Home కెరీర్ టెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌? అని అడిగితే ఏం చెప్పాలి?

టెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌? అని అడిగితే ఏం చెప్పాలి?

tell me about yourself

టెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌ ? ఇంటర్వ్యూలో మనకు జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్ ఇది. ఇంటర్వ్యూ అనగానే ఇప్పటికీ చాలా మంది వణికిపోతారు. ఎన్ని తెలివి తేటలు ఉన్నా.. ఎంత సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఉన్నా.. ఇంటర్వ్యూ మెట్టుపై బోల్తా పడి ఉద్యోగాలు రాని వాళ్లు చాలా మందే ఉన్నారు.

ఇంటర్‌వ్యూ అంటే మీ ఇన్నర్‌ వ్యూని సమర్థంగా చెప్పుకోగలగడం అన్న చిన్న లాజిక్‌ను మరచిపోతారు. గదిలోకి అడుగుపెట్టగానే ఎక్కడ లేని ఆందోళనంతా మొహంలో కనిపిస్తుంది. ఊరికే టెన్షన్‌ పడుతుంటారు. చివరికి చెప్పాల్సిన విషయాలను కూడా సరిగా చెప్పకుండా బయటకు వచ్చేస్తారు. ఏ ఇంటర్వ్యూ అయినా అడిగే కామన్‌ అండ్‌ ఫస్ట్‌ క్వశన్‌ ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌ .. అంటే మీ గురించి చెప్పండి అని..

టెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌ .. ఇంతే కదా.. ఇది వినడానికి చాలా చాలా సులువుగా కనిపించే ప్రశ్న. కానీ ఇక్కడే చాలా మంది అయోమయానికి గురవుతారు. ఏం చెప్పాలో తెలియక తికమక పడతారు. మీరేంటో, మీ సత్తా ఏంటో ఈ సమాధానంతోనే ఇంటర్వ్యూ చేసేవాళ్లకు తెలిసిపోతుంది. నిజానికి చాలా మంది ఈ ప్రశ్నను లైట్‌ తీసుకుంటారు. ఇదో పెద్ద ప్రశ్నా అన్నట్లు చూస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అవరు. ఎంతసేపూ తమ సబ్జెక్ట్‌పైనే దృష్టి సారిస్తారు.

కానీ ఇదొక్క సమాధానంతో అవతలి వాళ్ల నుంచి ఓ మంచి ఇంప్రెషన్‌ను కొట్టేయొచ్చన్న విషయం మీకు తెలుసా? మీరు ఇచ్చిన రెజ్యుమెను చేతిలో పట్టుకొని కూడా అవతలి వ్యక్తి మీ గురించి చెప్పండి అని అడుగుతున్నారంటేనే అర్థం చేసుకోండి. వాళ్లు మీ నుంచి ఎలాంటి సమాధానం ఆశిస్తున్నారో. అందువల్ల మీ గురించి మీరు ఏం చెబుతున్నారు? ఎలా చెబుతున్నారు ? అన్నది ఇంటర్వ్యూలో చాలా చాలా ముఖ్యమని గుర్తించండి. 

టెల్ మీ అబౌట్ యువర్‌ సెల్ఫ్‌

సో.. టెల్‌ మి అబౌట్‌ యువర్‌సెల్ఫ్‌ ? ఇంటర్వ్యూ గదిలోకెళ్లి మీరు సీట్లో సర్దుకోగానే ఇంటర్వ్యూయర్‌ అడిగే తొలి ప్రశ్న ఇదే. వినడానికి ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. కానీ ఇదొక చిక్కు ప్రశ్న. ఓ తెల్ల కాగితాన్ని మీ చేతికి ఇచ్చి ఏదైనా రాయండి అని అడిగితే ఏం రాస్తారు? ఏదో ఒకటి అంటే ఏంటి? ఇది కూడా అంతే. మీ గురించి చెప్పండి అని నేరుగానే ప్రశ్న అడిగారు. కానీ మీ గురించి ఏం చెబుతారు? ముందుగానే దీనికి సిద్ధంగా లేకపోతే ఆ టైమ్‌లో మీ మెదడులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతుంటాయి.

నా లైఫ్‌ స్టోరీ మొత్తం చెప్పాలా? ఇంతవరకూ చేసిన ఉద్యోగాల చిట్టా అంతా చెప్పాలా? నా హాబీలు, వ్యక్తిగత విషయాలు చెప్పాలా.. ఇంతకీ అవతలి వ్యక్తికి ఏం కావాలి? ఇక్కడే మీరు అయోమయానికి గురి కావద్దు. మీ గురించి చెప్పండి అంటున్నారంటే.. మీ బయోగ్రఫీ చెప్పమని కాదు.. అసలు మీరేంటి.. వాళ్ల జాబ్‌ ప్రొఫైల్‌కు మీరు సరిపోతారా లేదా? ఒకవేళ సరిపోతే.. ఎలా అన్నది వివరించి చెప్పాలి.

ఈ రెండూ గుర్తు పెట్టుకోండి

మీ గురించి చెప్పండి అన్న ప్రశ్నకు చాలా మంది ఒకే రకమైన తప్పిదం చేస్తుంటారు. వాళ్లకు మీ పేరు, ఊరు, మీరు గతంలో చేసిన ఉద్యోగాల గురించి అవసరం లేదు. అప్పటికే మీ రెజ్యుమెను వాళ్లు చూసి ఉంటారు కనుక.. అవన్నీ వాళ్లకు తెలిసి ఉంటాయి. మీ క్వాలిఫికేషన్స్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన అర్హతలన్నీ మీకు ఉన్నాయి కాబట్టే.. మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలిచారు.

