మూవీ రివ్యూ: ఆర్టికల్ 15 : ముగ్గురమ్మాయిలపై గ్యాంగ్ రేప్, హత్య

article 15 movie
[yasr_overall_rating null size=”medium”]

మూవీ రివ్యూ: ఆర్టికల్ 15 (హిందీ)
నటులు: ఆయుష్మాన్ ఖురానా, నాజర్, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, ఇషా తల్వార్, సయానీ గుప్తా
దర్షకుడు: అనుభవ్ సిన్హా, నిర్మాత: అనుభవ్ సిన్హా, జీ స్టూడియోస్
ఏ ఓటీటీలో ఉంది: నెట్ ఫ్లిక్స్

ఆర్టికల్ 15 కథ:
ఆర్టికల్ 15 రాజ్యాంగం ఇచ్చిన సమానత్వపు హక్కు. అంటే అందరూ సమానం. ముఖ్యంగా కులం పేరుతో వివక్ష ఉండకూడదన్నది అర్థం. అది ఆలయంలోకి వెళ్లడం కావొచ్చు.. మరొకటి కావొచ్చు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా ఇంకా వివక్ష కొనసాగుతుందని ప్రధాన పాత్ర ప్రవేశంతోటే స్పష్టంగా చెప్తాడు దర్శకుడు.

అయాన్ రంజన్ ఐపీఎస్ ఆఫీసర్. దిల్లీలో ఎలైట్ లైఫ్ లీడ్ చేసే అయాన్‌కి హిందీ రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న కులవివక్షపై లోతైన అవహగాన ఉండదు. అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు తీసుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని లాల్‌గావ్ వెళ్లేటప్పుడు దారిలో ఒక ఊరిలో ఆగి నీళ్లు తాగాలనుకుంటాడు.

కానీ ఆ ఊరి వాళ్ల నీడ కూడ పడకూడదని తన సిబ్బంది చెప్తారు. గన్ మెన్ నిహాల్ సింగ్ మాటలకు అయాన్ ఆశ్చర్యపోతాడు. ఆ రోజు లాల్ గావ్ చేరుకున్నాక తనకోసం ఏర్పాటు చేసిన పార్టీలో తన కాలేజ్ ఫ్రెండ్ సత్యేంద్ర్ అక్కడ ఉండటాన్నిచూసి ఆనందపడతాడు. అతనో ప్రభుత్వ అధికారి.

అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే ఇద్దరు అమ్మాయిలను హత్యచేసి ఊరు చివర చెట్టుకు వేలాడిదీశారంటూ ఉదయాన్నేసిబ్బంది వచ్చి అయాన్ కి సమాచారిమిస్తారు. తన సీఐ బ్రహ్మదత్ సింగ్ ఆ ఇద్దర్ని వాళ్ల తండ్రులే చంపి ఉంటారని అయాన్ కి చెప్తాడు.

వరుసకు అక్కాచెల్లెళ్లు అయినా ఇద్దరి మధ్య శారీరక సబంధం ఉన్నందుకే ఆ అమ్మాయిల తల్లిదండ్రులు చంపేశారని అంటాడు. ఇదంతా “వాళ్ల” సముదాయంలో సహజమని చెప్తాడు. ఇంకో అమ్మయి కనపడం లేదని కంప్లైంట్ చేయడానికి వచ్చినవారిని పొమ్మంటాడు బ్రహ్మదత్ సింగ్.

తన సిబ్బందిలో అగ్రకులానికి చెందిన ప్రతి ఒక్కరు ‘వాళ్లు’ అంతే, “వాళ్ల” ప్రవర్తన అంతే, “వాళ్ల” జీవితాలు అంతే.. అంటూ అయాన్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్లు అంటే ఎవరు? మనుషులేగా అంటాడు అయాన్. కులం ఎంత వేళ్లూనుకుపోయిందో అప్పటికి గానీ అయాన్ కు అర్థం అవలేదు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 చెప్పే సమానత్వం హక్కు వివరాల్ని తన పోలీస్ స్టేషన్లో అంటించి తన ఉద్దేశ్యాన్ని అందరికీ గట్టిగా చెప్తాడు. చనిపోయిన ఇద్దరు అమ్మాయిల కేసు దర్యాప్తును వేగవంతం చేస్తాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు పనిచేసే ఫ్యాక్టరీ యజమానిపై అనుమానం కలుగుతుంది అయాన్ కి.

