కరోనా పాజిటివ్‌ వస్తే .. మీ ముందున్న 10 మార్గాలివిగో..!

corona positive
Pic: pexels

కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కడో చైనాలోని వుహాన్‌.. తరువాత ఆ దేశం ఈ దేశం తిరిగి.. ఇప్పుడు మన గల్లీలోకి వచ్చింది. దురదృష్టవశాత్తూ మన ఇంట్లోకి వచ్చిందనుకోండి. వెంటనే పానిక్‌ అయిపోకండి. షాక్‌ అయిపోయి జీవితం ముగిసిందనుకోకండి.

కరోనాతో కలిసి జీవించడం తప్పదని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో మీరు మానసికంగా సిద్ధమవ్వండి.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మీ స్నేహితుడిగా మీకు గుర్తు చేసే ప్రయత్నమే ఇది తప్ప వైద్య సలహా కాదని గమనించండి.

కరోనా ఏ రకంగానైనా రావొచ్చు. వచ్చేంతవరకు మీకు తెలిసి ఉండకపోవచ్చు. పాల బూత్‌ దగ్గరే రావొచ్చు. కూరగాయల బండి వద్దే రావొచ్చు. ఉద్యోగం చేసే చోట కావొచ్చు. స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు రావొచ్చు. మీరు ఏదైనా పరిస్థితుల్లో ఆసుపత్రులు, లాబోరేటరీలు వెళ్లినప్పుడు.. ఇలా ఎప్పుడైనా రావొచ్చు..

మీకు సంబంధించిన సమూహం .. అంటే మీ సహోద్యోగికో, లేక మీ చుట్టూ ఉండే కాలనీ వాసులకో, లేక మీ మిత్రుడికో, మీ బంధువుకో కరోనా వచ్చిందనుకోండి. లేదా అతడికి కరోనా ఉందని తెలియక అతడిని ఏ అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాక.. అతడికి కరోనా సోకిందని తెలిసిందనుకోండి.. రెండు మూడు రోజులకు మీరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే మీకూ కరోనా సోకిందనుకోండి..

ఇలా ఏదో ఒక సందర్భంలో మీకు కరోనా వచ్చిందనుకుందాం.. అప్పుడు మీరేం చేస్తారు? కంగారు పడకుండా ఈ కింద ఉన్న మార్గాలు తెలుసుకోండి.

కరోనా పాజిటివ్ వస్తే ఇవి పరిశీలించండి

1. మీకు దగ్గు, తుమ్ములు, జ్వరం లేదా ఇతరత్రా ఏ అనారోగ్య లక్షణాలు కనిపించలేదునుకోండి. మీకు కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ మీరు ఆసుపత్రిలో అడ్మిట్‌ అవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు. వైద్యుడి సలహా మేరకు హోం క్వారంటైన్‌ గానీ, ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లోగానీ ఉండాల్సి వస్తుంది. మీకు అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే మీకు చికిత్స చేస్తారు.

2. మీకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలు పాటిస్తూ ఉండండి. మీరు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య సేతు యాప్ లో తెలియపరచండి. పైన ఉంటే ఎర్రని త్రిభుజాకార బొమ్మను క్లిక్ చేసి అందులో వచ్చే సూచన ప్రకారం నమోదు చేయవచ్చు.

3. మీకు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మీ కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్‌–19 పరీక్ష జరిపించడం మేలు. ప్రభుత్వ పరీక్షా కేంద్రాలు రద్దీగా ఉంటున్నందున కేవలం లక్షణాలు కనిపిస్తేనే అక్కడ పరీక్ష చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు మీకు ప్రయిమరీ కాంటాక్ట్‌ అయినప్పటికీ.. మీకు లక్షణాలు లేకుండా చేయడం లేదు. ఇలాంటప్పుడు ప్రయివేటు లాబ్‌లను ఆశ్రయించడం మేలు. అక్కడ ముందుగా మిమ్మల్ని స్క్రీనింగ్‌ చేసి కోవిడ్‌–19 పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు రూ. 4,500 రుసుము, కన్సల్టింగ్‌ ఫీజుగా రూ. 350 చెల్లించాల్సి ఉంటుంది.

4. ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో కోవిడ్‌ టెస్ట్‌ బుక్‌ చేస్తే ఇంటి వద్దకే వచ్చి పరీక్ష చేసేందుకు కొన్ని పేరున్న లాబ్‌లు ఇప్పటికే ఏర్పాట్లు చేశాయి. సంబంధిత వివరాలను ఆరోగ్యసేతు యాప్‌లో ఒక లింక్‌ క్లిక్‌ చేయడం ద్వారా గానీ, ఆరోగ్యసేతు మిత్ర్ వెబ్‌సైట్‌ ద్వారా గానీ తెలుసుకోవచ్చు.

