ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న బైక్స్‌లో 150 సీసీ బైక్స్ సెగ్మెంట్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇంతకన్నా తక్కువ సీసీ ఉంటే మైలేజ్ ఇస్తుంది కానీ పికప్, స్పీడ్ ఉండదు. ఎక్కువ సీసీ బైక్ అయితే స్పీడ్ ఉంటుంది కానీ మైలేజ్ ఉండదు. దీంతో ఈ మిడ్ రేంజ్ 150 సీసీ బైక్స్‌కి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంటోంది.
దాదాపు ప్రతి టాప్ కంపెనీ ఈ కేటగిరీపై ప్రత్యేకంగా దృష్టి సారించి సాధ్యమైనన్నిఎక్కువ మోడల్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. డైలీ ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లతోపాటు వీకెండ్స్‌లో షికార్లు, లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఈ బైక్స్ పనికొస్తాయి.
మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో బైక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో నుంచి మీ అవసరానికి తగిన బైక్‌ను ఎంచుకోవడం అన్నది ముఖ్యం. ఇంటి నుంచి చాలా దూరంగా ఉన్న ఆఫీస్‌కు డైలీ వెళ్లి రావాలంటే మంచి మైలేజ్ ఉండాలి. వీకెండ్స్‌లో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లాలంటే.. పవర్ ఎక్కువగా ఉన్న బైక్ అయితే బెటర్. ఇక ఎప్పుడూ బైక్‌పై ఊళ్లు తిరుగుతూ ఉండేవాళ్లకు.. ఈజీగా స్పేర్ పార్ట్స్ దొరికే మోడల్ బాగుంటుంది.
150 సీసీ బైక్స్‌లో దాదాపు వచ్చిన మోడల్స్ అన్నీ సక్సెసయ్యాయి. ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. టాప్ కంపెనీలు హోరో, హోండా, యమహా, సుజుకి, బజాజ్‌లాంటివి ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. మరి మీకు ఎలాంటి బైక్ కావాలి? ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బైక్స్‌లో ఏది బెస్ట్.. డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో తెలుసుకొని మీకు నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకోండి.
యమహా వైజడ్‌ఎఫ్ ఆర్ 15 (Yamaha YZF R15)
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ 150 సీసీ బైక్ అని చెప్పొచ్చు. సహజంగానే యూత్ ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్స్‌లో యమహా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆ కంపెనీ ఏ మోడల్ రిలీజ్ చేసినా.. యువతను దృష్టిలో ఉంచుకొనే అత్యాధునిక ఫీచర్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఈ వైఎజ్‌ఎఫ్ ఆర్15 కూడా అంతే. కళ్లు చెదిరే డిజైన్‌తోపాటు కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. పైగా లైట్ వెయిట్. లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడే యువతకు ఈ బైక్ సరిగ్గా సరిపోతుంది. కాకపోతే దీని ధర మిగతా 150 సీసీ బైక్స్‌తో పోలిస్తే కాస్త ఎక్కువే.
ధర – రూ. 1.65 లక్షల నుంచి 1.68 లక్షలు
స్పీడ్ – 150 కి.మీ.
మైలేజ్ – 46 కి.మీ.
బరువు – 136 కిలోలు
గేర్లు – 6
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 12 లీటర్లు
కలర్స్ – రెవ్వింగ్ బ్లూ, స్పార్కీ గ్రీన్, అడ్రినలైన్ రెడ్
డ్యుయల్ డిస్క్ బ్రేక్స్
సుజుకి జిక్సర్ ఎస్‌ఎఫ్ (Suzuki Gixxer SF)
లాంగ్ డ్రైవ్స్ వెళ్లే వాళ్లకు, స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్‌కు ఈ బైక్ బాగా సూటవుతుంది. ప్రత్యేకంగా యూత్ కోసం తయారు చేసిన బైక్ ఇది. దీని స్టైలిష్ లుక్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సెకన్లలోనే టాప్ స్పీడ్ 127 కిలోమీటర్లను చేరుకోవడం దీని ప్రత్యేకత. ఈ బైక్‌కు ఆన్‌లైన్‌లో చాలా వరకు పాజిటివ్ రీవ్యూస్ వచ్చాయి. ఈ బైక్‌లో ముందు, వెనుక అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చారు. 154.9 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్ పవర్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ధర – రూ. 1,30,414
స్పీడ్ – 127 కి.మీ.
