ఎయిర్ పొల్యూషన్ ఎలా ఎదుర్కోవాలి? పరిష్కారాలేంటి?

air pollution

యిర్ పొల్యూషన్.. ఇప్పుడు ఇండియా అనే కాదు.. మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎయిర్‌ పొల్యూషన్‌.. ఏటా లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో నివసించే వాళ్లు ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.

ఈ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మాస్క్‌లు, ఇళ్లు, ఆఫీస్‌లలో ఎయిర్‌ ప్యూరిఫయర్లలాంటి వాటి వాడకం కూడా ఎక్కువైంది. అసలు ఈ వాయు కాలుష్యం ఏంటి? గాలి నాణ్యతను ఎలా చూస్తారు? మన నగరాల పరిస్థితేంటి? ఈ కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఏ ఆహారం తీసుకోవాలి వంటి సమగ్ర సమాచారంతో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ.

ఎందుకీ కాలుష్యం?

వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఐదు వనరులు కాలుష్యం పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. వీటి ద్వారా ప్రమాదకర కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, గ్రౌండ్‌ లెవల్‌ ఓజోన్‌, పార్టిక్యులేట్‌ మ్యాటర్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌, డైడ్రోకార్బన్స్‌లాంటివి మనం పీలుస్తున్న గాల్లో కలుస్తున్నాయి.

ఇంట్లో వాడే శిలాజ ఇంధనాలు, పరిశ్రమలు, వాహనాలు, పంటల దహనాలు, వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

– ఇప్పటికీ చాలా దేశాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అనేదే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఇందులో బొగ్గును మండించి విద్యుత్‌ ఉత్పత్తి చేసే థర్మల్‌ ప్లాంట్స్‌ మరీ ప్రమాదకరం.

– ప్రపంచవ్యాప్తంగా వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి విడుదల చేస్తున్న కార్బన్‌ డైఆక్సైడ్‌ వల్ల ఏటా నాలుగు లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో డీజిల్‌ వాహనాలు మరీ ప్రమాదకరం. అందుకే ఆ మధ్య ఢిల్లీలో 2500 సీసీ కంటే ఎక్కువున్న డీజిల్‌ వాహనాల అమ్మకంపై నిషేధం విధించారు.

– ఇక ప్రమాదకరమైన గ్రౌండ్‌ లెవల్‌ ఓజోన్‌కు కారణమవుతోంది పంటల దహనం. మన దగ్గర తక్కువే కానీ.. ఉత్తర భారతంలో పంటల వ్యర్థాలను తగలబెట్టడం కామన్‌. వీటి వల్ల గాల్లోకి ప్రమాదకర మీథేన్‌, అమోనియా గ్యాస్‌లు ప్రవేశిస్తున్నాయి.

ఇవి గ్రౌండ్‌ లెవల్‌ ఓజోన్‌ను సృష్టిస్తున్నాయి. దీని కారణంగా ఆస్తమాతోపాటు ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గ్లోబల్‌ వార్మింగ్‌కు మీథేన్‌ గ్యాస్‌ కూడా ప్రధాన కారణమే.

– మన ఇళ్లలోని చెత్తను బయట పారేయడం, వాటిని బహిరంగంగా తగులబెట్టడం వల్ల కూడా కొన్ని విష వాయువులు గాల్లో కలుస్తున్నాయి. దీని ద్వారా ఎంతో ప్రమాదకరమన బ్లాక్‌ కార్బన్‌ మనకు తెలియకుండానే శరీరంలోకి వెళ్లిపోతోంది. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఈ సమస్యను కొంత వరకూ పరిష్కరించవచ్చు.

రోజూ 10 సిగరెట్లు తాగినట్లే..

స్మోకింగ్‌ ఎంత ప్రమాదమో తెలుసు కదా. ఎన్నో రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. ఎక్కువ కాలం వాయు కాలుష్యం బారిన పడినా ఇలాంటి ప్రమాదాలే ఉంటాయి. అది దాదాపు రోజూ పది సిగరెట్లు తాగడంతో సమానమని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన రీసెర్చర్లు 18 ఏళ్లపాటు ఏడు వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ కాలంలో వాళ్లకు సంబంధించిన సుమారు 15 వేల సీటీ స్కాన్లను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. దీనిని బట్టే వాయు కాలుష్యం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) అంటే..

రోజువారీగా గాలి నాణ్యతను చెప్పేదే ఈ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌. దీనిని బట్టి గాల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయంటే కాలుష్యం ఎక్కువగా ఉందని అర్థం. గాల్లో పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం), గ్రౌండ్‌ లెవల్‌ ఓజోన్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ల స్థాయిని ఈ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచిస్తుంది. వీటిలో పార్టిక్యులేట్‌ మ్యాటర్‌, ఓజోన్‌ చాలా ప్రమాదకరం. మనం పీలుస్తున్న గాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయంటే అనారోగ్యం బారిన పడినట్లే.