పోస్ట్ మార్టంలో అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిందని డాక్టర్ చెప్తుంది. ఎవరికీ భయపడొద్దని రిపోర్ట్ తయారు చేయమని డాక్టర్ కి చెప్పి… ఆ అమ్మాయిలు పనిచేసే ఫ్యాక్టరీ ఓనర్ ని పిలిచి అడుగుతాడు.

కూలి 3 రూపాయలు పెంచాలని ముగ్గరు అమ్మాయిలు అడిగితే ఫ్యాక్టరీ ఓనర్ ఇవ్వనంటాడు.  అంతకముందు వాళ్ళ కూలీ 25 రూపాయులు. అమ్మాయిలు అడిగింది ఇంకో మూడు రూపాయలు. ఫ్యాక్టరీ ఓనర్ అన్షు నహారియా ఇవ్వనంటే వేరే చోట పనికి వెళ్తుంటారు. దాంతో వాళ్లను బంధించి కొట్టినట్లు మాత్రమే అయాన్తో చెప్తాడు. అయితే అన్షు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే గ్యాంగ్ రేప్ లో అన్షు ఉన్నట్లు తేలుతుంది.

అన్షూ నహారియా తండ్రి స్థానిక లీడర్. రాజకీయంగా చాలా పలుకుపడి ఉన్న వ్యక్తి. అమ్మాయిల హత్యపై అడిషనల్ ఎస్పీ చేస్తోన్నదర్యాప్తులో అన్షు దోషి అన్నవివరాలు బయటకు రావడంతో దిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి కేసును సీబీఐకి బదిలీ చేయిస్తాడు.

ఈలోపు మూడో అమ్మాయి కోసం అయాన్ ఊరి చివర ఉన్న మురికి కాలువ, దాని అవతల ఉన్న అడవిలో వెతికిస్తుంటాడు. సీఐ బ్రహ్మదత్ సింగ్ పదే పదే అయాన్ ను  అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఓవైపు కేసులో చాలా విషయాలు తెలుసుకుంటాడు అయాన్. ఫ్యాక్టరీ ఓనర్ ఇంటికి వెళ్తే అన్షు అక్కణ్ణుంచి పారిపోతాడు. అప్పుడు అన్షు ఇంటి ఎదురుగా ఉన్న స్కూల్, దాని ముందున్న స్కూల్ బస్సు కనిపిస్తుంది.

లీడ్ దొరికింది ఇక్కడే

అమ్మాయిల హత్య జరిగిన రాత్రి ఆ రోడ్డులో ఓ బస్సు కనిపించిందని ఓ అబ్బాయి చెప్పిన సాక్ష్యం గుర్తొస్తుంది అడిషినల్ ఎస్పీకి. స్కూల్లో వెతికితే ఓ గదిలో అమ్మాయిలను కట్టేసిన తాళ్లు, జుట్టు నమూనాలు కనిపిస్తాయి.

అమ్మాయిల హత్య జరిగిన రోజు, అయాన్ లాల్ గావ్ కి వచ్చిన రోజు, తన మిత్రుణ్ణి కలిసిన రోజు ఒకటే. ఆ మరుసటి రోజు నుంచే తన మిత్రుడు సత్యేంద్ర కూడా కనిపించడు. ఎక్కడికెళ్లాడో తెలియడం లేదని సత్యేంద్ర భార్య అయాన్ కి చెప్తుంది.

ఈ కేసుకి సత్యేంద్రకి ఎక్కడో సంబంధం ఉందని అనుమానించిన అయాన్ తన గన్ మెన్ నిహాల్ సింగ్ ని వెంటబెట్టుకొని వెతుకుతుంటాడు. సత్యేంద్ర భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తే పట్టుకొని ఏం జరిగిందో చెప్పమంటాడు.

ఆ ముగ్గురు అమ్మాయిల హత్య జరిగిన రోజున ఫ్యాక్టరీ ఓనర్ ఇంట్లో పార్టీ ఇచ్చాడని, అందులో సీఐ బ్రహ్మదత్ సింగ్, గన్ మెన్ నిహాల్ సింగ్ కూడా వచ్చారని చెప్తాడు. ఆ తర్వాత అన్షు, సీఐ బ్రహ్మదత్ సింగ్, గన్ మెన్ నిహాల్ సింగ్ ఒక్కొక్కరూ ఎదురుగా ఉన్న స్కూల్లోకి వెళ్లొచ్చారని చెప్తాడు. అప్పుడు అయాన్ కి అర్థమవుతుంది. గ్యాంగ్ రేప్ చేసిన వారిలో సీఐ బ్రహ్మదత్, తన వెంటే ఉంటున్న నిహాల్ సింగ్ కూడా ఉన్నారని.

