Fish fry recipe: ఫిష్‌ ఫ్రై .. ఫిష్‌ కర్రీ .. ఈజీ కుకింగ్‌ ఇలా

fish fry recipe
Image: DearUrban Bureau

Fish fry recipe: ఫిష్‌ ఫ్రై అయినా, ఫిష్‌ కర్రీ అయినా తెలుగు వారికి, బెంగాలీలకు స్పెషల్‌ వంటకం. మార్కెట్లో ఎలాంటి చేపలు దొరుకుతాయేమోనన్న భయంతో ఎక్కువగా తెచ్చుకోరు కానీ.. తెలిసిన వాళ్లని అడిగి తాజా చేపలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో తెలుసుకుని తెచ్చేసుకుంటే సరి. ఫిష్‌ ఫ్రై రెసిపీ చాలా సులువు. అలాగే చేపల పులుసు చేయడం కూడా చాలా సులువు.

ఫిష్‌ ఫ్రై రెసిపీ (Fish fry recipe)

కావాల్సిన పదార్థాలు

చేపలు అర కేజీ (7 నుంచి 8 ముక్కలు)
కారం పొడి 3 టీ స్పూన్లు
ధనియాల పొడి 2 టీ స్పూన్లు
పసుపు పావు టీస్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ 1 లేదా ఒకటిన్నర టీ స్పూన్‌
ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్‌ లేదా తగినంత
నిమ్మరసం నాలుగైదు టీస్పూన్లు
వంట నూనె నాలుగైదు టేబుల్‌ స్పూన్లు
ఆప్షనల్ : జీలకర్ర పొడి, కార్న్‌ ఫ్లోర్‌ (క్రిస్పీగా ఉండాలనుకుంటే), మైదా, ఎగ్‌ వైట్, గరం మసాలా, ఫుడ్‌కలర్‌)

ఫిష్ ఫ్రై తయారీ విధానం Fish fry making ఇలా.. స్టెప్ బై స్టెప్

1. ముందుగా ఒక బౌల్‌లో చేప ముక్కలు సిద్ధం చేసుకోవాలి.

2. మరొక బౌల్‌లో మసాలా పేస్ట్‌ సిద్ధం చేసుకోవాలి. పైన చెప్పినట్టుగా అరకిలో చేప ముక్కలకు రెండు మూటు టీస్పూన్ల కారం, రెండు టీస్పూన్ల ధనియాల పొడి, పావు టీ స్పూన్‌ పసుపు, ఒక టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు, కాస్త జీలకర్ర పొడి, నిమ్మరసం కలుపుకొని పేస్ట్‌లా చేయాలి. ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపితే మసాలా పేస్ట్‌ సిద్ధం అవుతుంది. కొందరు కోడి గుడ్డు తెల్లసొన, కార్న్‌ఫ్లోర్, మైదా.. వీటిలో ఏదో ఒకటి కలుపుతారు. వారి అభిరుచిని బట్టి యాడ్‌ చేసుకోవచ్చు. అలాగే గరం మసాలా, ఫుడ్‌కలర్‌ కూడా మన అభిరుచిని బట్టి కలుపుకోవచ్చు. లేకపోయినా ఇబ్బంది లేదు.

3. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్‌లో ముందుగా మనం శుభ్రం చేసుకుని రెడీగా ఉంచిన చేప ముక్కలను కలపాలి. అన్ని ముక్కలకు మసాలా పట్టేలా చూడాలి. కనీసం ఒక అర గంట నుంచి గంట వరకు మారినేట్‌ అయ్యేలా చూడాలి.

4. ఫిష్‌ ఫ్రై చేసేందుకు ఒక వెడల్పాటి పాన్‌ తీసుకోవాలి. పాన్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల ఆయిల్‌ వేసి వేడెక్కాక పాన్‌ వెడల్పును బట్టి ఒకటి లేదా రెండు లేదా మూడు ఫిష్‌ ముక్కలు వేయాలి. మంట సిమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే అడుగంటిపోతుంది. చేప ఉడకదు. చేప ముక్కలు ఒక్కొక్కటి వేశాక కనీసం మూడు నిమిషాల పాటు ఒక పక్క వేగాక మరో వైపు తిప్పాలి. రెండో వైపు కూడా రెండు మూడు నిమిషాలు అలాగే వేగనివ్వాలి. ముక్క కరకరలాడే వరకు దీన్ని రిపీట్‌ చేయాలి. అయితే ముక్క రెండో వైపు తిప్పే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ముక్క విరిగిపోతుంది.

