ఆన్‌లైన్‌ షాపింగ్ : మందుల నుంచి మాంసం వరకూ

online shopping
Image by Alexas_Fotos from Pixabay

ఆన్‌లైన్‌ షాపింగ్ ఇంటింటినీ టచ్ చేస్తోంది. ఈ-కామర్స్‌ విప్లవం కారణంగా మెడిసిన్స్ నుంచి గ్రాసరీస్ వరకు, బట్టల నుంచి జువెల్లరీ వరకు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఫ్యాన్ రిపేర్ నుంచి ప్లంబింగ్ వరకు ఏ సర్వీస్‌ అయినా మీరు ఇంట్లో కూర్చొనే ఆర్డర్‌ చేయొచ్చు. పైగా అదిరిపోయే ఆఫర్లు. ట్రాఫిక్ బెడద లేదు. పొల్యూషన్ అసలే లేదు. బిల్లింగ్ చేయించేందుకు లైన్లో నిలబడాల్సిన పనిలేదు. మన ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులను ఆన్‌లైన్‌ షాపింగ్ ద్వారా ఎలా సమకూర్చుకోవాలో డియర్అర్బన్ డాట్ కామ్ ప్రత్యేక కథనం అందిస్తోంది.

ఆన్‌లైన్లో మెడిసిన్‌

మనకు కావాల్సిన మెడిసిన్‌ను డోర్‌ డెలివరీ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక అన్ని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లాగే మెడిసిన్‌ సప్లై చేసే వీటిల్లోనూ ఎన్నో ఆఫర్లు ఉంటాయి. ప్రత్యేక దినాల్లో 30 శాతం వరకు డిస్కౌంట్లు అందించడం వీటి ప్రత్యేకత.

1. 1ఎంజీ (1mg)

మనకు కావాల్సిన మందులను డోర్‌ డెలివరీ చేయడంతోపాటు ఇతర ముఖ్యమైన సర్వీసులను కూడా ఈ 1ఎంజీ సంస్థ అందిస్తోంది. ఈ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా తక్కువ ధరలకు మందులు లభించడమే కాదు.. సదరు మెడిసిన్‌ గురించి పూర్తి సమాచారం, వాటి వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను తెలుసుకోవచ్చు. డాక్టర్లు రాసిచ్చిన మందులతోపాటు మీకు తెలిసిన మందులను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయొచ్చు. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరులాంటి నగరాల్లో ఈ 1ఎంజీ సేవలు అందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా డయాగ్నోస్టిక్‌ పరీక్షలు, డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో 1ఎంజీ యాప్‌ అందుబాటులో ఉంది. ఇదీ సంస్థ వెబ్‌సైట్‌ 1mg .

2. నెట్‌మెడ్స్‌ (NetMeds)

ఇంగ్లిష్‌ మందులతోపాటు ఆయుర్వేదిక్‌, యునానీ మందులు కూడా ఇందులో దొరుకుతాయి. దేశంలోని టైర్‌ 2, టైర్‌ 3 సిటీలు, గ్రామాల్లోనూ తన సేవలను అందిస్తోంది. ప్రిస్‌క్రిప్షన్‌ మందులకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకే లభించే జెనరిక్‌ మెడిసిన్‌ను నెట్‌మెడ్స్‌ డెలివరీ చేస్తోంది.

మూడు నుంచి ఏడు రోజుల్లో మీకు కావాల్సిన మందులను డోర్‌ డెలివరీ చేస్తారు. హెల్త్‌ సప్లిమెంట్స్‌, పర్సనల్‌ కేర్‌, ఇతర హెల్త్‌ డివైస్‌లు కూడా ఇందులో లభిస్తాయి. వివిధ మందులపై ఆఫర్లు కామనే. NetMeds వెబ్‌సైట్‌లోకి వెళ్లండి లేదా నెట్‌మెడ్స్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

3. ఫార్మ్ ఈజీ (pharmeasy)

