Home న్యూస్ TTD News: సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం.. పుష్పయాగంతో పులకించిన తిరుమల

TTD News: సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం.. పుష్పయాగంతో పులకించిన తిరుమల

0
TTD News: సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం.. పుష్పయాగంతో పులకించిన తిరుమల
స్వామి వారికి పుష్ప యాగం
TTD news: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో ఉద‌యం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేప‌ట్టారు. మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు.

వైభ‌వంగా పుష్పాల ఊరేగింపు

ముందుగా ఉద‌యం ఉద్యాన‌వ‌న విభాగం కార్యాల‌యం నుండి శ్రీవారి ఆల‌యం వ‌ర‌కు పుష్పాల ఊరేగింపు వైభ‌వంగా జ‌రిగింది. పుష్పాల దాత‌లు, శ్రీ‌వారి సేవ‌కులు గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తార‌ని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం జ‌రుగుతోంద‌ని, ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధర‌ణ జ‌రిగింద‌ని చెప్పారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.

ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం:

శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌  శ్రీనివాసులును ఆల‌య అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు స‌భ్యులు మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, మారుతిప్ర‌సాద్‌, ఆలయ డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, విజివోలు బాలిరెడ్డి, గిరిధ‌ర్‌, ఎవిఎస్వోలు గిరిధ‌ర్‌, శివ‌య్య‌, పారుప‌త్తేదార్ తుల‌సిప్ర‌సాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article NPS new guidelines: ఎన్‌పీఎస్ కొత్త గైడ్‌లైన్స్ చూశారా?
Next article Bharat jodo yatra: మోదీ ఆ ముగ్గురికే దోచిపెడుతున్నారు.. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ విమర్శలు
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.