అనంతగిరి హిల్స్‌ .. తెలంగాణ ఊటీలో విహారం ఇలా

anantagiri hills

నంతగిరి హిల్స్‌ .. నేచర్‌ లవర్స్‌ ఎంతగానో ఇష్టపడే ప్రాంతమిది. హైదరాబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉందీ తెలంగాణ ఊటీ. ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలకు నెలవు. హైదరాబాద్‌ దగ్గర్లో ఉండే ప్రముఖ పట్టణమైన వికారాబాద్‌ నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే.. హాయిగా ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు.

వీకెండ్స్‌లో ఒకటి లేదా రెండు రోజుల్లో వెళ్లి వచ్చే అవకాశం ఉండటంతో ఈ మధ్య అనంతగిరికి టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువైంది. వారం మొత్తం బిజీబిజీగా గడిపే భాగ్యనగర వాసులకు ఈ అనంతగిరి ఓ కొత్త అనుభూతిని పంచుతోంది.

పచ్చని ప్రకృతి అందాలతోపాటు ట్రెక్కింగ్‌, బోటింగ్‌లాంటివి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. దీనికితోడు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయం పేరు మీదుగానే కొండలకు ఆ పేరు వచ్చింది.

తిరుమలలోని శేషాచల కొండలకు అనంతగిరి కొండలను తోక భాగంగా పిలుస్తారు. ఇక్కడ సుమారు 3500 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మరి తెలంగాణ ఊటీగా పేరొందిన ఈ అనంతగిరి హిల్స్‌ కు ఎలా చేరుకోవాలి? అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి? బస ఏర్పాట్లు ఉన్నాయా? దగ్గర్లో ఏయే రిసార్ట్స్‌ ఉన్నాయిలాంటి సమగ్ర సమాచారంతో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

అనంతగిరి హిల్స్ ఎలా వెళ్లాలి?

బస్సు ద్వారా: హైదరాబాద్ నుంచి అనంతగిరికి వెళ్లడం చాలా సింపుల్‌. నగరంలోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ నుంచి వికారాబాద్‌కు ప్రతి అరగంటకు ఒక బస్‌ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ బస్‌ అయితే వికారాబాద్‌కు రూ.70 వరకు చార్జ్‌ ఉంటుంది. వికారాబాద్‌ బస్‌ స్టేషన్‌ నుంచి అనంతగిరికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. లేదంటే తాండూరు వెళ్లే బస్‌ ఎక్కొచ్చు. హైదరాబాద్‌లోనే తాండూరు వెళ్లే బస్‌ ఎక్కితే నేరుగా అనంతగిరిలోనే దిగొచ్చు.

రైలు మార్గంలో: ఇక వికారాబాద్‌కు రైలు సౌకర్యం కూడా చాలా బాగుంది. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 11.30 వరకు అనేక రైళ్లు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ మీదుగా వెళ్తాయి.

ఒకవేళ రైల్లో వెళ్లి రోజంతా అనంతగిరిలో ఎంజాయ్‌ చేయాలి అనుకుంటే.. సికింద్రాబాద్‌లో ఉదయం 5.30 గంటలకు ప్యాసెంజర్‌ రైలు అందుబాటులో ఉంటుంది. టికెట్‌ ధర కేవలం రూ. 20 మాత్రమే. ఉదయం 8 గంటల కల్లా వికారాబాద్‌ చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్‌ నుంచి ఆటోలు, జీపులు లేదా ముందుగా చెప్పినట్లు తాండూరు వెళ్లే బస్సుల్లో అనంతగిరికి వెళ్లొచ్చు.

ఈ రైలు కుదరదనుకుంటే.. ఉదయం 7.40కి సికింద్రాబాద్‌ నుంచే వికారాబాద్‌ వరకు వచ్చే మరో ప్యాసెంజర్‌ రైలు ఉంటుంది. 7.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి పూర్ణ వెళ్లే రైల్లోనూ వికారాబాద్‌కు చేరుకోవచ్చు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ వెళ్లాలని అనుకుంటే.. 4.30 గంటల నుంచి రాత్రి 9  గంటల వరకు వివిధ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

సొంత వెహికిల్‌లో: ఇలా వెళ్లాలనుకుంటే మరీ మంచిది. హైదరాబాద్‌ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే అనంతగిరి ఉంది. కార్లో అయితే రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. వెయ్యి రూపాయలకు మించి పెట్రోల్‌ లేదా డీజిల్‌ అవసరం లేదు.

anantagirihills route

ఇదేమంత పెద్ద దూరం కాదు కాబట్టి.. టూ వీలర్‌ అయినా అలసట అనిపించదు. పైగా సొంత వాహనంలో వస్తే అనంతగిరికి ఓ 15 కిలోమీటర్ల దూరం నుంచే ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.

