మూవీ: దృశ్యం 2: ది రిసెమ్‌ప్షన్
రేటింగ్ : 2.5/5 (దృశ్యం 2013 రేటింగ్ : 4.0/5)
నటీనటులు : మోహన్ లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి
నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్
దర్శకుడు: జీతు జోసెఫ్
విడుదల : ఫిబ్రవరి 19, 2021
నిడివి : 153 నిమిషాలు
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆడియో: మళయాళం
సబ్‌టైటిల్స్: ఇంగ్లిష్
“భీతావహం చెందడం పేలుడులో లేదు, పేలుతుందని ఎదురుచూడటంలో ఉంది.”
“నాటకీయత అంటే నీరసమైన భాగాలను కత్తిరించి పారేసిన జీవితం తప్ప మరేమీ కాదు.”
– ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్
* * *
సీక్వెల్ తీసి మెప్పించడం ఎవరికైనా కష్టమే. లాభాలు చేసుకోగలిగితే చాలు, మన్ననలు ఎవడికి కావాలంటుంది సినిమా వ్యాపారం. అసలుకు దీటుగా తీస్తేనేగా సీక్వెల్‌లోని మజా అంటుంది సినిమా కళ. రెండిటికీ చుక్కెదురు. సీక్వెల్స్ తీసి హిట్టుల మీద హిట్టులు కొట్టిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మన్ననలను అందుకున్నవారు అతి అరుదు. అంతకంటే మిన్న అనిపించుకున్నవాళ్లు అంతకంటే అరుదు. అసలు లేరు అన్నా ఫర్వాలేదు. సినిమా చరిత్రలోనే అది అసాధారణం, అద్భుతం.
దృశ్యం గుర్తుందా?
జీతు జోసెఫ్ “దృశ్యం” (2013 మళయాళం ఒరిజినల్) తీరే వేరు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సిన్హళ, చైనీస్ భాషలలో చక చకా రీమేక్ కావడమే కాదు, ప్రతి భాషలోనూ సూపర్ హిట్టయింది. క్లాసిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచింది. మూల కథలో, కథనంలో ఎలాంటి పెద్ద, మౌలిక మార్పులను చేయకపోవడం వల్లనే రీమేక్‌లన్నీ సక్సెస్ అయ్యాయి. అలాంటి భారతీయ చిత్రం మరేదైనా ఉందా? లేదనే అనాలి. అదే “దృశ్యం” ఆరేళ్ళ తర్వాత “మళ్లీ మొదలు” (రిసెమ్‌ప్షన్).
దృశ్యం 2 కథ ఏంటి?
“దృశ్యం 2 : ది రిసెమ్‌ప్షన్” మళయాళ చిత్రాన్ని (ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో) అమెజాన్ ప్రైమ్ ఫిబ్రవరి19న విడుదల చేసింది. “దృశ్యం”ముగిసిన ఆరేళ్లకు “దృశ్యం 2”మళ్లీ మొదలవుతుంది.
ఒకప్పటి సాధారణ కేబుల్ ఆపరేటర్ జార్జి కుట్టి (మోహన్‌లాల్) ఇప్పుడు థియేటర్ యజమాని. సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. చీకటి గతాన్ని పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తాడు.
మానప్రాణాలను కాపాడుకోవడానికి అనుకోకుండా ఎస్పి గీతా ప్రభాకర్ (ఆశా శరత్) కొడుకు వరుణ్‌ను చంపేసిన జార్జి కుట్టి, పెద్ద కూతురు అను (అన్సిబా హసన్), భార్య రాణి (మీనా) పోలీసు జీపు సౌండ్ వింటేనే వణికిపోతూ భయం భయంగానే గడుపుతుంటారు.
చిన్న కూతురు అను (ఎస్తేర్ అనిల్)ను కూడా అదే పీడకల పట్టి పీడిస్తుంటుంది. జార్జి కుట్టి ఆర్థిక స్థాయి పెరగడంతో ఒకప్పుడు అతనంటే వల్లమాలిన సానుభూతితో ఉన్న సాటి వారి తీరు మారుతుంది. వరుణ్ మిస్సింగ్ కేసు గురించి గుసగుసలు జోరుగా సాగుతుంటాయి.
అను, రాణి, జార్జి కుట్టిల పైన రకరకాల పుకార్లు చాపకింద నీరులా వ్యాపిస్తుంటాయి. పోలీసు దర్యాప్తు రహస్యంగా సాగుతుందని వినవస్తుంది. అది ఒక్కటీ నిజం! రెండేళ్ల క్రితమే కొత్త ఐజిగా వచ్చిన థామస్ (మురళి గోపి) గీత కుటుంబానికి సన్నిహితుడు.