నిరంతరం కొత్త కొత్త ఆఫర్లతో ఫార్మ్ ఈజీ పేషెంట్లకు చేరువవుతోంది. యాప్ ద్వారా, వెబ్ సైట్ ద్వారా మందులు, వైద్య పరికరాలు, పరీక్షలు బుక్ చేసుకోవచ్చు. దీని వెబ్ సైట్ చిరునామా pharmeasy

4. బుక్‌మెడ్స్‌

హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లో అందుబాటులో ఉన్న సంస్థ ఇది. ప్రిస్‌క్రిప్షన్‌, నాన్‌ప్రిస్‌క్రిప్షన్‌, సర్జికల్‌, మెడికల్‌ ఉత్పత్తులను 24 గంటల్లో హోమ్‌ డెలివరీ చేస్తుంది. బుక్‌మెడ్స్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంది.

ఇంగ్లిష్‌ మందులతోపాటు హోమియోపతి, ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ కూడా డెలివరీ చేస్తారు. మదర్‌ అండ్‌ బేబీ కేర్‌, మెడికల్‌ గాడ్జెట్స్‌, ప్రొటీన్‌ సప్లిమెంట్స్‌లాంటి ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. 

4. షాపింగ్‌ వెబ్‌సైట్స్‌

ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా ఇప్పుడు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో దొరుకుతోంది. మనం వేసుకునే బట్టలు, షూస్‌ మొదలుకొని మొబైల్‌ ఫోన్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌, ఫ్యాషన్‌ ఉత్పత్తులు, బుక్స్‌ ఇలా ఒకటేమిటి కొన్ని వేల వస్తువులు ఈ వర్చువల్‌ మార్కెట్‌లలో ఉంటున్నాయి.

పైగా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కాంపిటిషన్‌ ఎక్కవవడంతో ఫాస్టెస్ట్‌ డెలివరీ, రివార్డు పాయింట్లు, కూపన్లలాంటి వాటిని కూడా పరిచయం చేస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ వెబ్‌సైట్లలో పాపులర్‌ సైట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. అమెజాన్‌ ఇండియా

కొన్నేళ్ల పాటు ఇండియన్‌ ఈ-కామర్స్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ను వెనక్కి నెట్టిన సంస్థ అమెజాన్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఈ-కామర్స్‌ సేవలు అందిస్తోంది. కొన్ని వేల ఉత్పత్తులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుంటే.. 24 గంటల్లోనే డెలివరీ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. ప్రధానంగా ఈ ఫాస్ట్‌ డెలివరీ సర్వీస్‌ కారణంగానే ఇండియాలో అమెజాన్‌కు పాపులారిటీ పెరిగిపోయింది. అమెజాన్ లో మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. పోచంపల్లి చీరల నుంచి కేరళ ఆయుర్వేద ఔషధాల వరకు అందుబాటులో ఉంటాయి.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ పేరుతో తరచూ భారీ డిస్కౌంట్లతో ఉత్పత్తులను అమ్ముతోంది. నో కాస్ట్‌ ఈఎంఐ, కొన్ని బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై అదనపు డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అమెజాన్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. Amazon లోకి వెళ్లి మీకు నచ్చిన షాపింగ్‌ చేసుకోండి. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుంటే వేగవంతమైన డెలివరీతోపాటు ప్రైమ్ వీడియోస్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ నౌ తదితర కొన్ని రకాల అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. వెంటనే స్పందించే కస్టమర్ సర్వీస్ దీని ప్రత్యేకత. అలాగే ఆఫర్లలో నెంబర్ 1 అనే చెప్పాలి.

2. ఫ్లిప్‌కార్ట్‌

ఇండియన్స్‌కు బాగా పరిచయమున్న ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. ఈ మధ్యే ప్రముఖ సంస్థ వాల్‌మార్ట్‌ కూడా ఇందులో పెట్టుబడి పెట్టింది. ఇండియాలో అమెజాన్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. మొదట్లో కేవలం ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌గా ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండటం ఈ వెబ్‌సైట్‌ మరో ప్రత్యేకత. ఈ మధ్యే అమెజాన్‌ ప్రైమ్‌లాగా ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ లాంచ్‌ చేసింది. ఈ మెంబర్‌షిప్‌ తీసుకున్న వాళ్లకు కూడా ఫాస్ట్‌ డెలివరీతోపాటు రివార్డు పాయింట్లు కూడా ఇస్తోంది. 70 శాతం మంది కస్టమర్లు ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌ చేసిన తర్వాత మళ్లీ ఆ వెబ్‌సైట్‌కే వస్తుండటం విశేషం.

బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ కూడా తరచూ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. నో కాస్ట్‌ ఈఎంఐ, కొన్ని బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇందులోనూ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ అడ్రెస్‌ flipkart. ఇక ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ కూడా ఉంది.

 

3. పేటీఎం మాల్‌

మొబైల్‌ వాలెట్‌గా ప్రారంభమై ఇప్పుడు ఈ-కామర్స్‌ ఇండస్ట్రీలోనూ దూసుకెళ్తున్న సంస్థ ఇది. 2016లో పేటీఎం మాల్‌ పేరుతో ఈ-కామర్స్‌ బిజినెస్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ది ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. క్యాష్‌బ్యాక్‌ల పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 12 కోట్ల మంది పేటీఎం మాల్‌లో కస్టమర్లుగా ఉన్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలాగే ఇందులోనూ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. పేటీఎం మాల్‌ మహా క్యాష్‌బ్యాక్‌ కార్నివాల్‌ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తుంది. పేటీఎం మాల్‌ వెబ్‌సైట్‌, యాప్‌.. రెండూ అందుబాటులో ఉన్నాయి. paytmmall

4. జబాంగ్‌, మింత్రా

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో అన్ని రకాల వస్తువులు దొరికితే.. జబాంగ్‌ మాత్రం ప్రత్యేకంగా కొన్నింటికే పరిమితమైంది. బట్టలతోపాటు ఫుట్‌వేర్‌, జువెలరీ, ఇతర యాక్సెసరీస్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 700 బ్రాండ్లకు చెందిన మొత్తం 50 వేలకుపైగా ప్రోడక్ట్స్‌ ఈ సైట్‌లో మనం చూడొచ్చు. తన సొంత ఉత్పత్తులతోపాటు థర్డ్‌ పార్టీకి చెందినవి కూడా జబాంగ్‌ అమ్ముతుంది.

ముఖ్యంగా దుస్తుల కోసం షాపింగ్‌ చేయాలనుకుంటే ఈ జబాంగ్‌ వెబ్‌సైట్‌ బెస్ట్‌ అని చెప్పొచ్చు. బెస్ట్‌ క్వాలిటీతోపాటు ఇతర వెబ్‌సైట్లలో కనిపించని వెరైటీ బ్రాండ్స్‌ ఇందులో ఉంటాయి. తరచూ భారీ ఆఫర్లు కూడా ఇస్తుంటుంది. ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ మింత్రా (myntra)ను ఈ జబాంగ్‌ సంస్థ కొనుగోలు చేసింది. jabong

దుస్తులు, ఇతర వస్తువుల షాపింగ్ కోసం ప్రత్యేకంగా ajio, tatacliqతదితర ఈకామర్స్ పోర్టల్స్ కూడా చాలా పాపులర్.

కిరాణా (grocery)

క్యాలెండర్‌లో నెల మారిందంటే.. కిరాణా సామాను లిస్ట్‌ రెడీ అవుతుంది. నెలకు సరిపడా ఒకేసారి తెచ్చి పెట్టుకుంటారు. ఒకప్పుడైతే చిన్ని చిన్న కిరాణా దుకాణాలే దిక్కు. తర్వాత సూపర్‌ మార్కెట్‌లు వచ్చాయి. ఇప్పుడవి కూడా బోర్‌ కొడుతున్నాయి. షాపింగ్‌ కంటే బిల్లు కట్టడానికి ఉంటున్న క్యూలు విసిగిస్తున్నాయి. దీంతో కిరాణా సామాను కూడా హాయిగా ఇంట్లో కూర్చొని ఆర్డర్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. పప్పులు, ఉప్పులు, నూనెలు, సబ్బులు.. ఇలా కిచెన్‌లోకి కావాల్సిన వస్తువులను ఇంటికి తెచ్చి పెట్టే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ ఎన్నో ఉన్నాయి.

