మూవీ రివ్యూ : రాత్ అకేలీ హై

raat akeli hai
Image Source: Instagram, Netflix
[yasr_overall_rating null size=”small”]

మూవీ రివ్యూ : రాత్ అకేలీ హై (ఒంటరి రాత్రి)
రేటింగ్ : 3.5/5
నటీనటులు:  నవాజుద్దీన్ సిద్దీఖీ, రాధికా ఆప్టే, ఖాలిద్, త్యాబ్‌జీ శ్వేతా త్రిపాఠీ, తిగ్మంషు దులియా, జ్ఞానేంద్ర త్రిపాఠీ, అభిషేక్ శ్రీవాస్తవ, నితేష్ కుమార్
దర్శకత్వం: హనీ త్రెహాన్
నిర్మాతలు: అభిషేక్ చౌబే, రానీస్క్రూవాలా
ప్లాట్ ఫాం: నెట్ ఫ్లిక్స్

రాత్ అకేలీ హై

సస్పెన్స్, థ్రిల్లర్ మూవీలు అనగానే హెవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో భారీ సీక్వెన్సులతో వచ్చిన సినిమాలే ఇండియాలో ఎక్కువ. ఇప్పుడిప్పుడే వాటిలో మార్పు వస్తోంది.  మర్డర్ మిస్టరీల్లో ఎవరు నేరస్థుడో సినిమా ప్రారంభమైనప్పటి నుంచి  సగటు ప్రేక్షకుడు గెస్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ నేరస్థుడు ఎవరో  సులువుగా అర్థమైపోయినా లేకపోతే స్టోరీ కన్విన్సింగ్‌గా ఉండకపోయినా నిరుత్సాహపడతాడు సగటు సినీ ప్రియుడు. దానికి పాస్ మార్కులు కూడా వేయడు.  కానీ చివరిదాకా ఉత్కంఠ, ఆసక్తి ఉండేలా చేస్తే మాత్రం కచ్చితంగా ఆ సినిమాను మెచ్చుకుంటాడు. అటుంవటి చిత్రమే రాత్ అకేలీ హై.. అంటే ఒంటరి రాత్రి. 

కథ :

అర్ధరాత్రి ఓ కారులో వెళ్తున్న మహిళను, డ్రైవర్‌ను లారీతో గుద్ది చంపేసే మొదటి సన్నివేశంతోటే ఏదో జరుగుతోందన్న భావన కల్పిస్తాడు దర్శకుడు.

కట్ చేస్తే..

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లోని సంపన్నుడు రఘుబీర్ సింగ్ (ఖాలిద్ త్యాబ్‌జీ) పాతికేళ్ల వయస్సున్న రాధ(రాధికా ఆప్టే)ను రెండో పెళ్లి చేసుకుంటాడు. అదే రాత్రి తన హవేలీ (కోట లాంటి ఇల్లు) లోనే హత్యకు గురవుతాడు. కేసు దర్యాప్తు చేసేందుకు ఇన్స్‌ పెక్టర్ జటిల్ యాదవ్ (నవాజుద్దీన్ సిద్దీఖీ)  హవేలీకి వస్తాడు.  

రఘుబీర్ సింగ్ బావమరిది, కూతురు-అల్లుడు, కుమారుడు, వాళ్లతోపాటు తమ్ముడి భార్య, ఆమె కుమారుడు, కూతురు అదే ఇంట్లో ఉంటారు. రెండో పెళ్లి చేసుకున్న రాధను పెళ్లికి ముందునుంచే కొంతకాలంగా అదే ఇంట్లో ఉంచుతాడు రఘుబీర్ సింగ్. స్థానిక ఎమ్మెల్యే మున్నారాజా (అభిషేక్ శ్రీవాస్తవ) రఘుబీర్ కుటంబానికి అత్యంత సన్నిహితుడు.

లంక అంత ఇల్లు, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు. ఇంట్లో వాళ్లే హత్య చేసే అవకాశాలు ఎక్కువ. బయటి వారి చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ బయటివాళ్ల సాయంతో లోపలి వ్యక్తులు రఘుబీర్‌ను చంపేసి ఉండొచ్చని జటిల్ యాదవ్‌కి అనుమానాలు మొదలవుతాయి.