అనంతగిరిలో రాత్రి బస సంగతేంటి?

– మిగతా అన్ని పర్యాటక ప్రాంతాల్లోలాగే అనంతగిరి హిల్స్‌ లోనూ తెలంగాణ టూరిజం శాఖకు చెందిన హరిత రిసార్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏసీ సూట్‌లతోపాటు డీలక్స్‌ రూమ్స్‌ కూడా ఉంటాయి. వీకెండ్స్‌లో అయితే వీటి ధరలు కాస్త ఎక్కువే.

harita restaurent at anantagiri hills

ఏసీ సూట్‌ వీక్‌ డేస్‌లో అయితే 24 గంటలకు గాను రూ. 3100 ఉంటుంది. అదే వీకెండ్స్‌లో అయితే రూ. 3700 వసూలు చేస్తారు. సాధారణ ఏసీ రూమ్స్‌ అయితే వీక్‌ డేస్‌లో రూ. 1800, వీకెండ్స్‌లో రూ. 2300 ఉంటాయి.

సాధారణ రోజుల్లో నేరుగా రిసార్ట్స్‌కు వెళ్లి రూమ్‌ బుక్‌ చేసుకోవచ్చు. వీకెండ్స్‌లో అయితే ఆన్‌లైన్‌ బుకింగ్‌ మాత్రమే ఉంటుంది. 9010911122, 08416-256800 నంబర్లకు ఫోన్‌ చేసి బుకింగ్‌ వివరాలు తెలుసుకోవచ్చు. రిసార్ట్స్‌లో పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కూడా ఉంటుంది. దీనికితోడు స్విమ్మింగ్‌ పూల్‌, ఆంఫి థియేటర్‌, రెస్టారెంట్‌, బార్‌లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

హట్స్ లో బస : ఇక రూమ్స్‌ వద్దు అనుకున్న వాళ్లకు హరిత రిసార్ట్స్‌ ముందే హట్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఏర్పాటు చేసినవి. పచ్చని అడవిలోనూ ఏసీ రూమ్స్‌ ఎందుకు అనుకునే వాళ్లకు ఈ హట్స్‌ బెస్ట్‌ చాయిస్‌. పైగా అదిరిపోయే లొకేషన్‌లో వీటిని ఏర్పాటు చేశారు.

హట్స్‌ లోపల డబుల్‌ కాట్‌ మంచం, బెడ్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌, అటాచ్డ్‌ బాత్‌రూమ్‌లాంటి సదుపాయాలు ఉంటాయి. ఈ హట్స్‌కు 24 గంటలకుగాను రూ. 1500 వసూలు చేస్తారు. వీకెండ్స్‌లో వీటికి కూడా ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి.. ముందుగానే బుక్‌ చేసుకుంటే మంచిది. అయితే వీటికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కాకపోతే 8096500084, 8096511295 నంబర్లకు ఫోన్‌ చేసి హట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు.

hut

నేరుగా అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఖాళీగా ఉంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ఇలాంటివి నాలుగు హట్స్‌ ఉన్నాయి. ఇక్కడే ఓ వ్యూ పాయింట్‌ను కూడా నిర్మించారు. దానిపైకి ఎక్కితే.. అనంతగిరి అందాలు మొత్తం కనువిందు చేస్తాయి.

చూడాల్సిన ప్రదేశాలు

ముందుగా చెప్పినట్లు అనంతగిరి హిల్స్‌ 3500 హెక్టార్లకుపైగా విస్తరించిన అటవీ ప్రాంతమిది. అడుగడుగునా ప్రకృతి రమణీయత మనల్ని కట్టి పడేస్తుంది. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌తోపాటు అనేక చూడదగిన ప్రాంతాలు అనంతగిరిలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అనంత పద్మనాభ స్వామి దేవాలయం

స్కంధ పురాణం ప్రకారం మార్కండేయ రుషి ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. శ్రీ మహా విష్ణువు.. అనంత పద్మనాభ స్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. హైదరాబాద్‌ను నిజాం పరిపాలించిన సమయంలో నవాబులు తరచూ ఇక్కడికి వేటకు వచ్చే వాళ్లు. స్వామి తనకు కలలో కనిపించాడంటూ హైదరాబాద్‌ నవాబే 400 ఏళ్ల కిందట ఇక్కడి ప్రధాన ఆలయాన్ని పునర్‌ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ ఆలయం దిగువకు వెళ్లడానికి మెట్లు ఉంటాయి. కిందికి వెళ్తే స్వామి వారి పుష్కరణి ఉంటుంది. ఇక్కడే ముచుకుంద నది జన్మించినట్లు ప్రతీతి. ఈ నదినే ఇప్పుడు మనం మూసీ అంటున్నాం. ఇది అనంతగిరి హిల్స్‌ నుంచి వికారాబాద్‌, హైదరాబాద్‌ మీదుగా ప్రవహిస్తూ.. నల్గొండ జిల్లాలో కృష్ణా నదితో కలుస్తుంది. ఈ పుష్కరణిని దాటి కాస్త ముందుకు వెళ్తే దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకోవచ్చు. ట్రెక్కింగ్‌ అంటే ఆసక్తి ఉన్న వాళ్లు ఇక్కడి కొండలు, గుట్టలను ఎక్కుతూ, దిగుతూ ఎంజాయ్‌ చేయొచ్చు.

అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్స్

అనంతగిరి హిల్స్‌ లో మరికొన్ని వ్యూ పాయింట్స్‌ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయం ఎదురుగానే వ్యూ పాయింట్స్‌కు వెళ్లడానికి ఓ దారి ఉంటుంది. టీబీ హాస్పిటల్‌ మీదుగా ఆ దారి వెళ్తుంది. కార్లు, బైకులు లోపలి వరకూ వెళ్తాయి.

వీకెండ్స్‌లో అయితే వ్యూ పాయింట్స్‌ దగ్గర వాటిని పార్క్‌ చేయడానికి చార్జీ వసూలు చేస్తారు. ఫోర్‌ వీలర్‌ అయితే రూ.30, టూవీలర్‌ అయితే రూ.20 వరకు తీసుకుంటారు. అక్కడ ప్రధానంగా రెండు వ్యూ పాయింట్లు ఉంటాయి. అక్కడి నుంచి పచ్చని అనంతగిరి కొండల అందాలను చూడటంతోపాటు దూరంగా ఉండే చిన్న చిన్న పల్లెలు, చెరువులు, కుంటలు, రైలు మార్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఘాట్ రోడ్డు: అనంతగిరి నుంచి తాండూరుకు వెళ్లే మార్గంలో ఘాట్‌ రోడ్డు ఉంటుంది. సరిగ్గా అది ప్రారంభమయ్యే ప్రదేశంలో కుడివైపు కాస్త రోడ్డు దిగి లోనికి వెళ్తే మరో వ్యూ పాయింట్‌ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఘాట్‌ సెక్షన్‌ మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యుడు అస్తమించే సమయంలో ఆ ప్రదేశంలో ఉంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.

– ఇక ఘాట్‌ రోడ్డు దిగుతున్నపుడు కూడా మరో చోట వ్యూ పాయింట్‌ ఉంటుంది. అక్కడ ఓ భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మీ వెహికిల్‌ పార్క్‌ చేయడానికి కూడా స్థలం ఉంటుంది. కాస్త రోడ్డు దిగి లోనికి వెళ్తే కొండలపై నుంచి వచ్చే చిన్న చిన్న జలపాతాలు కూడా కనువిందు చేస్తాయి.

– సైక్లింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్న వాళ్లు కాస్త ముందుకు వెళ్లి ఘాట్‌ రోడ్డు మొత్తం దిగితే అక్కడ సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. వీకెండ్స్‌లో ఇక్కడ అద్దెకు సైకిళ్లను ఇస్తుంటారు.

కోట్‌పల్లి జలాశయం, బోటింగ్‌

ఇక అనంతగిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కోట్‌పల్లి జలాశయం ఉంటుంది. తెలంగాణ ఊటీకి వచ్చే టూరిస్టులంతా కచ్చితంగా ఈ జలాశయానికి కూడా వెళ్లాలి. అనంతగిరి ఘాట్‌ సెక్షన్‌ మొత్తం దిగిన తర్వాత అలాగే తాండూరు రూట్లో వెళ్లాలి. అలా ఒక 8 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ధారూర్‌ అనే విలేజ్‌ వస్తుంది.

అది దాటిన వెంటనే వచ్చే కూడలిలో కుడివైపుకు తిరిగితే కోట్‌పల్లి జలాశయానికి చేరుకోవచ్చు. ఇక్కడ బోటింగ్‌ చేసుకోవచ్చు. సింగిల్‌ సీటర్‌, డబుల్‌ సీటర్‌ బోట్లు అందుబాటులో ఉంటాయి. సింగిల్‌ సీటర్‌ అయితే అరగంటకు రూ. 200, గంటకు రూ. 300, డబుల్‌ సీటర్‌ అయితే అరగంటకు రూ. 300, గంటకు రూ. 500 వసూలు చేస్తారు.

anantagiri hills boating

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ కంటే కచ్చితంగా వంద రెట్లు మెరుగైన అనుభూతి మీకు కలుగుతుంది. ప్రకృతి ఒడిలో, స్వచ్ఛమైన నీటిలో బోటు విహారం మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

స్నాక్స్‌లాంటివి కావాలనుకుంటే.. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్‌ సిద్ధంగా ఉంటాయి. ఈ జలాశయంలో స్విమ్మింగ్‌ కూడా చేయొచ్చు. కాకపోతే ఒడ్డుకు దగ్గరగా ఉంటే మంచిది. లోనికి వెళ్తే చాలా ప్రమాదం అన్నది గుర్తుంచుకోవాలి.

