వింటర్‌ కేర్‌ .. ఏం తినాలి? ఏ బట్టలు వేసుకోవాలి?

winter care
Photo by Susanne Jutzeler from Pexels

వింటర్‌ కేర్‌, వింటర్ కేర్ ఫర్ స్కిన్, వింటర్ కేర్ ఫర్ హెయిర్ అంటూ తరచూ ప్రకటనలు చూస్తుంటాం. వింటర్ వీటన్నింటిపై ప్రభావం చూపుతుంది కాబట్టే వీటికి ప్రత్యేక మార్కెట్ ఏర్పడింది. బయట మంచు దుప్పటి కమ్ముకుంటే.. ఇంట్లో మనం ఒంటి మీద కప్పుకున్న దుప్పటి తీయాలని అనిపించదు. ఒళ్లంతా బద్ధకంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. జలుబు, ఫ్లూలాంటివి సాధారణమైపోతాయి.

ఇక చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు చలికాలంలో మరిన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వాళ్లు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి వింటర్‌ కేర్‌లో భాగంగా ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి వంటి సమాచారంతో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

వింటర్‌ కేర్‌ ఫర్ స్కిన్

చలికాలంలో ఎక్కువగా దెబ్బ తినేది మన చర్మమే. చర్మం పొడిబారుతుంది. అలెర్జీలు వస్తుంటాయి. వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొందరికి చర్మంపై పగుళ్లు ఏర్పడతాయి. దీంతో వింటర్‌లో చర్మ సంరక్షణకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్‌ మెథడ్స్‌ను ఫాలో అవండి.. మీ చర్మాన్ని కాపాడుకోండి.

– చలికాలంలో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. బయట ఉన్న చలిని తట్టుకోవడానికి ఇది బాగానే ఉపయోగపడుతుంది. కానీ వేడి నీళ్ల స్నానం మీ చర్మాన్ని దారుణంగా దెబ్బ తీస్తుంది. చర్మంపై ఉన్న సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. దీనికి బదులు గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. తప్పదు.. వేడివే కావాలి అనుకుంటే.. ఆ నీళ్లలో కాస్త కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనె వేసుకోండి. 

– ఇక స్నానం చేయగానే అంటే మీ చర్మంపై ఉన్న తేమ ఆవిరవకముందే మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ రాసుకోవడం మరచిపోవద్దు. దీనివల్ల ఆ తేమ అలాగే ఉండిపోతుంది.

వింటర్‌ కేర్‌ క్రీమ్స్ ఏవి వాడాలి?

– ఈ మధ్య మార్కెట్‌లో వింటర్‌ కేర్‌ మాయిశ్చరైజింగ్‌ క్రీమ్స్‌ వస్తున్నాయి. చాలా వాటిలో పెట్రోలియం ఉత్పత్తులను కలుపుతున్నారు. ఇలాంటి వాటితో మీ చర్మానికి మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. అందువల్లో సహజ, పోషక పదార్థాలతో తయారు చేసిన క్రీమ్‌ను కొనడానికి ప్రయత్నించండి.

– చలికాలంలో వారానికి కనీసం రెండుసార్లు స్క్రబ్‌ సాయంతో చర్మాన్ని రుద్దడం మరచిపోవద్దు. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలిగిపోయి కొత్తవి పుట్టుకొస్తాయి.

– శరీరంలో చేతులు, కాళ్లు, మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం కాస్త దళసరిగా ఉంటుంది. దీనివల్ల ఈ భాగాలు వేగంగా తేమను కోల్పోతాయి. రాత్రిపూట ఈ భాగాలకు ప్రత్యేకంగా మాయిశ్చరైజింగ్‌ క్రీములు రాసి గ్లవ్స్‌, సాక్స్‌ వేసుకోండి. ఉదయం వరకూ తేమ అలాగే ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

– మడమ భాగంలో చర్మం పగులుతూ ఉంటుంది. అందువల్ల కాళ్లకు కాస్త ఎక్కువ క్రీమ్‌ పెట్టుకుంటూ ఉండండి. వీలైతే కాటన్‌ సాక్స్‌ వేసుకుంటే మీ మడమలను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. లాక్టిక్‌ యాసిడ్‌ క్రీమ్‌లో కాస్త కర్పూరం వేసుకొని రాసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

– పొడిబారిన చర్మంతోపాటు చలికాలంలో చర్మంపై వచ్చే దద్దుర్లకు పెరుగు మంచి మందుగా పని చేస్తుంది. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పెరుగును అలాగే చర్మానికి రాసుకోవచ్చు. చర్మం మరీ ఎక్కువ పొడిబారినట్లు కనిపిస్తే అందులో రెండు, మూడు చుక్కల గ్లిజరిన్‌ వేసుకోవచ్చు. చర్మానికి రాసుకున్న 20 నిమిషాల తర్వాత రోజ్‌ వాటర్‌ లేదా సాధారణ నీళ్లతో కడిగేయాలి.