ఏక్యూఐ ఎంత ఉంటే సేఫ్‌..

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో మొత్తం ఆరు కేటగిరీలు ఉంటాయి. స్వచ్ఛమైన గాలి నుంచి అత్యంత ప్రమాదకరమైన గాలికి సంబంధించిన సమాచారాన్ని ఈ కేటగిరీలు మనకు చెబుతాయి. ఇందులో ఏ కేటగిరీ దేనిని సూచిస్తుందో ఓసారి చూద్దాం..

1) 0-50: గాలి నాణ్యత బాగున్నట్లు అర్థం. ఏక్యూఐ ఈ లెవల్‌లో ఉంటే కాలుష్యం అసలు లేనట్లు భావించాలి.

2) 51-100: గాలి నాణ్యత ఓ మోస్తరుగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. కొద్ది స్థాయిలో కాలుష్యం ఉంటుంది. అంటే పూర్తి ఆరోగ్యవంతులకు ఈ గాలి పీల్చడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న కొందరు వ్యక్తులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

3) 101-150: ఇది ఇంకాస్త ప్రమాద స్థాయి. ఈ గాలి పీల్చడం వల్ల పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బందులు ఎదురవుతాయి.

4) 151-200: ఇది అనారోగ్యకరమైన ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌. గాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ గాలి పీల్చడం వల్ల అందరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. అప్పటికే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.

5) 201-300: అత్యంత అనారోగ్యకరమైన ఎయిర్‌ క్వాలిటీ ఇది. ఈ గాలి పీల్చడం వల్ల అందరికీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి.

6) 300-ఆపైన: ఇది ప్రమాదకరమైన ఎయిర్‌ క్వాలిటీ. గాలి పూర్తిగా కలుషితమైపోయి ఉంటుంది. ఈ గాలి పీల్చిన వాళ్లు ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు.

ఏ నగరాలు డేంజర్‌?

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో 9 మన దేశంలోనే ఉన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. అక్కడి గాల్లో పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5 స్థాయి 173గా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన సేఫ్టీ లిమిట్‌ కంటే 17 రెట్లు ఎక్కువ కావడం విశేషం. కాన్పూర్‌ తర్వాతి స్థానాల్లో ఫరీదాబాద్‌, వారణాసి, గయా, పాట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, ముజఫర్‌పూర్‌ ఉన్నాయి.

ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలం రాగానే వాయు కాలుష్యాన్ని చూసి ప్రజలు వణికిపోతున్నారు. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం, ఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో పంటల దహనం.. ఈ కాలుష్యాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. ఒక్కోసారి ఢిల్లీలో అక్టోబరు మాసంలో ఏక్యూఐ 1000ని తాకుతోంది.

వీటితో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం చాలా తక్కువ. ఇక్కడ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌.. 50 నుంచి 100 మధ్యలో నమోదవుతూ ఉంటుంది.

పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం) అంటే..?

పార్టిక్యుటేట్‌ మ్యాటర్‌ లేదా పార్టిక్యులేట్‌ పొల్యూషన్‌.. గాల్లో ఉండే ఘన, ద్రవ అణువుల మిశ్రమం. ఇందులో చాలా వరకు అణువులను ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ఆధారంగానే మనం చూడగలుగుతాం.

ఇందులో సాధారణంగా సల్ఫేట్స్‌, నైట్రేట్స్‌, బ్లాక్‌ కార్బన్‌, కాడ్మియం, కాపర్‌, నికెల్‌, జింక్‌లాంటి ఖనిజాలు, హైడ్రోకార్బన్స్‌ ఉంటాయి. ఈ పీఎం వివిధ సైజుల్లో ఉంటుంది. పది మైక్రోమీటర్ల వ్యాసంతో ఉండే పార్టికల్స్‌ను పీఎం10గా పిలుస్తున్నారు. ఇవి మన శ్వాసవ్యవస్థ ద్వారా లోనికి వెళ్లగలవు.

ఇక 2.5 మైక్రోమీటర్ల వ్యాసం ఉన్న పార్టికల్స్‌ను పీఎం 2.5గా పిలుస్తారు. ఇవి మరింత సులువుగా మన లోనికి వెళ్లగలవు. అన్ని రకాల రసాయనాల మిశ్రమమైన ఈ పార్టిక్యులేట్‌ మ్యాటర్‌.. అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది.

గాల్లో పీఎం ఎలా కలుస్తోంది?

