pregnancy symptoms in telugu: ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులకు తెలుస్తుంది? ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుంది? ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించినప్పటి నుంచి గర్భధారణ, గర్భం వారం వారం ఎదుగుదల.. ఇలా స్త్రీ ఆలోచనలన్నీ తనకు పుట్టబోయే బిడ్డ చుట్టే తిరుగుతుంటాయి. ఆ మాతృత్వం తాలూకు మాధుర్యాన్ని అనుభూతి చెందడానికి తహతహలాడుతుంటోంది. అలాగే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకొని అనుకోకుండా, గర్భ నిరోధక సాధనాలు వాడకుండా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కూడా ఈ సందేహాలు నెలకొంటాయి.
మరి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి? ఎన్ని రోజులకు తెలుస్తుంది? గర్భధారణ జరిగాక తన కడుపులోని పిండం వారం వారం ఎలా ఎదుగుతోంది? వంటి అంశాలు తెలుసుకోవాలన్న కుతూహలం వాళ్లలో కనిపిస్తుంది. గర్భం దాల్చిన తొలి రోజు నుంచి బిడ్డ పుట్టే వరకు ఎలాంటి మార్పులు వస్తాయి? pregnancy symptoms తనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని అనుకుంటారు. దీనిపై డియర్ అర్బన్ ప్రత్యేక కథనం అందిస్తోంది.
after how many days pregnancy symptoms start to show: ప్రెగ్నెన్సీ తెలియాలంటే ఎన్ని రోజులు పడుతుంది
- పీరియడ్స్ మిస్ అవడం
- కొందరికి ఫలదీకరణ చెందిన అండం గర్భాశయానికి అతుక్కుంటున్న సందర్భంలో స్పాటింగ్ కనిపిస్తుంది. అంటే చిన్నపాటి రక్తపు మరక. దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అండం ఫలదీకరణ చెందిన ఆరు రోజుల నుంచి 12 రోజుల మధ్య (pregnancy second week) ఇలా జరుగుతుంది. అందరికీ ఇలా జరగాలని లేదు.
- ఇదే సమయంలో యోని గోడలు దళసరిగా మారుతున్నప్పుడు తెల్లని స్రావాలు కూడా విడుదలవుతాయి. అలాగే ప్రెగ్నెన్సీ వస్తే హార్మోన్ల స్థాయిల్లో మార్పులు వస్తాయి.
- ఈ సమయంలో బ్రెస్ట్ (రొమ్ము) వాపుగా, కాస్త నొప్పిగా కూడా అనిపిస్తుంది.
- కొందరికి తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావొచ్చు.
- ప్రెగ్నెన్సీ తొలివారం (pregnancy first week) లోనే అలసటగా, నీరసంగా ఉంటుంది. ఉదయం పూట మరీ నీరసంగా ఉంటుంది.
- వికారంగా (nausea), వాంతులు వచ్చినట్టుగా ఉంటుంది.
- కడుపు ఉబ్బరంగా (bloating) ఉంటుంది.
- మలబద్దకం (Constipation) ఏర్పడుతుంది.
how to know pregnancy: ప్రెగ్నెన్సీ ఎలా తెలుసుకోవచ్చు
అండం శుక్ర కణంతో ఫలదీకరణ జరిగినప్పుడు గర్భదారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా పసిగట్టవచ్చు. అయితే అందరికీ ఈ లక్షణాలు కనిపించవు.
ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మెడికల్ షాపులు లేదా ఆన్ లైన్ ఫార్మా స్టోర్లలో టెస్ట్ కిట్ దొరుకుతుంది. ప్రెగా న్యూస్, ఐ కెన్ , ఓవ్లో ప్లస్ టెస్ట్ కిట్.. ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. ధర రూ. 45 నుంచి రూ. 100 మధ్య ఉంటుంది. pregnancy symptoms కన్ఫర్మ్ చేసుకునేందుకు శాస్త్రీయంగా చాలా సింపుల్‌గా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. కిట్ పై ఉన్న సూచనలకు అనుగుణంగా పరీక్ష చేయాలి. ఒక్కో కిట్ ఒక్కో రకంగా ఉండొచ్చు. టెస్ట్ కూడా విభిన్నంగా ఉండొచ్చు. కిట్‌లో టెస్ట్ కార్డ్, డ్రాపర్, ఒక సిలికాన్ పౌచ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం చాలా సులువైన ప్రక్రియ.
ఉదయం లేవగానే యూరిన్‌ను ఒక కంటైనర్‌లో సేకరించాలి. టెస్ట్ కార్డ్ సమాంతరంగా ఉన్న ప్లేస్‌లో పెట్టి డ్రాపర్ ద్వారా యూరిన్ కంటైనర్ నుంచి తీసుకుని మూడు నాలుగు చుక్కలు టెస్ట్ కార్డ్‌లో ఉన్న హోల్లో వేయాలి. ఇలా వేశాక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. సీ, టీ అనే అక్షరాల వద్ద రెండు పింక్ లైన్స్ వస్తే మీరు ప్రెగ్నెంట్ అని అర్థం. అలా కాకుండా సీ వద్ద ఒకే చోట పింక్ లైన్ కనిపిస్తే మీరు ప్రెగ్నెంట్ కాలేదని అర్థం. ఒక్క పింక్ లైన్ కూడా కనిపించకపోతే.. టెస్ట్ ఫెయిలైనట్టు అర్థం చేసుకోవాలి.
మీ శరీరంలో హెచ్‌సీజీ Human chorionic gonadotropin (hCG) లెవల్స్ ఆధారంగా ఈ పరీక్ష ఫలితం ఉంటుంది. హెచ్‌సీజీ హార్మోన్ ప్లెసెంటాలో ఉత్పత్తి అవుతుంది. మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మాత్రమే యూరిన్‌లో పరీక్ష ద్వారా కనిపిస్తుంది. బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా హెచ్‌సీజీ లెవెల్స్ తెలుసుకోవచ్చు.
How many times to have sex for pregnancy: ఎన్నిసార్లు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది?
ఒకసారి సెక్స్‌లో పాల్గొన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ రావాలంటే అండం, వీర్యకణాలు కలవాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే అండం విడుదలయ్యే సమయం తెలుసుకోవాలి. సాధారణంగా పీరియడ్స్ ప్రారంభమైన 10 రోజుల నుంచి 20 రోజుల మధ్య అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుడి వృషణాల్లో తయారైన వీర్యకణాలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు స్కలనం (ఎజాక్యులేషన్) జరిగి కోట్లాది వీర్యకణాలు మహిళ యోని మార్గం ద్వారా వెళ్లి అండాశయాల నుంచి విడుదలయ్యే అండాలను తాకుతాయి. కోట్లాది వీర్య కణాల నుంచి ఒకే ఒకటి ప్రెగ్నెన్సీకి కారణమవుతుంది. అండం పలధీకరణ చెందనప్పుడు అవి పీరియడ్స్ సమయంలో రుతుస్రావం రూపంలో బయటకు వెళ్లిపోతాయి.
అండం ఫలోపియన్ ట్యూబ్ ద్వారా యుటెరిస్ (గర్భాశయం) చేరుకుంటుంది. ఇందుకు కనీసం 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో వీర్య కణాలు అండంతో కలిస్తే ఫలదీకరణ జరుగుతుంది. వీర్యకణాలు 3 నుంచి 6 రోజుల వరకు బతికే ఉంటాయి. అంటే సెక్స్ జరిగిన తరువాత 6 రోజుల వరకు అండం ఎప్పుడు తాకినా ఫలదీకరణ చెందుతుంది. ఫలదీకరణ చెందిన మూడు నాలుగు రోజులకు ఈ అండం గర్భాశయం చేరుకుంటుంది. ఫలదీకరణ చెందిన 6 రోజులకు అండం గర్భాశయం గోడలకు అతుక్కుటుంది. ఈ ప్రక్రియకు 3 నుంచి 4 రోజులు పడుతుంది. ఈ ప్రక్రియనే ఇంప్లాంటేషన్ అంటారు. గర్భాశయం గోడలకు అతుక్కోగానే.. అది ఊడిపోకుండా ఉండేందుకు కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. అందువల్ల ఇక పీరియడ్స్ రావు.