అయినా ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతి ఒక్కరూ ఇవన్నీ చెబుతుంటారు. కానీ అసలు చెప్సాల్సిన రెండు విషయాలను మాత్రం పక్కన పెట్టేస్తారు. అవేంటంటే.. అసలు ఈ ఉద్యోగం నుంచి సంస్థ ఏం ఆశిస్తోంది.. వాళ్ల అవసరాలేంటి.. రెండోది.. ఆ పాత్రకు మీరెలా న్యాయం చేయగలుగుతారు? ఈ రెండింటిపై కాస్త దృష్టి పెట్టి.. ముందుగానే సమాధానం సిద్ధం చేసుకుంటే.. సగం ఇంటర్వ్యూ సక్సెస్‌ అయినట్లే.

కంపెనీ అవసరాలు ఏంటి?

ఇది తెలుసుకోవాలంటే సదరు కంపెనీ ఉద్యోగం కోసం వెలువరించిన ప్రకటనను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. అందులో పదే పదే కొన్ని పదాలు వాడుతుంటారు. రిక్వైర్డ్‌ (required)అని, మస్ట్‌ హ్యావ్‌ (must have) అని, హైలీ డిజైర్డ్‌ (highly desired) అన్న పదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వీటితోనే ఆ కంపెనీకి ఏం కావాలో తెలిసిపోతుంది. ఆ అవసరాలను మీరు తీర్చగలరా లేదా అన్నది మీకు స్పష్టమవుతుంది. ఒకవేళ తీర్చగలిగితే అందుకు తగిన క్వాలిటీస్‌ మీలో ఏమున్నాయో ఇంటర్‌వ్యూయర్‌కు అర్థమయ్యేలా వివరించగలగాలి.

ఆ తర్వాత కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో About Usపై క్లిక్‌ చేయండి. దీనివల్ల ఆ కంపెనీపై పూర్తి అవగాహన మీకు ఏర్పడుతుంది. కంపెనీ వాల్యూస్‌ ఏంటి, అక్కడి పని సంస్కృతి ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుస్తాయి. ఈ రెండింటి ద్వారా అసలు కంపెనీ ఈ ఉద్యోగం నుంచి ఏం ఆశిస్తుందో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. 

మీరెలా న్యాయం చేస్తారు?

ఉద్యోగం నుంచి కంపెనీ ఏం ఆశిస్తుందో తెలుసుకున్న తర్వాత మీరే ఆ ఉద్యోగానికి సరైన వ్యక్తి అని నిరూపించుకోగలగాలి.

  • మీ గత అనుభవాలను వివరిస్తూ మీ అవసరాన్ని నేనిలా తీర్చగలను.. నాలో ఉన్న క్వాలిటీస్‌ ఇవి.. ఈ ఉద్యోగానికి నేను న్యాయం చేయగలను అని ఇంటర్వ్యూయర్‌ని కన్విన్స్‌ చేయగలగాలి.
  • అలాగని నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారో ఇరుకున పడతారు. మీరు చెబుతున్నది కాస్త అతిగా అనిపించకుండా చూసుకోండి.
  • ఇంటర్వ్యూకి వెళ్లే ముందే ఏం చెప్పాలని అనుకుంటున్నారో దానిని బాగా ప్రాక్టీస్‌ చేయండి. ఇలాంటి సమాధానం ద్వారా మీరేంటి.. కంపెనీ అవసరాన్ని మీరెలా తీర్చగలుగుతారు అన్నది స్పష్టంగా చెప్పగలుగుతారు.
  • ఇలా చేయడం వల్ల కేవలం మీ గురించి చెప్పడమే కాదు.. కంపెనీకి మీ అవసరం ఎంత ఉందన్నది కూడా తెలుస్తుంది. ఇది మిగతా అభ్యర్థుల కంటే మిమ్మల్ని ముందు వరుసలో నిలబెడుతుంది.

ఇదీ ముఖ్యమే…

ఎవరైనా ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరితే.. తమను తాము నిరూపించుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఏ స్థాయి ఉద్యోగానికైనా ఇదే వర్తిస్తుంది. అందువల్ల ఇంటర్వ్యూలకు వెళ్లే వాళ్లు ఈ పాయింట్‌ను కూడా గుర్తు పెట్టుకోవాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి మూడు నెలల్లో మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అయితే ఇక్కడ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి.

  • దీనికి సమాధానం చెప్పేటప్పుడు అతి జాగ్రత్త పనికి రాదు. అంటే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని, సహచరులను సంప్రదించిన తర్వాతే ఏవైనా మార్పులు చేస్తాను అని చెప్పడం సరైంది కాదు.
  • అలా అని అప్పటి వరకు కంపెనీ చేస్తున్న తప్పిదాలను చెబుతూ.. నేను వాటిని సరి చేస్తానని చెప్పడం కూడా ప్రమాదమే. తమ కంపెనీ తప్పిదాలను ఎత్తి చూపడాన్ని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు.
  • దీనికి బదులుగా.. ఇలా చేస్తే బాగుంటుంది.. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను గతంలో ఇలా చేశాను.. అని చెప్పడం మంచిది. కంపెనీలో తీసుకురావాల్సిన మార్పులపై కొన్ని సూచనలు చేయండి.
  • మొదటి మూడు నెలల్లో మీరు ఏం చేయగలుగుతారన్న దానిపైనే కంపెనీలో మీ సక్సెస్‌ రేట్‌ ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇంటర్వ్యూ అనగానే ఎంతసేపూ మీ సబ్జెక్ట్‌పైనే దృష్టి సారించకుండా.. ఇలాంటి కీలక అంశాలను గుర్తుంచుకుంటే.. ఉద్యోగం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

Exit mobile version