సిమ్లా టూర్ ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంతవుతుంది?

shimla tour

ప్రకృతి అందాల వేటలో వేసవి తాపాన్ని అధిరోహించాలంటే అందుకు సరైన ప్రదేశాల్లో ఒకటి సిమ్లా. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లా నగరం అందాలు అణువణువు ఆస్వాదించదగినవే. మరి సిమ్లా టూర్ ఎలా వెళ్లాలి, ఏమేమి చూడాలి? ఎంత ఖర్చవుద్దో ఓ అవగాహన ఉంటే పక్కాగా ప్లాన్ చేసి విహారయాత్ర విజయవంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం..

సిమ్లా ఎలా చేరుకోవాలి?

ఆనందం, అద్భుతం తోడైతే అది సిమ్లా సొగసుల సందర్శననే చెప్పాలి. వేసవి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన సిమ్లా నగరం ఢిల్లీ నుంచి 340 కిలో మీటర్ల దూరంలో ఉంది.

బస్సులు, ప్రైవేటు కార్లు ద్వారా నేరుగా సిమ్లాకు చేరుకోవచ్చు. దిల్లీ నుంచి హిమచల్ టూరిజం బస్సులు(టికెట్ ధర రూ.950) అందుబాటులో ఉంటాయి. లేదా రెడ్ బస్ వంటి సైట్లలోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే ప్రత్యేకంగా వ్యాన్ కూడా బుక్ చేసుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా అయితే ఢిల్లీ నుంచి కల్కా, అక్కడి నుంచి టాయ్ ట్రైన్ ద్వారా సిమ్లా చేరుకోవచ్చు. టికెట్లు ఐఆర్సీటీసీ నుంచి బుక్ చేసుకోవచ్చు.

విమానం మార్గం అంటే ఛండీగడ్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 110 కిలోమీటర్లు ప్రయాణించి సిమ్లా చేరుకోవాల్సి ఉంటుంది.

మధురానుభూతి

సిమ్లా చేరుకునే అనుభూతి అదరహో అనిపిస్తుంది. ఘాట్ రోడ్లు, పర్వాతాల్లో దూరిపోయే సొరంగమార్గాలు, పొడవైన వంతెనలు దారిపొడవునా కనువిందు చేస్తాయి.

కల్కా నుంచి టాయ్ ట్రైన్ కు వెళ్తే మాత్రం 96 కిలోమీటర్ల ట్రాక్ లో వందకుపైగా సొరంగాలు, 87 వంతెనలు, 900 మలుపులతో ప్రయాణం మధురానుభూతిగా సాగిపోతుంది.

అక్కడి చేరిందే ఆలస్యం వాతావరణం సైతం చల్లని పిల్లగాలులతో శరీరాన్ని పులకింతకు గురిచేస్తుంది. పట్టణంల ఏటు చూసినా అందమైన ప్రకృతి పలకరిస్తుంది. కొండల్లో కోనల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు కనుచూపుమేర కనిపిస్తాయి.

సిమ్లాలో చూడదగిన ప్రాంతాలు

సిమ్లాలో చూడదగిన ప్రాంతాల్లో పట్టణంలోని వైస్ రాయ్ భవనం. బ్రిటిష్ కాలంలో నాటి ఆంగ్లేయులు వేసవి రాజధానిగా సిమ్లా ఎంచుకుని పాలన సాగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం భారత్ కు సిమ్లా వేసవి రాజధానగా ఉంది. భారత్, పాక్ విభజన పై ఈ భవనంలోనే చర్చలు సాగాయి.

నేడు అందరూ చెప్పుకునే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం ఈ భవనానికి 1904లో డిజైన్ చేశారు. ఇప్పటికి దానికి సంబంధించిన పైపులను అక్కడ చూడవచ్చు. భవనం ముందు నుంచి మూడంతస్తులుగా, వెనక నుంచి ఐదు అంతస్తులుగా ఉంటుంది. ప్రస్తుతం ఆ భవనంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఏర్పాటు చేశారు. భవనం చూడాలంటే పర్యాటక రుసుం రూ. 50 చెల్లించాల్సిందే.

సిమ్లాలో చూడదగ్గ ప్రదేశాల్లో క్రీస్ట్ చర్చ్ ఒకటి. నగరంలో కొండపై ఉండే ఈ చర్చ వద్ద హిల్ వ్యూవ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడి నుంచి పర్వత అందాలను వీక్షించేందుకు వీలుంటుంది. చర్చి ఎదుట విశాల ప్రాంగణం పర్యాటల సందర్శనకు వీలుగా ఉంటుంది. అతిపెద్ద జాతీయ జెండా ఈ కొండపై ఏర్పాటు చేశారు.

