కోవిడ్ లక్షణాలు దాచిపెట్టేవారూ ఉన్నారంటే నమ్ముతారా? జ్వరం వస్తే ఇది సాధారణ జ్వరమేలే.. దగ్గు వస్తే ఇది సాధారణంగా వచ్చేదే లే.. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే దుమ్ము వల్ల వస్తుందేమోలే.. మనం ఎవరినీ తాకలేదు కదా. మనకు కరోనా ఎందుకు వస్తుందిలే అన్న భ్రమల్లో కొంతమంది తమ లక్షణాలను పట్టించుకోకుండా ఉంటారు.
కరోనా టెస్ట్ కూడా చేయించుకోరు. చేయించుకోకపోవడం వారిష్టం. కానీ ఈ లక్షణాలు ఉన్నప్పటికీ బయట తిరిగి ఇతరులను ప్రమాదంలో నెట్టేస్తారు చూడండి. అప్పుడే అసలు సమస్య. తమకు ఎలాంటి సమస్య లేదనుకుని జనంలో తిరిగేస్తారు.
ఆఫీస్ ఒత్తిళ్లనో, ఇంకోటనో మనసుకు సంజాయషీ చెప్పుకొంటూ బతికేస్తారు. అది వారిష్టం. కానీ వారికి కోవిడ్ లక్షణాలు ఉండి.. హోం క్వారంటైన్‌లో ఉండకుండా.. జనంలోకి వచ్చినప్పుడు ఏ బలహీన ఆరోగ్యం కలిగిన వారికి సోకడానికి కారణమైతే ఎలా ఉంటుంది. ఒక్కోసారి వారి కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తారు.
థర్మల్ స్క్రీనింగ్ కు చిక్కకూడదని ఎయిర్ పోర్టులో దిగేముందు పారాసెటమల్ టాబ్లెట్ వేసుకుని వచ్చారని స్వయంగా కేంద్ర మంత్రులే ప్రెస్ మీట్లలో చెప్పడం చూశాం.
మనం ప్రమాదంలో పడిపోతాం
ఏ డయాబెటిస్, బీపీ, ఆస్తమా వంటి వ్యాధులు ఉన్న వారికి ఇలా లక్షణాలు దాచిన వారి నుంచి సోకిందనుకోండి. అప్పుడు వారి పరిస్థితి ఏంటి? టెస్టులకు, చికిత్సలకు ప్రయివేటు ఆసుపత్రుల్లో లక్షల్లో బిల్లులు చెల్లించాల్సిందే. దురదృష్టం బాగుంటే ప్రాణం కూడా దక్కకపోవచ్చు.
అఫ్ కోర్స్! ఇతరులకు సోకనివ్వొద్దన్న ఆలోచన ఇలాంటి వారికి ఉండకపోవచ్చు. ఆ సెంటిమెంట్ ఉంటుందని మనం కోరుకోవడం అత్యాశే. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం కారణంగా ఇక సాధారణ జీవితం గడపాల్సి వస్తోంది.
అంటే ఆఫీస్ తెరుచుకుంది. రోజూ వెళ్లాల్సిందే. బస్సుల్లోనో, టాక్సీలోనో, ఆటోలోనో లేక ఇంకో దారిలోనే వెళ్లాల్సిందే. వెళ్లాక తోటి ఉద్యోగులతో కలిసి కూర్చుని పనులు చేయాల్సిందే. దూరప్రాంతాలు ప్రయాణించాల్సి వస్తుంది.
ఇలాంటప్పుడే కోవిడ్ లక్షణాలు దాచే బ్యాచ్‌తో మనకు కష్టాలు వస్తాయి. మనం డ్రైవింగ్ బాగా చేసినా ఎదుటి వారు సరిగ్గా వాహనం నడపనప్పుడు మనకు ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో.. ఇలాంటి బ్యాచ్‌తో కూడా కరోనా ప్రమాదాలు సంభవిస్తాయి.
మరి మనకు ఉన్న మార్గం ఏంటి?
మన బాధ్యతలు మనకు ఉన్నందున మనం తిరగకతప్పదు. కోవిడ్ పేషెంట్ల మధ్యే తిరుగుతున్నట్టుగా భావించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మాస్కు ధరించాలి. వెంట ఓ పాకెట్ సానిటైజర్ ఉంచుకోవాలి. పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలి.
అలాగే తక్షణం ఓ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు పరిమితం చేయకుండా ప్రయివేటు ఆసుపత్రులు, ప్రయివేటు డయాగ్నస్టిక్ సెంటర్లను అనుమతిస్తున్నాయి.
కరోనా బాధితులు ఎక్కువైతే మనకు ప్రభుత్వ పడక దొరకకపోవచ్చు. ప్రయివేటుకు వెళ్లేంత స్తోమత లేకపోవచ్చు. అందువల్ల తక్షణం ఓ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. లక్షణాలు దాచే బ్యాచ్‌తో జాగ్రత్తగా ఉండండి.
ఇవీ చదవండి