సర్కారు వారి పాట : మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు అవినీతిపైనా?

sarkaaru vaari paata

సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం ఉదయం 9.09 గంటలకు స్వయంగా ఆవిష్కరించారు.

ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఒకింత భిన్నంగా ఉంది. చెవికి పోగుతో మాస్ లుక్ కనిపించింది. సినిమా టైటిల్, మహేష్ బాబు చిత్రంపై రూపాయి నాణెం చిహ్నం.. ఇవన్నీ కలసి చూస్తుంటే ప్రభుత్వ పెద్దల అవినీతిపై పోరాడే కథానాయకుడి పాత్ర అయి ఉండొచ్చనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రి పొడక్షన్ వర్క్ నడుస్తోంది. హీరోయిన్ సహా ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు మార్తాండ్ కె. వెంకటేష్ చూస్తారు.

సర్కారు వారి పాట సినిమాను నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, గోపి అచంట నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బానర్ల పై సినిమా నిర్మితం కానుంది. మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టయిన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయనుంది.

గతంలో అవినీతి కథావస్తువుగా నిజం సినిమా తీసిన మహేష్ బాబుకు ఆ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించలేదు. మాఫియా నేపథ్యంలో తీసిన పోకిరి మహేష్ బాబు చరిత్రలో బంపర్ హిట్ గా నిలిచింది. ఆర్మీ ఆఫీసర్ గా ఇటీవలి సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా బంపర్ హిట్ అందించింది. ఈ చిత్రంతో పాటు సందేశాత్మకంగా తీసిన మహర్షి, భరత్ అనే నేను వంటి వరస చిత్రాల్లో రాజకీయం, అవినీతి, అధికార దుర్వినియోగం కథాంశంగా ఉంది.

సర్కారు వారి పాట ప్రభుత్వంలోని పెద్దల అవినీతిపై ఎక్కు పెడుతుందా? ప్రభుత్వ పనుల్లో వేలం పాటలపై ఎక్కుపెడుతుందా? తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Scroll to Top