బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్ వెబ్ సిరీస్ రివ్యూ

breath
[yasr_overall_rating null size=”–“]

బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్ .. అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో కొత్తగా రిలీజైన వెబ్‌సిరీస్‌. బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ అభిషేక్‌ బచ్చన్, ఒకప్పుడు తెలుగు తెరపై తన అందం, నటనతో మెరిసిన నిత్యామీనన్‌ నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ భారీ అంచనాల మధ్య జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2018లో ఇదే అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో వచ్చిన బ్రీత్‌ వెబ్‌సిరీస్‌కు కొనసాగింపుగా ఇది తెరకెక్కింది. ఫస్ట్‌ సీజన్‌ను డైరెక్ట్‌ చేసిన మయాంక్‌ శర్మనే ఈ కొత్త సీజన్‌కూ డైరెక్షన్‌ చేశాడు. మరి ఈ లేటెస్ట్‌ సీజన్‌ ఎలా ఉంది? సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా అవకాశాలు లేక కిందా మీదా పడుతున్న స్మాల్‌ బీ అభిషేక్‌ బచ్చన్‌ ఈ బ్రీత్‌తో ఊపిరి పీల్చుకున్నాడా లేదా? డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్పెషల్‌ రివ్యూ చదవండి.

బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్‌.. క్రై మ్‌ థ్రిల్లర్‌

క్రై మ్‌ థ్రిల్లర్‌ కథలతో తెరకెక్కిన చాలా వెబ్‌సిరీస్‌లు మంచి సక్సెస్‌ సాధించాయి. క్రై మ్‌కు కాస్త సస్పెన్స్‌ను జోడించి కొన్ని ఎపిసోడ్లు లాగడం వెబ్‌సిరీస్‌ డైరెక్టర్లకు ఓ అలవాటుగా మారిపోయింది. ఆ లెక్కన ఈ లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్‌ కూడా అదే కోవకు చెందుతుంది. ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 45 నిమిషాలు. మొత్తం 12 ఎపిసోడ్లు. రెండు కిడ్నాప్‌లు, మూడు మర్డర్లు, కాస్త సస్పెన్స్, అర్థం లేని లాజిక్కులు, గంటల పాటు సాగతీత.. సింపుల్‌గా చెప్పాలంటే బ్రీత్‌ : ఇన్‌టు ద షాడోస్‌ ఇంతే.

బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్ కథ

సరే.. ఈ షాడోస్‌ కథలోకి వెళ్లే ముందు ఒకసారి అంతకుముందు వచ్చిన బ్రీత్‌ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. 2018లో వచ్చిన ఈ బ్రీత్‌ వెబ్‌సిరీస్‌లో స్టార్‌ హీరో మాధవన్‌ నటించాడు. అప్పటికి మన ఇండియన్‌ ఆడియెన్స్‌ ఇంకా అంతగా ఈ వెబ్‌సిరీస్‌ కాన్పెప్ట్‌కు అలవాటు పడలేదు. అలాంటి సమయంలో ఓ కొత్త క్రై మ్‌ కథతో ఈ వెబ్‌సిరీస్‌ తెరకెక్కింది.

ప్రాణాంతకమైన జబ్బుతో పోరాడుతున్న తన కొడుకును కాపాడుకునేందుకు ఆరాటపడే పాత్రలో మాధవన్‌ కనిపించాడు. సిస్టిక్‌ ఫిబ్రోసిస్‌తో బాధపడుతున్న కొడుకును కాపాడుకునేందుకు మిగిలింది కేవలం ఆరు నెలల సమయం. అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ కావడంతో దాతలు దొరకడం కష్టమవుతుంది. పైగా అతని కంటే ముందు ఉన్న వాళ్లందరినీ దాటుకొని వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకుకు సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలంటే దాతలను చంపుకుంటూ వెళ్లడం తప్ప అతనికి మరో మార్గం కనిపించదు. కన్న కొడుకును కాపాడుకునేందుకు ఓ తండ్రి ఎంత వరకూ వెళ్లగలడు అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ బ్రీత్‌ వెబ్‌సిరీస్‌ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అదే కాన్సెప్ట్‌.. కాస్త ట్విస్ట్‌

ఇక ఇప్పుడు బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్‌ స్టోరీకి వద్దాం. ఈ సిరీస్‌ కూడా మొదటి నాలుగు ఎపిసోడ్లు చూస్తే బ్రీత్‌ చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. కిడ్నాప్‌కు గురైన తన కూతురిని కాపాడుకోవడం కోసం హత్యలు చేయడానికి కూడా వెనుకాడని తల్లిదండ్రులను మనం ఇందులో చూస్తాం. సిరీస్‌ తొలి ఎపిసోడ్‌లోనే రెండు కిడ్నాప్‌లు జరుగుతాయి.

