కరోనావైరస్ ప్రతిఫలంగా ఏర్పడిన లాక్ డౌన్ మనిషి జీవితాన్ని స్తంభింపజేసిందన్న బాధ ఓ వైపు ఉన్నా.. ఇదే లాక్ డౌన్ మనిషి పరుగును ఆపి ఆలోపింపజేసింది. ప్రాపంచిక జీవితంలో ఉరుకులు పరుగులు తీసే మనల్ని వెనక్కి తిరిగి చూసుకొనేలా చేసింది.
మూలాలను తవ్వేలా చేసింది. ఏది అవసరం, ఏది అనవసరమో నిర్ధారించుకునేలా చేసింది. అది కూడా కచ్చితత్వంతో. మన అవసరాల విషయంలో, మనం కోరుకొనే మనుషుల విషయంలో, మన గమ్యాల విషయంలో స్పష్టతను తీసుకొచ్చింది.
మార్చి 24న అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ నేటితో ఫేజ్ 3 కూడా పూర్తి చేసుకుంది. మనల్ని ఇళ్లకే పరిమితం చేసిన ఈ 55 రోజుల కాలం.. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడెక్కడ ఉన్నాం? ఎక్కడికి చేరుకోవాలి?.. మన లక్ష్యాలు, గమ్యాల విషయాల్లో ఇన్నాళ్లు మనకు ఉన్న ఆలోచనలను సంపూర్ణంగా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
ఈ నిర్బంధం మనిషికి కావాల్సిన తోడును గుర్తు చేసింది. ఆ తోడు అవసరం ఎంతో నేర్పింది. ఎక్కడో చిక్కుకొని గమ్యస్థానాలకు వేల కిలోమీటర్లు కాలినడకన కుటుంబంతో బయలుదేరిన కష్టజీవిని చూసి ‘అసలు కష్టం’ అంటే ఏంటో మనిషికి తెలిసి వచ్చింది.
సొంతూరుకు చేరుకొనే క్రమంలో కష్టజీవి విగతజీవిగా మారుతున్నాడు. ప్రయాణ వసతులు లేక నడక ప్రయాణం మొదలు పెట్టాడు. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా 2 వేల ప్రమాదాలు చోటుచేసుకోగా, ఈ ప్రమాదాల్లో 368 మంది చనిపోయినట్టు సేవ్ లైఫ్ ఫౌండేషన్ గణాంకాలు విడుదల చేసింది.
దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ సంస్థ కృషి చేస్తోంది. వలస కార్మికులు, వైద్య సిబ్బంది తదితరులు ఈ ప్రమాదాల్లో మృతి చెందినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇంతటి నిజమైన కష్టం ముందు ఏ కష్టమైన చిన్నదే ఏమో!.
ఈ కష్టాన్ని చూసి చెమర్చిన కళ్లు.. బాటసారికి రహదారిపై భోజన వసతులు ఏర్పాటు చేసేలా చేసింది. వారి అవసరాలను తీర్చి మానవత్వాన్ని చాటుకొనేలా చేసింది. అలా.. ఈ నిర్బంధ కాలం మనిషిని ఆపి ఆలోచింపజేసింది.
ఏది మంచి, ఏది చెడు.. ఏ అవసరం, ఏది అనవసరం, ఏది నిజమైన కష్టమో తెలిసేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అలా లాక్ డౌన్ వల్ల తన ఆలోచనల్లో వచ్చిన మార్పును బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అందరితోనూ పంచుకున్నాడు.
ఎవరెన్ని చెప్పినా ప్రేమ విలువైంది..
‘మనం ఏ అవసరాలను తీర్చుకోవడానికి బతుకుతున్నామో, నిజానికి ఆ అవసరాలు మనం అనుకున్న దానికంటే ఏమంత అవసరం లేనివి. మన పక్కన ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం లేదు, మనసువిప్పి మాట్లాడుకొనే కొంత మంది ఉంటే చాలు.
ఒక్క క్షణం పాటు కాలాన్ని ఆపేసి, ప్రాపంచిక అవసరాల కోసం పరుగు తీసే అవసరం లేకుండాపోయింది. మనం పోట్లాడిన వారితో నవ్వుకోవచ్చు.
వారి ఆలోచనల కన్నా మన ఆలోచనలు గొప్పవేమి కాదని తెలుసుకోవచ్చు. అన్నింటికి మించి ఎవరెన్ని చెప్పినా ప్రేమ ఎంతో విలువైనది’ అని ట్విటర్లో లాక్ డౌన్ పాఠాలు రాసుకొచ్చాడు షారుక్ ఖాన్.
Lockdown lessons… pic.twitter.com/yYhAwseLBv
— Shah Rukh Khan (@iamsrk) May 15, 2020