5. మీరు ఆసుపత్రిలో అడ్మిట్‌ అవ్వాల్సి వచ్చిందునుకోండి. మీ కుటుంబ సభ్యుల బాగోగులు మీరే చూసుకోవాల్సి ఉన్నప్పుడు ఏం చేయాలి? వారు ప్రయివేటు గానీ, ప్రభుత్వ ఆసుపత్రి గానీ చేరేందుకు వాహనం, టాక్సీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆంబులెన్స్‌ ప్రయత్నించండి. లేనిపక్షంలో హోం టెస్ట్‌ను ప్రిఫర్‌ చేయండి. అది కూడా సాధ్యం కానప్పుడు కోవిడ్‌కు భయపడకుండా మీ కష్టాన్ని గట్టెక్కించగలిగే మిత్రులను గుర్తు చేసుకోండి. వారు వారి వాహనంలో తీసుకెళ్లేందుకు అవకాశాన్ని చూడండి.

6. అకస్మాత్తుగా కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు మీకు దిగ్భ్రాంతి కలుగుతుంది. మీ వద్ద డబ్బు ఉండకపోవచ్చు. మీ వద్ద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే మీకు కొండంత అండగా ఉంటుంది. మీకు లక్షణాలు కనిపించకపోతే పరవాలేదు. కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరొచ్చు. అయితే అక్కడ బెడ్లు లేకపోవడమో, ఇంకేదైనా కారణంగానే చేరలేకపోతే ప్రయివేటును ఆశ్రయించాల్సి రావొచ్చు.

అప్పుడు మీరు కొంత నగదు డిపాజిట్‌ చేయాల్సి వస్తుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లేనప్పుడు క్రెడిట్‌ కార్డు ఉంటే కొంత ఉపశమనం. అది కూడా లేనప్పుడు మన సేవింగ్స్‌ ఖాతాకు డబ్బు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారో గుర్తు చేసుకోండి. ఉంటే వెంటనే జమ చేయమని చెప్పండి. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు.

7. మీరు ఇటీవల కరోనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఏమైనా తీసుకున్నారేమో గుర్తుచేసుకోండి. తీసుకుని ఉంటే ఆసుపత్రిలో చేరేముందు ఆ పాలసీ చూపండి.

8. మీ కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్‌ వస్తే, మీలో ఆందోళన రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. కానీ గుర్తుంచుకోండి. లక్షణాలు ఏవీ లేనప్పుడు ఎలాంటి చింత, చికిత్స అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి వారి సలహా పాటించండి. అందరూ ఒకే చోట.. వీలైతే వైద్య సదుపాయం కలిగిన ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో చేరే మార్గం చూడండి. ముందుగా ప్రభుత్వ కోవిడ్‌ హెల్ప్‌ సెంటర్‌ను సంప్రదించి పరిస్థితి వివరిస్తే.. ఇది సులువవుతుంది.

8. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి హోం క్వారంటైన్‌లో ఉంటే నిత్యావసరాలన్నీ ఆన్‌లైన్‌లో తెప్పించండి. మీతోపాటు ఇంట్లో ఎవరూ బయట తిరగకపోవడం మంచిది.

9. కరోనా హెల్ప్‌ లైన్‌ నెంబర్, దగ్గరలోని కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు, ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాల నెంబర్లు, కోవిడ్‌ హెల్త్‌ సెంటర్ల్, కోవిడ్‌ ఆసుపత్రులు, ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లు, ఆన్ లైన్ మెడిసిన్ యాప్స్, ఫోన్ నెంబర్లు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఇలాంటి వివరాలు ఒక షీట్‌లో రాసిపెట్టుకోండి. ఇంట్లో అందరికీ కనిపించే చోట అతికించండి.

10. కరోనా కష్టకాలంలో మీకు సాయపడే వారి వివరాలు కూడా ఒక షీట్‌లో నమోదు చేయండి.
మీ ఆత్మీయ స్నేహితులు, బంధువుల ఫోన్‌ నెంబర్లు, మీ సహోద్యోగుల నెంబర్లు, మీ ఆఫీస్‌ మేనేజర్‌ నెంబర్‌ రాసి పెట్టుకోండి. ఇంట్లో అందరికీ కనిపించేలా అతికించిపెట్టుకోండి. ఇంటికి దగ్గరగా ఉండే ఆత్మీయులు, బంధువులు, సహోద్యోగుల నెంబర్లు తొలి ప్రాధాన్యక్రమంలో రాసిపెట్టుకోండి.

ఇవన్నీ మీకు కష్టకాలంలో ధైర్యాన్ని, మార్గాన్ని చూపే అంశాలు మాత్రమే. కరోనా చికిత్సలో వైద్యుడి సలహా తప్పనిసరి అని మరిచిపోకండి.

ఇవీ చదవండి

కరోనా నేర్పిన పది జీవిత పాఠాలు

ఈ పిట్ట కథ నిజమవుతుందా?

Previous articleఆమె మనసులో ఏముంది?
Next articleYama kupam book review: యమకూపం – ఆ వేశ్యల వెనక రాబందులు ఎవరు?