Home న్యూస్ లాక్‌డౌన్ ఎత్తి వేస్తే .. ఈ పిట్ట కథ నిజమవుతుందా?

లాక్‌డౌన్ ఎత్తి వేస్తే .. ఈ పిట్ట కథ నిజమవుతుందా?

covid 19 lock down

ఇండియాలో ఎదురయ్యే పర్యవసనాలేంటి?

కరోనా వ్యాప్తి .. లాక్ డౌన్ పై చర్చించేముందు ఈ పిట్ట కథను ఓసారి చదువుకుందాం. ఓ రాజు గారు తనకు బాగా ఇష్టమైన చదరంగం ఆటను కనిపెట్టిన వ్యక్తిని సన్మానించాలని నిర్ణయించుకున్నాడట. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి నీకేం బహుమానం కావాలో కోరుకో అని అడిగాడట. వద్దు ప్రభు అన్నా వినకుండా తీసుకోవల్సిందే అన్నాడట.

ఐతే నాకు చదరంగం బోర్టులో ఉన్న మొదటి గడిలో ఒక బియ్యం గింజ, రెండో గదిలో రెండు, మూడో గడిలో దానికి రెట్టింపు అనగా 4, నాలుగో గడిలో దానికి రెట్టింపు గా 8 గింజలు.. అలా చదరంగం పలకపై ఉండే అన్ని గడులూ నింపండి అని అడిగాడట.

ఓస్ అంతేనా ఇంత చిన్న బహుమానం అడిగి నన్ను అవమానిస్తున్నావని అన్న ఆ రాజు అతడు కోరిన మేరకు గింజలు ఇచ్చి పంపండని సేవకులను ఆదేశించాడట. కొంత సేపటికి తిరిగివచ్చిన సేవకులు రాజా వారు ఈ పండితుడు కోరినట్టు ఇవ్వడానికి మన దగ్గర అన్ని గింజలు లేవు.. అతడు చెప్పినట్టు ఇవ్వాలంటే చివరి గడి నింపడానికి 9 లక్షల కోట్ల గింజలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారట. అప్పడర్ధమైంది ఆ రాజుకు గణిత శాస్త్ర మర్మం.. రెట్టింపు లెక్కల బలం.

మొదటి గడిలో వేసిన గింజను ఒక పాజిటివ్ కేసుగా అన్వయించండి .. క్రమంగా అది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తే, ఒక్కొక్కరూ రెట్టింపు సంఖ్యలో తనకు తెలియకుండానే సంక్రమింపజేస్తే.. కరోనా అంటని మానవుడు ఉంటాడా? తాజా గణాంకాల ప్రకారం దేశంలో కేసులు రెట్టింపు అయ్యేందుకు 7.5 రోజులు పడుతోంది. ఏప్రిల్ 19న సుమారు 1350 కేసులు, ఏప్రిల్ 20న 1500 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రజలపై ఎంత బాధ్యత ఉంటుంది..

ఇప్పుడు ఉన్న కరోనా పాజిటివ్ కేసులు తక్కువే కదా.. ఎంత వ్యాప్తిచెందినా మన దాకా చేరదనో.. లేక ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలంటే చాలా సమయం పడుతుందనో అనుకుంటే ప్రమాదమే. అది వైరస్ వ్యాప్తినీ… దాని విజృంభన లెక్కనూ తక్కువ అంచనా వేసినట్టే. చైనాలో ఒక్కటిగా ప్రారంభమైన కరోనా పాజిటివ్ కేసులు అక్కడ కేవలం రెండు నెలల్లోనే 80 వేలకు చేరడమే మనకు మేల్కొలుపు కావాలి. వైరస్ విజృంభణ స్థాయిని మన దేశం గుర్తించినట్టు ప్రపంచ దేశాలు గుర్తించకపోవడం కూడా మనం గమనించాలి.

అమెరికా నుంచి పాఠం నేర్చుకుందామా?

అమెరికాలో ఏప్రిల్ 20 నాటికి 7,23,605 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. జనవరి 20న అక్కడ తొలి కేసు నమోదైంది. ఫిబ్రవరి 15 నాటికి 15 కేసులే నమోదయ్యాయి. మార్చి 12 నాటికి 987 కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ ఏప్రిల్ 1 నాటికి 1,63,199 కేసులకు చేరుకున్నాయి.