బరువు – 146 కిలోలు
మైలేజ్ – 62 కి.మీ.
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 12 లీటర్లు
కలర్స్ – గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్, రేసింగ్ బ్లూ
బజాజ్ వీ15 (Bajaj V15)
చూడగానే డిఫరెంట్ లుక్స్‌తో ఈ బైక్ ఆకట్టుకుంటోంది. బజాజ్ ప్రత్యేకంగా రిలీజ్ చేసిన వీ సిరీస్‌లో ఇది బెస్ట్ మోడల్. ఈ వీ15లో ఇండియన్ నేవీలో ఉండే ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో వాడిన మెటల్‌ను వాడినట్లు బజాజ్ కంపెనీ ప్రకటించింది. అత్యాధునిక ఫీచర్స్‌తో కూడిన పాత కాలం బైక్ లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.
ధర – రూ. 77,809
స్పీడ్ – 110 కి.మీ.
మైలేజ్ – 57 కి.మీ.
బరువు – 135.5 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 13 లీటర్లు
కలర్స్ – పర్ల్ వైట్, ఎబోనీ బ్లాక్, హీరోయిక్ రెడ్, ఓషన్ బ్లూ
హోండా సీబీ హార్నెట్ 160 ఆర్ (CB Hornet 160R)
150 సీసీ బైక్స్ సెగ్మెంట్‌లో స్టైలిష్ లుక్స్ కోరుకునే వాళ్లకు ఈ హోండా సీబీ హార్నెట్ మంచి చాయిస్. మార్కెట్‌లో యమహా ఎఫ్‌జడ్, సుజుకి జిక్సర్‌కు పోటీగా ఈ బైక్‌ను హోండా తీసుకొచ్చింది. బ్రేక్ సిస్టమ్ ఆధారంగా ఐదు వేరియంట్స్‌లో ఈ బైక్ అందుబాటులో ఉంది. టెయిల్ ల్యాంప్ ఎక్స్ షేప్‌లో రావడం వల్ల వెనుక నుంచి ఓ కొత్త లుక్‌లో కనిపిస్తుంది.
ధర – రూ.1.03 లక్షల నుంచి రూ.1.12 లక్షలు
స్పీడ్ – 110 కి.మీ.
మైలేజ్ – 52 కి.మీ.
బరువు – 140 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 12 లీటర్లు
కలర్స్ – స్ట్రైకింగ్ గ్రీన్, మార్స్ ఆరెంజ్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్
బజాజ్ పల్సర్ 150 (Bajaj Pulsar)
బజాజ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ మోడల్స్‌లో పల్సర్ ఎప్పుడూ ముందే ఉంటుంది. కొన్నేళ్ల కిందట తొలిసారి మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పల్సర్‌కు ఎన్నో మెరుగులు దిద్దుతూ వస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైక్స్‌లో పల్సర్‌ది రెండో స్థానం కావడం విశేషం.
స్పోర్టీ హెడ్‌ల్యాంప్స్‌తో వచ్చిన తొలి మోడల్స్‌లో ఇదీ ఒకటి. ఇక ఈ బైక్ టైర్లను ప్రత్యేకంగా ఇండియన్ రోడ్లకు తగినట్లు రూపొందించారు. 150 సీసీ బైక్స్ సెగ్మెంట్‌లో పల్సర్‌లో వచ్చిన అన్ని మోడల్స్ సక్సెసయ్యాయి. పర్ఫార్మెన్స్, మైలేజ్‌లో పల్సర్‌ను మించిన బైక్ లేదు.
ధర – రూ. 82,890 నుంచి రూ. 1.02 లక్షలు
స్పీడ్ – 115 కి.మీ.
మైలేజ్ – 65 కి.మీ.
బరువు – 144 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 15 లీటర్లు
కలర్స్ – న్యూక్లియర్ బ్లూ, లేజర్ బ్లాక్, డైనో రెడ్
హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ (Hero Xtreme Sports)
ఇండియాలో అతిపెద్ద టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హీరో నుంచి వచ్చిన బెస్ట్ 150 సీసీ బైక్ ఇది. హీరో బ్రాండ్ అంటేనే తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ బైక్స్ తయారు చేస్తుందన్న పేరుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లి వచ్చేవాళ్లకు ఇది మంచి చాయిస్ అని చెప్పొచ్చు. బ్రేక్స్ ఆధారంగా రెండు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఈ సెగ్మెంట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో ఇదీ ఒకటి.