హీటర్లు వాడొద్దు..

– సమ్మర్‌లో ఏసీల్లాగే ఈ మధ్య చలికాలంలో హీటర్ల వాడకం ఎక్కువైంది. అయితే ఈ హీటర్లు గదిలో ఉన్న గాల్లోని తేమను మొత్తం పీల్చేస్తాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోతుంది. హీటర్ల బదులు హుమిడిఫయర్లను వాడితే బాగుంటుంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో ఈ హుమిడిఫయర్లను పెట్టుకోవడం వల్ల గాల్లోని తేమ అలాగే ఉంటుంది. ఆన్‌లైన్‌లో వెయ్యి నుంచి రెండు వేలు పెడితే మంచి హుమిడిఫయర్లు అందుబాటులో ఉన్నాయి.

నీళ్లు తాగడం మరచిపోవద్దు..

ఇది కాస్త వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా సమ్మర్‌లో తరచూ మన శరీరంలోని నీటిని చెమట రూపంలో కోల్పోతుంటాం కాబట్టి.. ఎక్కువ నీళ్లు తాగాలని చెబుతారు. ఆ సీజన్‌లో మనకు దాహం కూడా వేస్తుంది. కానీ వింటర్‌లో అలా కాదు. మనకు ఎక్కువ దాహంగా అనిపించదు. అలాగని శరీరానికి నీటి అవసరం లేదు అనుకుంటే పొరపాటే అవుతుంది.

ఏ కాలంలో అయినా మన శరీరానికి రోజువారీ కావాల్సిన నీటి పరిమాణంలో ఎలాంటి తేడా ఉండదు. దాహం వేయడం, వేయకపోవడం అన్నది శరీరంలోని రక్త ప్రసరణతో ముడిపడి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో శరీరంలోని ఉష్ణోగ్రత మొత్తం పడిపోకుండా ఉండేందుకు రక్త ప్రసరణను తగ్గించేస్తుంది. ఫలితంగా మనకు అంతగా దాహం అనిపించదు. కానీ కిడ్నీలు మాత్రం ఎప్పటిలాగే పని చేస్తాయి.

అంటే మీరు తక్కువ మొత్తంలో నీళ్లు తాగుతున్నా.. అవి మాత్రం అవే మొత్తంలో నీటిని బయటకు పంపిస్తుంటాయి. ఫలితంగా మన శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. పైగా చలికాలంలో మనం ధరించే స్వెటర్ల వల్ల కూడా మనకు తెలియకుండానే శరీరంలోని నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల దాహం వేసినా వేయకపోయినా.. చలికాలంలోనూ శరీరానికి అవసరమైనంత నీటిని తాగాల్సిందే.

ఎక్సర్‌సైజులు తప్పనిసరి

ఉదయాన్నే లేవడానికి మీకు ఎంత బద్ధకం అనిపించినా సరే.. చలికాలంలో ఎక్సర్‌సైజులు చేయడం అన్నది చాలా చాలా అవసరమని గుర్తుంచుకోండి. అసలే బయట ఉన్న చలికి శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది.. చర్మం పొడిబారుతుంది. శరీర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇలాంటి సమయంలో కనీసం అరగంట పాటు శరీరంలో వేడి పుట్టించే ఎక్సర్‌సైజులు కచ్చితంగా చేయాలి.

దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అలాగే మీ గుండె నుంచి రక్తం అన్ని అవయవాలకు సరిగ్గా అందుతుంది. చలిలోనూ చర్మం కాంతివంతంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. చలికాలంలో మీ శరీరంలోని రక్త నాళాలు, చెమట గ్రంథులు కాస్త బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. అందుకే మీ చర్మం కాంతిని కోల్పోతుంది. అలాంటప్పుడు కసరత్తులు చేయడం ద్వారా బిగుసుకుపోయిన నాళాలను, గ్రంథులను యాక్టివ్‌గా మార్చాల్సి ఉంటుంది.