షాపింగ్ సెంటర్లు

ఈ క్రీస్ట్ చర్చకు చేరుకునే దారిలోని మాల్ రోడ్డు ఉంటుంది. పర్యాటకుల షాపింగ్ కు సిమ్లాలో పేరుగాంచింది. మాల్ రోడ్డులో బ్రాండ్ దుస్తులు, రెస్టారెంట్ లు, గిఫ్ట్ షాపులు బోలెడు ఉంటాయి. ధరలు మాత్రం సాధారణ నగరాల్లో మాదిరే ఉంటాయి.

హిమాచల్ ఎంపోరియంలో స్థానికంగా తయారుచేసే హ్యాండీ క్రాఫ్ట్స్ దొరుకుతాయి. చేతి ఉత్పత్తులు తక్కువ ధరలో లభిస్తాయి. సిమ్లా నగరం ఆపిల్ కు కూడా బాగా ప్రాచుర్యం చెందినది.

shimla apple

చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే ఆపిల్ పండ్లను ఈ నగరానికి తీసుకొచ్చి ఎగుమతి చేస్తుంటారు. ఆపిల్ మార్కెట్ కు వెళ్తే 16 నుంచి 20 కేజీల బాక్సులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.

చూసి తీరాల్సిన కుఫ్రీ

కుఫ్రీ… సిమ్లా వెళ్తే తప్పకుండా చూసి రావాల్సిన ప్రాంతం. సిమ్లా నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని కుఫ్రీ ఆపిల్ తోటలు, గ్రామీణ వాతావరణం, సాహస క్రీడలకు నెలవైన పర్యాటక ప్రాంతం.

సిమ్లా నుంచి కుఫ్రీకి కారులో చేరుకున్న తర్వాత కొండపైకి వెళ్లేందుకు గుర్రాలను ఎక్కాల్సి ఉంటుంది. 1.5 కి. మీ. దూరం కొండను ఎక్కించి దింపేందుకు గుర్రానికి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రయాణంలో వచ్చే కిక్కే వేరు.

కొండపై పర్యాటకులకు గ్రామంలోకి ఎంట్రీ కోసం వ్యక్తికి రూ. 10 చెల్లించాలి. అక్కడ స్థానిక దుస్తులు, వస్తువుల మార్కెట్ ఉంటుంది.

అది దాటి ముందుకు వెళ్తే  అడ్వంచెర్స్ గేమ్ జోన్ ఉంటుంది. గుర్రాలు ఎక్కే సమయంలోనే ఈ గేమ్స్ కూడా రూ. 1000 లతో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 6 సాహస క్రీడలు (జిప్ లైన్ తాడుకు వేలాడుతూ ఒక కొండ నుంచి మరొక కొండపైకి వెళ్లడం, తాడు నిచ్చెన ఎక్కడం, తాళ్ల వంతెనపై నడవడం వంటివి) ఉంటాయి. ఆర్మీ చేసేలా ఉండే వీటిని ఆస్వాదించవచ్చు. సాహసోపేతమైన అనుభూతి సైతం దక్కించుకోవచ్చు.

అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కుఫ్రీ గ్రామం ఉంటుంది. అక్కడ వారి నివాసాలు, క్యాబేజి తోటలు, కొండలపై గట్లు గట్లుగా తోటలు చూడొచ్చు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆపిల్ పండ్లతో నిండిన తోటలను వీక్షించవచ్చు.

కుఫ్రీలో బ్రెడ్ ఆమ్ లెట్, మ్యాగీ, రోటీ మాత్రమే తినడానికి దొరకుతాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

సిమ్లా యాత్రకు శ్రీకారం చుడితే ఉష్ణోగ్రతలు కొంత తక్కువగా ఉంటాయి కనుక జాకెట్స్ వెంట తీసుకెళ్లడం మంచింది.

సిమ్లాలో ఒకరోజు మొత్తం తిరగడానికి క్యాబ్ లు రూ. 2500 లకు దొరుకుతాయి.

హోటల్ రూంలు సీజన్, సౌకర్యాలను ఒక రోజుకు బట్టి రూ. 1500 నుంచి రూ. 5000 వరకు అందుబాటులో ఉంటాయి.

ఎప్పుడు వెళితే బెటర్?

నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచు ఎక్కువగా కురుస్తుంది. మిగిలిన కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కుటుంబంతో కలిసి చూడాల్సిన చక్కని ప్రదేశం సిమ్లా.

కొత్తగా పెళ్లైన వారికి ఫర్ ఫెక్ట్ హనీమూన్ డెస్టినేషన్ అనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మరి.. సిమ్లా టూర్ ప్లాన్ చేయండి.. హిమాలయ సొగసులు చూసిరండి.

– జీవీఎస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

ఇవి కూడా చదవండి

Previous articleఇంటర్వ్యూ ప్రశ్నలు .. లాజికల్ సమాధానాలు..
Next articleన్యూ పేరెంట్స్ బడ్జెట్ ప్లాన్ సిద్ధం చేయండిలా