ఒకటి ఓ మెడికల్‌ స్టూడెంట్‌ కిడ్నాప్‌ కాగా.. మరొకటి ఆరేళ్ల పాప సియా కిడ్నాప్‌. ఓ ముసుగు వేసుకున్న వ్యక్తి వీళ్లను కిడ్నాప్‌ చేస్తాడు. కిడ్నాప్‌కు గురైన ఆ పాప తల్లిదండ్రులుగా అభిషేక్‌ బచ్చన్‌ (అవినాశ్‌), నిత్యామీనన్‌ (అభా) నటించారు. అవినాశ్‌ ఓ సైకియాట్రిస్ట్‌ కాగా.. అభా ఓ స్టార్‌ హోట్‌లో చెఫ్‌. పాప కిడ్నాపై నెలలు గడుస్తున్నా.. పోలీసులు మాత్రం కేసును ఛేదించలేకపోతారు.

విచిత్రంగా 9 నెలల తర్వాత కిడ్నాపర్‌ నుంచే ఓ పార్శిల్‌ అందుకుంటారు అవినాశ్, అభా. మీ పాపను ఏడుపు మాన్పించడానికే మూడు నెలలు పట్టింది.. అందుకే ఇంత లేటైంది అన్నట్లుగా కిడ్నాపర్‌తో ఓ జస్టిఫికేషన్‌ ఇప్పిచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌.

ఇక ఆ పార్శిల్‌ విషయానికి వస్తే.. ఓ ఐప్యాడ్‌.. అందులో సదరు మెడికల్‌ స్టూడెంట్, పాప సియాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్‌. ఇన్ని నెలలుగా వాళ్లు ఏం చేస్తున్నారో ఫాస్ట్‌ ఫార్వర్డ్‌లో కిడ్నాపర్‌ చూపిస్తాడు. చివర్లో పాపను సేఫ్‌గా విడిచి పెట్టాలంటే ఒకడిని చంపాలని చెబుతాడు. అతని వివరాలతోపాటు ఎలా చంపాలో కూడా వివరిస్తాడు. అతనికి కాస్త కోపం ఎక్కువ అని, కోపంతోనే అతడు చావాలనీ చెబుతాడు.

పాపను కాపాడుకోవడం కోసం ఈ హత్యలేంటి అనుకొని ఒక దశలో పోలీసుల దగ్గరికి వెళ్లడానికి సిద్ధమైన వాళ్లు.. తర్వాత హత్య చేయడానికే మొగ్గు చూపుతారు. పక్కా ప్లాన్‌తో కిడ్నాపర్‌ చెప్పిన వ్యక్తిని చంపేస్తాడు అవినాశ్‌. కానీ ఈ ఒక్క హత్యతో ఇది ముగిసిపోయేది కాదని వాళ్లకు తర్వాత తెలుస్తుంది. తర్వాత ఇలాగే మరో వ్యక్తిని చంపాలంటూ కిడ్నాపర్‌ ఇంకో ఐప్యాడ్‌లో మరో వీడియోతో పార్శిల్‌ పంపిస్తాడు. దీంతో చేసేది లేక ఆ హత్యకూ సిద్ధమవుతారు వాళ్లు.

ట్విస్ట్‌ కాని ట్విస్ట్‌

అయితే 12 భారీ ఎపిసోడ్ల ఈ వెబ్‌సిరీస్‌లో ఐదో ఎపిసోడ్‌లోనే ఓ కీలకమైన ట్విస్ట్‌ను డైరెక్టర్‌ ప్రేక్షకుల ముందు పెట్టేస్తాడు. ఆ కిడ్నాపర్‌ ఎవరో తేలిపోతుంది. ఇక ఆ తర్వాత ఏడు ఎపిసోడ్లు ఆ కిడ్నాపర్‌ ఆ హత్యలు ఎందుకు చేయిస్తున్నాడు అన్న జస్టిఫికేషన్‌ ఇవ్వడానికే సరిపోతుంది. ఇక్కడే అర్థం లేని లాజిక్కులు, సాగదీసే ఇన్వెస్టిగేషన్‌తో కథ మొత్తం గాడి తప్పుతుంది.

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి చూసి బోర్‌ కొట్టిన మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ కాన్సెప్ట్‌నే డైరెక్టర్‌ మయాంక్‌ శర్మ ఇందులోనూ వాడుకున్నాడు. ఆ స్ప్లిట్‌ పర్సనాలిటీకే కాస్త భారత పురాణాల టచ్‌ ఇచ్చే ప్రయత్నమూ చేశాడు. రావణుడు, అతడి పది తలలు, ఒక్కో తలకు ఉన్న ప్రాముఖ్యత, వాటి ఆధారంగానే హత్యలు చేయాలని కిడ్నాపర్‌ డిమాండ్‌ చేయడం.. ఇలా సాగిపోతుంది.

