: రొట్టెకు చుట్టూ నెయ్యి వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంట మీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.

అంతే బొబ్బట్లు రెడీ. ఈ బొబ్బట్లను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. బొబ్బట్లనే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా పిలుస్తారు. భక్ష్యాలు, పోలీలు, ఉగాది బూరెలు అని పిలుస్తారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version