వైట్ టైగర్ కొన్ని తరాలకు ఒక్కసారి మాత్రమే జన్మిస్తుంది. అంటే పదివేల పులులు పుడితే అందులో ఒక్కటి మాత్రమే తెల్లగా పుడుతుంది, అత్యంత అరుదు. అలాంటి అరుదైన యువకుడి కథే ది వైట్ టైగర్. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ లేటెస్ట్ మూవీ ది వైట్ టైగర్ నవల ఆధారంగా తెరకెక్కించారు. భారత్‌లో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ, మత పట్టింపులు, ఉన్నవారికీ లేని వారికి మధ్య ఉన్న ఆకాశమంత వ్యత్యాసం, దరిద్రంలోంచి బయటికొచ్చేందుకు కష్టపడి పనిచేస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరును పచ్చిగానే చెప్తారు ది వైట్ టైగర్ పుస్తకంలో.
2008లో ఇండో ఆస్ట్రేలియన్ రైటర్ అరవింద్ అడిగా రాసిన పుస్తకానికి మాన్ బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. వెనుకబడిన వర్గాలకు చెందిన అణచివేతకు గురైన వ్యక్తులకు గొంతుక ఇవ్వాలన్నదే నా తాపత్రయమని అరవింద్ అడిగా అన్నారు. ఆ పుస్తకం రాసే సమయానికి ఆయనకు 33 ఏళ్లు. ఆ పుస్తకం ఆధారంగా తీసిన చిత్రంలోనూ అంతే పచ్చిగా వాస్తవాల్ని చూపించారు.
ది వైట్ టైగర్ కథ :
బెంగళూరులో ది వైట్ టైగర్ డ్రైవర్స్ కంపెనీ యజమాని అశోక్ శర్మ. 2010లో అప్పటి చైనా ప్రధాని భారత్ పర్యటనకు వస్తారు. ఆయన్ను కలిసేందుకు మెయిల్ చేస్తాడు అశోక్ శర్మ. భారత్ పరిస్థితులు, ఇక్కడున్న అవకాశాలు, కులాలు, మతాలు, ఆర్థిక అసమానతల గురించి చెప్తానంటాడు. తన కథ పూర్తిగా వినకుండా ఓ నిర్ణయానికి రావొద్దంటాడు.
ఉత్తర భారతంలోని ఓ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన అబ్బాయి బలరాం హల్వాయి. స్వీట్లు తయారు చేసే వారిని హల్వాయి అంటారు ఉత్తర భారతంలో. అది కూడా ఓ కులాన్ని రెప్రజెంట్ చేస్తుంది. అసలే పేదరికం.. ఆ పైన అగ్రకుల భూస్వాములు వారి కష్టాన్ని దోచుకుంటూ ఉంటారు. వీటన్నింటినీ చూస్తూ పెరిగిన బలరాం మంచి జీవితం రాకపోదా అని ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు.
చిన్నప్పటి నుండి తమను దోచుకుంటున్న జమీందార్ కుమారుడు అమెరికాలో చదువుకొని సొంత రాష్ట్రం జార్ఖండ్ కు వస్తాడు. అది చూసిన బలరాం తన భవిష్యత్తును మార్చుకునే అవకాశం వచ్చిందని భావిస్తాడు. ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకొని సిటీలో భూస్వామి ఇంటికి వెళ్లాలనుకుంటాడు. ఇంటి పెద్ద అయిన తన నానమ్మకు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపించి డ్రైవింగ్ నేర్చుకొని సిటీలోని భూస్వామి ఇంటికి వెళ్తాడు.
భూస్వామిని కలిసి తాను డ్రైవర్‌గా పనిలో చేరతానని కాళ్లు మొక్కుతాడు. అప్పుడు జమీందార్ అడిగే మొదటి ప్రశ్న నీది ఏ కులం?.. బలరాం హల్వాయి అని బదులిస్తాడు. ఊళ్లో ఉన్న తన మనుషులకు ఫోన్ చేయించి బలరాం కుటుంబం గురించి వాకబు చేయిస్తాడు. అంటే ఇక్కడ పనిలో ఏమైనా తేడా వస్తే కుటుంబానికి హాని జరుగుతుందన్న భయం పనివాళ్లలో ఉంటుంది.