5. సర్వింగ్‌ బౌల్‌లో పెట్టుకుని కొత్తమీర ఆకులు చల్లుకోవాలి.

చూశారు కదా.. చాలా ఈజీ రెసిపీ. చిన్న పిల్లలకు ఇది నెమ్మదిగా అలవాటు చేస్తే చేపలు ఆహారంగా తీసుకోవడంలో ఇష్టపడతారు.

చేపల కూర తయారీ విధానం Fish curry recipe

ఫిష్‌ ఫ్రై నోరూరిస్తే.. ఫిష్‌ కర్రీ గుమగుమలు వెదజల్లుతుంది. పులుపు, కారం, ఉప్పు తగిన పాళ్లలో ఉంటే చేపల కూర రెసిపీ సక్సెస్‌ అయినట్టే.

ఫిష్ కర్రీ fish curry కి కావలిసిన పదార్థాలు..

చేప ముక్కలు 1 కిలో
వంట నూనె 4 టేబుల్‌ స్పూన్లు
ఉల్లి పేస్ట్‌ 2 ఉల్లిగడ్డలు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ 1 టీస్పూన్‌
కారం పొడి 3 టీస్పూన్లు
పసుపు పావు టీస్పూన్‌
ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్లు
ధనియాలు 2 టీ స్పూన్లు
మెంతులు అర టీ స్పూన్‌
లవంగాలు మూడు
జీలకర్ర ఒక టీ స్పూన్‌
యాలకులు 2
పచ్చి మిర్చి 3
కొత్తిమీర తురుము కాస్త
కరివేపాకు
చింతపండు పిడికెడు

ఫిష్‌ కర్రీ fish curry making చేసే విధానం స్టెప్‌ బై స్టెప్‌

1. చేపల వాసన పోవాలంటే కాస్త ఉప్పు వేసిన నీళ్లతో కడిగి రెడీగా పెట్టుకోవాలి. చేప ముక్కలకు నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

2. చింతపండు రసం కోసం కొద్దిగా (ఒక కోడిగుడ్డు సైజులో) చింతపండు తీసుకుని శుభ్రం చేసుకుని గిన్నెలో నానబెట్టుకోవాలి.

3. స్టవ్‌ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ధనియాలు, మెంతులు, లవంగాలు, యాలకులు, జీలకర్ర లైట్‌గా వేయించి చల్లారిన తరువాత మిక్సీలో పొడిగా చేసుకోవాలి.

4. ఇక కూర గిన్నె స్టవ్‌ పై పెట్టి దానిలో నాలుగు టేబుల్‌ స్పూన్ల వంట నూనె పోసి వేడెక్కాక ఉల్లిగడ్డ పేస్ట్‌ గానీ, సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని గానీ వేయాలి. తదుపరి నిలువుగా కోసిన పచ్చి మిర్చి వేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి కూడా వేసి వేగాక కాస్త పసుపు వేసుకోవాలి.తదుపరి కారంపొడి కూడా వేసి కలపాలి.

5. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసుకుని కూరలో పోయాలి. ఒకటిన్నర రెండు గ్లాసుల చింతపండు రసం వస్తే సరిపోతుంది. ఫ్రైలో వేసిన ఈ రసాన్ని బాగా కలపాలి. తరువాత ఉప్పు కూడా వేయాలి.

6. రసం వేడెక్కాక చేప ముక్కలు కూడా వేసుకోవాలి. పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి. కలిపితే ముక్కలు విరిగిపోతాయి.

fish curry
Image by DearUrban

7. ముందుగా వేయించి పొడిచేసుకున్న మసాలా పొడిని ఇప్పుడు కూరలో వేయాలి. ఆయిల్‌ కూరపై పేరుకుపోయేవరకు ఆగితే చాలు. గార్నిష్‌ కోసం కొత్తిమీర చల్లుకోవచ్చు. అంతే ఇక చేపల కూరతో పుష్టిగా భోంచేయొచ్చు.

– రెసిపీ : అర్పితా రెడ్డి

Previous articleసర్ .. ప్రేమ ఉంటే చాలా?
Next articleది వైట్ టైగర్ : డ్రైవర్ నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ పేదవాడి కథ