కోపం, కామం, భయం, మోహం.. ఇలా పది తలలకూ ఉన్న విశిష్టతలను చెబుతూ.. వీటి ఆధారంగా ఒక్కొక్కరినీ హత్య చేయాలని కిడ్నాపర్‌ చెబుతుంటాడు. తమ పాపను కాపాడుకోవడం కోసం అవినాశ్, అభా అలా హత్యలు చేస్తూ వెళ్తారు. అప్పుడెప్పుడో 25 ఏళ్ల కిందట హాలీవుడ్‌లో వచ్చిన సెవెన్‌ మూవీ కాన్సెప్ట్‌ ఇది.

తొలి సీజన్‌లో ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌గా కనిపించిన కబీర్‌ సావంత్‌ (అమిత్‌ సాధ్‌) ఈ లేటెస్ట్‌ సీజన్‌లోనూ ఈ హత్యల మిస్టరీని ఛేదించే పనిలో ఉంటాడు. హత్యలు చేసే అవినాశే ఆ హత్యల ఇన్వెస్టిగేషన్‌లో ఎలా పాల్గొంటాడు? అసలు ఆ కిడ్నాపర్‌ ఎందుకు ఈ హత్యలు చేయిస్తాడు? ఈ మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌కూ స్టోరీకి ఉన్న కీలకమైన లింకు ఏంటి అన్నది వెబ్‌సిరీస్‌ చూస్తే తెలుస్తుంది.

ఎందుకంటే అసలు క్రై మ్‌ థ్రిల్లర్‌ స్టోరీలకు సస్పెన్సే మూలం. కీలకమైన ఆ సస్పెన్స్‌నే ఇక్కడ చెప్పేస్తే ఇక అది చూసినా ప్రయోజనం ఉండదు. ఇంతకుముందు చెప్పినట్లు రెండు కిడ్నాప్‌లు, మూడు మర్డర్లు, కొన్ని ట్విస్ట్‌లు.. ఇదే బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్‌ స్టోరీ. ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కరోనా కాలంలో, థియేటర్లు, కొత్త సినిమాలు ఎలాగూ లేవు. చేతిలో చాలా ఖాళీ సమయం ఉందీ అనుకుంటే.. ఓ ఆరేడు గంటలు కూర్చొని ఈ వెబ్‌ సిరీస్‌ చూసేయండి.

యాక్టింగ్‌.. ఓకే

నాన్న స్టార్‌ హీరో. బాలీవుడ్‌ షెహన్‌ షా. కానీ సిల్వర్‌ స్క్రీన్‌పై అభిషేక్‌ బచ్చన్‌కు అవేమీ కలిసి రాలేదు. తెరంగేట్రం చేసిన 20 ఏళ్లలో ఈ స్మాల్‌ బీకి చెప్పుకోవడానికి పెద్దగా విజయాలేమీ లేవు. దీంతో తొలిసారి ఇలా డిజిటల్‌ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశాడు. పెద్ద స్టార్‌ కావడం వల్లో మరేంటోగానీ డైరెక్టర్‌ మయాంక్‌ శర్మ కూడా కథ మొత్తం అభిషేక్‌ బచ్చన్‌ చుట్టూ తిప్పాడు. అభిషేక్‌ కూడా పర్వాలేదనిపించాడు. ఈ వెబ్‌సిరీస్‌తో ఓ కొత్త క్యారెక్టర్‌లో కనిపించే అవకాశం అతనికి దక్కింది. నటనపరంగా తనను తాను అభిషేక్‌ ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక అతని భార్య పాత్రలో నిత్యామీనన్, ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా అమిత్‌ సాధ్‌ కూడా బాగానే నటించారు.

బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్‌.. రేటింగ్‌

నిజానికి ఈ వెబ్‌సిరీస్‌పై చాలా మంది రీవ్యూయర్లు పెదవి విరిచారు. దేశ, విదేశాల్లో ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు కూడా 2 నుంచి 3 స్టార్‌ రేటింగ్స్‌ మాత్రమే ఇచ్చాయి. అయితే ప్రేక్షకుల రేటింగ్‌కు ప్రామాణికమైన ఐఎండీబీలో మాత్రం బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్ కు మంచి రేటింగే వచ్చింది. పదికి గాను 8.2 రేటింగ్‌ రావడం విశేషం. ఆ లెక్కన ఈ క్రై మ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులకు బాగానే నచ్చిందని చెప్పొచ్చు.

వెబ్‌ సిరీస్‌ : బ్రీత్‌ : ఇన్‌టు ది షాడోస్
రేటింగ్ : 3/5
నటీనటులు: అభిషేక్‌ బచ్చన్, నిత్యామీనన్, అమిత్‌ సాథ్, ఇవానా కౌర్,
డైరెక్టర్‌: మయాంక్‌ శర్మ
ప్రొడక్షన్‌: అమెజాన్‌ స్టూడియోస్‌

ఇవీ చదవండి: 

  1. ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ రివ్యూ
  2. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్

Previous articleపైలెట్ వెంట 30 మంది ఎమ్మెల్యేలు
Next articleబుక్ రివ్యూ : దోసిట చినుకులు బై ప్రకాష్ రాజ్