రెండు రోజులకే.. అంటే ఏప్రిల్ 3 నాటికే 2,13,600కు చేరుకున్నాయి. ఏప్రిల్ 10 నాటికి 4,25,889 కేసులకు చేరుకున్నాయి. ఏప్రిల్ 13 నాటికి 5,24,514 కేసులకు చేరుకున్నాయి.

ఏప్రిల్ 16 నాటికి 6,04,070 కేసులకు చేరుకున్నాయి. ఏప్రిల్ 20కి 7,23,605 కేసులకు చేరుకున్నాయి. రోజుకు సగటున 30 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.

కోవిడ్-19 వైరస్ విశృంఖల వ్యాప్తి ఇంతటితో తగ్గుతుందన్న సూచనలు కనిపించడం లేదు. అనేక దేశాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్ ఫలితంగా వైరస్ విజృంభణ కొంత నెమ్మదించినప్పటికీ పూర్తిగా అదుపులో లేదు. కొత్త వ్యక్తులకు సోకేందుకు అవకాశం లేని వాతావారణం ఉండాలంటే సంపూర్ణ లాక్‌డౌన్ మాత్రమే అందుకు ఏకైక మార్గం అని మనం గుర్తించాలి.

మరణాల రేటు ఎలా ఉంది?

కోవిడ్-19 వల్ల సంభవించే మరణాల సంఖ్యను కూడా ఓసారి గమనిస్తే… అత్యున్నత వైద్యసదుపాయాల మధ్య కూడా కనీసం 1 శాతం మరణాల రేటు ఉంటుందని అంచనా. లాక్‌డౌన్ అమలులో లేకుంటే ప్రతి ఒక్కరూ కరోనా పాజిటివ్ గా మారక తప్పని పరిస్దితి. ఆ లెక్కన చూసుకుంటే ఒక్క అమెరికాలోనే కరోనా కారణంగా 30 లక్షల మరణాలు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కన 3.5 శాతం మరణాలతో అమెరికాలో ఈ మరణాల సంఖ్య దాదాపు కోటి ఉండే ప్రమాదం ఉంది.

కరోనా వ్యాప్తి కట్టడికి మార్గాంతరాలు ఏంటి?

వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజులు ఉంటుంది. దేశంలోని ప్రతిఒక్కరూ 4 నుంచి 6 వారాలపాటు పూర్తి ఐసోలేషన్ లో ఉంటే కనుక కోవిడ్-19 వైరస్ లేకుండా పోతుందని ఓ అంచనా. పూర్తి ఐసోలేషన్ అంటే ఏ వ్యక్తీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిరావడం కానీ, వాకింగ్ పేరుతో, కిరాణా అవసరాల పేరుతో, వ్యాపారం నిత్యావసర సరుకుల పేరుతో కూడా బయటకు వెళ్లకుండా ఉండాల్సిదే.

అలా చేస్తే ఇంట్లో ఉన్నవారికి వైరస్ సోకే మార్గాలు మూసుకు పోతాయి. ఒకవేళ ఇంట్లో ఏ వ్యక్తైనా కరోనా పాజిటివ్ ఐనప్పటికీ ఆ వైరస్ వ్యాప్తి కేవలం ఆ కుటుంబం వరకే నిలువరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతి 4-6 వారాల్లో కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ పూర్తిచేసుకుని వైరస్ ను ఆ కుటుంబంలోనే అంతం చేసే అవకాశం ఉంటుంది.

చైనా ఇలాగే అత్యంత కఠినంగా నిబంధనలు విధించి సానుకూల ఫలితాలు రాబట్టగలిగింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వాసి జ్యోతి వుహాన్ లో చిక్కుకుపోయినప్పుడు సహోద్యోగులందరినీ ఎయిర్ ఇండియా విమానంలో పంపేందుకు అక్కడి యంత్రాంగం అంగీకరించినా.. శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా ఎక్కువగా ఉన్నందున జ్యోతిని పంపేందుకు అనుమతించలేదు. అంత నిక్కచ్చిగా ఉంటేనే మనం కరోనాపై విజయం సాధించగలం.