ఈలోపు సీబీఐ వచ్చి కేసు హ్యాండోవర్ చేసుకొని తనని దర్యాప్తునుంచి తప్పుకోమంటోంది. ఆ మూడో  అమ్మాయిని వెతికేంతవరకు తాను ఊరుకోనని చెప్పి చుట్టుపక్కల ఊర్లలో ఉన్న పోలీసులను రమ్మంటారు. దళితుల అంశం అయినందకు ఎవరూ రారు. చివరికి కొంతమంది మాత్రం ముందుకు వస్తారు. అడవిలో ఓ వాటర్ పంపులో మూలుగుతున్న మూడో అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏం చెప్పింది? సత్యేంద్ర చెప్పింది నిజమేనా? దోషులు దొరికారా? అన్నదే క్లైమాక్స్.

విశ్లేషణ:

సినిమా మొదటి సన్నివేశం దగ్గర్నుంచి చివరి వరకు ఎక్కడా అసాధారణంగా కనిపించదు. దళితులపట్ల ఉన్న వివక్ష ముఖ్యంగా వాళ్లపై జరుగుతున్న అత్యాచారాలే సెంట్రల్ పాయింట్ గా కథ నడిపించాడు దర్శకుడు.

అమ్మాయిల కేసు దర్యాప్తులో భాగంగా హ్యూమన్ స్కావెంజింగ్, చనిపోయిన జంతువుల చర్మాన్ని వలిచి అమ్ముకునే వాళ్ల స్థితి, గుడిలోకి ప్రవేశించినందుకు యువకుల్ని కొట్టే సన్నివేశాల్ని జోడించినా ప్రేక్షకుడు ఏమాత్రం డీవియేట్ కాకుండా ఉండేలా స్క్రీన్ ప్లే ఉంది.

పాటలు, యాక్షన్, భారీ డైలాగులు, హంగామా ఏవీ ఉండవు. సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి చివరి దాకా ఓ సరళరేఖలా కథనం కొనసాగుతుంది. సీఐ బ్రహ్మదత్ పాత్రపై చివరివరకు ట్విస్ట్ ఇవ్వడం హాఫ్ బీట్ ఫిలిం అనిపించకుండా చేసిదంనే చెప్పొచ్చు. చట్టాలు ఎన్ని ఉన్నా అగ్రవర్ణాలు, దళితులు కలిసిపోయారని పార్టీలు అంటున్నా.. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన మనుషుల్లో కులం నరనరాల్లో ఎలా ఇంకిపోయిందో ఎటువంటి షుగర్ కోటింగ్ లేకుండా చెప్తుంది ఆర్టికల్ 15 మూవీ.

భిన్నమైన కథలు ఎంచుకొని బాలీవుడ్ లో  తనకంటూ స్పెషల్ స్పేస్ ఏర్పాటు చేసుకున్న అయుష్మాన్ ఖురానాలో.. సినిమా చూస్తున్నంత సేపు అడిషనల్ డిఎస్పీ అయాన్ రంజన్ మాత్రమే కనిపిస్తాడు.

గతంలో దస్, క్యాష్ వంటి యాక్షన్ సినిమాలు, తేరేబిన్ వంటి రోమాంటిక్ చిత్రాలు తీసిన దర్శకుడు అనుభవ్ సిన్హా ఆర్టికల్ 15తోటే తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన తీసిన తేరేబిన్ చిత్రానికి తెలుగు రీమేకే తరుణ్, శ్రియ నటించిన చిత్రం  “ ఎలా చెప్పను”

11 నెలల క్రితం విడుదలై ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. తాజాగా తమిళంలో రీమేక్ కానుందని, బోనీకపూర్ రీమేక్ రైట్స్ తీసుకున్నారని సినీ పరిశ్రమ చెబుతోంది.

— కే , సీనియర్ జర్నలిస్ట్

ఇవీ చదవండి:

 

Previous articleఅమెరికాలో పడిపోతున్న రియల్‌ ఎస్టేట్ ధరలు
Next articleపవన్‌ కళ్యాణ్‌ బలగం బండి సంజయ్‌కు బలమవుతుందా?