1. అమెజాన్‌ ఫ్రెష్ (Amazon fresh)

ప్రపంచంలోని అతి పెద్ద ఈ-కామర్స్‌ సంస్థ అయిన అమెజాన్‌.. అమెజాన్‌ ప్యాంట్రీ పేరుతో ఇండియాలో ఆన్‌లైన్‌ గ్రాసరీ సర్వీస్‌ను ప్రారంభించింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌, యాప్‌లలో ప్రత్యేకంగా అమెజాన్‌ ప్యాంట్రీ కేటగిరీ ఉంటుంది. అమెజాన్‌కు ఇప్పటికే చాలా పాపులారిటీ ఉండటంతో.. ఈ అమెజాన్‌ ప్యాంట్రీ కూడా లక్షల మంది కస్టమర్లకు వేగంగా చేరువైంది. అమెజాన్ ప్యాంట్రీ ని ఇప్పుడు అమెజాన్ ఫ్రెష్ గా మార్చింది. మిగతా గ్రాసరీ యాప్స్‌లా కాకుండా దేశం మొత్తంలో ఎక్కడికైనా డోర్‌ డెలివరీ చేస్తుండటం దీని ప్రత్యేకత. amazon వెబ్‌సైట్‌లోకి వెళ్లి అమెజాన్‌ ఫ్రెష్ కేటగిరీని సెలక్ట్‌ చేసుకోవచ్చు.

2. బిగ్‌బాస్కెట్‌ (bigbasket)

ఇండియాలోని పాపులర్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీ వెబ్‌సైట్‌, యాప్‌ ఇది. ఇందులో పది వేలకుపైగా గ్రాసరీ ఐటమ్స్‌ అందుబాటులో ఉంటాయి. పళ్లు, కూరగాయలు, పాలు, పెరుగులాంటి డెయిరీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌ సహా దేశంలోని అన్ని మెట్రో సిటీల్లో ఈ బిగ్‌బాస్కెట్‌ సేవలు అందిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐవోస్‌ వినియోగదారులు మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇతర ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలాగే ఫాస్ట్‌ డెలివరీ, భారీ ఆఫర్లు.. ఇందులో కూడా ఉంటాయి. సంస్థ వెబ్‌సైట్‌ bigbasket.

3. గ్రోఫర్స్‌  (Grofers)

సాధారణ కిరాణా వస్తువులకు కూడా బ్యాంకు ఆఫర్లు, ప్రొమో కోడ్లు, ఫ్రీ డెలివరీలు, క్యాష్‌బ్యాక్‌లాంటి వాటితో ఈ గ్రోఫర్స్‌ పాపులర్‌ అయింది. హైదరాబాద్‌ సహా ఇండియాలోని 20 నగరాల్లో గ్రోఫర్స్‌ గ్రాసరీస్‌ను హోమ్‌ డెలివరీ చేస్తోంది. దీనికి సంబంధించిన యాప్‌ కూడా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో ఉంది. బయటి మార్కెట్ల కంటే తక్కువ ధరలకే వివిధ కిరాణా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వంద శాతం రిటర్న్‌, ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది. ఈ సంస్థ వెబ్‌సైట్‌ grofers

4. ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌మార్ట్‌ (Flipkart Supermart)

ఇండియాలో ఈ-కామర్స్‌కు కేరాఫ్‌ అయినా ఫ్లిప్‌కార్ట్‌ కూడా గ్రాసరీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. పైగా ఏ ఇతర సంస్థ ఇవ్వని రీతిలో బిగ్‌ బిలియన్‌ డేస్‌, ఫెస్టివల్‌ సేల్స్‌ పేరుతో రూపాయికి కూడా కొన్ని ఉత్పత్తులను అందిస్తోంది. అమెజాన్‌లాగే ఇండియాలో ఎక్కడికైనా గ్రాసరీ డెలివరీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి అన్ని నగరాల్లో అందుబాటులో ఉన్నా.. చిన్న చిన్న పట్టణాలకు డెలివరీ సౌకర్యం లేదు. flipkart వెబ్‌సైట్‌లోనే గ్రాసరీ కేటగిరీ ప్రత్యేకంగా ఉంటుంది.