దీనికి ప్రధానంగా మూడు రకాల కారణాలు ఉన్నాయి.
– విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఫ్యాక్టరీలు, భారీ పరిశ్రమలు, పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు విడుదల చేసే ఉద్గారాల్లో ఇవి ఉంటాయి.
– రోడ్లు, భవన నిర్మాణాల నుంచి వచ్చే దుమ్ము, ధూళి
– పంట, ఇతర వ్యర్థాలను తగులబెట్టడం వల్ల కూడా ఈ పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ గాల్లో కలుస్తుంది.

ముందే చంపేస్తోంది

ఇంటా, బయటా వాయు కాలుష్యం కారణంగా ఇండియాలో సగటు ఆయుర్దాయం (లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ) రెండున్నరేళ్లు తగ్గిపోతున్నట్లు ఈ మధ్య పర్యావరణ నిపుణులు తేల్చారు. అసలు స్మోకింగ్‌ కంటే కూడా ఎయిర్‌ పొల్యూషన్‌ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బయటి కాలుష్యంలోని పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ ఏడాదిన్నర ఆయుద్దాయాన్ని మింగేస్తుంటే.. ఇంట్లోని కాలుష్యం మరో ఏడాదిని తగ్గిస్తోంది. బయటి కాలుష్యం సంగతేంటోగానీ.. ఇక్కడ ఇంట్లోని కాలుష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది.

శ్వాస సంబంధిత వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో చనిపోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వాయు కాలుష్యం కారణంగా ఒక్క ఊపిరి తిత్తులే కాదు.. శరీరంలోని అన్ని భాగాలూ దెబ్బ తింటున్నాయి. గుండె జబ్బులు, డయాబెటిస్‌, మెదడు దెబ్బతినడం, పొట్ట భాగంలోని అవయవాలు చెడిపోవడం, బ్లాడర్‌ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్‌లాంటి అత్యంత ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ కారణంగానే అత్యధికమంది చనిపోతున్నారని, అనారోగ్యాల బారిన పడుతున్నారని వెల్లడించింది.

ఏటా 42 లక్షల మంది కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్నారు. వీళ్లలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, పిల్లల్లో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల వల్లే చనిపోతున్నారు.

పార్టిక్యులేట్‌ మ్యాటర్‌, ఓజోన్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌ల వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. పిల్లలైనా, పెద్ద వాళ్లయినా ఎక్కువ కాలం ఈ వాయు కాలుష్యం బారిన పడితే.. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఆస్తమాలాంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

ఆర్థికంగా ఎంత నష్టం?

ప్రస్తుతం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 15 మన దేశంలోనే ఉన్నాయి. దేశంలోని సుమారు 70 కోట్ల మంది ఈ వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. ఎయిర్‌ పొల్యూషన్‌ ఆర్థికంగా కూడా భారీ నష్టాన్ని మిగులుస్తోంది.

వరల్డ్ బ్యాంక్‌ రికార్డుల ప్రకారం.. ఒక్క 2013లోనే ఇండియా తన జీడీపీ విలువలో 8.5 శాతం ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా నష్టపోయిందంటే నమ్మగలరా? కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురి కావడం, ఆ ప్రభావంతో ఉత్పత్తి తగ్గిపోవడంలాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ నష్టాన్ని అంచనా వేశారు.

ఒకవేళ ఈ పొల్యూషన్‌ను జీరోకి తీసుకురాగలిగితే ప్రతి ఏటా ఇండియాకు కనీసం 30 వేల కోట్ల డాలర్ల నుంచి 40 వేల కోట్ల డాలర్ల వరకూ అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా.

2017లోనే ఎయిర్‌ పొల్యూషన్‌ కారణంగా మన దేశంలో పది లక్షల మంది చనిపోయారు. వాయు కాలుష్యాన్ని ఎలా కట్టడి చేయాలో చైనాను చూసి నేర్చుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను ఓ పర్యావరణ ఎజెండాగా కాకుండా.. ఓ ఆర్థిక ఎజెండాగా చైనా చూస్తోందని వాళ్లు చెబుతున్నారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఆ మరణాలకు, ఎయిర్ పొల్యూషన్ కు నేరుగా ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే మన దేశంలో నమోదవుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసుల్లో మూడో వంతు ఎయిర్‌ పొల్యూషన్‌ వల్లేనని రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. కచ్చితంగా ఆ మరణాలకు, కాలుష్యానికి లింకు ఉందని డాకర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ మధ్యే ప్రభుత్వం తొలిసారి నేషనల్ క్లియర్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో దేశంలోని వంద ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని 20 నుంచి 30 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మాత్రం ఈ చర్యలు సరిపోవని, మరిన్ని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచిస్తోంది.

దేశంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వాడుతున్న బొగ్గు వల్ల ఈ కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రపంచంలో సల్ఫర్‌ డైఆక్సైడ్‌ను అత్యధికంగా వెదజల్లుతున్న దేశం భారతే కావడం గమనార్హం.