మనం ఇప్పటివరకు దేశంలో నిత్యావసర సరుకుల సరఫరా వ్యవస్థను గమనిస్తే కూరగాయల మార్కెట్లు, మాంసం మార్కెట్లు, ఫుడ్ డెలివరీ వ్యవస్థ ద్వారా కూడా కోవిడ్ వ్యాప్తి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల మున్ముందు చాలా శ్రద్ధగా ప్రజలు లాక్ డౌన్ పాటించాల్సిన అవసరం ఉంది. కూరగాయలను నేరుగా ఇంటికే సరఫరా చేసే వ్యవస్థ ఉండాలి. లేదా అమ్మకందారులకు పూర్తి అవగాహన కల్పించడం, వారికి పీపీఈ కిట్లు అందించడం వంటివైనా చేయాలి.

కరోనా వ్యాప్తి నిరోధకానికి ఏ మార్గంలో వెళ్లాలి..

మన ముందు రెండే మార్గాలు ఉన్నాయి. మొదటిది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ వైరస్ సోకి తర్వాత దాని నుంచి బయటపడటం… కానీ దాని ద్వారా మరణాల సంఖ్య లెక్కలేనంతగా ఉంటుంది.. ఊహకందని రీతిలో శవాలను చూడాల్సిన పరిస్తితులు తలెత్తుతాయి. రెండోది ప్రపంచం మొత్తం ఏక సమయంలో 4 నుంచి 6 వారాలు లాక్‌డౌన్ పాటించడం.

కానీ ప్రతీ దేశం ఎప్పుడు కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుతుందా ఎప్పుడు లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేధ్దామా అని ఎదురు చూస్తోంది. కానీ మనం చదరంగం గడులు, ధాన్యం గింజల కథను మరోసారి గుర్తుచేసుకోవాలి. అమెరికాలో లాక్ డౌన్ నిబంధనలు ఉన్నా మార్చి 29న లక్ష కేసులు ఉండి.. 22 రోజుల్లో 7 లక్షల కేసులకు పెరిగాయని మరవరాదు.

అంటే లాక్‌డౌన్ ఎత్తివేసిన మరుక్షణమే కరోనా కోరలు చాచే ప్రమాదం ఉంది. ఇప్పటికైతే దేశంలో 28 రోజుల వరకూ ఒక్క కొత్త కేసూ నమోదు కానిపక్షంలోనే అది గ్రీన్ జోన్ లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా లో 28 రోజుల పాటు కొత్త కేసు నమోదు చేసుకోకుంటేనే గ్రీన్ జోన్లోకి వస్తుందని చెప్పినట్టే…

ప్రపంచ దేశాలన్నీ కేసులు ఆగిపోయిన తరువాతే లాక్‌డౌన్ ఎత్తివేస్తామని చెబితే బాగుంటుంది. దేశీయ విమాన సర్వీసులు, రైలు సర్వీసులు ప్రారంభమైనా కరోనా మహమ్మారి కోరలు చాచే పరిస్థితి ఉంటుంది. అలాంటిది అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తే పరిస్థితి ఎలా దారి తీస్తుందో ఊహించలేం.

సుదీర్ఘకాలం ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ లో ఉంటే ఆర్ధిక సంక్షోభం తలెత్తుతుంది. అనేక దేశాల్లో ఆహార ధాన్యాల కొరత, మందుల కొరత, ఇతర నిత్యావసర వస్తువుల కొరత వేధిస్తుంది. అందుకే మరికొందరు నిపుణులు మరో ప్రత్యామ్నాయాన్ని కూడా సూచిస్తున్నారు. కొంతకాలం లాక్‌డౌన్ పాటించడం… తర్వాత స్వల్పకాలం సడలించడం .. పాజిటివ్  కేసులు, మరణాలు పెరిగే సూచనలు కనిపించగానే మళ్ళీ లాక్‌డౌన్ అమలు పరచడం.. ఇలాపదే పదే చేస్తూ పోవడం ఓ ప్రత్యామ్నాయం.

అయితే లాక్‌డౌన్ ను సడలిస్తే ప్రాణ నష్టం ఉంటుంది. కానీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే ప్రపంచం మొత్తం ఏకకాలంలో 4 నుంచి 6 వారాలు లాక్‌డౌన్ పాటిస్తే ఆర్థిక నష్టం ఉంటుంది. కానీ ప్రాణాలు నిలబడతాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నదే ప్రపంచం ముందున్న సవాల్.

ఇవి కూడా చదవండి

  1. కరోనా మరణాలు లక్షన్నర
  2. కరోనా నేర్పిన జీవిత పాఠాలు
  3. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అమలు చేస్తున్నామా?
Exit mobile version