స్విగ్గీ, జొమాటో బాటలో అమెజాన్ ఫుడ్ డెలివరీ చేయనుంది. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరులోని కొన్ని ఎంపికచేసిన పిన్ కోడ్ ప్రాంతాల్లో డెలివరీ ప్రారంభించింది. క్రమంగా అన్ని నగరాలకు విస్తరించనుంది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ గొప్పగా ప్రారంభమైనప్పటికీ అంతగా రాణించక పోవడంతో చివరకు ఇండియాలోని సేవలను జొమాటోకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో చాలా కష్టంగా నెగ్గుకొస్తున్నాయి.
వీటికి ఇదివరకే ఇతర సంస్థలతో పోటీ ఎదురవుతోంది. కేెఎఫ్సీ వంటి సంస్థలు సొంతంగా ఆన్ లైన్ డెలివరీ ఇస్తున్నాయి. అలాగే పిజా కంపెనీలు సైతం వాటంతట అవే డెలివరీ ఇస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు సొంతంగా ఈ వ్యవస్థను నడుపుతున్నాయి.
అమెజాన్ ఫుడ్ డెలివరీ విజయవంతమవుతుందా?
అమెజాన్ ఇండియాలో ఇప్పటివరకు ఎంచుకున్న అన్ని కార్యకలాపాలు విజయవంతమయ్యాయి. ముఖ్యంగా అమెజాన్ ప్యాంట్రీ ప్రజాధరణ పొందింది. ఈరోజు మధ్యాహ్నం బుక్ చేస్తే రేపు ఉదయానికల్లా గ్రాసరీ ఇంటికి వచ్చేయడం తొలుత అమెజాన్ పాంట్రీతోనే సాధ్యమైంది. అనేక ఆఫర్లతో ఆకట్టుకుంది. తరువాత అమెజాన్ ఫ్రెష్ కూడా ఇదే రీతిలో సక్సెస్ అయ్యింది.
ఇక ఇప్పుడు అమెజాన్ ఫుడ్ డెలివరీ కూడా విజయవంతం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పటిష్టమైన కస్టమర్ బేస్ ఉంది. అమెజాన్ పే వంటి చెల్లింపు వసతి కూడా ఉంది. ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లకు కొదవే లేదు. యుటిలిటీ సర్వీసుల్లో కూడా అమెజాన్ పే సక్సెస్ అయ్యింది.
అన్నింటికంటే మిన్నగా అమెజాన్ సక్సెస్ సీక్రెట్ దాని కస్టమర్ కేర్ సర్వీస్.. వినియోగదారులకు కావాల్సింది కూడా ఇదే. కస్టమర్ కేర్ సెంటర్ ను సంప్రదించాల్సిన అవసరం రానివ్వదు. వస్తే వినియోగదారులకు ఉపశమనం కలిగించకుండా ఉండదు.