Pregnancy weeks: గర్భధారణ ఎన్ని వారాలు?
సాధారణంగా ఓ బిడ్డ.. తల్లి కడుపులో గరిష్ఠంగా 38 వారాల పాటు ఉంటుంది. అయితే మొత్తం ప్రెగ్నెన్సీ కాలాన్ని మాత్రం 40 వారాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ కాలాన్ని గర్భధారణ జరిగినప్పటి నుంచి కాకుండా చివరి రుతుస్రావం జరిగిన మరుసటి రోజు నుంచే లెక్కిస్తారు.
దీని ప్రకారమే ప్రసవం జరిగే తేదీ (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ (ఈడీడీ)) ని అంచనా వేస్తారు. నిజానికి చివరి రుతుస్రావం జరిగిన రెండు వారాలకు గర్భధారణ జరుగుతుంది. ఈ మొత్తం కాలాన్ని మూడు ట్రైమెస్టర్లుగా విభజిస్తారు.
– తొలి ట్రైమెస్టర్ ఒకటి నుంచి 12 వారాల వరకు.. (మొదటి మూడు నెలలు)
– రెండో ట్రైమెస్టర్ 13 నుంచి 27 వారాల వరకు.. (నాలుగు, ఐదు, ఆరు నెలలు)
– మూడో ట్రైమెస్టర్ 28 నుంచి 40 వారాల వరకు ఉంటుంది. (ఏడు, ఎనిమిది, తొమ్మిది నెలలు)
pregnancy symptoms and fetus growth: అండం పెరుగుదల
ఇక ప్రెగ్నెన్సీ మూడో వారం నుంచి 12వ వారం వరకు అంటే తొలి ట్రైమెస్టర్లోనే బిడ్డకు ఓ రూపం వస్తుంది. మొదట్లో బియ్యపు గింజ సైజులో ఉండే పిండం కాస్తా క్రమంగా ఎదుగుతుంది. ట్రైమెస్టర్ మారిన సమయంలో బిడ్డలో స్పష్టమైన మార్పులు కనిపిస్తుంటాయి. మీరు మానసిక ఉల్లాసంతో ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా చక్కటి గాలి, వెలుతురు, ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారం తీసుకోవడం, సమయానికి మందులు వేసుకోవడం వంటి వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి నెలా డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాల్సిందే. అలాగే 8వ నెల నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి, 9వ నెలలో ప్రతి వారం డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 37 వారాలు వచ్చే సరికి బిడ్డ పూర్తిగా ఎదిగి ప్రసవానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఏ వారం ఏం జరుగుతుంది? ఇందులోని కీలక దశలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Third week pregnancy symptoms: మూడో వారం గర్భం
గర్భధారణ జరిగిన 30 గంటల తర్వాత ఆ జీవకణం రెండుగా విడిపోతుంది. తర్వాత మూడు రోజులకు 16 కణాలుగా విడిపోతుంది. మరో రెండు రోజులకు ఆ జీవకణం ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయంలోకి వెళ్తుంది.
week 4 pregnancy symptoms: నాలుగో వారం
జీవకణం మరిన్ని కణాలుగా విడిపోతూ.. శరీరంలోని వివిధ వ్యవస్థలు ఏర్పడే వారమిది. జీర్ణ వ్యవస్థ కూడా ఇప్పుడే ఏర్పడుతుంది. ఈ సమయంలో మనం ముందుగా చెప్పుకున్నట్లు బిడ్డ ఓ బియ్యపు గింజ సైజులో ఉంటుంది.