తాగుబోతు భర్త సాబు, అతనితో తన్నులు తినే భార్య సరిత అనే జార్జి పక్కింటి జంట కొత్త పాత్రలు. వారు జార్జి కుట్టిపైన, అతని కుటుంబంపైన కన్నేసి ఉంచడం కోసం థామస్ నియమించిన పోలీసు అధికారులు.
రాణి తనకు బాగా చేరువైన సరితను సొంత చెల్లిలా చూసుకుంటుంది. భయంతో, ఆందోళనతో గడుపుతున్న రాణిని సరిత మరింతగా భయపెడుతుంటుంది. నోరు దాటితే ఊరు దాటుతుందని నమ్మిన జార్జి పాత విషయాలను ప్రస్తావించనివ్వడు. థామస్ మైండ్ గేమ్‌కు మెయిన్ టార్గెట్స్… రాణి, అంజు.
జార్జి కుట్టి ఇంటికి దగ్గరలోనే ఉన్న చర్చి ఆవరణను తవ్వడం కోసం పోలీసులు జీవులలో వచ్చి ఆర్భాటం చేస్తారు. దీనికి తోడు సరిత.. రాణిని మరింత భయపెడుతుంది. దీంతో రాణి వరుణ్‌ను చంపింది అంజు అని బయటపెట్టేస్తుంది. సరిత, సాబులు ఆ ఇంటిలో వినిపించే ప్రతి మాటను రికార్డ్ చేస్తుంటారు. రాణి ఎంత ఒత్తిడి చేసినా జార్జి నోరు విప్పడు.
వరుణ్ శవం దొరకనిదే కేసు నిలవదు. దర్యాప్తు కథ మళ్లీ డెడ్ ఎండ్‌కు చేరిందని అనిపిస్తుండగా… హత్యానేరంపై శిక్ష అనుభవించి విడుదలైన పాత నేరస్థుడు జోస్ వస్తాడు. జార్జి వరుణ్ శవాన్నిఎక్కడ దాచిపెట్టాడో తనకు తెలుసంటాడు.
తాగి, గొడవ పడి బావమరిదిని చంపి, పారిపోతున్న జోస్.. నిర్మాణంలో ఉన్నపోలీస్ స్టేషన్ నుంచి జార్జి పారతో బయటకు రావడాన్ని చూసినది నిజం. జోస్ మాటను నమ్మిన థామస్ గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్ ఫ్లోరింగ్‌ను తవ్విస్తాడు.
అస్థిపంజరం బయట పడుతుంది!
ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదిక అది వరుణ్‌దే కావచ్చునని రూఢి చేస్తుంది. థామస్ ఇక జార్జి కుట్టి కుటుంబాన్ని ఇంటరాగేషన్‌కు రప్పిస్తాడు.
కొడుకు మీద గుడ్డి ప్రేమతో గీత ఎంత దుర్మార్గంగా ప్రవర్తించగలదో దృశ్యంలో చూశాం. అదే టెర్రర్ సీన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎదురు చూస్తూ క్షణ క్షణం చస్తూ బతుకుతున్న అంజు అప్పటికే ఫిట్స్‌తో బాధపడుతుంటుంది. పీడకల నిజం కాగా, ఈ కొత్త టెర్రర్‌కు తట్టుకోలేక ఫిట్స్ వచ్చి పడిపోతుంది.
కూతురు స్థితిని చూసి చలించి పోయిన జార్జి ఏకాంతంగా థామస్ వద్ద నిజం ఒప్పుకుంటాడు.
హత్య తానే చేశానని, తన కుటుంబాన్ని ఏం చేయకుండా ఇక వదిలిపెట్టేస్తే నేరాంగీకార వాంజ్ఞ్మూలంపై సంతకం చేయడమే గాక, ఆధారాలను కూడా అప్పగిస్తానంటాడు. దీనితో కథ కొలిక్కి వస్తున్నట్టే అనిపిస్తుంది.
కానీ అసలు కథ అప్పుడే…“మళ్లీ మొదలు!”
దృశ్యం 2 సక్సెస్ అయినట్టేనా
న్యూమరాలజీ ఏమంటుందో గానీ, ఆరేళ్ల విరామంతో అదే ప్రధాన తారాగాణంతో అదే దర్శకుడు సీక్వెల్‌ను తీయడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఎప్పుడు నిజం భయటపడుతుందోననే భయంతో బతికే రాణి, అంజులు ఈ చిత్రాన్ని మంచి ధ్రిల్లర్‌గా మలిచే మంచి అవకాశాన్ని ఇచ్చారు.
మొదట కోట్ చేసిన హిచ్‌కాక్ చెప్పిన టెర్రర్ వారిద్దరిలో దండిగా ఉంది. దోషులకు తెలియకుండా సాగే రహస్య దర్యాప్తు, సరిత, సాబుల కొత్త కేరక్టర్లు ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగానూ పొందించడానికి అనుకూలమైన అంశాలే.
