ఎందరో అమ్మాయిలకు ఆమె ప్రయాణం ఓ స్ఫూర్తిదాయకం. అమ్మాయిలకు ఆటలెందుకు అనే ఇంకెందరికో చెంపపెట్టు. సిక్కోలులోని ఓ మారుమూల గ్రామం నుంచి సిడ్నీ ఒలంపిక్స్ దాకా ఆమె సాగించిన విజయపరంపర ప్రతి భారతీయుడికి గర్వకారణం.
ప్రతి అమ్మాయికి ఆమె ఒక ఆత్మనిబ్బరం. ప్రతి యువతి బంగారు భవితకు బాటలు వేసే ఆమె విరోచిత ప్రయాణం ఇప్పుడు వెండి తెరకెక్కనుంది. ఆమె ఎవరో కాదు వెయిట్ లిఫ్టర్, మన తెలుగు ఆడబిడ్డ కరణం మళ్లీశ్వరి.
శ్రీకాకుళం జిల్లాలోని అముదాలవలకు సమీపంలోని ఊసవానిపేటలో జన్మించిన కరణం మళ్లీశ్వరీ ఒలంపిక్ లో పతకాన్ని సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
చిన్నతనంలో ‘ఈ అమ్మాయికి ఆట లెందుకు ఎందుకు’ అని అహంకారపూరిత మాటలు వినివినీ జీవితంలో ఏదైనా సాధిచాలన్న నిశ్చయించుకుంది మళ్లీశ్వరీ.
12 ఏళ్ల వయస్సులో కెరీర్ ప్రారంభించిన ఆమె ఢిల్లీ చేరుకొని తన ప్రతిభతో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టిని ఆకర్షించింది.
అలా 1990లో జాతీయ క్యాంప్ లో చేరిన అనంతరం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన లక్ష్యసాధనలో వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె సడలని సంకల్పం దేశానికి ఎన్నో పతకాలు సాధించిపెట్టింది.
వరుస విజయాలు..
1994, 95లో 54 కేజీల విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన మళ్లీశ్వరీ 1993, 96లో మూడో స్థానంలో నిలిచింది.
అలాగే 1994లో ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో వెండి పతకం, 1995లో కొరియాలో 54 కేజీల విభాగంలో ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్, అదే ఏడాది చైనాలో 113 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ లో టైటిల్ దక్కించుకొని రికార్డు సృష్టించింది.
11 బంగారు పతకాలతో కలిపి 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన మళ్లీశ్వరీ రెండు సార్లు వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.
ఇక సిడ్నీ-2000 ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్ లో పతకం సాధించిన తొలి భారత మహిళగా కరణం మళ్లీశ్వరి చరిత్ర పుటలకెక్కింది. ఆమె ఎగురవేసిన విజయ పతాకం ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. పద్మ శ్రీ, రాజీవ్ గాతంధీ ఖేల్ రత్న పురస్కారాలు ఆమెను వరించాయి.
దేశాన్ని నిలబెట్టిన ఓ అమ్మాయి ప్రయాణం..
దేశంలో ఇప్పటికే ఎందరో క్రీడాకారుల జీవితాలు వెండితెరకెక్కాయి. అవి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయేలా నిలిచిపోయాయి.
భారత క్రికెక్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన #ఎంఎస్ ధోనీ, బాక్సింగ్ లో #మేరీకోమ్, కుస్తీ పోటీల్లో గీత ఫోగట్, ఆమె తండ్రి కథ ఆధారంగా తెరకెక్కిన #దంగల్ ఎంతటి గొప్పవిజయాన్ని సాధించాయో చెప్పాల్సిన పని లేదు.
దంగల్ చిత్రం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అందరి మన్ననలు పొందింది. ఇక చైనాను అయితే ఈ చిత్రం ఊపేసిందనే చెప్పాలి. ఆ దేశ అధ్యక్షుడు జింపింగ్ ఇటీవల భారత పర్యటనకు వచ్చినప్పుడు దంగల్ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని మన ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ స్వయంగా హరియాణ ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు.
ఇక దేశానికి క్రికెట్ లో మొదటి వరల్డ్ కప్ అందించిన జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన #83దిఫిలిం త్వరలో విడుదల కానుంది.
అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన #భాగ్ మిల్కా భాగ్ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.. ఇదే కోవలో కరణం మళ్లీశ్వరి జీవితం త్వరలో వెండి తెరకెక్కనుంది.
వైఎస్సార్ సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రముఖ రచయిత, నిర్మాత కోనా వెంకట్ నిర్మాణ సారథ్యంలో రానున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.