అప్పటికే డ్రైవర్‌గా పనిచేస్తోన్న ఇంకో వ్యక్తి గదిలో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. జమీందార్ కుమారుడు అశోక్ అమెరికాలో క్రిస్టియన్ అమ్మాయి పింకీని పెళ్లి చేసుకుంటాడు. జమీందార్ ఆ పెళ్లికి ఒప్పుకోడు. అయినా ఇద్దరూ ఒక్కటవుతారు. భారత్‌లో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటాడు అశోక్. బెంగళూర్ అంటే తనకిష్టం.తన యజమాని అశోక్ జీవనశైలిని గమనిస్తూ ఉంటాడు బలరాం. జమీందార్కు ముస్లింని డ్రైవర్‌గా పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు.
మొదటి డ్రైవర్ ముస్లిం అయినా హిందువని చెప్పుకొని డ్రైవింగ్ చేయడాన్ని పసిగట్టిన బలరాం తనని బ్లాక్ మెయిల్ చేసి ఇంట్లోంచి పంపించేస్తాడు. అప్పుడు తనే అశోక్ కు ప్రధాన డ్రైవర్ గా మారతాడు. అశోక్ అతని భార్య పింకీ బలరాం పట్ల అభిమానంగానే ఉంటారు. పింకీ న్యూయార్క్ లో పెరిగింది. కులవివక్షకు వ్యతిరేకం. కానీ భారత్‌లో ముఖ్యంగా జమీందార్ అయిన తన మామ ఇంట్లో ఆమె మాటల్ని ఎవరూ పట్టించుకోరు.
జమీందార్‌ను తన పనితో సంతృప్తి పరిచేందుకు ఎంత కష్టపడినా అతని పట్ల చాలా హీనంగా వ్యవహరిస్తుంటారు. అశోక్, పింకీ ఏమీ అనరు. జార్ఖండ్‌లో ఓ పెద్ద ‘’సోషలిస్ట్’ నేత లంచం ఎక్కువగా అడగడంతో నేరుగా దిల్లీ వెళ్లి ప్రతిపక్షానికి డబ్బులిచ్చి తన బిజినెస్ కు మార్గం సులువుగా చేసుకోవాలనుకుంటాడు అశోక్.
ఆలోచనలను మార్చేసిన సంఘటనలు
అశోక్, పింకీ దిల్లీ వెళ్తారు. బలరాం డ్రైవింగ్ చేస్తాడు. దిల్లీలో ఎత్తైన బిల్డింగ్‌లను చూసి మురిసిపోతాడు బలరాం. యజమానాలు ఆకాశహర్మ్యాల్లో ఉంటే వాటి కింది కట్టిన చీకటి గదుల్లో డ్రైవర్లు ఉంటారు.
పింకీ బర్త్ డే రోజున పార్టీ నుంచి వచ్చేటప్పుడు తానే డ్రైవింగ్ చేస్తానని పట్టుపడుతుంది. తాగిన మైకంలో రాష్ గా డ్రైవ్ చేస్తూ ఓ చిన్నారిని గుద్దేస్తుంది. బలరాం వాహనాన్ని ఇంటికి తీసుకొచ్చి దానికంటిన రక్తాన్ని తూడ్చేస్తాడు.
మరోసటి రోజు ఉదయాన్నే జమీందార్, దిల్లీలోని ఫ్లాట్‌లో ప్రత్యక్షమవుతాడు. బలరాంతో ప్రేమగా మాట్లాడతాడు. జమీందార్ పక్కనే లాయర్ ఉంటాడు. ఓ డాక్యుమెంట్ ఇచ్చి చదివి దానిపై సంతకం పెట్టమని అడుగుతారు. అది చదివితే కానీ బలరాంకి అర్థం కాదు, అది కన్ఫెషన్ స్టేట్మెంట్ అని. సంతకం పెట్టేంతవరకు ప్రేమతో మాట్లాడిన జమీందార్ సంతకం పెట్టగానే యథాతథంగా బూతులు తిట్టడం ప్రారంభిస్తాడు. కాలితో తంతాడు. దాంతో కోపం వచ్చిన పింకీ వారిస్తుంది. అశోక్-పింకీకి గొడవ అవుతుంది. పింకీ అశోక్‌కు చెప్పకుండా న్యూయార్క్ వెళ్లిపోతుంది. జమీందార్ సొంతూరికి వెళ్లిపోతాడు.