వింటర్‌లో ఏం తినాలి?

చలికాలంలో మనల్ని వేడిగా ఉంచడానికి మన శరీరం కాస్త ఎక్కువ శక్తిని వాడుకుంటుంది. అందువల్ల ఆ కోల్పోయిన శక్తిని తిరిగి అందించడంతోపాటు శరీరంలో వేడి పుట్టించే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ సాధారణంగా మనం రోజూ తినేవే. కాకపోతే చలికాలంలో కాస్త ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది.

నెయ్యి

చాలా మంది నెయ్యిని ప్రతి రోజూ తమ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ఇందులో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల చలికాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచడంలో నెయ్యి తోడ్పడుతుంది. అయితే ఈ కొవ్వును చూసే చాలా మంది భయపడుతుంటారు.

ఫిట్‌గా ఉండటానికి కొవ్వు తినడం మానేసిన వాళ్లూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఆవు నెయ్యి వాడితే బెటర్‌. గేదె పాలతో తయారైన నెయ్యి కంటే ఆవు నెయ్యిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. పైగా ఈ నెయ్యి చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.

దానిమ్మ పళ్ల రసం

చలికాలంలో రోజూ ఒక గ్లాస్‌ దానిమ్మ పళ్ల రసం తాగితే చాలా మంచిది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. నిమ్మ, నారింజలాంటి సిట్రస్‌ పళ్లను తీసుకోవడం వల్ల కూడా చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

ఉడకబెట్టిన ఆహారం

వింటర్‌లో ఎప్పుడూ వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోండి. ఎప్పుడో వండిన ఆహారం, ప్యాకేజ్డ్‌ మీల్స్‌కు దూరంగా ఉంటే మంచిది. ఇక క్యారట్లు, బీట్‌రూట్స్‌, ఆకుకూరలు మేలు చేస్తాయి. వీటిని ఉడకబెట్టుకొని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పప్పులు, తృణధాన్యాలు

మంచి ప్రొటీన్‌, శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం వణికించే చలిని తట్టుకోగలుగుతుంది. పప్పులు, తృణధాన్యాల్లో ఇవి రెండూ సమృద్ధిగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్‌

డ్రై ఫ్రూట్స్‌ శరీరంలో చాలా వేడి పుట్టించగలవు. ముఖ్యంగా చలికాలంలో బాదాం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్‌ జీర్ణ క్రియను కూడా పెంచుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, చలికాలంలో తరచూ వేధించే జలుబు బారిన పడకుండా ఉండాలంటే.. పల్లీలు కచ్చితంగా తినాలి. నువ్వులు, పల్లీలకు బెల్లం జత చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

అల్లం

శరీరంలో వేడి పెరగడానికి అల్లాన్ని వినియోగించడం ఎప్పటి నుంచో వస్తోంది. పైగా ఇది జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని, రక్త ప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది. అల్లాన్ని సాధ్యమైనంత వరకు నేరుగా తినడానికి ప్రయత్నించండి. ఇలా తినలేము అనుకుంటే.. ఉదయాన్నే ఓ అల్లం చాయ్‌ తాగండి. వేడి నీటిలో కాస్త అల్లం, తేనె వేసుకొని తాగితే మంచిది.

తులసి

మనం రోజూ పూజ చేస్తూ పవిత్రంగా చూసుకునే మొక్క తులసి. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఈ తులసి ఆకులు యాంటీ సెప్టిక్‌గా పని చేయడంతోపాటు ఏ, సీ విటమిన్స్‌, ఐరన్‌ కలిగి ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చలికాలంలో ప్రధానంగా ఎదురయ్యే జలుపు సమస్యను నివారిస్తుంది. ఎప్పటికప్పుడు శరీరాన్ని వేడిగా ఉంచుతూ.. విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. తులసి ఆకులను నేరుగా తినొచ్చే లేదంటే వేడి నీటిలో వేసుకొని తాగొచ్చు.

మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఈ సుగంధద్రవ్యాలు కూడా బాగా పని చేస్తాయి. మిరియాలను తిన్నప్పుడు వాటిని అరిగించడానికి శరీరం సహజంగా వేడిని ఉత్పత్తి చేస్తుంది.