వీటికితోడు ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ స్పెన్సర్స్‌, పేటీఎం మాల్‌, డీమార్ట్‌ ఆన్‌లైన్‌ గ్రాసరీ, రిలయెన్స్‌ స్మార్ట్‌లు కూడా ఆన్‌లైన్‌ గ్రాసరీ బిజినెస్‌లను నడిపిస్తున్నాయి.

5. సూపర్ డెయిలీ (supr daily)

సూపర్ డెయిలీ వినూత్నంగా ముందుకొచ్చింది. పాల దగ్గరి నుంచి అన్ని రకాల గ్రాసరీస్ ను వేకువ జామునే అందిస్తుంది. దీని సేవలను యాప్ ద్వారా పొందవచ్చు. వెబ్ సైట్ suprdaily లో మరిన్ని వివరాలు పొందవచ్చు.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ

ఇంట్లో రోజూ తిని బోర్‌ కొడుతోంది.. రెస్టారెంట్‌కు వెళ్లే ఓపిక లేదు.. ఏం చేస్తారు.. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి నచ్చిన ఫుడ్‌ని ఆర్డర్‌ చేసుకోండి.. నిమిషాల్లో వేడి వేడి ఫుడ్‌ మీ ప్లేట్‌లోకి వచ్చేస్తుంది. అంతా టెక్నాలజీ మహిమ. అనేక ఫుడ్‌ డెలివరీ యాప్స్‌, వెబ్‌సైట్స్‌ మీ ఇంటి తలుపు తడుతున్నాయి.

1. స్విగ్గీ (swiggy)

ఇండియాలోని టాప్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో ఇదీ ఒకటి. గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధిక మంది అంటే సుమారు కోటికిపైగా డౌన్‌లోడ్స్‌తో ఈ స్విగ్గీ యాప్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది. హైదరాబాద్‌ సహా దేశంలోని అన్ని టాప్‌ సిటీస్‌లో స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ సదుపాయం ఉంది. మీకు కావాల్సిన రెస్టారెంట్‌లో, నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకుంటే.. స్విగ్గీ దానిని మీ ఇంటికి తెచ్చి పెడుతుంది.

మినిమం ఆర్డర్‌ అంటూ ఏమీ లేకపోవడం స్విగ్గీకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. పైగా ఆర్డర్‌ లైవ్‌ ట్రాకింగ్‌, ఫాస్ట్‌ డెలివరీ సదుపాయాలు కూడా అందిస్తోంది. ఫుడ్‌పై వివిధ ఆఫర్లు, కూపన్లు కూడా ఇస్తుంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. యాప్‌తో పాటు swiggy పేరిట స్విగ్గీ వెబ్‌సైట్‌ కూడా ఉంది.

2. జొమాటో (zomato)

స్విగ్గీకి ప్రధాన పోటీదారు ఈ జొమాటో. నిజానికి మొదట్లో ఇదొక రెస్టారెంట్‌ సెర్చ్‌ చేసుకొనే ప్లాట్‌ఫామ్‌. తర్వాత ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌లోకి దిగింది. ఇండియాతోపాటు ప్రపంచంలోని 25 దేశాల్లో జొమాటో తన సర్వీసులను అందిస్తోంది. మన దేశంలో హైదరాబాద్‌ సహా అన్ని ప్రముఖ నగరాల్లో జొమాటో ఫుడ్‌ డెలివరీ చేస్తోంది.