కాకపోతే ఒక్కటేలోటు… స్క్రిప్ట్! హిచ్‌కాక్ చెప్పిన రెండో మాటను జీతు జోసెఫ్ విస్మరించారు. నిస్సారమైన, నీరసమైన, అనవసర సన్నివేశాలను మొదటి గంటలో దట్టించి, అవన్నీ చివరి 30-40 నిమిషాల థ్రిల్లర్‌కు సన్నాహాలని భ్రమించారు.
చిత్ర రచయిత కూడా అయిన జీతు జోసెఫ్‌నే అందుకు తప్పు పట్టాలి. మొదటి గంట మహా భారంగా, నిరాసక్తికరకంగా నీరసంగా సాగుతుంది. ఆ బాగాన్ని 30 నిమిషాలకు కుదించి, 120-140 నిమిషాల నిడివిగల చిత్రంగా రూపొందిస్తే ఇది కూడా “దృశ్యం”సరసన నిలిచేదేమో! హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొదటి గంటా చూసేస్తే, ఆ తర్వాత కదలకుండా మెదలకుండా మీరే మంచి థ్రిల్లర్‌ను చూస్తారు.
దృశ్యం 3 కూడానా?
దృశ్యం 3 కూడా ఉండవచ్చని ఈ చిత్రం ముగింపు సంకేతించింది. అంతే కాదు చంద్రముఖికి సీక్వెల్ చేసి చేతులు కాల్చుకున్న వెంకటేశ్ దృశ్యం 2 తెలుగు రీమేక్ షూటింగ్‌ను చకచకా కానిచ్చేస్తున్నారని అంటున్నారు. కాబట్టి సీక్వెల్స్ గురించి తొలుత ప్రస్తావించిన విషయాన్ని మరి కాస్త వివరంగా చూద్దాం.
ఎలియాన్ (1979), జురాసిక్ పార్క్(1993)లను తీసుకుందాం. అవి మాత్రమే క్లాసిక్స్‌గా నిలవగా.. వాటి సీక్వెల్స్ వచ్చాయి, పోయాయే తప్ప అసలుకు దీటుగా నిలిచించి ఒక్కటీ లేదు.
లాభాలు తెచ్చాయనేది వేరే విషయం. ది గాడ్‌ఫాదర్ (1972, 1974, 1990)నుండి మామా మియా (2008, 2018) సీక్వెల్స్ వరకు ఒకటే తీరు. కాసుల గలగలలే తప్ప అసలులోని మ్యాజిక్ టచ్ వాటి కొసర్లు వేటిలోనూ కలికానికి కూడా కనిపించదు.
అందుకేనేమో జూలీ ఆండ్రూస్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ (1965)కు సీక్వెల్ తీయడానికి ఎవరూ సాహసించలేదు అనుకుంటుండగా… ఆమె మొదటి చిత్రం మేరీ పాపిన్స్ (1964)కు సీక్వెల్ 2018లోనే వచ్చింది, పోయింది. ఈ సీక్వెల్స్‌లో ఏదీ ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాల జాబితాలకు ఎక్కలేదు, ఎక్కవు.
పూర్తి భిన్న కథాశంతో, పాత్రలతో సీక్వెల్స్‌ను చేసినవారూ ఉన్నారు. కానీ, ది డావిన్సీ కోడ్(2006)కు ప్రీక్వెల్ అయిన ఏంజెల్స్ అండ్ డెమన్స్ (2009), సీక్వెల్ అయిన ఇన్ఫెర్నో (2016) ఎందరికి గుర్తున్నాయి?
నెట్‌ఫ్లిక్స్ తాజా ఆస్కార్ రేసు గుర్రంమాంక్ చిత్ర దర్శకుడు డేవిడ్ ఫించర్ తీసిన ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ(2011)కి సీక్వెల్ ది గర్ల్ ఇన్ ది స్పైడర్ వెబ్ ఉందని ఎందరికి తెలుసు? ఇక తెలుగు హిందీలలో వచ్చిన, వస్తున్న సీక్వెల్స్ సంగతులు, గతులు ఎవరికి తెలియనివి?
గుణపాఠం ఏమంటే… ఎంత గొప్ప సినిమా అయినా, దర్శకులైనా, నటీనటులైనా సీక్వెల్స్ మీద మనం పెద్ద పెద్ద అంచనాలు పెట్టేసుకోకూడదు. సీక్వెల్ తీసి హిట్టు కొట్టకపోయినా నాలుగు కాసులైనా రాబట్టుకోకుండా ఉభయభ్రష్టత్వాన్ని మూటగట్టుకున్న వాళ్లను చూసి జాలి పడాలో వద్దో ఎవరికి వారే తేల్చుకోవాలి.
రివ్యూ : పీవీఆర్