బిర్యానీల్లో ఉపయోగించే దాల్చిన చెక్క కూడా శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూస్తుంది. ఈ దాల్చిన చెక్కను ఉదయాన్నే టీ లేదా కాఫీలోనూ వేసుకోవచ్చు.

చలికాలంలో గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. పసుపులోని కుర్కుమిన్‌ను అరగించడానికి శరీరం ఎక్కువ మొత్తంలో శక్తిని విడుదల చేయడం వల్ల చలి తీవ్రత నుంచి రక్షించుకోగలుగుతారు.

ఇవే కాకుండా చలికాలంలో బెల్లం, తేనె, నువ్వులు వంటి వాటిని కూడా మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

వింటర్‌ కేర్‌ డ్రెస్సింగ్

సాధారణంగా చలికాలంలో మనం వేసుకునే దుస్తులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధ్యమైనంత వరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచే డ్రెస్సులు వేసుకోవాలి. ఉన్నితో చేసిన దుస్తులు వింటర్‌కు సరిగ్గా సరిపోతాయి. చలిని తట్టుకోవడానికి మామూలుగా వేసుకునే డ్రెస్సులతోపాటు జాకెట్స్‌ వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడీ జాకెట్స్‌ను అవసరంతోపాటు స్టైల్‌ కోసం కూడా వాడుతున్నారు. ఇలాంటివి కొనే ముందు మీకు ఎలాంటి మెటీరియల్‌తో చేసినవి కావాలో కూడా చూసుకోండి.

– లెదర్‌ జాకెట్స్‌ చాలా స్టైలిష్‌గా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. యూత్‌ ఎక్కువగా లెదర్‌ జాకెట్స్‌ను ప్రిఫర్‌ చేస్తారు.

– ఇక వెరైటీ కలర్స్‌లో కావాలనుకుంటే మాత్రం వూల్‌ జాకెట్స్‌కు వెళ్లండి. కలర్స్‌తోపాటు స్టైలిష్‌గానూ ఉంటాయి.

– కాటన్‌ కోట్‌ కూడా వేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉంటే మాత్రం ఇవి పని చేయవు. చలిని తట్టుకోవాలంటే మాత్రం వూలెన్‌ కోట్స్‌ అయితేనే బెటర్‌.

వింటర్‌ కేర్‌ లేయర్స్

ఇక వింటర్‌ కేర్‌ లో భాగంగా మనం మూడు నాలుగు లేయర్స్‌లో దుస్తులు వేసుకుంటాం. అయితే ఏ లేయర్‌లో ఏ రకమైన దుస్తులు వేసుకోవాలో కూడా తెలుసుకుంటే మంచిది. లోపల వేసుకునే దుస్తులు చెమటను పీల్చేవిగా ఉండాలి. థర్మల్స్ ఇందుకు ఉపయోగకరంగా ఉంటాయి. బనియన్ క్లాత్ మాదిరిగానే ఉండి చర్మానికి అతుక్కుపోయేలా ఉంటుంది. గాలి లోనికి చొరబడదు. పిల్లలకు ఇవి మేలు చేస్తాయి. ధర కూడా రూ. 300 నుంచి రూ. 500 మధ్య నాణ్యమైనవి దొరుకుతాయి. అమెజాన్, మింత్రా వంటి సైట్లలో ప్రయత్నించవచ్చు. 

మధ్యలో వేసుకునే దుస్తులు శరీరానికి వెచ్చదనం ఇవ్వడంతోపాటు వేడిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకునేవిగా ఉండాలి. బయట వేసుకొనే స్వెటర్‌, జాకెట్‌లాంటివి చల్లని గాలిని లోపలికి రానీయకుండా అడ్డుకోవడంతోపాటు వాటర్‌ప్రూఫ్‌గా ఉండేలా చూసుకోవాలి.

జాకెట్స్‌, స్వెటర్స్‌తోపాటు మఫ్లర్స్‌, స్కార్ఫ్స్‌, గ్లవ్స్‌, హుడీస్‌, బూట్స్‌లాంటివి కూడా వింటర్‌లో మిమ్మల్ని వణికించే చలి నుంచి కాపాడతాయి. 

ఇవి కూడా చదవండి

Previous articleవెడ్డింగ్‌ గిఫ్ట్ ఐడియా .. ఏది బాగుంటుంది?
Next articleMaldives Package From Hyderabad: మాల్దీవ్స్‌ టూర్ .. ఎలా వెళ్లాలి? బెస్ట్‌ ప్యాకేజ్‌ ఏది?