గుంజన్ సక్సేనా : నేను మిమ్మల్ని ఎప్పుడూ ఓడిపోనివ్వను డాడీ

gunjan saxena
Image Source: Netflix

గుంజన్‌ సక్సేనా ది కార్గిల్‌ గర్ల్‌ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా విడుదలవబోతున్న ఓ యథార్థ గాథ ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఈ బుధవారం ఆగస్టు 12న విడుదల కానుంది.

భారత వాయుసేనలో తొలి మహిళా కంబాట్‌ పైలట్‌గా చరిత్రకు ఎక్కిన గుంజన్‌ సక్సేనా యథార్థ గాథ. ఒక స్ఫూర్తిదాయకమైన కథ. భావోద్వేగాలతో ముడివడిన కథ. సాహసాలకు, సామాజిక నేపథ్యాలకు ఈ సినిమాలో కొదవేలేదు. ఇక ఉత్కంట రేకెత్తించే యుద్ధ సన్నివేశాలు ఉండనే ఉంటాయి.

1994లో గుంజన్‌ సక్సేనా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో జాయినయ్యారు. 1999 కార్గిల్‌ వార్‌లో పాల్గొన్నారు. శౌర్య చక్ర అవార్డు అందుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కారు. కార్గిల్‌ వార్‌లో పాల్గొన్న ఏకైక మహిళ గుంజన్‌ సక్సేనా. యుద్ధంలో పాల్గొన్న తొలి మహిళా పైలట్‌ కూడా ఈమె.

కార్గిల్‌ యుద్ధంలో గాయపడిన సైనికులను తరలించడం, వారికి నిత్యావసరాలను చేరవేయడం, నిఘా బృందానికి తోడ్పడడం వంటి కీలక పాత్ర పోషించింది గుంజన్‌ సక్సేనా. ఏడెళ్లపాటు ఆమె పైలట్‌గా పనిచేశారు. ఆమె కెరీర్‌ హెలికాప్టర్‌ పైలట్‌గానే ముగిసింది. ఎందుకంటే అప్పుడు మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌ లేదు.

చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కల గన్న గుంజన్ సక్సేనా

గుంజన్‌ లక్నోలో ఓ ఆర్మీ కుటుంబంలో పుట్టింది. తండ్రి లెఫ్టినెంట్‌ కల్నల్‌. అన్నయ్య కూడా ఆర్మీలో పనిచేశారు. గుంజన్‌కు చిన్నప్పటి నుంచే పైలట్‌ కావాలని ఆశగా ఉండేది. ఢిల్లీ యూనివర్శిటీలో చదివిన గుంజన్‌ సక్సేనా ఢిల్లీ ఫ్లయింగ్‌ క్లబ్‌లో చే రుతుంది. 1994లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన 25 మంది మహిళల బృందంలో గుంజన్‌ ఒకరు.

గుంజన్‌తోపాటు ఈ బృందంలోని ఆరుగురు యుద్ధ భూమిలో పనిచేసేందుకు శిక్షణ పొందుతారు. గుంజన్‌ తొలి పోస్టింగ్‌ ఉదంపూర్‌లో వస్తుంది. 132 ఫార్వార్డ్‌ ఏరియా కంట్రోల్‌ లో పనిచేస్తుంది. అయితే వాయు సేనలో అప్పటివరకు మహిళలు లేకపోవడం.. మహిళలకు సంబంధించి ఎలాంటి వసతులు లేకపోవడంతో గుంజన్‌ కొన్ని ఇబ్బందులు పడుతుంది.

కనీసం బట్టలు మార్చుకునే సౌకర్యం కూడా ఉండదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో గుంజన్‌ కశ్మీర్‌లో పనిచేస్తుంది. డ్రాస్, బటాలిక్‌ ప్రాంతాలోని ట్రూప్స్‌కు గుంజన్‌సాయపడుతుంది. గాయపడిన వారిని తరలించడం, వారికి నిత్యావసరాలను సమకూర్చడం చేస్తుంది. శత్రువుల కదలికలను గుర్తించడం చేస్తుంది.

గుంజన్‌ నిజ జీవిత కథ ఆధారంగా ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ అదరగొట్టింది. ట్రైలర్‌లోనే తన నటనతో ఆకట్టుకుంది. పైలట్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలలు గన్న గుంజన్‌ సక్సేనా.. ఎయిర్‌ ఫోర్స్‌ నుంచి తండ్రికి ఫోన్‌ చేసి ‘మిమ్మల్ని ఓడిపోనివ్వను డాడీ..’ అంటూ చెప్పే సన్నివేశం ట్రైలర్‌లో ఆకట్టుకుంటుంది. గుంజన్‌ తండ్రిగా పంకజ్‌ త్రిపాఠి, సోదరుడిగా అంగద్‌ బేడీ నటించారు.

లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలైన తరుణంలో తొలుత అమెజాన్ ప్రైమ్ ముందంజలో ఉన్నట్టు కనిపించినా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ దూసుకెళుతోంది. చాలా కొత్త సినిమాలను విడుదల చేస్తోంది.

Previous articleహైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢిల్లీ తరహాలో కుప్పకూలనుందా?
Next articleDrop shipping business: డ్రాప్‌ షిప్పింగ్‌ .. తక్కువ పెట్టుబడితో ఆన్‌లైన్‌‌ బిజినెస్‌