అమ్మాయిలు మెచ్చే మ్యాన్లీ లుక్‌.. ఇలా మీ సొంతం

manly look
Photo by Craig Adderley from Pexels

మ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు. మ్యాన్లీ లుక్ కోసం జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తూ.. కండలు పెంచుతారు. బాలీవుడ్‌ హీరోల్లాగా సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌ల కోసం ఆరాటపడతారు. కోల మొహం ఉంటే.. అమ్మాయిలు పడిపోతారు అని అనుకుంటారు. కానీ మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగామ్‌కు చెందిన సైకాలజిస్ట్‌ ఇయాన్‌ స్టీఫెన్‌ జరిపిన తాజా అధ్యయనంలో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. అపొజిట్‌ సెక్స్‌ను ఆకర్షించాలంటే.. కండలుంటే సరిపోదు.. మీ ముఖం రంగు అట్రాక్టివ్‌గా ఉండాలి అని ఆయన తేల్చేశారు. బంగారు వర్ణంలో నిగనిగలాడే రంగుకు అమ్మాయిలు ఇట్టే ఆకర్షితులవుతారట. మీరు కూడా ఓ మోస్తరు అందగాళ్లే అయితే.. అమ్మాయిలను అట్రాక్ట్‌ చేసేలా నిగనిగలాడే చర్మ కాంతిని సొంతం చేసుకోండి. దీనికోసం అమ్మాయిల్లాగా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు. మరింత అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు.

మొహాన్ని ‘బాగా’ కడుక్కోండి

ఈ సలహా మీకు చాలా వింతగా అనిపించవచ్చు. మొహం కడుక్కోమని ప్రత్యేకంగా చెప్పాలా అనుకోవచ్చు. కానీ చాలా మంది అబ్బాయిలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏదో కడిగామంటే కడిగామన్నట్లు ఉంటారు కొందరు. మరికొందరు అసలు ఫేస్‌ వాష్‌ జోలికే వెళ్లరు. ఇది మీ ముఖంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మొహం బాగా కడుక్కోవడమంటే.. దానికీ ఓ పద్ధతి ఉంటుందని అర్థం. మీ చర్మ తత్వాన్ని బట్టి.. అందుకు తగిన ఫేసియల్‌ క్లీనర్‌తో మొహాన్ని కడుక్కోవాలి. మీది పొడిబారే చర్మమైతే.. మాశ్చరైజింగ్‌ లక్షణాలు ఎక్కువగా ఉండే క్లీనర్‌ను వాడాలి. మొటిమలు ఎక్కువగా ఉండి.. జిడ్డుబారినట్లు ఉంటే.. ఆయిల్‌ కంట్రోల్‌ క్రీమ్‌లను వాడాల్సి ఉంటుంది.

ఇక మీ మొహాన్ని ఎప్పుడూ వేడి నీళ్లతో కడగొద్దు. దీనివల్ల మీ చర్మం పాడవుతుంది. పొడిబారినట్లు కనిపిస్తుంది. దాని బదులు గోరు వెచ్చటి నీళ్లతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ రెండుసార్లు మొహం కడిగితే మంచిది. పొద్దున, రాత్రి పడుకోబోయే ముందు కడిగితే.. ముఖంపై ఉండే జిడ్డు, మలినాలు తొలగిపోయి ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

షేవింగ్‌ ఎలా చేస్తున్నారు?

ఈ మధ్య గడ్డం పెంచడమే ఓ ఫ్యాషనైపోయింది. మ్యాన్లీ లుక్‌ పేరుతో స్టైల్‌గా గడ్డాలు పెంచేస్తున్నారు. కానీ నీట్‌ షేవ్‌తోనూ మ్యాన్లీ లుక్‌ను మెయింటేన్‌ చేయొచ్చు. పైగా మీ ముఖం మరింత నీట్‌గా, అందంగా కనిపిస్తుంది. అయితే షేవింగ్‌ అన్నాం కదా అని.. ఎలా పడితే అలా చేసేయొద్దు. ముఖ్యంగా మీరు వాడే రేజర్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి క్వాలిటీ ఉన్న రేజర్‌ వాడాలి. మీ చర్మం, గడ్డం తీరును బట్టి రేజర్‌ను ఎంపిక చేసుకోండి. మల్టీపుల్‌ బ్లేడ్స్‌ ఉన్న రేజర్లకు దూరంగా ఉంటే మంచిదన్నది నిపుణుల సలహా. వీటి వల్ల చర్మం లోపల వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రేజర్‌తోపాటు మంచి షేవింగ్‌ జెల్‌ కూడా ఇంపార్టెంటే. జెల్‌ మీ గడ్డాన్ని మృదువుగా మార్చి, షేవింగ్‌ సులువుగా చేసుకునేలా సాయపడుతుంది. జెల్‌ మంచి క్వాలిటీది అయి ఉంటే.. రేజర్‌ వల్ల మీ చర్మం పాడవకుండా ఉంటుంది. ఇక ఆఫ్టర్‌ షేవ్‌ ఆయిల్‌ కూడా మీ చర్మాన్ని పొడిబారకుండా చేసేదై ఉండాలి. లేదూ.. షేవింగ్‌ చేసుకోం.. గడ్డమే బాగుందీ అనుకుంటే.. కనీసం దాన్నయినా సరిగ్గా మెయింటేన్‌ చేయండి. అవసరమైన మేరకు ట్రిమ్‌ చేసుకుంటూ.. గడ్డం నీట్‌గా ఉండటానికి మార్కెట్‌లో దొరికే ప్రత్యేకమైన ఆయిల్స్‌ వాడితే మంచిది.