అశోక్ ఆ బాధలో తాగుబోతుగా మారతాడు. బలరాం మరోసారి యజమానిని కాపాడాతాడు. అతన్ని తాగుడు నుంచి బయటకు తీసుకొస్తాడు. అశోక్ మళ్లీ తన వ్యాపార ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అందుకోసం రాజకీయ నేతల్ని కలిసి లంచాలు ఇస్తుంటాడు.
క్రమంగా బలరాంను పనిలోంచి తీసేసి ఇంకొకర్ని పెట్టుకోవాలని చూస్తుంటాడు అశోక్. ఆవిషయం అర్థమైన బలరాంకి విపరీతమైన కోపం వస్తుంది. యజమాని మెప్పు పొందేందుకు పడ్డ కష్టం, పడిన తిట్లు, తిన్న తన్నులు, ఛీత్కారాలకు తనకు ఇచ్చే విలువ ఇంతేనా అన్న బాధ కోపం రూపంలో మారుతుంది. ఎన్ని చేసినా ఆఖరికి తనల్ని చెత్తను బయటపడేసినట్లు పడేస్తున్నారన్న బాధతో రగిలిపోతాడు.
అశోక్ డబ్బులున్న బ్యాగుతో ఓ నేతను కలిసేందుకు వెళ్తున్న సమయంలో దారి మధ్యలో సీసాతో పొడిచి డబ్బుతో పారిపోతాడు. తన యజమాని అశోక్ నోటి నుంచి చాలా సార్లు విని తెలియకుండానే ఇష్టం పెచుకున్న బెంగళూరుకి.
అక్కడికి వెళ్లి బలరాం కాస్తా అశోక్ శర్మ అవుతాడు. ది వైట్ టైగర్ డ్రైవర్స్ అనే వెహికిల్ సర్వీస్ కంపెనీ పెడతాడు. తన యజమాని డ్రైవర్ల పట్ల వ్యవహించినట్లుగా కాకుండా డ్రైవర్ల పట్ల బాధ్యాతాయుతంగా ఉంటాడు. బెంగళూరుకి వచ్చిన కొత్తలో న్యూస్ పేపర్లో ఒక వార్త చూస్తాడు. ఉత్తరభారతంలో 17 మంది సభ్యులున్న కుటుంబాన్ని హతమార్చారన్నది ఆ వార్త.
అయినా సరే బలరాం ఉరఫ్ అశోక్ శర్మ తాను దొరికిపోయినా భయపడను అంటాడు. బానిస బతుకు నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా జీవితం ఒక నెల, ఒక రోజు, ఒక్క క్షణమైన చాలంటాడు.
సామాజిక పోకడలకు నిలువుటద్దం ది వైట్ టైగర్
కాస్త మెరుగైన జీవితం బతకాని అనుకునే ఓ కుర్రాడి నుంచి.. ఓ హత్య చేసి, మోసంతో ఓ పెద్ద వ్యాపారిగా మారేంతవరకు బలరాం ప్రయాణంలో అడుగుడునా కుల వివక్ష, మతం పట్ల కక్ష్య, సోషలిస్టు నేతల అవినీతి, లంచాలు తీసుకునే రాజకీయ నేతలు, లేనివారి పట్ల డబ్బున్న వారు వ్యవహరించే తీరు అన్నీ కథలో భాగంగానే కనిపిస్తాయి. దోపిడీకి గురై సమాజాన్ని ఎదురించి సంఘ సంస్కర్తలుగా, రాజకీయ నేతలుగా, విప్లవకారులుగా, ఉద్యమకారులుగా ఎదిగిన వారిని చూశాం. అయితే ఇక్కడ దోపిడీకి గురై.. ఒక నేరానికి పాల్పడినప్పటికీ.. న్యాయమే కదా.. అనే రీతిలో కన్విన్స్ చేసేలా ప్రధాన పాత్రధారితో కథ చెప్పిస్తుండడంపై మిశ్రమ స్పందన ఎదురైనా.. చిత్రం ఆకట్టుకుంటుంది.