బుగ్గ రామలింగేశ్వర ఆలయం

అనంతగిరి దగ్గర్లో చూడాల్సిన మరో ప్రదేశం బుగ్గ రామలింగేశ్వర ఆలయం. ఇక్కడ ఉన్న శివలింగం కింద నీళ్లు ఎప్పటికీ ఊరుతూనే ఉంటాయి. ఆలయం వెనుక భాగంలో ఉన్న పుష్కరణిలోకి ఏడాది పొడుగునా ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉండటం ఈ ప్రాంతం విశిష్టతగా చెప్పుకోవచ్చు.

ఈ ఆలయానికి వికారాబాద్‌ లేదా అనంతగిరి నుంచి కూడా వెళ్లొచ్చు. వికారాబాద్‌ పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అనంతగిరికి వెళ్లే దారి కాకుండా మరో దారిలో వెళ్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఒకవేళ అనంతగిరి నుంచి ఇక్కడికి రావాలన్నా దారి ఉంది.

ఇంతకుముందు చెప్పినట్లు అనంతగిరి ఘాట్‌ రోడ్డు దిగిన తర్వాత కొంత దూరం వెళ్తే కేరెళ్లి అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కుడివైపునకు తిరిగితే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఉంటుంది. దారి పొడుగునా అనంతగిరి కొండలు కనువిందు చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫీ లవర్స్‌కు పండగే.  ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

గ్రాస్ వాక్, హిల్స్ అండ్ వ్యాలీ

– అనంతగిరి కొండలపై హరిత రిసార్ట్స్‌ ఉన్నట్లే.. దాని చుట్టుపక్కల కొంత దూరంలో మరికొన్ని రిసార్ట్స్‌ కూడా ఉన్నాయి. అందులో ఒకటి హిల్స్‌ అండ్‌ వ్యాలీ అడ్వెంచర్‌ రిసార్ట్స్‌. వికారాబాద్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇక్కడ ఇండోర్‌, ఔట్‌డోర్‌ గేమ్స్‌తోపాటు స్విమ్మింగ్‌, రైడింగ్‌, డర్ట్‌ కార్ట్స్‌, క్వాడ్‌బైక్‌ రైడింగ్‌, జిప్‌లైనింగ్‌, హార్స్‌ రైడింగ్‌లాంటివి అందుబాటులో ఉన్నాయి. వీక్‌ డేస్‌, వీకెండ్స్‌కు సెపరేట్‌గా ప్యాకేజీలు ఉంటాయి.

వీక్‌ డేస్‌లో అయితే కనీసం పది మంది గ్రూప్‌ బుకింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి రూ.800 వసూలు చేస్తారు. దీనికి ట్యాక్స్‌లు అదనం. ఏసీ కాటేజీలు కూడా ఇక్కడ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం 9849020041 నంబర్‌ను సంప్రదించవచ్చు. 

– ఇక ఇక్కడ ఉన్న మరో రిసార్ట్‌.. ది గ్రాస్‌వాక్‌. వికారాబాద్‌ దగ్గర్లోని గుడుపల్లి గ్రామ సమీపంలో ఈ రిసార్ట్‌ ఉంటుంది. అమెరికన్‌, ఆఫ్రికన్ టెంట్స్‌ అంటూ వివిధ రకాల టెంట్లు అందుబాటులో ఉంటాయి. ఒక రాత్రికి రూ. 2800 నుంచి రూ. 8 వేల వరకు ఛార్జీలు వసూలు చేస్తారు.

మంచె లాంటి టెంట్లకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. బీబీక్యూ, బాన్ ఫైర్ దీని ప్రత్యేకతలు. గ్రూప్ బుకింగ్‌ కావాలన్నా చేసుకోవచ్చు. బుకింగ్స్‌ కోసం 9949912944 / 91007 80783 నంబర్లకు కాల్‌ చేయొచ్చు. grasswalk లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 

ఈ యాత్రలకు వెళతారా?

Previous articleFreelance jobs: ఫ్రీలాన్స్‌ జాబ్.. రిమోట్ జాబ్.. వర్క్ ఫ్రమ్ హోం జాబ్ కావాలా
Next articleఉద్యోగంలో చేరారా? ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి