బొబ్బర పప్పు గారెలు ఉదయం అల్పాహారంగానూ లేదా సాయంత్రం స్నాక్స్ గానూ తీసుకోవచ్చు. రోజూ పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం, వారు రోజూ ఒకే తీరు బ్రేక్ ఫాస్టా అని ప్రశ్నించడం మీకు భారంగా మారుతుంది. రొటీన్ కు భిన్నంగా ఈజీగా చేయగలిగే మరో బ్రేక్ ఫాస్ట్ బొబ్బర పప్పు గారెలు. వీటినే అలసంద వడలు అని కూడా అంటారు. మంచి పౌష్టికాహారంగా కూడా పరిగణించే ఈ బొబ్బర పప్పు గారెలు ఎలా చేయాలో ఒక సారి చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
♦ బొబ్బర పప్పు – ఒక కప్పు
♦ కారం పొడి – ఒక టీ స్పూన్
♦ ఉప్పు – తగినంత
♦ వెల్లుల్లి – నాలుగు రెబ్బలు
♦ జీలకర్ర – అర టీ స్పూన్
♦ వంట సోడా – అర టీ స్పూన్
♦ ఉల్లి గడ్డ – ఒకటి
♦ కొత్తి మీర – తగినంత
♦ కరివేపాకు – తగినంత
తయారీ విధానం – స్టెప్ బై స్టెప్ :
- ముందుగా బొబ్బర పప్పును రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలి.
- బాగా నానబెట్టిన పప్పును చక్కగా కడిగి నీళ్లు లేకుండా తీసిపెట్టుకోవాలి
- మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, (కారం పొడి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు), బబ్బెర పప్పు వేసి కొంచెం గరుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి
- ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, వంటసోడా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రై కోసం సరిపడా నూనె పోసి నూనె కాగనివ్వాలి.
- ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న గారెల పిండిని తీసుకుని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసి బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
అంతే.. రుచికరమైన, కరకరలాడే బొబ్బర పప్పు గారెలు రెడీ..
బొబ్బెర్లతో ఆరోగ్యం
బొబ్బెర్లను అలసందలు కూడా అంటారు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వీటిల్లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. బొబ్బర్లు లో గ్లైజమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి ఆరోగ్యకరమైన ఆహారం. విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. పొటాషియం అందించే ఆహారం ఇది.
– కిరణ్మయి, ఫ్రీలాన్స్ రైటర్
ఇవి కూడా చదవండి