జుట్టు స‌హ‌జంగా ఒత్తుగా, పొడుగ్గా పెర‌గాలా! అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి

shirtless woman sorrounded by sunflowers
జుట్టు ఒత్తుగా పెరగాలంటే? Photo by Lola Russian on Pexels

Food for Hair Growth: జుట్టు పెరుగుద‌ల విషయంలో చాలామంది ర‌కర‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఎన్నో ర‌కాల ర‌సాయ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతూ ఉంటారు. కానీ ఆహ‌ర విష‌యంలో మాత్రం ఎటువంటి శ్ర‌ద్ద చూప‌రు. జుట్టు పెరుగుద‌ల బావుండాలంటే బ‌య‌ట మార్కెట్‌లో దొరికే ర‌కర‌కాల హెయిర్ ప్రొడ‌క్ట్స్ వాడుతున్నంత మాత్రాన స‌రిపోదు. అవి జుట్టుకు అంత స‌హ‌జ‌త్వాన్ని అందించ‌లేవు. అవి ఎప్ప‌టికీ తాత్కాలిక‌మైన‌విగానే ప‌నిచేస్తాయి. కానీ జుట్టుకు అత్యంత ప్రధాన‌మైన‌ది  ప్రోటీన్‌తో నిండిన ఆహారం. జుట్టు ఒత్తుగా పెర‌గాల‌న్నా, ఊడ‌కుండా ఉండాల‌న్నా ప్రోటీన్ చాలా అవ‌స‌రం. ఎలాంటి ఆహ‌రాల ద్వారా జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందో తెలుసుకుందాం.

జుట్టును స‌హ‌జంగా పెంచే ఆహ‌రాలు

  1. బాదం జుట్టుకు మంచి పోష‌ణ. ఇది విటమిన్ ఇ క‌లిగి ఉంటుంది. ఇది జుట్టు మూలాల‌ను దెబ్బ‌తిన‌కుండా కాపాడుతుంది. జుట్టును నిగారింపుగా చేయ‌డంలో ముందుంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా చేస్తుంది. చాలామందికి జుట్టు చివర్లు చిట్లి పోతూ తెగిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఖ‌చ్చితంగా రోజూ నాన‌బెట్టిన బాదంను తింటే మంచి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. జుట్టు క్ర‌మంగా పెర‌గ‌డానికి కూడా బాదం సహాయపడుతుంది. చుండ్రు సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. జుట్టును పొడిబారకుండా సిల్కీగా మార్చుతుంది.
  1. చిక్కుడుకాయలు, బీన్స్ ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా జుట్టుకు పోష‌కాల‌ను అందించి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. చిక్కుళ్ల‌లో పీచు ప‌దార్థం అధికంగానే ఉంటుంది. జుట్టుకు మంచి పోష‌ణ అందివ్వ‌డానికి పీచు ప‌దార్థం స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల ఇందులోని ఫొలేట్ సహా బి విటమిన్స్ జుట్టుని పొడుగ్గా చేస్తాయి.
  1. గుడ్లలో అనేక విట‌మిన్లు ఉంటాయి. ఇవి జుట్టును దృఢంగా చేయడంలో స‌హ‌యప‌డతాయి. గుడ్డు తెల్లసొనలో రైబోఫ్లేవిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి  ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు బాగా సహాయపడతాయి.
  1. జుట్టును స‌హ‌జంగా మార్చ‌డానికి కొన్ని ఖ‌నిజ లవణాలు, కొవ్వు ఆమ్లాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. విట‌మిన్ డి, విట‌మిన్ సి, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఇవి జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో, పెరుగుద‌ల‌ను ప్రోత్సహించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దోస‌కాయ‌, వేరుశ‌న‌గ‌, నువ్వులు, కొబ్బ‌రి, బీన్స్, దానిమ్మ, గుమ్మ‌డి గింజ‌లు, ఆకుకూర‌లు మొద‌లైనవి జుట్టును పెంచే ఆహారాల‌లో ముఖ్య‌మైన‌వి. విట‌మిన్ బి12 కూడా జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది.

జుట్టుకు ఆరోగ్య‌మైన ఆయుర్వేద ప‌ద్ద‌తులు:

1. కొబ్బ‌రినూనె

కొబ్బ‌రినూనెను క‌నీసం వారానికి రెండు సార్లైనా ప‌ట్టించాలి. ఈ విధంగా చేయడం వ‌ల‌న జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తేమ‌ను అందించి జుట్టు పెరిగేలా చేస్తుంది.

2. ఉల్లిపాయ ర‌సం

ఉల్లిపాయ జుట్టుకు మంచి పోష‌ణను అందిస్తుంది. ఉల్లిపాయ రసం చుండ్రును నివారిస్తుంది. జుట్టు ఊడ‌టం త‌గ్గి నిగారింపును అందిస్తుంది. ఇది నూనె ఉత్పుత్తుల్లో కూడా భాగం అయింది. జుట్టు కోసం ఆముదం, ఉల్లిపాయి ర‌సం ఎంతో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

3. వేపాకు

జుట్టు రాలే స‌మ‌స్యను త‌గ్గించ‌డంలో వేపాకు చాలా వేగంగా ప‌ని చేస్తుంది. వేప పేస్టును జుట్టుకు ప‌ట్టించ‌డం వ‌ల్ల జుట్టుకు సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించొచ్చు. అలాగే జుట్టు నుంచి వ‌చ్చే చుండ్రు, దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి వేపాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వేప పేస్టు, తేనేను హెయిర్ పేక్‌లా వాడుకుంటే మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

4. మెంతులు

మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. మెంతులు ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇది మాడుపై ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెంచుతుంది. ఫ‌లితంగా జుట్టు పెరుగుద‌ల‌కు స‌హ‌య‌ప‌డుతుంది. మెంతి ర‌సాన్ని గాని, మెంతి పేస్టును గానీ క‌నీసం వారానికి రెండు సార్లు ప‌ట్టించ‌డం వ‌ల్ల జుట్టు తెగిపోకుండా, ఊడ‌కుండా ఉండానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleక‌మ్మ‌ని క‌రివేపాకు రైస్.. పిల్లల లంచ్ బాక్స్‌కు మంచి రెసిపీ! ప‌ది నిమిషాల్లో సిద్దం
Next articleచపాతీలు గట్టిగా వ‌స్తున్నాయా? ఈ ప‌ద్ద‌తిలో అయితే మెత్తగా దూదిలా వ‌స్తాయ్