జొమాటో గోల్డ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ. 2 వేలు చెల్లించి ఈ మెంబర్‌షిప్‌ తీసుకోవచ్చు. ఈ మెంబర్‌షిప్‌తో జొమాటోతో లింకై ఉన్న రెస్టారెంట్లలో వన్‌ ప్లస్‌ వన్‌ ఫుడ్‌, టూ ప్లస్‌ టూ డ్రింక్స్‌ ఆఫర్లు ఉంటాయి. zomato వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫేవరెట్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేయండి లేదా మీ దగ్గర్లోని బెస్ట్‌ రెస్టారెంట్‌ ఏదో వెతకండి. జొమాటో యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌లలో అందుబాటులో ఉంది.

4. ఫుడ్‌పాండా

జర్మనీకి చెందిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ ఇది. 43 దేశాల్లో తన సేవలు అందిస్తోంది. ఇండియాలోని వివిధ నగరాల్లో 40 వేలకుపైగా రెస్టారెంట్లతో ఫుడ్‌పాండా చేతులు కలిపింది. ఇందులోనూ ఫుడ్‌పై చాలా ఆఫర్లే ఉంటాయి. హైదరాబాద్‌ సహా ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫుడ్‌పాండా ఫుడ్‌ డెలివరీ చేస్తోంది. ఫుడ్ పాండా వెబ్ సైట్ లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఫుడ్‌పాండా యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

ఇక పిజ్జా లవర్స్‌ కోసం ప్రత్యేకంగా డొమినోస్‌, పిజ్జాహట్‌లాంటి యాప్స్‌ ఉన్నాయి. ఇవే కాకుండా  జస్ట్‌ ఈట్‌ (justwat), టేస్టీ ఖానా (tastykhana), ఫుడ్‌మింగో (foodmingo)లాంటి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ కూడా ట్రై చేయొచ్చు.

చేపలు, మాంసం, గుడ్లు

1. లీషియస్

లీషియస్ యాప్ ద్వారా మనం చేపలు, మాంసం, చికెన్, రొయ్యలు, గుడ్లు, ఇలా అనేక రకాల నాన్ వెజ్ ఒక్క క్లిక్ ద్వారా 90 నిమిషాల్లో డోర్ డెలివరీ అవుతుంది. నాణ్యత లేదని మీరు భావిస్తే ఒక గంటలో మీరు వెనక్కి పంపించేయొచ్చు. అయితే బయట మార్కెట్లో కంటే కొంచెం ధర ఎక్కువగా అనిపించినప్పటికీ నాణ్యత విషయంలో రాజీ లేదని చెప్పొచ్చు. పైగా విభిన్న రకాల మాంసం ఉత్పత్తులు పొందడం చాలా సులువు.

2. ఫ్రెష్ టూ హోం

ఆన్ లైన్లో చేపలు కొనుక్కునే వెసులుబాటు ఈ యాప్ ద్వారానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది కూడా నాణ్యతకు పెద్దపీట వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ యాప్ లో ముందస్తుగా బుక్ చేసుకోవలసి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఫిష్ బిగ్ బాస్కెట్ వంటి రెగ్యులర్ గ్రాసరీ వెబ్ సైట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌ జువెలరీ

ఇన్ని వస్తువులు ఆన్‌లైన్‌ షాపింగ్ వెబ్ సైట్లలో దొరికినప్పుడు నగలు మాత్రం ఎందుకు ఉండవు? వాటి కోసం కూడా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ స్టోర్స్‌ ఉన్నాయి. మిగతా వాటిలాగే వీటిలోనూ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫ్రీ షిప్పింగ్‌లాంటివి ఉంటాయి.

1. బ్లూస్టోన్‌ (Bluestone)

ట్రై ఇట్‌.. బిఫోర్‌ యు బయ్‌ ఇట్‌.. ఈ క్యాప్షన్‌తో బ్లూస్టోన్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ఇండియాలో పాపులర్‌గా మారిపోయింది. నగలు కొనే ముందు కచ్చితంగా మనకు సూటవుతాయా లేదా అని చూసే కొంటాం కదా. అందుకే వాళ్లు ఈ ఆఫర్‌ పెట్టారు. ఫ్రీ బుకింగ్‌ చేసుకుంటే.. మీకు నచ్చిన నగలను ఇంటికే తీసుకొచ్చి ట్రయల్‌ చేసుకునే అవకాశం ఇస్తారు. కొన్న తర్వాత 30 రోజుల్లోపు ఎప్పుడైనా రిటర్న్‌ చేసే చాన్స్‌ కూడా ఉంటుంది. పైగా మీ నగలను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్‌ చేసి కూడా ఇస్తారు. ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌ వెబ్‌సైట్‌ bluestone. నేరుగా వెళ్లాలనుకుంటే.. హైదరాబాద్‌లోని ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో ఈ స్టోర్‌ ఉంటుంది.