ధర – రూ. 93,940 నుంచి రూ.96,158
స్పీడ్ – 115 కి.మీ.
మైలేజ్ – 62 కి.మీ.
బరువు – 146 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 12 లీటర్లు
కలర్స్ – పైరో ఆరెంజ్, మెర్క్యూరిక్ సిల్వర్, పాంథర్ బ్లాక్, ఫియరీ రెడ్, బ్లాక్, రెడ్
సుజుకి ఇంట్రూడర్ 150 (Suzuki Intruder 150)
150 సీసీ బైక్స్ సెగ్మెంట్‌లో సుజుకి నుంచి వచ్చిన మరో మోడల్ ఇది. చాలా వరకు ఫీచర్స్ అన్నీ జిక్సర్‌లాగే ఉంటాయి. అయితే ముఖ్యమైన తేడా డిజైనే. ఈ మోడల్ లుక్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పైగా ఆకర్షణీయమైన కలర్స్ అందుబాటులో ఉన్నాయి. సీట్ హైట్, ఫ్రంట్ లుక్స్ మిగతా బైక్స్‌తో పోలిస్తే చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ బైక్ సైడ్ లుక్ ఈ సెగ్మెంట్ బైక్స్‌లో దీనిని యూనిక్‌గా నిలబెడతాయి. సుజుకిలో అత్యధికంగా అమ్ముడవుతోన్న మోడల్ ఇదే. కాకపోతే ధర ఎక్కువ. మైలేజ్ తక్కువ.
ధర – రూ. 1,24,353
స్పీడ్ – 115 కి.మీ.
మైలేజ్ – 44 కి.మీ.
బరువు – 148 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 11 లీటర్లు
కలర్స్ – మెటాలిక్ గ్రే, మెటాలిక్ మాట్ బ్లాక్, గ్రే అండ్ రెడ్, మెటాలిక్ మాట్ టైటానియం సిల్వర్
హోండా సీబీ యూనికార్న్ 150
150 సీసీ బైక్స్ సెగ్మెంట్‌లో మంచి మైలేజ్ ఇస్తున్న మోడల్స్‌లో ఇదీ ఒకటి. లీటర్‌కు 60 కి.మీ. మైలేజ్ హోండా యూనికార్న్ సొంతం. పల్సర్‌లాగే ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన 150 సీసీ బైక్ ఇది. మన ఇండియన్ రోడ్స్‌కు బాగా సూటయ్యే మోడల్. స్టైలిష్ లుక్స్‌లో మాత్రం ఈ బైక్ వీకే. ఈ సెగ్మెంట్‌లోని మిగతా అన్ని బైక్స్ కంటే ఈ యూనికార్న్ లుక్ మామూలుగా ఉంటుంది. డైలీ ఆఫీస్‌కు వెళ్లి వచ్చే వాళ్లకు ఇది మంచి చాయిస్.
ధర – రూ. 85,198 నుంచి రూ. 92, 394
స్పీడ్ – 101 కి.మీ.
మైలేజ్ – 60 కి.మీ.
బరువు – 146 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 10 లీటర్లు
కలర్స్ – పర్ల్ ఇగ్నెయస్ బ్లాక్, రెడ్, జెనీ గ్రే మెటాలిక్
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 (TVS Apache RTR 160)
2007లో అపాచీ సిరీస్‌లో టీవీఎస్ తొలిసారి ఇండియాలో ప్రవేశపెట్టిన బైక్ ఇది. ఇందులో ఆర్టీఆర్ అంటే రేసింగ్ థ్రోటిల్ రెస్పాన్స్. పేరులో ఉన్నట్లే రేసింగ్ ఉద్దేశంతో తయారు చేసిన బైక్ ఇది. ఇండియాలో పెటల్ డిస్క్ బ్రేక్‌తో వచ్చిన తొలి బైక్. హోండా సీబీ హార్నెట్, సుజుకి జిక్సర్‌లకు అపాచీ ఆర్టీఆర్ 160 గట్టి పోటీ ఇస్తోంది.
ధర – రూ. 1,06,527
స్పీడ్ – 118 కి.మీ.
మైలేజ్ – 54 కి.మీ.
బరువు – 137 కిలోలు
గేర్లు – 5
పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ – 16 లీటర్లు
కలర్స్ – రెడ్, వైట్, గ్రే, మాట్ రెడ్, బ్లాక్, వైట్ అండ్ రెడ్, మాట్ బ్లూ
ఇవి కూడా చదవండి