మూవీ : ఫారెస్ట్ గంప్
రేటింగ్ : 4.5/5
విడుదల : 1994
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియోస్
నిడివి : 2 గంటల 20 నిమిషాలు
నటీనటులు : టామ్ హాంక్స్, రాబిన్ రైట్, గారీ సైనైస్, సాలీఫీల్డ్, విలియంసన్
డైరెక్టర్ : రాబర్ట్ జెమెకిస్
బ్యానర్: పారామౌంట్
ఫారెస్ట్ గంప్ హాలివుడ్ టాప్ రేటెడ్ మూవీస్‌లో ఒకటి. ఐఎండీబీ టాప్–250లో 12వ స్థానంలో నిలిచిన సినిమా. ఆరు ఆస్కార్ అవార్డులు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కించుకున్న క్లాసిక్ మూవీ. 1986లో వచ్చిన నవల ఆధారంగా నిర్మించిన ఫారెస్ట్ గంప్ 1994 జూన్ 23న విడుదలై 26 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు దీనిని బాలీవుడ్లో ఆమీర్‌ఖాన్ ‘లాల్ సింగ్ ఛద్దా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కొత్త సినిమాలు విడుదల కావడం లేదనే సినీ ప్రియుల కోసం ఈ పాత క్లాసిక్ సినిమా గురించి పరిచయం చేయాలనే ఈ ప్రయత్నం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఫారెస్ట్ గంప్ మూవీ అందుబాటులో ఉంది.
కథ :
ఫారెస్ట్ గంప్ (టామ్ హాంక్స్) అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన గ్రీన్బో పట్టణవాసి. ఓ బస్ షెల్టర్ వద్ద అపరిచితులతో తన స్వగతాన్ని చెబుతుండడంతో సినిమా మొదలవుతుంది. ఫారెస్ట్ గంప్‌కు వెన్నెముక బలంగా లేకపోవడంతో సరిగ్గా నడవలేకపోతాడు. కాళ్లకు సపోర్ట్‌గా బ్రేసెస్ వాడాల్సి వస్తుంది. దీనికి తోడు తనకు ఐక్యూ లెవెల్స్ తక్కువ.
తన తల్లి అడ్మిషన్ కోసం వెళితే స్కూల్ ప్రిన్సిపల్ నిరాకరిస్తాడు. స్పెషల్ నీడ్స్ చిల్డ్రెన్ చదివే పాఠశాలలో చదివించాలని సూచిస్తాడు. కానీ ఫారెస్ట్ గంప్ తల్లి మాత్రం తన కుమారుడికి కూడా అందరికీ ఉండే అవకాశాలు రావాలని ఆశపడుతూ అందరితోపాటు బాగా చదువుతాడని నమ్ముతుంది.
చివరకు అదే పాఠశాలలో చేరినా గంప్ను సహచర విద్యార్థులు చిన్నచూపు చూస్తారు. గంప్ కూడా కొద్దిగా ఆత్మన్యూనతతో జీవిస్తుంటాడు. కానీ కల్మషం లేనివాడు. బస్సులో పక్కన కూర్చోనివ్వకుండా తోటి విద్యార్థులు నిరాకరిస్తే తన ఇంటికి సమీపంలోనే ఉండే జెన్నీ తన పక్కన కూర్చోమని పిలుస్తుంది. అలా వారి స్నేహం మొదలవుతుంది.
తోటి పిల్లలు ఫారెస్ట్ గంప్ను వేళాకోళం చేస్తూ హింసించే ప్రయత్నం చేస్తుంటే జెన్నీ గంప్ను పరుగెత్తమని అరుస్తుంది. ఈ సమయంలో గంప్ కాళ్లకు ఉన్న బ్రేసెస్ ఊడిపోయి.. సరిగ్గా పరిగెత్తడం వస్తుంది. ఇక అప్పటినుంచి పరుగు ఆపడు. దీనిని తన జీవితంలో జరిగిన అద్భుతంగా చెబుతాడు గంప్.
తరువాత ఫుట్‌బాల్‌లో రాణిస్తాడు. ఆ తరువాత తల్లి తన డెస్టినీని వెతుక్కోమని చెప్పడంతో మిలటరీలో చేరుతాడు. అక్కడ ఇద్దరు స్నేహితులు పరిచయం అవుతారు. పింగ్–పాంగ్ ఛాంపియన్ అవుతాడు. స్నేహితుడి ఆశ మేరకు అతడి మరణానంతరం రొయ్యల వేటలో దిగుతాడు. నిరంతరం జెన్నీ ప్రేమ కోసం పరితపిస్తుంటాడు.
జెన్నీకి కూడా గంప్ అంటే ఇష్టమే. కానీ చిన్నతనంలో తండ్రి నుంచి ఎదురైన చేదు అనుభవాలు జెన్నీ జీవితంపై ప్రభావం చూపుతాయి. జెన్నీతో కలిసి జీవించేందుకు పరితపించే గంప్‌కు తను దగ్గరవుతుందా? ప్రేమంటే నీకు తెలియదని చెప్పిన జెన్నీ గంప్తో కలిసి జీవిస్తుందా? ఈ ప్రశ్నల కోసం సినిమా చూడాల్సిందే.
ఫారెస్ట్ గంప్ .. చెరగని ముద్ర
ఈ సినిమాకు ఒక ప్రత్యేక కథేమీ ఉండదు. ‘లైఫ్ వాజ్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ .. యూ నెవర్ నో.. వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్’ అని తన తల్లి తనతో చెప్పేదని గంప్ తన కథలో గుర్తుచేస్తాడు. సినిమా కథ కూడా గంప్ జీవితం, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. గంప్ తన జీవితంలో ఏది చేస్తున్నా దానిని ప్రేమిస్తాడు. పరుగైనా, యుద్ధమైనా, రొయ్యల వేటైనా.. ఏదైనా సరే. తన జీవితంలో అనేక అవరోధాలు ఉన్నా వాటిని అధిగమించి అమెరికా అధ్యక్షులతో అవార్డులు, ప్రశంసలు పొంది మెప్పిస్తాడు. వార్ హీరోగా నిలుస్తాడు.
జెన్నీ తనను కాదన్నప్పుడు మొదలుపెట్టిన పరుగును మూడేళ్ల వరకు ఆపడు. ఎందుకు పరుగెత్తుతాడో అర్థం కాదు. కానీ గతాన్ని వెనక్కి నెట్టేస్తూ ముందుకు సాగడం తప్ప అంతకుమించి చేయగలిగేదేమీ లేదని చెప్పడమేమో..
గంప్ కథ ఒక అద్భుతమైన అనుభూతి మిగులుస్తుంది. తన ప్రియురాలి జెన్నీతో చివరగా మాట్లాడే మాటలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. సినిమా మొత్తం మన హృదయాలను తాకుతుంది. 1950 నుంచి మూడు దశాబ్దాలపాటు అమెరికా రాజకీయాలు, వాటిపై వ్యంగ్యాత్మక సన్నివేశాలు, వియత్నాంలో యుద్ధం, యుద్దానికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీలు, సాంస్కృతిక పోకడలు అన్నీ ఈ సినిమాలో అంతర్లీనంగా ఉంటాయి.
ఫారెస్ట్ గంప్ గా టామ్ హాంక్స్ అద్భుతంగా నటించాడు. తన నటనకు ఆస్కార్ అవార్డు అందకున్నాడు. అలాగే బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డులు కూడా ఈ సినిమాకు దక్కాయి.
ఈ క్లాసిక్ మూవీని మీరు మిస్ కావొద్దు..
ఇవీ చదవండి