2. కారట్‌లేన్‌ (Caratlane)

ప్రముఖ నగల దుకాణం తనిష్క్‌ భాగస్వామ్యంతో బెస్ట్‌ ఆన్‌లైన్‌ జువెలరీ సైట్స్‌లో ఒకటిగా నిలిచింది. గోల్డ్‌, డైమండ్‌ జువెలరీలకు సంబంధించిన వేల కలెక్షన్లు ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 వేల ప్రముఖ దుకాణాలతో కారట్‌లేన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వెబ్‌సైట్‌ కూడా నగలు కొనే ముందు ఉచితంగా ట్రై ఎట్‌ హోమ్‌ ఆప్షన్‌ను అందిస్తోంది. బయటి మార్కెట్‌తో పోలిస్తే తమ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా 30 శాతం ఆదా చేసుకోవచ్చని కారట్‌లేన్‌ చెబుతోంది. ఏడాది వారెంటీ, 15 రోజుల్లోగా రిటర్న్‌, లైఫ్‌టైమ్‌ ఎక్స్‌చేంజ్‌, ఫ్రీ షిప్పింగ్‌లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సంస్థ వెబ్‌సైట్‌ caratlane.

3. పీసీ జువెలర్‌ (PC Jeweller)

పీసీ జువెలర్స్‌ పేరు మీరు వినే ఉంటారు. అన్ని రకాల సాంప్రదాయ, ఆధునిక నగలు ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌లో లభిస్తాయి. 24 గంటల్లోనే షిప్పింగ్‌ ఆఫర్‌ కూడా పీజీ జువెలర్‌ ఇస్తోంది. ఫ్రీ ఇన్సూరెన్స్‌, బీఐఎస్‌ హాల్‌మార్క్‌, వంద శాతం సర్టిఫైడ్‌ నగలు, లైఫ్‌టైమ్‌ ఎక్స్‌చేంజ్‌లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. https://www.pcjeweller.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు నచ్చిన నగలను కొనుగోలు చేయండి.

4. తనిష్క్‌ (Tanishq)

టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్‌ జువెలరీ స్టోర్స్‌ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆఫ్‌లైన్‌లోనే కాదు.. ఆన్‌లైన్‌లోనూ తన మార్క్‌ లేటెస్డ్‌, ట్రెండీ నగలను ఈ సంస్థ అమ్ముతోంది. ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా షిప్పింగ్‌ చేస్తారు. పద్మావత్‌, ఉత్సవ, లావణ్యం, శుభం, గ్లిటరాటిలాంటి ఎక్స్‌క్లూజివ్‌ కలెక్షన్స్‌ తనిష్క్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఉన్నాయి. tanishq

5. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ (Malabar)

ప్రపంచంలోని టాప్‌ 5 జువెలరీ రిటెయిలర్స్‌లో ఒకటి ఈ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌. ఇండియా సహా పది దేశాల్లో ఈ మలబార్‌ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. సంస్థ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా కూడా మలబార్‌ నగలను కొనుగోలు చేయొచ్చు. గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌ జువెలరీతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కంపెనీలకు చెందిన రిస్ట్‌ వాచ్‌లు కూడా ఈ మలబార్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. Malabar వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