రఘబీర్ రెండో వివాహం చేసుకున్న రాధ ఐదేళ్ల క్రితమే జటిల్ యాదవ్‌కి తెలుసు. ఇన్స్ పెక్టర్ కి అంతర్గతంగా ఆమెపై సానుభూతి కూడా ఉంటుంది. దర్యాప్తు  మొదలు పెట్టిన తర్వాత రఘుబీర్ రెండో పెళ్లి చేసుకున్న రాధకి.. రఘుబీర్ తమ్ముడి కొడుకు విక్రమ్ కు సంబంధం ఉన్నట్లు కనిపెడతాడు.

మామ చావుతో ఆస్తిపై హక్కు నాదే అంటాడు అల్లుడు. తండ్రి మరణంపై పెద్దగా బాధపడని కొడుకు.. ఏం జరుగుతుందో వివరాలు బయటికి చెప్పని రఘుబీర్ తమ్ముడి భార్య, కూతురు.. రఘబీర్ పట్ల అసంతృప్తితో ఉన్న స్నేహితుడైన స్థానిక ఎమ్మెల్యే మున్నా రాజా.

ఇలా  జటిల్ యాదవ్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఒక్కో చిక్కు ముడి పెరుగుతుంటుంది. సినిమా చూస్తున్నతంసేపు ప్రేక్షకుడు నేరస్థుడు ఎవరై ఉంటారో అన్న ఆలోచన అనుమానం అందరి మీద కలిగేవిధంగా చిన్న చిన్న క్లూ ఇస్తూ కథను నడిపించడంలో సఫలమయ్యారు రైటర్ శ్వేతా సింగ్.  

రాధతో సహా ప్రతీ పాత్రపై పై అనుమానం కలుగుతుంది. హవేలీలో పనమ్మాయిని ఇన్ఫార్మర్ గా మార్చుకుంటాడు ఇన్స్ పెక్టర్. ఆ అమ్మాయిని కూడా ఎవరో హత్య చేస్తారు. దాంతో జటిల్ దర్యాప్తును ఇంకా వేగవంతం చేస్తాడు. హవేలీ బయటి నుంచి ఒక్కో క్లూను సేకరిస్తూ ముందుకు సాగుతాడు. చివరికి హంతకుల్ని కనిపెడతాడు. 

రాత్ అకేలీ హై మెప్పించిందా?

అర్థం లేని లాజిక్‌ కంటే సాధారణమైన అంశాలతోటే సినిమాపై ఆసక్తి కొనసాగేలా చెయ్యడంలో విజయం సాధించాడు దర్శకుడు. కమర్షియల్ సినిమాల్లో ఉండే భారీ డైలాగులు, ఛేజింగ్‌లు, ఫైటింగులు ఇందులో కనిపించవు. కానీ ఒక్కో చోట కథ కొంచెం నెమ్మదిగా నడుస్తోంది అనిపించినా నేరస్ధుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన ప్రేక్షకుడికి విసుగు కలిగించదు. 

కానీ ఐదేళ్ల క్రితం పరిచయమున్న అమ్మాయి.. రఘుబీర్ హత్యలోని నిందితురాల్లో ఒకరైన రాధికపై తనకున్న జాలి చివరివరకు కొనసాగడం పూర్తిగా కన్విన్సింగ్ గా లేదు. ఒక ఇంట్లో దాదాపు పది మంది మనుషులు, అందులో ఒకరి హత్య, హంతకుడెవరో చివరిదాకా తెలియకపోవడమనే కాన్సెప్ట్ తో హాలీవుడ్‌లో చాలా చిత్రాలే వచ్చాయి. అటువంటి భారతీయ చిత్రాలు తక్కువనే చెప్పాలి. వాటిలోనూ విజయం సాధించినవి ఇంకా తక్కువ.

రాత్ అకేలీ హై ఆ కోవకే చెందుతుంది. నవాజుద్దీన్ సిద్దీఖీకి సమానంగా మిగిలిన ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఒంటరి రాత్రి వావ్ సూపర్బ్ అనిపించకోపోయినా కచ్చితంగా నిరుత్సాహపరచదు.

Previous articleమూవీ రివ్యూ : ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
Next articleహైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢిల్లీ తరహాలో కుప్పకూలనుందా?