ఇమ్యూనిటీ పెంచేందుకు సీ, డీ విటమిన్లు, జింక్ వంటి పోషకాలతో కూడిన ఆహారం ఎంత అవసరమో.. ఇమ్యూనిటీ తగ్గించే ఆహారానికి కూడా దూరంగా ఉండడం అంతే మేలు చేస్తుంది. కరోనా వంటి వ్యాధులను తెచ్చి పెట్టే వైరస్‌లను, బ్యాక్టీరియాను తట్టుకునేందుకు మన శరీరాన్ని బలోపేతం చేయాల్సిన తరుణమిది. మనం తింటున్న ఆహారంలో మన శరీరానికి హాని చేసేవాటిని తక్షణం పక్కనపెడదాం ఇక.
1. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి
ఆకలేసినప్పుడల్లా మనకు తెలియకుండానే మనం ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుంటాం. ఆకలి తీరాలని చూస్తాం. వెంటనే లాగేస్తాం. కానీ దాని వల్ల రోగ నిరోధక శక్తికి కలిగే నష్టాన్ని మనం గుర్తించం. జంక్ ఫుడ్‌లో ఉండేదంతా కార్పొహైడ్రేట్స్. అంటే పిండి పదార్థాలు. కార్బొహైడ్రేట్స్ ఒక వ్యసనం వంటిది. కడుపులో పడేసేంతవరకు అది ఊరుకోనివ్వదు. మనసు లాగుతుంది.
వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లి వైరస్, బ్యాక్టీరియాపై పోరాటం చేయలేదు. మైదాతో చేసే ఆహార పదార్థాలు అసలే వద్దు. సో.. బర్గర్లు, పిజాలు, సమోసాలు, గప్‌చుప్‌లు, పానీ పూరీలు వంటివాటిన్నీ టాటా చెప్పేయండి. వీటికి బదులుగా కీర, కారెట్, బెల్ పెప్పర్(కాప్సికమ్), బ్రకోలి వంటి సలాడ్స్ తీసుకుని ఆకలి చల్లార్చుకోండి. బెల్ పెప్పర్, బ్రకొలి వంటివాటిని ఉడికించి తీసుకోవాలి. పిల్లలకు కూడా చిప్స్, గిప్స్ కొనడం మానేయండి.
2. ఫ్రైడ్ ఫుడ్ కు నో చెప్పండి
ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఇవి నూనెలో వేగి మీ రోగ నిరోధక శక్తిని కరిగిస్తాయి. వీటితోపాటు అతుక్కుని ఉండే ఉప్పు మీలో రక్తపోటును పెంచుతుంది. సాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండి జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని పాడు చేస్తుంది. ఇది క్రమంగా అల్సర్, డయాబెటీస్, గుండె జబ్బులకు కారణమవుతుంది. అందువల్ల ఫ్రైడ్ ఫుడ్‌కు నో చెప్పండి. రోడ్డుపై దొరికే పకోడా, మిర్చి బజ్జి వంటికి కూడా బై చెప్పండి. నిల్వ పచ్చళ్లను కూడా తరచుగా వాడకండి. వంటల్లో కూడా నిత్యం ఫ్రై కూరలు కాకుండా ఉడికించిన కూరలకే పరిమితమవ్వండి. వీటికి బదులుగా డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వంటివి ట్రై చేయండి.
3. కాండీస్, షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్ కి బైబై చెప్పండి
అప్పుడప్పడు మనకు తియ్యగా తినాలనిపిస్తుంది. అందుబాటులో ఉండే షుగర్ క్యాండీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, పేస్ట్రీస్, కేక్స్ వంటివన్నీ లాగేస్తాం. వీటితోపాటు ప్రాసెస్డ్ ఫుడ్‌లో షుగర్ దండిగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవడమే కాకుండా ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. బరువు పెరగడానికి కారణమవుతుంది. అందువల్ల వీటికి బదులుగా హాయిగా సీజన్‌ను బట్టి రకరకాల తాజా పండ్లు తీసుకుంటే వాటిలో ఉండే తియ్యదనం ఎంజాయ్ చేయొచ్చు. పోషకాలు పుష్కలం. ఇమ్యూనిటీని పెంచడం ఖాయం.
4. కాఫీ పదే పదే తాగుతున్నారా?
కాఫీ రోజుకు ఒకసారో, రెండుసార్లో అయితే పర్వాలేదు. కానీ పదే పదే కాఫీ లాగించేస్తుంటే మాత్రం తక్షణం ఈ అలవాటు మానుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. ఎక్కువ సార్లు కాఫీ తీసుకోవడం వల్ల దీని నుంచి వచ్చే కార్టిసాల్ మన ఇమ్యూనిటీపై దాడిచేస్తుంది. అందువల్ల కెఫైన్ ఉన్న ద్రవాలను తగ్గించేయండి. ప్రత్యామ్నాయంగా జ్యూస్ తాగుతూ ఉండండి. పాలు, మజ్జిగ, టీ.. ఇలా ఇతరత్రా ఇమ్యూనిటీని పెంచేవాటిని ప్రయత్నించండి.
5. కూల్ డ్రింక్, సోడాలను టచ్ చేయకండి
కూల్ డ్రింక్, సోడాలను కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటాం. వీటి ద్వారా శరీరంలోకి అత్యధికంగా కేలరీలు వచ్చి చేరుతాయి. పండ్ల రసాల్లో ఉన్నట్టుగా వీటిల్లో ఫైబర్ ఉండదు. దీంతో క్రమంగా బరువు పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. ఇంకేముంది.. లైఫ్‌స్టయిల్ వ్యాధులన్నీ క్యూ కడతాయి. అందువల్ల పండ్ల రసాలను మాత్రమే తీసుకోండి. ఇమ్యూనిటీ పెంచుకోండి.
6. ఆల్కహాల్‌కు బై చెప్పే సమయం ఇదే..
ఆల్కహాల్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దారుణంగా దాడిచేస్తుంది. గ్యాస్, అల్సర్లకు దారి తీయడమే కాకుండా, అత్యధిక కేలరీలు శరీరంలోకి వచ్చి పడతాయి. కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది. లివర్ సంబంధిత వ్యాధులు దాడి చేస్తాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మొదలవుతాయి.
మహిళలు రోజుకు ఒక డ్రింక్, పురుషులు రోజుకు రెండు డ్రింక్స్ వరకు తీసుకోవచ్చని వైద్యులు చెబుతారు. కానీ అక్కడితో ఆగేవారు వందలో ఒకరో ఇద్దరో.
అందువల్ల ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఇమ్యూనిటీ పెరిగి, ఆరోగ్యంగా ఉండేందుకు, డబ్బులు సేవ్ అయ్యేందుకు ఆస్కారం ఉండగా.. ఆల్కహాల్ ఎందుకు దండగ.
ఈ కథనం మీకు నచ్చితే షేర్ చేయడం మరిచిపోవద్దు.