సినిమా టికెట్స్‌

రిలీజైన రోజే సినిమా చూడటానికి ఒకప్పుడు నానా తంటాలు పడాల్సి వచ్చేది. పెద్ద పెద్ద క్యూలలో నిలబడి.. అసలు మన వరకు టికెట్లు ఉంటాయా లేదా అని టెన్షన్‌ పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టికెట్లు కూడా ఆన్‌లైన్‌ అయిపోయాయి. రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే.. మీకు నచ్చిన థియేటర్‌లో.. నచ్చిన సీట్‌ను కూడా సెలక్ట్‌ చేసుకునే అవకాశం ఈ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ యాప్స్‌, సైట్స్‌ ద్వారా వచ్చేసింది. అర్బన్‌ ఏరియాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లోనూ ఈ ఆన్‌లైన్‌ సినిమా టికెట్లకు ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. మరి సినిమా టికెట్లకు బెస్ట్‌ సైట్స్‌, యాప్స్‌ ఏంటో మీకు తెలుసా?

1. బుక్‌ మై షో.కామ్‌

ఇండియాలోనే మొదటి ఆన్‌లైన్‌ మూవీ టికెట్‌ వెబ్‌సైట్‌ ఇది. 2007లోనే ప్రారంభమైంది. ఇప్పటికే బుక్‌ మై షోనే టాప్‌ ప్లేస్‌లో ఉంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలతోపాటు అన్ని ప్రాంతీయ భాషల సినిమా టికెట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. దేశంలోని టాప్‌ మల్టీప్లెక్స్‌లు అయిన పీవీఆర్‌ సినిమాస్‌, ఐనాక్స్‌, సినిమ్యాక్స్‌, సినీపొలిస్‌తోపాటు స్థానిక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లన్నింటిలోనూ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. సినిమా టికెట్లతోపాటు ఇతర ఈవెంట్లు, క్రికెట్‌ మ్యాచ్‌ల టికెట్లు కూడా బుక్‌ చేసుకునే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. బుక్‌ మై షో అధికారిక వెబ్‌సైట్‌ bookmyshow ఇదే పేరుతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి.

2. పేటీఎం.కామ్‌

ఓ మొబైల్‌ వాలెట్‌గా మొదలై అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది ఈ పేటీఎం. ఇప్పటికే పేటీఎం మాల్‌ రూపంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌లోనూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో సినిమా టికెట్లు కూడా బుక్‌ చేసుకోవచ్చు. బుక్‌ మై షో స్థాయిలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని థియేటర్లను ఇది కవర్‌ చేయలేదు కానీ.. అర్బన్‌ ఏరియాల్లో ఉండే స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి. ఇక తనకు అలవాటైన రీతిలో మూవీ టికెట్లపై కూడా పేటీఎం వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు అందిస్తోంది. paytm వెబ్‌సైట్‌లోనే సినిమా టికెట్లకు ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్స్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

3. జస్ట్‌టికెట్స్‌.ఇన్‌

హైదరాబాద్‌ సహా తెలంగాణ, ఏపీల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్‌ టికెట్లను అందిస్తోంది ఈ జస్ట్‌టికెట్‌. క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లతో ఈ వెబ్‌సైట్‌ కూడా క్రమంగా ఆదరణ పొందుతోంది. దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. అధికారిక వెబ్‌సైట్‌ https://www.justickets.in/hyderabad.

ఇవే కాకుండా టికెట్‌ న్యూ (https://www.ticketnew.com/Movie-Ticket-Online-booking/C/Hyderabad), పీవీఆర్‌ సినిమాస్‌ (https://www.pvrcinemas.com/) లాంటి వెబ్‌సైట్లలో కూడా సినిమా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

మీకు నచ్చిన ఆన్‌లైన్‌ షాపింగ్ వెబ్ సైట్లు ఇంకా ఏవైనా ఉంటే మాకు మెయిల్ చేయండి.

ఇవీ చదవండి

 

Previous articleహైదరాబాద్‌లో బెస్ట్‌ స్పోర్ట్స్ కోచింగ్‌ సెంటర్లు ఇవిగో
Next articleBest gym in hyderabad: బెస్ట్ జిమ్ ఇన్ హైదరాబాద్.. ఎలైట్ ఫిట్‌నెస్ సెంటర్స్