జవాబు చెప్పు సుశాంత్..!

sushant singh rajput

డియర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఓటమి అనేది మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత్వాన్ని తెస్తుందని చిచోరే మూవీలో చెప్పావ్. మన ప్రయత్నంలో కొన్నిసార్లు ఎదురయ్యే ఓటమి కూడా మనకు ఆనందాన్నిస్తుందని చెప్పావ్. ఓటమి ఎదురయ్యే వరకు మనం మన లక్ష్యాలను చేరుకోవడానికి సాగించే ప్రయాణం చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పావ్.

నిత్యం ఎన్నో ఆలోచనలు నింపుకొని జీవించే మనిషి ఎలా బతకాలో నీ జీవన శైలితో కాస్త అయినా నేర్పావు. నువ్వు కేవలం సినిమాలు తీసే నటుడివే అయ్యుంటే నీకు ఈ ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. కానీ మాకు తెలిసిన నీ జీవన ప్రయాణం ‘అంతకుమించి’..!

కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు వరదలొస్తే కోట్ల కొద్ది డబ్బులిచ్చావ్. ఏముందిలే డబ్బు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు అన్న చందంగా. ఇక్కడ నీ దాతృత్వాన్ని మాకు పరిచయం చేశావ్.

నీ సినీ ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదిగి నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నావ్. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని నీలో ఆవహించుకొని ‘ఎంఎస్ ధోనీ’లో ఒదిగిపోయావ్. అసలు ధోనీనే నిజంగా నటిస్తున్నాడా అనేంతలా మమ్మల్ని కట్టిపడేశావ్.

నువ్వు కనబరిచిన అద్భుత నటనతో వందకు వంద మార్కులు తెచ్చుకొని నీ ప్రతిభను మాకు పరిచయం చేశావ్. నీ మొదటి చిత్రం కాయ్ పో చే మొదలుకొని నిన్నటి చిచోరే వరకు నీ ప్రయాణంతో, నీ పనితో మమ్మల్ని మెప్పించావ్.

నువ్వు ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడి ఉంటే మాకు అంతగా నచ్చకపోయి ఉండేవాడివేమో! కానీ నువ్వు నీ ఆలోచనలను విశ్వం, గ్రహాలు, కాలం, జ్ఞానోదయం, సృష్టి రహస్యాల చుట్టూ తిప్పావు. నువ్వు తిరగడమే కాకుండా మమ్మల్ని కూడా తిప్పావు.

అక్కడితో ఆగావా.. ఈ మధ్య ఖాన్ అకాడమీలో కంప్యూటర్ గేమింగ్ కోడ్ నేర్చుకుంటున్నా అని చెప్పి మళ్లీ నీ విభిన్నతను చాటుకున్నావ్. క్రికెట్, సంగీతం, పైలెట్ అవ్వడానికి నువ్వు తీసుకున్న శిక్షణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘నేర్చుకోనేందుకు’ నువ్వు అడుగుపెట్టని రంగమే లేకుండాపోయింది.

ఒక మనిషి తన జీవితంలో ఎలా బ్రతకాలి, తన లక్ష్యాల వేటలో ఎంత ఆసక్తిగా జీవించాలో మాకు నేర్పావు. అసలు ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకొనే వరకు ఉరుకులు పరుగులు తీసే మాకు వ్యక్తిగత జీవితంలో మన ఆనందాలకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో నేర్పావ్.

స్వయం కృషితో.. నచ్చిన పని చేసుకుంటూ, నచ్చినట్టు బతికావ్. అందుకే ఏమో నువ్వంటే ఇతర హీరోలకంటే కాస్త ఎక్కువ ఇష్టం. నీ Insta అకౌంట్ లో నువ్వు రోజూ ఏ పోస్టు పెడతావు, దేని గురించి మాట్లాడతావో అన్న ఆసక్తి.

నువ్వూ, నీ జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకున్నాం. వాటిలో కొన్నైనా పాటించి మా జీవన ప్రయాణ క్షణాల్ని ఆస్వాదిద్దాం అనుకున్నాం.

జీవితాన్ని ఎంతో భిన్నంగా, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ జీవించిన నువ్వు.. చివరిగా మాకు ఇచ్చిన సందేశం ఏంటి? దీనికి జవాబు చెప్పు సుశాంత్…

Previous articleమూవీ రివ్యూ : అఖుని (axone) : స్నేహం ప్రేమ ద్వేషం
Next articleవెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?