బయటికెళ్తే సన్ స్క్రీన్ లోషన్లు తప్పనిసరి

అబ్బాయిల చర్మం దెబ్బతినడానికి ప్రధాన కారణం.. ఎండలో ఎక్కువగా తిరగడం. ముఖానికి ఎలాంటి రక్షణ లేకుండా బయట తిరుగుతుంటారు. దీనివల్ల మొహంపై నల్లటి మచ్చలు రావడం, చర్మం జిడ్డుగా మారడం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ లోషన్లు తప్పనిసరి అని గుర్తుంచుకోండి. సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ (ఎస్పీఎఫ్‌) కనీసం 30గా ఉన్న లోషన్లు వాడితే మంచిది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి లోషన్‌ రాసుకొని వెళ్తే మీ ముఖంపై ఎండ ప్రభావం కాస్త తగ్గుతుంది. మీరు ఎక్కువగా ఎండలోనే తిరగాల్సి వస్తుంది అనుకుంటే.. ఎస్పీఎఫ్‌ ఎక్కువగా ఉన్న లోషన్లను వాడాలి. వాటిని మీ వెంటే తీసుకెళ్తే మధ్యలో మరోసారి అప్లై చేసుకునే వీలుంటుంది. ఇక ఎక్కువగా ఎండలో తిరిగేది లేదు అనుకునే వాళ్లు కాస్త తక్కువ ఎస్పీఎఫ్‌ ఉన్న లోషన్‌ వాడాలి. దీని వల్ల మీ ముఖం జిడ్డుగా కనిపించకుండా ఉంటుంది.

హాయిగా నిద్రపోండి

మంచి నిద్ర అనేది అన్ని రోగాలకు దివ్యౌషధం. రాత్రిపూట హాయిగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా కనీసం 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోయే వాళ్లు ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారు. మంచి నిద్ర అందంగా కనిపించడానికి కూడా సాయపడుతుంది. రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే చర్మంలో తేమ స్థాయి తగ్గి డల్లుగా కనిపిస్తారు. నిద్ర తక్కువైతే కళ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడి అంద విహీనంగా కనిపిస్తారు. అంతేకాదు ఒబెసిటీ, డిప్రెషన్‌, కిడ్నీ సమస్యల బారిన కూడా పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మంచి నిద్ర అన్నది చాలా ముఖ్యమని గ్రహించండి. దీనికి కాస్త క్రమశిక్షణ అవసరం. రాత్రి వేళల్లో మీ మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లకు దూరంగా ఉండండి. వాటిలో నుంచే వెలుతురు మీ మెదడుపై ప్రభావం చూపి, నిద్రకు దూరం చేస్తుంది. అలాగే రాత్రి వేళల్లో టీలు, కాఫీల జోలికి వెళ్లకండి. రాత్రి పూట కనీసం 8 గంటలు సుఖంగా నిద్రించగలిగితే.. మీ ముఖం ఎంతో ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది. 

ఇవి కూడా చదవండి

♦  బెస్ట్ డేటింగ్ యాప్స్ ఏవో మీకు తెలుసా?

♦ ఒంట్లో కొవ్వు మలినాలు తగ్గించుకోవడం ఎలా

Previous articleయూత్ మెచ్చే యాప్ తో డబ్బు సంపాదించండి
Next articleవిమానంలో గోవా టూర్ వెళ్లొద్దామా?