ఇవి తినండి

ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రధానంగా దెబ్బతినేవి మన ఊపిరి తిత్తులు. దీంతో పలు శ్వాస సంబంధిత వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన ఊపిరి తిత్తులను శుభ్రం చేయడంలో సాయపడతాయి. అవేంటో చూద్దాం..

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎక్కువ మొత్తంలో అలిసిన్‌ ఉంటుంది. ఇది మంటను తగ్గించగలదు. పైగా ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వెల్లుల్లిని పచ్చిగానే తింటే చాలా మంచిది. వారానికి కనీసం రెండుసార్లు వీటిని పచ్చిగా తినేవాళ్లు లంగ్ క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఊపిరితిత్తులతోపాటు గుండెకు కూడా ఈ వెల్లుల్లి మేలు చేస్తుది.

అల్లం

ఊపిరి తిత్తులు సక్రమంగా పని చేయడానికి తోడ్పడే పలు రకాల రసాయన సమ్మేళనాలు ఈ అల్లంలో ఉంటాయి. శ్వాస నాళాన్ని శుభ్రం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ప్రతి రోజూ అల్లం చాయ్‌ తాగితే ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు నిరూపించాయి.

ఆపిల్స్‌

స్మోకింగ్‌ అలవాటు ఉన్నవాళ్లు లేక ఈ ఎయిర్ పొల్యూషన్ బారిన పడిన వాళ్లు రోజూ ఒక ఆపిల్‌ తినడం చాలా మంచిది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్‌ మన డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులోని క్వెర్సెటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌.. ఊపిరితిత్తులను శుభ్రం చేయగలదు. పైగా ఆపిల్‌లో విటమిన్స్‌, ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువ. అందుకే అంటారు రోజూ ఒక ఆపిల్‌ తింటే చాలు.. పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు అని.

బెర్రీలు

స్ట్రా బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ.. ఏదైనా సరే మన ఊపిరి తిత్తులకు మేలు చేసేవే. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు, లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా ఇవి కాపాడుతాయి.

కొన్ని రకాల కూరగాయలు

క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బ్రొకోలీలాంటి కూరగాయలు కూడా ఊపిరి తిత్తులను శుభ్రంగా ఉంచగలవు. వాయు కాలుష్యం కారణంగా మన శరీరంలో చేరిన విష పదార్థాలను ఇవి తొలగిస్తాయి.

మాస్క్‌లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు

ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుండటంతో ఈ సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన వస్తువుల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఫేస్‌ మాస్క్‌లు వేసుకోవడం ఎక్కువైంది.

ఇవి గాల్లోని ప్రమాదకర కారకాలు లోపలికి వెళ్లకుండా అడ్డకుంటాయి. అయితే అన్ని రకాల  మాస్క్‌లు వీటిని అడ్డుకోలేవు. ముఖ్యంగా ప్రమాదకర పీఎం 2.5 అణువులను అడ్డుకోవడానికి ప్రత్యేకమైన మాస్క్‌లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

– ఇందులో ఎన్‌ 95 యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌ ఒకటి. ఇది 95 శాతం పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

– మరొకటి ఎన్‌ 99. పేరులో ఉన్నట్లే ఇది 99 శాతం పార్టిక్యుటేల్‌ మ్యాటర్‌ను లోనికి వెళ్లనీయదు. అయితే ఈ రెండూ కూడా ఆయిల్‌ సంబంధిత కాలుష్య కారకాలను మాత్రం అడ్డుకోలేవు. కనీసం మూడు వందల నుంచి రెండు వేల వరకు ధరల్లో ఈ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి.

వీటికితోడు ఇళ్లు, ఆఫీస్‌లలో ఎయిర్‌ ప్యూరిఫయర్లు, కార్‌ ప్యూరిఫయర్ల వాడకం కూడా పెరుగుతోంది. ఈ ఎయిర్ ప్యూరిఫయర్లు మన చుట్టూ ఉన్న గాల్లోని విష పదార్థాలను ఫిల్టర్‌ చేస్తాయి. ఫిలిప్స్‌, పానసోనిక్‌, షియోమీ, కెంట్, యురేకాలాంటి కంపెనీలు ఈ ఎయిర్‌ ఫ్యూరిఫయర్లను తయారు చేస్తున్నాయి.

మొత్తంగా పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్ తో ఇండియాలో యాంటీ పొల్యూషన్‌ ప్రోడక్ట్స్‌ మార్కెట్‌ భారీగా పెరుగుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  

ఇవి కూడా చదవండి

Previous articleSperm count Increasing Foods: స్పెర్మ్‌ కౌంట్‌ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏది?
Next articleబెస్ట్ గేమింగ్ మొబైల్ ఏది? ధర ఎంత?