week 5 pregnancy symptoms: ఐదో వారం
కేంద్ర నాఢీ వ్యవస్థ ఏర్పడేది ఐదో వారం ప్రెగ్నెన్సీ లోనే. అంటే మెదడు, వెన్నెముకలాంటి కీలక భాగాలు ఏర్పడుతాయి. గుండె కూడా ఇప్పుడే రూపుదిద్దుకుంటుంది.
week 6 pregnancy: ప్రెగ్నెన్సీ ఆరో వారం
గర్భ ధారణ జరిగాక ఆరో వారం దశలో బిడ్డను గర్భస్థ పిండంగా పిలుస్తారు. ఆ పిండంలో నుంచి హార్మోన్ల విడుదల ప్రారంభమవుతుంది. ఇది తల్లి రుతుక్రమాన్ని నిలిపేస్తుంది. గుండె ఫస్ట్ బీట్ ప్రారంభమవుతుంది.
week 7 pregnancy: ఏడోవారం గర్భం
గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. పిండం మెల్లగా తల్లి రక్త ప్రసరణ నుంచి ఆక్సిజన్, ఇతర పోషకాలను అందుకోవడం మొదలుపెడుతుంది. సాధారణంగా ఎక్కువ మంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటారు. కూర్చోవడం, లేవడం, పనులు చేయడం వంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.
week 8 pregnancy: ప్రెగ్నెన్సీ ఎనిమిదో వారం
ఈ దశలో పిండం 1.3 సెంటీమీటర్ల పొడువు ఉంటుంది. వెన్నెముక వేగంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. తల పెద్దగా ఉండి.. వెన్నెముకతో కూడిన శరీరం ఓ తోకలాగా కనిపిస్తుంది. చాలా మందిలో ఎర్లీ ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ ఇదే సమయంలో తెలుస్తుంది. అంటే పిండం తగిన రీతిలో అభివృద్ధి చెందడం, గుండె సక్రమంగా కొట్టుకోవడం, ఆక్సిజన్ సక్రమంగా అండంలో ఏవైనా లోపాలు ఉంటే ఈ సమయంలో తెలిసిపోతాయి. వీటిలో లోపాలు ఉంటే పిండం అస్తవ్యస్తంగా పెరిగి రక్తస్రావం అవుతుంది.
week 9 pregnancy: తొమ్మిదో వారం ప్రెగ్నెన్సీ
కళ్లు, నోరు, నాలుక ఏర్పడేది ఈ వారంలోనే. పిండంలోని కాలేయం మెల్లగా రక్త కణాలను తయారు చేస్తుంది. కండరాలు పిండం మెల్లగా కదలడానికి తోడ్పడతాయి.
week 10 pregnancy: పదో వారం ప్రెగ్నెన్సీ
పిండం 2.5 సెంటీమీటర్లు ఉంటుంది. శరీరంలోని మొత్తం అవయవాలన్నీ ఈ సమయానికి ఏర్పడి ఉంటాయి. మెదడు ఉత్తేజితం అవుతుంది.
week 11 pregnancy: పదకొండో వారం ప్రెగ్నెన్సీ
పదకొండో వారం గర్భంలో పిండం గుండె మరింత వృద్ధి చెందుతూ ఉంటుంది. చిగుళ్లలో పళ్లు ఏర్పడుతుంటాయి.
week 12 pregnancy: పన్నెండో వారం (తొలి ట్రైమెస్టర్ ముగింపు) ప్రెగ్నెన్సీ
తొలి ట్రైమెస్టర్ ఇక్కడితో ముగుస్తుంది. ఈ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి పిండం ఎలా ఉందో చూస్తారు. తల్లికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. దీనిని తొలి ట్రైమెస్టర్ కంబైన్డ్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. బిడ్డలో డౌన్ సిండ్రోమ్ లేదా ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉందేమో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేస్తారు.
క్రోమోజోముల్లో అబ్నార్మలిటీ ఏమైనా ఉందా పరీక్షిస్తారు. రక్త పరీక్షలో ఎనీమియా, హెపటైటిస్ బి, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహిస్తారు. తిరిగి ఐదో నెలలో, ఏడు లేదా ఎనిమిదో నెలలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇవన్నీ సాధారణమే. వీటి గురించి టెన్షన్ పడాల్సిన పనేలేదు.
week 13 pregnancy: పదమూడో వారం (రెండో ట్రైమెస్టర్ ప్రారంభం) ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీలో ఇది మరొక దశ ప్రారంభం. పిండం ఏడు సెంటీమీటర్ల పొడువు ఉంటుంది. అటు ఇటూ కదులుతూ ఉంటుంది.
week 14 pregnancy: పద్నాలుగో వారం ప్రెగ్నెన్సీ
ఈ వారం పూర్తిగా వృద్ధి చెందిన కళ్లపై కనుబొమ్మలు ఏర్పడుతుంటాయి. స్వరపేటిక వృద్ధి చెంది ఉండటం వల్ల బిడ్డ ఏడుపు మొదలుపెడుతుంది. వేళ్లపై గోర్లు రావడం కూడా ప్రారంభమవుతుంది.
week 15, 16 pregnancy: పదిహేను, పదహారో వారం ప్రెగ్నెన్సీ
తొలి ట్రైమెస్టర్ కంబైన్డ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయకపోతే.. రెండో ట్రైమెస్టర్ స్క్రీనింగ్‌ను ఈ సమయంలో రిఫర్ చేస్తారు. ఈ సమయానికి పిండం 14 సెంటీమీటర్ల పొడువు పెరిగి ఉంటుంది. నాలుకపై రుచి మొగ్గలు ఏర్పడేది కూడా ఇప్పుడే.
week 18 to 20 pregnancy: 18 నుంచి 20వ వారం ప్రెగ్నెన్సీ
ఈ సమయంలో మరో అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తారు. అన్ని అవయవాలు ఏర్పడి ఉంటాయి కాబట్టి.. అవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది చూస్తారు. ఈ సమయంలో బిడ్డకు ఎక్కిళ్లు రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక 20వ వారానికి చెవులు పూర్తిగా పని చేయడం ప్రారంభిస్తాయి. బయటి ప్రపంచం తాలూకు శబ్దాలను వినగలుగుతుంది. వేలి ముద్రలు ఏర్పడి ఉంటాయి. పిండం పొడవు 21 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
week 20 to 24 pregnancy: 20 నుంచి 24వ వారం గర్భం
గర్భంలో పిండం 33 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. అప్పటి వరకు అతుక్కొని ఉన్న కనురెప్పలు విడిపోతాయి. దీంతో బిడ్డ కళ్లు మూస్తూ, తెరుస్తూ ఉంటుంది. తన ఊపిరితిత్తులతో శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. చర్మంపై పలుచని వెంట్రుకలు కనిపిస్తుంటాయి.
బిడ్డ తన్నడం మొదలుపెట్టేది ఈ సమయంలోనే. మీ కదలికలను కూడా శిశువు గ్రహిస్తుంది. మీ కాళ్లు, మడమలు కాస్త వాచినట్లుగా కనిపిస్తాయి. 28వ వారంతో రెండో ట్రైమెస్టర్ పూర్తవుతుంది. రెండో ట్రైమెస్టర్ మధ్య నుంచే.. అంటే ఆరో నెల ప్రారంభం నుంచే వైద్యులు వ్యాయామం చేయాలని, వాకింగ్ చేయాలని సూచిస్తారు. తగిన సలహాలు తీసుకుని మాత్రమే వ్యాయామం చేయండి. వాకింగ్ 30 నిమిషాల పాటు చేయొచ్చు. ఇంటి పని, వంట పని చేస్తున్నాం కదా.. ఇది సరిపోదా అని అనుకోకండి. వైద్యులను అడిగినా కూడా ఇదే చెప్తారు. తప్పనిసరిగా వాకింగ్ చేయమని సూచిస్తారు. నార్మల్ డెలివరీ కోసం వాకింగ్ చాలా ఉపయోగపడుతుంది.
