36 వయసులో .. ఆహా ఓటీటీలో తాజాగా విడుదలైన సినిమా. ఇది 2015లో తమిళంలో వచ్చిన 36 వయధినిలే మూవీకి తెలుగు డబ్బింగ్. నటుడు సూర్య నిర్మించిన ఈ సినిమాలో ఆయన భార్య జ్యోతిక కథానాయిక. లాక్ డౌన్ కాలంలో జ్యోతిక కు ఇది రెండో సినిమా. పొన్మగల్ వంధల్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలై మంచి విజయం సాధించింది.
మూవీ రివ్యూ : 36 వయసులో
రేటింగ్ : 3/4
జానర్ : డ్రామా
స్టారింగ్ : జ్యోతిక, రహమాన్, అభిరామి, నాజర్
డైరెక్టర్ : రోషన్ ఆండ్రూస్
నిర్మాత : సూర్య
నిడివి : 1 గంట 54 నిమిషాలు
ఓటీటీ : ఆహా
36 వయసులో కథ :
వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్ డివిజన్ క్లర్క్. భర్త రాంప్రసాద్ (రహమాన్), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటూ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు.
ఐర్లాండ్ వెళ్లేందుకు అక్కడ ఉద్యోగం సంపాదించాలన్న తపనతో ఇంటర్వ్యూకు వెళ్లిన వాసంతికి వయస్సు 36 కావడంతో రిజెక్ట్ చేస్తారు. స్కూలు ఫంక్షన్‌కు వచ్చిన రాష్ట్రపతిని మృదుల ఓ ప్రశ్న అడగడంతో ఆమె తల్లిని కలవాలని చెప్పి వాసంతిని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. సరిగ్గా రాష్ట్రపతి వద్దకు వెళ్లేసరికి ఆమె స్పృహ తప్పి పడిపోతారు.
ప్రతి విషయంలో నిరుత్సాహ పరిచే భర్త, రాష్ట్రపతి వద్ద పడిపోవడంతో సోషల్ మీడియా, ఐర్లాండ్‌కు వెళ్లొద్దన్నందుకు కూతురు అవమానించడంతో వాసంతి క్రుంగి పోతుంది. ఇలాంటి సమయంలో తనను తాను నిరూపించుకునేందుకు తన క్లాస్‌మేట్ తనలో ప్రేరణ కలిగిస్తుంది. ఈ సమయంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్ సాధించింది? అన్నదే 36 వయసులో సినిమా కథ.
36 వయసులో ఆకట్టుకుంటుందా?
సినిమా అంటే నవరసాలు ఉండేదే కాదు. ఇది ఆ కోవలోదే కాదు. కేవలం సందేశాత్మక చిత్రం. ఓ మహిళ ఆశలకు, కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అన్న ప్రశ్న చుట్టూ ఆల్లుకున్న చిత్రం ఇది. మెజారిటీ ఇళ్లల్లో గృహిణి ఎదుర్కొనే సమస్యే. ఫస్ట్ హాఫ్ అంతా ఓ టీవీ సీరియల్ చూస్తున్నట్టుగానే బోరింగ్‌గా ఉంటుంది. కానీ సెకెండ్ హాఫ్‌లోనే సినిమా బలమంతా దాగి ఉంది. భర్తల ధోరణిని, సోషల్ మీడియా తీరును కళ్లకు కట్టినట్టు చూపుతుంది. ఏ మనిషి అయినా.. ముఖ్యంగా ఏ మహిళ అయినా.. ఏదైనా సాధించేందుకు వయస్సు అడ్డు కాదని ఈ సినిమా చెబుతుంది. నీ కలే నీ సంతకం.. అని సందేశం ఇచ్చే సినిమా ఇది.
సినిమా అంతా వసంతి పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ పాత్రను జ్యోతిక అవలీలగా పోషించారు. మిగిలిన ప్రధాన పాత్రల్లో నటించిన రహమాన్ తదితరులు కూడా బాగానే నటించారు.
సినిమాలో పాటలు, ఫైటింగులు వంటివి ఆశించొద్దు. ఓ మహిళ కల నెరవేరేందుకు చేయూత ఇవ్వాలన్నా, తన కలను నెరవేర్చుకునేందుకు స్ఫూర్తి పొందాలన్నా ఈ సినిమా చూడొచ్చు.