డ్రైవర్ గా ముస్లింలను తీసుకొని యజమానులు దేశంలో ఇంకా లక్షల్లో ఉన్నారు. హిందువు అయ్యుండి కొన్ని కులాలకు చెందిన వారూ అగ్రకులాల వారికి పనికిరారు. తమ దగ్గర పనిచేస్తారు కాబట్టి ఎంత వేధించినా భరించాలనేది అలిఖిత రాజ్యాంగం. మరీ ముఖ్యంగా డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలా కనిపించదు. కానీ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో రోజుకు 12 గంటలకు పైగా పని చేసినా నెలకు పదివేలు కూడా జీతం రాని డ్రైవర్లు వేలల్లో ఉంటారు. అయినా ఎందుకు పనిచేస్తారు అంటే వారి సొంతూళ్లలో పరిస్థితి అంతకంటే అధ్వాన్నంగా ఉంటుంది.
ఆదర్శ్ గౌరవ్ అద్భుత నటన..
20 ఏళ్లు కూడా ఉంటాయా అనిపించే ఆదర్శ గౌరవ్.. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావ్, మహేశ్ మంజ్రేకర్ లను మించి నటించాడు అనడంలో సందేహం లేదు. ఆదర్శ్ ఓ ట్రైన్డ్ సింగర్ అని చెప్తే అస్సలు నమ్మబుద్ది కాదు. పదేళ్ల సినీ కేరీర్ లో 50 యాడ్ ఫిల్మ్స్ కొన్ని బాలీవుడ్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసాడు. కానీ ఈ ఒక్క చిత్రంతో పొందిన గుర్తింపు ముందు అవన్నీ దిగదుడుపే.
హేమాహేమీలు, బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఏలుతున్న బాలీవుడ్లో చిన్న చిన్న రోల్స్ తో కేవలం తన ప్రతిభతో మంచి స్థాయికి చేరుకున్న రాజ్‌కుమార్ రావ్ని సైతం ఈ చిత్రంలో పాతికేళ్ల కుర్రాడు డామినేట్ చేశాడు. రాజ్ కుమార్ రావ్ పాత్ర క్యారెక్టరైజేషనే అలా ఉండటం వల్ల అతనికీ ఎక్కువ స్కోప్ లేదు. చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న ప్రియాంక చోప్రా చిన్న పాత్రలో నటించింది. మహేశ్ మంజ్రేకర్ క్రూరమైన ల్యాండ్ లార్డ్ లా మెప్పించాడు.
భారతీయ ఆంగ్ల భాష యాక్సెంట్ లో ఉన్న ఈ చిత్రం తెలుగు, హిందీ తదితర ఆడియోలో కూడా అందుబాటులో ఉంది.
మూవీ రివ్యూ: ది వైట్ టైగర్
రేటింగ్ : 4/5
విడుదల : నెట్ ఫ్లిక్స్ ఓటీటీ, ఎంపిక చేసిన థియేటర్లు
విడుదల తేదీ : జనవరి 22, 2021
దర్శకుడు రమిన్ బహ్రానీ
నిర్మాణ సంస్థ లావా మీడియా ప్రొడక్షన్, నోరుజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్
నటీ నటులు: బలరాం హల్వాయి – ఆదర్శ్ గౌరవ్
అశోక్ – రాజ్ కుమార్ రావ్
పింకీ – ప్రియాంక చోప్రా జోనస్
జమీందార్ – మహేజ్ మంజ్రేకర్
మెచ్యూరిటీ రేటింగ్ – 16 ప్లస్
రివ్యూ – కే