week 28 to 30 pregnancy: 28 నుంచి 30వ వారం (మూడో ట్రైమెస్టర్ 29వ వారంలో ప్రారంభం)
28 వారం నుంచి 30వ వారం మధ్య ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ కనీసం ఒక కిలో బరువు ఉంటుంది. 37 సెంటీమీటర్ల వరకు పొడువు ఉంటుంది. మొదట్లో తల పెద్దగా ఉండి వెన్నెముకతో కూడిన మిగతా శరీరం తోకలాగా కనిపిస్తుందని అనుకున్నాం కదా. ఈ సమయానికి శరీరం కూడా అదే స్థాయిలో ఎదుగుతుంది. దీంతో బిడ్డకు పూర్తి రూపం వస్తుంది. ఈ సమయంలో తల్లి ఆరోగ్యంలోనూ మార్పులు కనిపిస్తాయి. కడుపులో వికారంగా ఉంటుంది. 29వ వారం నుంచి మూడో త్రైమాసికం ప్రారంభమవుతుంది. 40 వారాల వరకు థర్డ్ ట్రైమెస్టర్గా వ్యవహరిస్తారు.
week 32 pregnancy: 32వ వారం ప్రెగ్నెన్సీ
32 వారం గర్భం సమయంలో బిడ్డ చాలా వరకు నిద్రలోనే ఉంటుంది. కదలికలు తల్లికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ సమయానికి బిడ్డ తల కిందులుగా ఉంటుంది. అంటే డెలివరీకి సిద్ధమవుతున్నట్లుగా ఉంటుంది.
week 36 to 40 pregnancy: 36 నుంచి 40వ వారం ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీ 36 వారం నుంచి 40 వ వారం మధ్య కాలంలో శిశువు 46 సెంటీమీటర్లు వరకు పొడువు ఉంటుంది. ప్రసవానికి పూర్తి సిద్ధంగా ఉంటుంది. పూర్తి ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఊపిరి తిత్తుల వృద్ధి చాలా వేగంగా ఉంటుంది. కొందరికి అంచనా వేసిన తేదీ కంటే ముందే ప్రసవం జరిగే అవకాశాలు ఉంటాయి. మరికొందరు పూర్తిగా 40 వారాలు నిండిన తర్వాత కూడా ప్రసవిస్తారు. 40 వారాలు దాటిందన్న ఆందోళన అవసరం లేదు. 36 వారాల తర్వాత ఎప్పుడు ప్రసవం జరిగినా బిడ్డ ఆరోగ్యంగానే ఉంటుందన్నది గమనించండి.
Pregnancy tracking apps: ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ యాప్స్
గర్భం ఎదుగుదల వారం వారం ఎలా ఉంటుంది? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలను ట్రాక్ చేసేందుకు ఇప్పుడు మొబైల్ యాప్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
- ఓవియా
- బేబీ బంప్
- ప్రెగ్నెన్సీ యాప్
- మామ్ లైఫ్ ప్రెగ్నెన్సీ ట్రాకర్
- బేబీ చక్ర (ఇండియన్ యాప్)
- ప్రెగ్నెన్సీ డ్యూ డేట్ ట్రాకర్ వంటి అనేక యాప్స్ యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ గురించి చర్చించేందుకు మన అనుమానాలు నివృతి చేసుకునేందుకు కొన్ని ఆన్లైన్ ఫోరమ్స్ అందుబాటులో ఉన్నాయి. బేబీ సెంటర్, ది బంప్ వంటి ఫోరమ్స్ లో గర్భ ధారణపై పాఠకులు తమ అనుభవాలు చర్చిస్తారు.